భారతీయ వివేకమే కోస్టారిక ఆదర్శం
ABN , Publish Date - Sep 14 , 2024 | 04:57 AM
సెప్టెంబర్ 15న కోస్టారిక 203వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్నది. అదే రోజు భారత్– కోస్టారికల మధ్య దౌత్య సంబంధాల 54వ వార్షికోత్సవం కూడా. 1970లో ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తి స్థాయిలో ఏర్పడ్డాయి.
సెప్టెంబర్ 15న కోస్టారిక 203వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్నది. అదే రోజు భారత్– కోస్టారికల మధ్య దౌత్య సంబంధాల 54వ వార్షికోత్సవం కూడా. 1970లో ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తి స్థాయిలో ఏర్పడ్డాయి. తదాది పరస్పర ప్రయోజనాలు గల వివిధ రంగాలలో ఉభయ దేశాల మధ్య స్నేహ సహకారాలు నిత్య నూతనంగా వర్ధిల్లుతున్నాయి. భారత్, కోస్టారిక రెండూ సముద్ర తీరస్థ దేశాలు. జీవ వైవిధ్యం అపారంగా ఉన్న దేశాలు. ప్రతిభా సమన్విత మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు. పెరుగుతున్న సముద్ర మట్టం, వాతావరణ మార్పు విషమ ప్రభావాలకు లోనవుతున్న దేశాలు ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం, మానవహక్కులను రక్షించడం, మరింత సమ్మిళిత భవిష్యత్తు నిర్మించడం మొదలైన సదాశయాలతో భారత్ , కోస్టారికల మధ్య సంబంధాలు దృఢమవుతున్నాయి.
మధ్య అమెరికాకు సింహద్వారం కోస్టారిక. లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలతో సంబంధాలు పటిష్ఠం చేసుకునే ప్రయత్నాలలో భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామి కోస్టారిక. అరకోటికి పైగా జనాభా ఉన్న కోస్టారికలో అధికార భాష స్పానిష్ అయినప్పటికీ ఆంగ్లభాషలో సమగ్ర నైపుణ్యమున్నవారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు 8 ఆదివాసీ తెగలు ఉన్న కోస్టారిక బహుళ జాతులు, సాంస్కృతిక వైవిధ్యానికి సహజ నెలవుగా ఉన్నది. పౌరుల సగటు జీవితకాల పరిమాణం, అత్యధికంగా (పురుషులకు 77, స్త్రీలకు 82 సంవత్సరాలు) ఉన్న దేశాలలో కోస్టారిక ఒకటి.
దేశాధ్యక్షుడు రోడ్రిగో చావెస్ నేతృత్వంలో కోస్టారిక ఆర్థికవ్యవస్థ 86.5 బిలియన్ డాలర్ల జీడీపీతో వర్థిల్లుతోంది. 98 శాతం అక్షరాస్యత ఉన్న ఈ దేశంలో సహజంగానే ఉన్నత విద్యకు ఎనలేని ప్రాధ్యాన్యమిస్తుంది. విద్యా వైద్య రంగాలలో భారీ మదుపులు మానవాభివృద్ధికి ఈ మధ్య అమెరికా దేశం ఇస్తున్న ప్రాధాన్యాన్ని విశదం చేసింది. ప్రపంచ శాంతికి అంకితమైన దేశం కోస్టారిక. శాంతికి నిబద్ధతలో భాగంగా 1948 డిసెంబర్ 1న సైన్యాన్ని శాశ్వతంగా రద్దు చేసింది. ఈ అసాధారణ, అభినందనీయమైన చర్య తీసుకున్న ఏకైక దేశం కోస్టారిక. ప్రపంచ జీవ వైవిధ్యంలో 5 శాతం కోస్టారికలో ఉన్నది. ఏడాది పొడుగునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే కోస్టారిక ప్రపంచ పర్యాటకులకు గమ్యంగా ఉన్నది. మధ్య అమెరికాలో సిరిసంపదలే కాకుండా పర్యావరణ చైతన్యం అధికంగా ఉన్న దేశం కోస్టారిక అని నిస్సంకోచంగా చెప్పవచ్చు.
దౌత్య సంబంధాలు నెలకొన్నది మొదలు భారత్, కోస్టారికల మధ్య వాణిజ్య సంబంధాలు ఇతోధికంగా పెరుగుతూ వస్తున్నాయి. వివిధ రంగాలలో పరస్పర సహకారానికి అవి అనేక అవకాశాలను కల్పిస్తున్నాయి. 2016–22 సంవత్సరాల మధ్య కోస్టారికాకు మోటార్ వెహికల్స్, కార్లు, అగ్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేసింది. అదే కాలంలో భారత్‌కు కోస్టారిక ఎగుమతులలో దారు ఉత్పత్తులు, మెడికల్, సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, సర్జికల్ ప్రోడక్ట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ మొదలైనవి ఉన్నాయి జౌళి, వ్యవసాయ ఉత్పత్తులలో ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగే అవకాశాలు ఇతోధికంగా ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఉభయ దేశాల మధ్య 301 మిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్‌ఎస్, ఎల్ అండ్ టి ఇన్ఫటెక్, సిఎస్‌ఎస్ కార్పొరేషన్ మొదలైన ఇండియన్ కంపెనీలు కోస్టారికలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.
భారత్, కోస్టారికల మధ్య వాణిజ్య సంబంధాలే కాదు ఒక తాత్త్విక సంబంధం కూడా ఉన్నది. ఆ బంధం, భౌగోళిక హద్దులను అధిగమించి శాంతి సామరస్యాలు, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తోంది. ఉభయ దేశాల సంస్కృతీ సంప్రదాయాల నుంచి జనించిన ఆ బంధం ప్రపంచ దేశాల పరస్పర సంబంధాలను ఆదర్శప్రాయంగా ప్రభావితం చేస్తోంది. కోస్టారిక ప్రజల జీవన తత్వాన్ని వ్యక్తం చేసే తాత్విక భావన ‘పుర విడ’. ఈ స్పానిష్ పదానికి అర్థం ‘నిర్మలమైన లేదా నిరాడంబర జీవితం’. కోస్టారికలో ఎక్కడకు వెళ్లినా ఈ పదం ప్రజల సంభాషణల్లో వినపడుతుంది. ‘పుర విడ’ ఒక తాత్విక భావన మాత్రమే కాదు అదొక జీవన విధానం. జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడమే ఆ భావన పరమార్థం. నైసర్గిక పరిసరాల శోభను ఆస్వాదించే సౌందర్యాత్మక దృష్టిని, సామాజిక సంబంధాలను మానవీయం చేసే ఉన్ముఖతను అది కల్పిస్తుంది. ఈ ఆదర్శ తాత్వికతను పురాతన భారతీయ వివేకం ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒక కుటుంబం) గౌరవిస్తుంది, పరిపూరకం చేస్తుంది. ఈ రెండు తాత్విక భావనలు పరస్పర సంబంధాన్ని, కరుణను, కృతజ్ఞతను, సాంస్కృతిక ఆదాన ప్రదానాన్ని, శాంతియుత సహకారాన్ని, పర్యావరణ భద్రత పట్ల శ్రద్ధను ప్రబోధిస్తున్నాయి. భారత్, కోస్టారికల మధ్య దశాబ్దాలుగా ప్రగాఢ, వైవిధ్యపూరితమైన సాంస్కృతిక సంబంధాలు వర్ధిల్లుతున్నాయి. పరస్పర సంప్రదాయాలు, విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని ఉభయ దేశాలు సమున్నతంగా గౌరవించుకుంటున్నాయి. ఈ గౌరవపూర్వక అనుబంధం 1960ల్లో అంటే దౌత్య సంబంధాలు నెలకొనక ముందే ఆరంభమయింది. వాటికి ఆద్యుడు ప్రొఫెసర్ హిల్డా చెన్ అపుయె. యునెస్కో సహకారంతో 1960లో కోస్టారిక విశ్వవిద్యాలయంలో భారతీయ చరిత్ర, తత్వశాస్త్రం, సంస్కృత భాషా సాహిత్యాల అధ్యయనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ విద్యా సంబంధ సహకారం కోస్టారికలో భారతదేశ సమున్నత సంస్కృతీ వైభవంపై అవగాహనను పెంపొందించేందుకు విశేషంగా తోడ్పడింది.
సాంస్కృతిక ఆదానప్రదానాలు, కళాకారుల సందర్శనలు ఉభయ దేశాల మధ్య సంబంధాలను సంస్కృతీ సంబంధంగా పరిపుష్టం చేశాయి. ఫిబ్రవరి 2023లో సంస్కృత భాషా విద్వాంసుడు రోబెర్టో మోరలేస్ భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన వివిధ విశ్వవిద్యాలయాలలో సంస్కృత భాషా సాహిత్యాలపై వెలువరించిన ఉపన్యాసాలపై భారతీయ విద్వజ్ఞుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ విధంగా ఉభయ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు విశాలమవుతూ ఉన్నాయి.
లలిత కళలు కూడా ఈ సాంస్కృతిక సంబంధాన్ని మరింతగా సమున్నతం చేస్తున్నాయి. కోస్టారిక విఖ్యాత చిత్రకారుడు రౌడ్యిన్ అల్ఫరో తన పెయింటింగ్‌లను ‘కోస్టారికన్ –సెంటెడ్ కాఫీ’ పేరిట ప్రదర్శించారు. చిత్రకళాభిమానులను అవి విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల రాకపోకలు అధికమవుతున్నకొద్దీ ఉభయ దేశాల కళాత్మక సంప్రదాయాల సమ్మేళనం సంభవిస్తోంది. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన భారతీయ కళా విద్యార్థులు కోస్టారిక కళా సంప్రదాయాలను శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారు. ఇరు దేశాలలోను పరస్పర చిత్రకళా ప్రదర్శనలు సైతం తరచుగా జరుగుతున్నాయి.
విద్యారంగం విషయానికి వస్తే భారత ప్రభుత్వ ఉపకార వేతనాలపై కోస్టారిక విద్యార్థినీ విద్యార్థులు వివిధ భారతీయ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలు చేస్తున్నారు. అలాగే కోస్టారికలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శాంతి విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విద్యార్థులు, కళాకారులతో ఉభయ దేశాల మధ్య సహకారం బహుముఖీనంగా వికసిస్తోంది.
కోస్టారికలో 1000 మందికి పైగా భారతీయులు నివశిస్తున్నారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలను పటిష్ఠం చేయడంలో వీరు తమదైన ప్రాత నిర్వహిస్తున్నారు. 2010లో ఏర్పడిన కోస్టారిక ఇండియన్ అసోసియేషన్ భారతీయ పండుగల సందర్భంలో వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భారతీయ సంస్కృతిపై కోస్టారికన్లకు అవగాహనను పెంపొందిస్తోంది. కోస్టారిక 203వ స్వాతంత్ర్య దినోత్సవం, భారత్‌తో దౌత్య సంబంధాల 54వ వార్షికోత్సవం ఉభయ దేశాల మధ్య సంబంధాలు ఎంత సుదృఢంగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఈ స్నేహబంధం మరింతగా దృఢమవగలదనే ఆశాభావం ఇరు దేశాల ప్రజలలోను బలంగా ఉన్నది.
సోఫియా సలాస్ మోంగె
కోస్టారిక దౌత్యప్రతినిధి, న్యూఢిల్లీ
(సెప్టెంబర్ 15: కోస్టారిక స్వాతంత్ర్య దినోత్సవం,
భారత్–కోస్టారిక దౌత్య సంబంధాల 54వ వార్షికోత్సవం)