Share News

సుందరీకరణ పేరిట దమనకాండ

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:40 AM

పూర్తిగా అంపశయ్య మీదున్న కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోసింది మళ్ళీ తెలంగాణనే. ఆ అవకాశాన్ని అధికారాన్ని ఇలా వాడుకోవాలని ప్రయత్నిస్తే, దౌర్జన్యం చేస్తే, ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంత ప్రజల శాపాలు, శోకాలు, ఆవేదన, ఆక్రందనలకు కాంగ్రెస్‌ పార్టీ ఏమైపోతుందో రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రికి తక్షణమే చెప్పాలి. కలలోంచి మేల్కొల్పాలి, ప్రజలతో చర్చించాలి.

సుందరీకరణ పేరిట దమనకాండ

పూర్తిగా అంపశయ్య మీదున్న కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోసింది మళ్ళీ తెలంగాణనే. ఆ అవకాశాన్ని అధికారాన్ని ఇలా వాడుకోవాలని ప్రయత్నిస్తే, దౌర్జన్యం చేస్తే, ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంత ప్రజల శాపాలు, శోకాలు, ఆవేదన, ఆక్రందనలకు కాంగ్రెస్‌ పార్టీ ఏమైపోతుందో రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రికి తక్షణమే చెప్పాలి. కలలోంచి మేల్కొల్పాలి, ప్రజలతో చర్చించాలి.

ఢిల్లీ నగరాన్ని సుందరీకరించాలనుకున్నాడు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి తనయుడు సంజయ్‌గాంధీ అంతే, నిర్దాక్షిణ్యంగా పేదలగూళ్ళు తొలగించేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీలో జరిగిన ఆ ప్రాంతాల్లో కూల్చివేతలపై మంత్రులు, అధికారులు, సామాజిక కార్యకర్తలు, జమా మసీద్‌, తుర్కమన్‌గేట్‌, కరోల్‌బాగ్‌ నివాసితులు మూడు వారాలపాటు నిరసనలు చేశాక షా కమిషన్‌ విచారణలో విచిత్రమైన విషయం బయటపడింది. అది చట్టం, న్యాయం, ధర్మం, అసలు మానవత్వమే లేని కరకు కర్కోటక చర్యని.

తెలంగాణకు ముఖ్యమంత్రి అవడంతోనే మూసీని సుందరీకరించాలనుకున్నాడు రేవంత్‌రెడ్డి. అంతే తెల్లారేసరికి మూసీ పరివాహక ప్రాంతాల్లోకి దండులు, దండులుగా వచ్చేసారు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు. ప్రశాంతంగా ఎవరిళ్ళల్లో వాళ్ళుండి పనులు చేసుకుంటున్న మధ్యతరగతి ఇళ్ళకి, పనులకోసం బయటికెళ్ళిన నిరుపేదల ఇళ్ళకి ఆర్‌.బి.ఎక్స్‌ పేరుతో మార్కింగులు వేసుకుంటూ పోయారు. ప్రశ్నిస్తే బుల్డోజర్లు వచ్చి మీ ఇళ్ళు కూల్చేస్తాయి మాట్లాడకండి. మీరు మూసీ నదిని ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారు అయినా సర్కారు వారు మీ యందు దయతో మీకో బంపరాఫర్‌ కలిగించారు. మీ అందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్స్‌ అందిస్తున్నారు. కావాలంటే సంతకం పెట్టి సామాన్లు డి.సి.ఎం. వాన్‌లో పెట్టండి, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చు కూడా ఉచితం, లేదంటే ఏదీ ఉండదు... వెంటనే తేల్చి చెప్పండి అనే హకుం. ఇదంతా అక్షర సత్యం. ఇదే జరిగింది. ఇలాగే జరుగుతోంది.


లక్షల రూపాయలతో ఇంటి స్థలాలు కొనుక్కొని, దశాబ్దాల క్రితమే వేలాది రూపాయలతో రిజిస్ట్రేషన్లు చేసుకొని, మున్సిపల్‌ శాఖ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతులు పొంది, ఊళ్ళలో ఆస్తులమ్ముకొనో, అప్పులు తెచ్చో, లోన్లు తెచ్చుకొనో ఇళ్ళు కట్టుకున్నారు. కాయకష్టంతో చిన్న స్థలం కొనుక్కొని, అందులోనే రెండు గదులు వేసుకొని ఇంతటి నగరంలో మాకూ ఒక సొంత ఇల్లు ఉందని మురిసిపోతున్న సగటు జీవులకు ముఖ్యమంత్రి కల పీడకలగా మారింది. తిండిలేదు, నిద్రలేదు, ప్రశాంతత లేదు. ఎటువైపు నుంచి బందిపోటు దొంగలు వచ్చి దోచుకుంటారో అని భయాందోళనలకు గురైనట్లు ఎప్పుడు ఏ అధికారులు వస్తారో అని కలవరపాటుకు గురవుతున్నారు మూసీ ప్రాంతవాసులు.

సంజయ్‌గాంధి అప్పుడు వ్యవహరించిన తీరుకి, ఇప్పుడు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకి తేడా ఏమీ కన్పించడం లేదు. వాళ్ళు అనుకున్నారు అంతే అయిపోవాలి. మూసీ రివర్‌ బెడ్‌ ఎప్పుడు నిర్ధారణ చేశారు ఏ ప్రాతిపదికన చేశారు చెప్పరు. రివర్‌బెడ్‌ అని వాళ్ళు ఇప్పుడు మార్కింగ్‌ చేసిన వాటికి మున్సిపల్‌ అధికారులు ఎందుకు అనుమతులిచ్చారో చెప్పరు. రివర్‌బెడ్‌లో రోడ్లు, విద్యుత్‌, మంచినీరు ఎందుకు కల్పించారో చెప్పరు. మూసీ నదీగర్భంలోనే ప్రభుత్వం ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్‌ ఎలా నిర్మించిందో చెప్పరు, చెప్పలేరు కూడా. ఎందుకంటే ఇక్కడి ప్రజల ఇళ్ళవైపు వాళ్ళు ఒక వేలు చూపిస్తుంటే మిగిలిన నాలుగు వేళ్ళు వాళ్ళనే ప్రశ్నిస్తున్నాయి కాబట్టి.

ప్రపంచంలోని నగరాల్లో ఉన్న నదులకు రెండువైపులా నదినీరు జనావాసాల్లోకి రాకుండా ఎత్తయిన, దృఢమైన గోడలు కడతారు. నాడు నగరంగా ఉన్న నేటి పాతబస్తీ ప్రాంతమైన మదీనా, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, పురానాపూల్‌, చాదర్‌ఘాట్‌ వరకూ నాటి నిజాం పాలకులు అలాగే గోడలు కట్టి మూసీకి రెండు వైపులా అందమైన నిర్మాణాలు చేశారు.


బ్రిటీష్‌ రెసిడెన్సీ (ఉమెన్స్‌ కాలేజ్‌)గా నేడు పిలవబడుతున్నది కూడా ఉన్నది మూసీకి దగ్గరే. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న చాదర్‌ఘాట్‌ ఆది హిందు భవన్‌ ఉన్నదీ అక్కడే కదా! నిజాం దిగిపోయాడు, హైదరాబాద్‌ మహానగరం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మూసీకి రెండువైపులా ఎక్కడా రెండడుగుల గోడ కూడా కట్టలేని బాధ్యతారాహిత్య ప్రభుత్వాలు, మూసీని మురికి కూపంగా మార్చేసిన ప్రభుత్వాలు ఇప్పుడే నిద్రలేచి ముఖ్యమంత్రి లండన్‌ థేమ్స్‌ నది కల నెరవేర్చడం కోసం సామాన్యులను వేధించడం దుర్మార్గం.

మూసీ సుందరీకరణ కంటే ముఖ్యమైనది మూసీ ప్రక్షాళన. ముందు చేయవలసింది మూసీలో పారుతున్న మురుగునీటిని నివారించడం. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నవారు ఎప్పటినుంచో దానిని కోరుకుంటున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు కాని, పర్యవేక్షణలేమి వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. నిజంగా మూసీని అభివృద్ధి చేయాలనుకున్నా ఇలాంటి దుందుడుకు దమనకాండకు పోవాల్సిన అవసరం లేనేలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి వీక్షించిన లండన్‌లోని థేమ్స్‌ నది వెడల్పు 250 అడుగులతోనే ఉంది.

సరాసరి తీసుకన్నా 700 అడుగులే ఉంది. ఇక రష్కా రాజధాని మాస్కోలో పారుతున్న మాస్కోనది వెడల్పు 390 అడుగుల నుండి గరిష్టంగా 660 అడుగులు, హోచిమిన్‌లోని సైగాన్‌ నది అయినా, బ్యాంకాక్‌ నగరంలోని చావోప్రాయా నదయినా ఉన్నది గరిష్టంగా 700 అడుగుల వెడల్పులోనే. మూసీనది పొంగి పరివాహక ప్రాంతాలు మునిగిన దాఖలాలు 1908 తరువాత లేనేలేవు.


ప్రస్తుతం మూసీనది గర్భం కూడా సగటున 400 అడుగుల పైనే ఉంటుంది. మూసీ పరివాహక 55 కిలోమీటర్ల మేర నదికి రెండు వైపులా కొన్ని వందల మీటర్ల మేర ఉన్న ఇళ్ళ యజమానులు అవి తమ భవిష్యత్‌ కోసమో, తమ పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసమో ఉంటాయని ప్రశాంతంగా ఉంటున్నవారు ఇప్పుడు అకస్మాత్తుగా ఆక్రమణదారులైపోయారు.

పూర్తిగా అంపశయ్య మీదున్న కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోసింది మళ్ళీ తెలంగాణనే. ఆ అవకాశాన్ని అధికారాన్ని ఇలా వాడుకోవాలని ప్రయత్నిస్తే, దౌర్జన్యం చేస్తే, ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంత ప్రజల శాపాలు, శోకాలు, ఆవేదన, ఆక్రందనలకు కాంగ్రెస్‌ పార్టీ ఏమైపోతుందో తెలంగాణ రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రికి తక్షణమే చెప్పాలి. కలలోంచి మేల్కొల్పాలి, ప్రజలతో చర్చించాలి.

Updated Date - Oct 05 , 2024 | 04:40 AM