కదిరి సీమ స్మృతిలో కమ్యూనిస్టు రవూఫ్
ABN , Publish Date - Feb 09 , 2024 | 03:36 AM
మచ్చలేని మహామనిషి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా సీపీఐ(ఎంఎల్)కు చెందిన ఎస్‌ఏ రవూఫ్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన నమ్మిన...

మచ్చలేని మహామనిషి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా సీపీఐ(ఎంఎల్)కు చెందిన ఎస్‌ఏ రవూఫ్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆచరించిన మార్గాల స్ఫూర్తితో ఎంతోమంది పేదలు తమ హక్కులను సాధించుకున్నారు. సగం కాలం జైల్లోనే గడిపిన ఆయన, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కనీసం వివాహం కూడా చేసుకోకుండా చివరి శ్వాస వరకూ పేదల పక్షాన పోరాడుతూనే గడిపారు. పోరాటమే ఊపిరిగా బలహీనవర్గాల కోసం తన జీవితాన్ని ధారపోసిన రవూఫ్ అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. అభాగ్యుల పాలిట ‘ధ్రువతార’గా నిలిచిన రవూఫ్ ఫిబ్రవరి 9, 2013న నింగికేగారు.
మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో 1924లో అనంతపురం జిల్లా, కదిరిలోని కుటాగుళ్లలో ఆయన జన్మించారు. బీఏ పూర్తి చేసుకున్న ఆయన కదిరిలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో న్యాయవాద విద్యను అభ్యసించి, 1964లో న్యాయవాద పట్టాను పొందారు. అనంతరం మదనపల్లిలో కృష్ణశాస్త్రి అనే న్యాయవాది వద్ద అసిస్టెంట్‌గా కొన్నాళ్లు పనిచేశారు. న్యాయవాద వృత్తిలో స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులును రవూఫ్ ఆదర్శంగా తీసుకున్నారు. డబ్బులేదనే కారణంతో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో పేదల పక్షాన న్యాయస్థానంలోనూ తన పోరాటాన్ని సాగించారు.
‘ప్రోగ్రెసివ్ గ్రూప్ ఆఫ్ కదిరి’ పేరుతో రవూఫ్ ఎన్నో కార్యక్రమాలను నడిపారు. భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడేవారు. ఇష్టం లేకపోయినా పార్టీ హైకమాండ్ సూచన మేరకు ఆయన ఎన్నికల్లో పాల్గొన్నారు. పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్టీలో సహచర నాయకుడు నిజాంవలితో కలసి అనేక పోరాటాల్లో పాలుపంచుకున్నారు. నిజాంవలితో కలసి భూస్వాముల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడంలో రవూఫ్ సఫలీకృతులయ్యారు. నిజాంవలి సీపీఐలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో ప్రజానాయకుడిగా ఎదుగుతున్న తరిమెల నాగిరెడ్డిని రవూఫ్ అనుసరించారు. ఆయన చేసే పోరాటాలకు రవూఫ్ ప్రచారం చేసేవారు. అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డి నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. నాగిరెడ్డికి పోటీగా నిజాంవలి కూడా నిరాహార దీక్షకు దిగారు. తన మిత్రుడిని కాదనుకుని నాగిరెడ్డికే రవూఫ్ మద్దతు పలికి, దీక్షను విజయవంతం చేసేందుకు గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచారు.
అనంతపురం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో రవూఫ్ పాత్ర గణనీయమైనది. రవూఫ్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, యూపీ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లోని నక్సలైట్ నాయకులతో, గ్రూపులతో సత్సంబంధాలను కొనసాగించి ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి కృషి చేశారు. వారితో కలసి భూస్వాములు, పెత్తందార్లతో నిరంతరం పోరాడేవారు. విజయనగరం జిల్లా పార్వతీపురం కేసులో ఆయనకు యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. ఉద్యమంలో భాగంగా మొత్తం మీద ఆయన దాదాపు 27 సంవత్సరాలు జైల్లోనే గడిపారు.
మార్క్సిస్టు పార్టీ నుంచి విడిపోయిన తర్వాత రవూఫ్ నక్సల్బరీ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. నక్సల్బరీ నాయకుడైన చారుమంజుదార్ ఆలోచనలకు ఆయన ప్రభావితులయ్యారు. నిరంతరం భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలపై రవూఫ్ సమరశీల పోరాటాలు చేశారు. చారుమజుందార్ సలహాతో శ్రీకాకుళంలో జరిగిన సాయుధ పోరాటంలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలోనే 1970లో జరిగిన సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర మహాసభలో రవూఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. 1973లో అరెస్టయ్యారు. జైలులో ఉన్న సమయంలో కొండపల్లి సీతారామయ్య(కేఎస్)తో రవూఫ్‌కు పరిచయం ఏర్పడింది.
అనంతరం సీపీఐ(ఎంఎల్)తో తెగదెంపులు చేసుకున్న రవూఫ్ 1979లో సీపీఐ(ఎంఎల్) ఏపీ రీ ఆర్గనైజేషన కమిటీ (ఏపీఆర్‌ఓసీ)ని ప్రారంభించారు. ఏపీఆర్‌ఓసీ తనవంటి వైఖరి కలిగిన కేరళ రాష్ట్ర కమిటీతో జత కలిసింది. 1981లో జరిగిన అఖిలభారత సమావేశంలో సీపీఐ(ఎంఎల్) రీ ఆర్గనైజింగ్ కమిటీ సీపీఐ(ఎంఎల్) సెంట్రల్ రీ ఆర్గనైజేషన(సీఆర్‌సీ)గా మారింది. 1985లో అంతర్జాతీయ స్థాయిలో ‘రెవెల్యూషనరీ ఇంటర్‌నేషనల్ మూవ్‌మెంట్‘ (రిమ్) ఆవిర్భవించింది. రవూఫ్ నాయకత్వంలోని పార్టీ ఇందులో చేరింది. విప్లవాత్మక మార్పులకు రవూఫ్ నాయకత్వం వహించారు. ఆ తర్వాత జరిగిన పలు కారణాల వల్ల సీఆర్‌సీ (కమ్యూనిస్టు రీ ఆర్గనైజింగ్ కమిటీ) రెండుగా చీలిపోయింది. ఒక విభాగంలో ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని కమ్యూనిస్టు మిత్రులతో కలసి సీపీఐ(ఎంఎల్) నక్సల్బరీని ఏర్పాటు చేశారు. 2006 దాకా రవూఫ్ ఆ పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ఈ పార్టీ సీపీఐ మావోయిస్టులో విలీనమైంది. అప్పటికే వయో భారం, అనారోగ్యం వల్ల ఆయన కదిరికే పరిమితమయ్యారు. వివిధ కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత కోసం ఆయన ఎంతగానో శ్రమించారు.
అనంతపురం జిల్లాలో మహిళలపై అకృత్యాలు చేసేవారిపై, భూస్వాములపై రవూఫ్ కఠిన చర్యలు తీసుకునేవారు. ప్రధానంగా కదిరి ప్రాంతంలోని రైతులు పెత్తందార్ల దోపిడీకి తీవ్రంగా గురయ్యేవారు. అనేకమంది భూస్వాములు, వడ్డీ వ్యాపారులు రైతులకు అప్పు ఆశ చూపి, అక్రమంగా ప్రామిసరి నోట్లు రాయించుకుని భూములను సొంతం చేసుకునేవారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను సాయుధం చేసి భూస్వాముల గుండెల్లో రవూఫ్ సింహస్వప్నంగా నిలిచారు. పోలీసులు రవూఫ్ కోసం గాలిస్తున్నా, కదిరి ప్రాంత ప్రజలు ఆయనకు అండగా నిలిచి, కాపాడారు. కదిరి మాత్రమే కాకుండా పెనుకొండ, నల్లమాడ, హిందూపురం, పేరూరు, ధర్మవరం తదితర ప్రాంతాల్లో రవూఫ్ పర్యటించి రైతుల పక్షాన నిలిచారు.
రవూఫ్ పేదలకు అందించిన సేవలకు చిహ్నంగా కదిరి పట్టణంలోని కుటాగుళ్లలో ఆయన అభిమానులు స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఈ స్థూపాన్ని కమ్యూనిస్టు నాయకుడు, ఎస్‌ఏ రవూఫ్ మెమోరియల్ ట్రస్టు అప్పటి అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణారావు 2015, ఫిబ్రవరి 9న ఆవిష్కరించారు.
చల్లా నవీన్ కుమార్ నాయుడు
సీనియర్ జర్నలిస్టు
(నేడు రవూఫ్ వర్ధంతి)