బియాండ్ లైఫ్
ABN , Publish Date - Jun 24 , 2024 | 06:01 AM
ఇదిగో.. ఇప్పుడు ఇక్కడ తేరగా దొరికే సాంగత్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తావో తెలియదు. ఖాళీ పాత్రలను వెన్నెలో వెలుగో...
ఇదిగో.. ఇప్పుడు
ఇక్కడ తేరగా దొరికే సాంగత్యాన్ని
ఎందుకు నిర్లక్ష్యం చేస్తావో తెలియదు.
ఖాళీ పాత్రలను
వెన్నెలో
వెలుగో
చీకటో పూరించినట్టు
వదిలి వెళ్ళిన జీవితాన్ని
మరేదీ పూరించలేదు.
కావాలనే వదులుకుంటాం
పోనీలే..
మరెప్పుడు కలుసుకుందామో
నువ్వే చెప్పు
ఈ సజీవ క్షణం ఇప్పడే ముగిసిపోయాక..
ఎండి రాలిపోయి పువ్వుల్ని
కుప్పగా పోసి
నిప్పంటించాక
వాటి పరిమళాలను
ఎవరు తలపోసుకుంటారు
పూల పుట్టుక వనానికి కొత్తేం కాదుకదా..
కాకపోతే పోయిన వాటి లెక్కలే తేల్చమంటాను.
ఇద్దరం
ఒకే కాలరేఖపై నడయాడినా
మనల్ని కలిపే సరళరేఖనే గీసుకోలేకపోయాం
నీలిసముద్రపు తీరంలో
నాకేౖతే కొన్ని రంగుల గవ్వలు శంఖాలు దొరికాయి
మరి నీవేమి పొందావో నాకు తెలియదు కదా.
నా అరణ్యపు దారిలో
కొంత ఎండ పొడ, పేరు తెలియని చెట్లూ పూలు
లోతు ఎరుగని కొండవాగులు
రెల్లుపూల వసంత కాలాలు
నీడలుగా విస్తరించిన శ్రావణ మేఘాలు
ఉదయసంధ్యల శుకపికాల శ్రావ్యపేయ రాగాలు
కొన్ని మధూదయాలు
అరుదుగా కనిపించిన మహోదయాలు
నేను వేణువవుతాను
నువ్వు విను. లేదూ..
పిట్ట గొంతుగా నువ్వు పాడు
నేను నీలో వాయులీనమవుతాను
మణీందర్ గరికపాటి
99483 26270