కుల గణన : సమన్యాయానికి తొలి అడుగు
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:47 AM
గత కొన్ని సంవత్సరాలుగా కుల గణన చేపట్టాలి అనే వాదన దేశంలో చాలా గట్టిగా ముందుకొచ్చింది. ఈ మధ్యే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ కీలక అంశంగా చర్చకు వచ్చింది. పౌరసమాజం, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు...
గత కొన్ని సంవత్సరాలుగా కుల గణన చేపట్టాలి అనే వాదన దేశంలో చాలా గట్టిగా ముందుకొచ్చింది. ఈ మధ్యే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ కీలక అంశంగా చర్చకు వచ్చింది. పౌరసమాజం, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా అందరూ కుల గణనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అయితే బీజేపీ, ఆ పార్టీ భావజాలంతో సత్సంబంధాలు కలిగినవారు మాత్రం ఇది దేశాన్ని విభజిస్తుందని ఒక అర్థం లేని వాదన ముందుకు తెస్తున్నారు. కుల గణన అనేది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రజాస్వామిక దేశాలు నిర్వహిస్తున్నాయి. అలా నిర్వహించడం వల్ల దేశంలోని వివిధ సాంస్కృతిక, సామాజిక–ఆర్థిక విభజనలు, వైరుధ్యాలు తేటతెల్లం అవుతాయి. ప్రజాస్వామిక దేశాల్లో ఉన్న జాతి, లింగ, భాష, మత, ప్రాంతం వంటి అనేక విషయాలకు సంబంధించి సమాచారం సేకరిస్తారు. అలా సేకరించిన సమాచారంతో ఏ వర్గానికి ఎలాంటి చట్టాలు అవసరమో అవి చేయవచ్చు. అమెరికాలో జాత్యాంతర వివాహాలకి సంబంధించి స్పష్టమైన గణాంకాలు ఉన్నాయి. అలాంటి గణాంకాలు దేశంలో జాతి వివక్ష తగ్గుదల గురించి ప్రజలకి ఒక అవగాహన, చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు తోడ్పడతాయి అంటారు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గేయిల్ ఓంవెట్.
భారతదేశం కొన్ని వందల సంవత్సరాలుగా కులాల ఆధారంగా విభజించబడిన సమాజం. బ్రిటిష్ వారి పాలనలో కులం ఒడిదొడుకులకి లోనైంది. కుల గణన మొదటిసారి బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించింది. దీంతో కులాల సమీకరణలు మారిపోయాయి. అప్పటివరకు గుర్తించబడని కులాలు, సముదాయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ విధానాల్లో తమ వాటా, ప్రాతినిధ్యం, గుర్తింపు మొదలైన విషయాలపై విన్నపాలు సమర్పించుకున్నారు. ఆ సందర్భంలోనే కుల గణన దళితులని చైతన్యం చేసేందుకు ఉపయోగపడింది అని గేయిల్ ఓంవెట్ వివరించారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ కుల గణన ముఖ్యమైనది, తప్పనిసరి అన్నారు.
దేవెగౌడ ప్రభుత్వం (1996–97) కుల గణనకి అనుకూలంగా తీర్మానం చేసింది, కానీ 2001లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుల గణన చేసే అవకాశం ఉండి కూడా చెయ్యలేదు. వాస్తవానికి దీని వల్ల కులతత్వం పెరుగుతుందని వాజపేయి ఆ తీర్మానాన్ని పక్కన పెట్టేసారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, కుల నిర్మూలన కులం గురించిన అవగాహనతోనే వస్తుంది అని సోషియాలజీ ప్రొఫెసర్ సతీష్ దేశ్‌పాండే అన్నారు. కులాన్ని గణించకపోతే కులం బయటకి కనిపించదు. కాబట్టి కులం అంతరించిపోతుంది అనే ఒక భ్రమలో కాలం గడిచిపోయింది. ఈ భ్రమ ఇప్పటిది కాదు, ఇరవయ్యవ శతాబ్దం మొదటి నుంచి ఉంది. ముఖ్యంగా ఇది సాంస్కృతిక పెత్తందారులు చేసే వాదన. కులాన్ని గణిస్తే కులం పెరుగుతుంది అని వారి వాదన. స్వాతంత్ర్యానంతరం కూడా కులం అప్రస్తుతం, గణన అవసరం లేదు అని వాదించారు. తాము బయటికి కులంతో గుర్తించబడం కాబట్టి, తమకు కులం లేదు అని వారు ప్రచారం చేసుకున్నారు. కింది కులాలు కూడ తమలాగే కులాన్ని వదిలి కుల రహితంగా జీవించాలని సూచించారు. కాని అది వాస్తవమేనా? కుల గణన చేస్తే ఆ సత్యం వాస్తవాలతో బయటకి వస్తుంది. ఏ కులంలో ఎంతమంది సంపన్నులు ఉన్నారో, పేదలున్నారో, భూమి, ఉద్యోగాలు మొదలైన సమాచారం ప్రజల్లోకి వెడుతుంది. కుల గణన వ్యతిరేకించే వాళ్ళదంతా ఈ భయమే, తమ రహస్య సంపద అక్రమార్జన బయటపడతాయి అనే. అక్రమాల గుట్టు తెలిసినప్పుడు ప్రజలకి జవాబు చెప్పాలి, తమవి కానివి పంచెయ్యాలి. ఇదే వారి అసలు భయం, అంతే కాని వారికేమీ దేశం మీద ప్రేమ కాదు. ఇవన్నీ కాకుండా తమ కులం చెప్పకూడదు అనుకునేవాళ్ళు వారి కులం చెప్పుకోనక్కర్లేదు, అలా వాదించే వారిలో ఎంతమంది ఆ సౌలభ్యాన్ని వదులుకుంటారో తెలుస్తుంది అంటారు సతీష్ దేశ్‌పాండే. కులాన్ని గణించకపోవడం వల్ల జరిగింది మేలు కాదు, వెనకబడ్డ కులాలకి నష్టం, తీరని అన్యాయం.
తెలంగాణలో 2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఎలక్షన్ కోడ్, లోక్‌సభ ఎన్నికలు ముగిశాక, కుల గణనకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాల ప్రకారం ప్రజలు కులం, మతం లేదు అని చెప్పుకునే అవకాశం కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన ప్రారంభిస్తున్న సందర్భంలో, కాంగ్రెస్ ప్రముఖనేత రాహుల్‌గాంధీ దేశంలో కుల వివక్ష మహమ్మారిని గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కులం అనేది టైటానిక్ సినిమాలో ఐస్‌బర్గ్ లాంటిదని, కంటికి ఉపరితలం మాత్రమే కనిపిస్తుంది కాని, కులం చేసే విధ్వంసం వేదన కేవలం భారత ప్రజలకే కాదు, భారత రాజ్యాంగానికి, భరత జాతికి కూడా అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలలో వాస్తవం లేకపోలేదు. వెనుకబడ్డ నిమ్న వర్గాలకు కులం ఈ దేశంలో అడుగడుగునా ఎదురవుతుంది. చదువుకోవాలన్నా, ఉద్యోగం సంపాదించాలన్నా, కనీస సౌకర్యాలతో బతకాలన్నా కులం కేవలం సామాజికంగానే కాక సాంస్కృతికంగా, ఆర్థికంగా ఒక పెద్ద అడ్డుగోడగా నిలుస్తుంది. చదువుకొనే స్థోమత లేకపోవడం, చదువు మధ్యలో వదిలెయ్యడం, నాణ్యతలేని చదువుల వల్ల ఉద్యోగావకాశాలు అందుకోలేకపోవడం జరుగుతుంది.
కులానికి, ఆర్థిక స్థోమతకి, జెండర్‌కి ముడి ఉంది. దీన్నే ఇంటర్సెక్షనాలిటి అంటారు. అటువంటి వారి జీవితం ఇంకా ఘోరంగా ఉంటుంది. అందుకే కింది కులాల నుంచి మహిళల, లింగ అల్పసంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి, కుల గణన ఈ అంతరాలని రూపుమాపే క్రమంలో తొలి అడుగు. కుల గణన దేశాన్ని విభజించదు ఏకీకరిస్తుంది, బహిష్కరించబడ్డ వారిని కలుపుకోవడానికి తోడ్పడుతుంది, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది.
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కుల గణన దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా జనగణనలో అన్ని కులాలని నమోదు చేసి, వెనకబడిన కులాలకు, అట్టడుగు వర్గాలకు ఏ విధంగా సామాజిక, ఆర్థిక న్యాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వాలు సమగ్ర సామాజిక, ఆర్థిక కార్యాచరణని రూపొందించుకొని దేశాన్ని అన్ని వర్గాల భాగస్వామ్యంతో ప్రగతిపథంలో నడిపించాలి.
తోట లక్ష్మీకాంతరావు
ఎమ్మెల్యే, జుక్కల్