కారా మాస్టారు మా ఇల్లు వెతుక్కుని వచ్చారు!
ABN , Publish Date - Nov 04 , 2024 | 12:39 AM
నేను అప్పటికి కొన్ని కథలు వ్రాసి వున్నప్పటికీ పుస్తకం వేసుకోవాలన్న ఆలోచన లేదు. అంటే నేను కూడా కథలు వ్రాయగలను పుస్తకం వేసుకోవచ్చు ఫరవాలేదు అనుకోలేదు. మీరు బాగా రాస్తున్నారు అని చెప్పి...
నా మొదటి పుస్తకం
నేను అప్పటికి కొన్ని కథలు వ్రాసి వున్నప్పటికీ పుస్తకం వేసుకోవాలన్న ఆలోచన లేదు. అంటే నేను కూడా కథలు వ్రాయగలను పుస్తకం వేసుకోవచ్చు ఫరవాలేదు అనుకోలేదు. మీరు బాగా రాస్తున్నారు అని చెప్పి సంకలనం వేసుకోమని ప్రోత్సహించిన వారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు.
ఆ సమయంలో ఆయన సీతా బుక్స్ పేరుతో తన ‘ఇల్లాలి ముచ్చట్లు’ వేసుకుంటున్నారు. పుస్తకాలు చదవడమే గానీ వాటి ప్రచురణ, ముద్రణల గురించి నాకేం తెలీదు. నా కథలు చాలావరకూ ఆంధ్రజ్యోతిలో వచ్చినవే. అందులో ఒక ప్రథమ బహుమతి కథ కూడా వుంది. నా పుస్తక ప్రచురణ బాధ్యత పురాణం గారికే అప్ప చెప్పాను. ఆయన కొడుకు నానీ గారు ముఖ చిత్రం వేశారు. అది నా మొదటి కథా సంకలనం. పురాణం నన్ను మెచ్చుకుంటూ ముందుమాట వ్రాసారు. కొంచెం ఉబ్బి తబ్బిబ్బులే!
ఆవిష్కరణ సభ పెట్టడం అదంతా నాకు తెలియదు. అసలు విషయం ఏమిటంటే నేను కూడా సభ పెట్టడం ఏమిటి? అని చాలా మొహమాటం. అది too humble కావచ్చు, ఆత్మవిశ్వాసం తక్కువ కావచ్చు కానీ అప్పట్లో అంతే. కానీ పురాణంగారు పట్టుపట్టడంతో కాంథారీ హోటల్‌లో చిన్న గెట్ టుగెదెర్‌లా పెట్టాను. పురాణం, నండూరి రామ్మోహనరావు, భమిడిపాటి జగన్నాథరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, టి.ఎల్. కాంతారావు, వీరాజీ, నా స్నేహితురాలు సి. సుజాత అలా పదిహేనుమంది వచ్చారు. నా కథల గురించి సుబ్బరామయ్య గారు తప్ప అందరూ మాట్లాడారు. నిజంగా నేను కథలు బాగానే రాయగలనని నాకు తెలిసి పోయింది. మాకు ఫొటోగ్రాఫర్ లేడు, పత్రికా ప్రతినిధులను పిలవలేదు. సుజాత ఉదయం పత్రికలో మంచి రిపోర్ట్ వ్రాసింది. తరువాత పత్రికల్లో సానుకూలమైన ప్రోత్సాహజనకమైన సమీక్షలొచ్చాయి.
అదంతా ఒక ఎత్తు అయితే తరువాత ఒక రోజు జరిగిన అద్భుతం నిజంగా అద్భుతమే. ఆరోజు నేను మా బాల్కనీలో కూర్చుని బయటికి చూస్తున్నాను. మా గేటు దగ్గర ఒక రిక్షా ఆగింది. అందులో నుంచి దిగిన తెల్లబట్టల పెద్దాయన అచ్చం కాళీపట్నం మాస్టారులా వున్నారు. నా చిత్తభ్రమ కాకపోతే ఆయన ఎందుకు వస్తారు అనుకుంటూ వుండగా మా కాలింగ్ బెల్ మోగింది. నేను కలలో కూడా ఊహించని విధంగా కారా మాస్టారు మా ఇల్లు వెతుక్కుని వచ్చారు. నా జీవితంలో ఒక అద్భుతమైన క్షణం అది. ఆయన పుస్తకంలో లోపాలు చెప్పారు. కథల్లో లోపాలు కాదు. కథల కింద వాటి ప్రచురణ తేదీలు వేయకపోవడం, కథల్ని క్రానలాజికల్ ఆర్డర్‌లో పెట్టకపోవడం, అలాంటివి. మాస్టారు ఇంకో మాట కూడా అన్నారు– ‘‘ఇంత చక్కగా కథలు వ్రాసే నువ్వు బయటికెందుకు రావు? అందుకే నేను రావాల్సి వచ్చింది,’’ అని. చాలా మొహమాటంగా వుండేదాన్ని. మెల్లగా బయటికి వచ్చాను నేను. కొన్ని కథల వలన కొంతమంది గుర్తుపట్టడం మొదలు పెట్టారు నన్ను. ఇదంతా 1989లో సంగతి. అప్పటి నుంచి మాస్టారు నాకు మంచి మిత్రులయారు. చివరి చివరలో నేను వ్రాసిన ‘సప్తవర్ణ సమ్మిశ్రితం’ కథ గురించి కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నా మొదటి కథా సంకలనం వలన నాకు మంచి పరిచయాలు అయ్యాయి, స్నేహితులు దొరికారు, నమ్మకం వచ్చింది– నేనూ వ్రాస్తానని వ్రాస్తూ పోగలనని.
పి. సత్యవతి
ఈమెయిల్: sathyavathi.pochiraju@gmail.com