Share News

భారత ప్రజాస్వామ్య పునాదుల్లో పగుళ్లు

ABN , Publish Date - Nov 13 , 2024 | 03:18 AM

73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా రూపొందించిన (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం– 1994 అమలులోకి వచ్చి ఏప్రిల్‌ 2024 నాటికి ముప్పై సంవత్సరాలు పూర్తయ్యాయి...

భారత ప్రజాస్వామ్య పునాదుల్లో పగుళ్లు

73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా రూపొందించిన (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం– 1994 అమలులోకి వచ్చి ఏప్రిల్‌ 2024 నాటికి ముప్పై సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ఇప్పటికీ పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం గురించి, అధికారాలు బదలాయింపు విషయమై చర్చించుకోవాల్సిన పరిస్థితి బాధాకరం. ఇందుకు బాధ్యులెవరు? లోపం ఎక్కడుంది?

అసలు 73వ రాజ్యాంగ సవరణ చట్ట నిర్మాణం పటిష్ఠంగా లేదు. రాజ్యాంగం పదకొండవ షెడ్యూల్లో పేర్కొనబడిన 29 అంశాలకు సంబంధించిన అధికారాల బదలాయింపు రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యలకు వదిలివేయడం, 73వ సవరణను అనుసరించి రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ, అధికారం పూర్తిగా రాష్ట్రాలకు కట్టబెట్టడం మొదలైనవి రాజ్యాంగ సవరణలో ఉన్న ప్రధాన లోపాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 విషయానికి వస్తే ఇది కొత్తగా చేయబడిన చట్టం కాదు. పాత చట్టాల అతుకుల బొంత. అప్పటివరకూ అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్టం–1964, ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్షా మండళ్ల చట్టం–1986 లను కలిపి 73వ రాజ్యాంగ సవరణలకు అణుగుణంగా ఒకే చట్టంగా రూపొందించారు. ఒకే చట్టమైతే రూపొందించారు కానీ పాత చట్టాల క్రింద ఏర్పాటైన అధికార వ్యవస్థలు అయిన పంచాయతీ, అభివృద్ధి విభాగాలను ఏకీకృతం చెయ్యలేదు.


ఫలితంగా రెండు విభాగాల అధికారవ్యవస్థలు కుమ్ములాడుకొని మొత్తం వ్యవస్థనే సర్వనాశనం చేశాయి. ఈ చట్టం కూర్పులో జరిగిన మరో పొరపాటు ఏమిటంటే మూడు అంచెల మధ్య అవినాభావ సంబంధాన్ని తుంచివేయడం. గ్రామ పంచాయితీలో ఎంపీటీసీకి, సర్పంచ్‌కి మండల ప్రజాపరిషత్‌లో, జడ్‌పీటీసీకి మండల ప్రజా పరిషత్‌లో, ఎంపీపీకి జిల్లా ప్రజాపరిషత్‌లో సభ్యత్వం కల్పించకుండా వారిని ‘శాశ్వత ఆహ్వానితులు’గా చేశారు. అందువలన సర్పంచ్‌లు మండల ప్రజాపరిషత్ సమావేశాల్లోనూ, ఎంపీపీలు జిల్లా ప్రజాపరిషత్ సమావేశాల్లోనూ పాల్గొనటానికి ఆసక్తి చూపించటం లేదు. పాల్గొన్నా ఓటు హక్కు లేకపోవడంతో విలువా లేదు. ఈ కారణంగా మూడు అంచెల వ్యవస్థల మధ్య ఉండాల్సిన అవినాభావ సంబంధాలు తెగిపోయి ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. చేసే పనుల్లో, కార్యక్రమాల్లో మూడు వ్యవస్థల మధ్య సమన్వయం పూర్తిగా కరువయింది.

73వ రాజ్యాంగ సవరణ గ్రామ సభకు రాజ్యాంగ ప్రతిపత్తి, ప్రాధాన్యాన్ని కల్పించింది. గ్రామ సభను ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి వేదికగా, గ్రామ స్వరాజ్యంకు ప్రతీకగా భావించింది. గ్రామపంచాయతీలో ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ గ్రామసభ సభ్యులే. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో సంవత్సరంలో రెండుసార్లు గ్రామసభ తప్పనిసరిగా నిర్వహించాలని నిర్దేశించారు. తర్వాత సంవత్సరానికి నాలుగుసార్లు అంటే ప్రతీ మూడు నెలలకు తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే గ్రామసభ ఆచరణ సాధ్యం కాని వ్యవస్థ. గ్రామసభల నిర్వహణకు పలు ప్రతిబంధకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి – గ్రామ పంచాయతీ భౌగోళిక స్వరూపం, ఓటర్ల సంఖ్య, ప్రజల భాగస్వామ్యం. మన గ్రామ పంచాయతీల విస్తీర్ణాన్ని గమనిస్తే చిన్న కుగ్రామం నుంచి అనేక ఆవాసాలతో కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న అనేక ప్రాంతాలు ఉంటాయి. అలాంటి పంచాయతీల్లో అన్ని ఆవాస ప్రాంతాల వారిని ఒకేచోటకు చేర్చి గ్రామసభ నిర్వహించటం కష్టం. అలాగే గ్రామసభ సభ్యులు– 300 నుంచి 15 వేలకు పైబడిన ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వేల సంఖ్యలో సభ్యులు ఉన్న చోట గ్రామసభ నిర్వహించటం, నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. అసలు సమస్య ప్రజల భాగస్వామ్యం. అనుభవం చెబుతున్నది ఏమిటంటే గ్రామ సభలకు ప్రజలు హజరు కారు. బలవంతంగా తరలించినా పట్టుమని పాతిక మంది హాజరుకావడం కష్టం. ఇందుకు అనేక సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. వీటితోబాటు ప్రజల ముందు అన్నీ ఉంచటానికి పంచాయతీ పాలకవర్గాల అయిష్టత. ఫలితంగా గ్రామసభల నిర్వహణ ఒక ప్రహసనంగా మారిపోయింది.


పంచాయతీరాజ్ చట్టం గ్రామ సభకు కోరం నిర్ణయించలేదు. దీని పర్యవసానం నోటీసు ఇచ్చి, గ్రామసభ జరిగిపోయినట్లుగా నమోదు చేసుకోవచ్చు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కనీసం పది శాతం కోరంగా ఉండాలని అందులో 33 శాతం మహిళలు ఉండాలని అప్పుడే గ్రామసభ నిర్వహించాలని గట్టిగా చెబుతున్నది. అలాగే గ్రామసభ సభ్యుల్లో పదిశాతం మంది కోరితే, వారి కోరిక మేరకు వారు కోరిన అంశాలపై గ్రామసభ నిర్వహించాలి అని పంచాయతీరాజ్ చట్టం చెబుతున్నది. అసలు ఈ పదిశాతం ప్రజాస్వామ్యం ఏమిటో, గ్రామ స్వరాజ్యంను ఆది ఎలా ప్రతిబింబిస్తుందో అర్ధం చేసుకోవడం కష్టమే. భారత రాజ్యాంగం మౌలికంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యన్ని నెలకొల్పింది. అందుకు విరుద్ధంగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అధిక జనాభా కలిగిన మనదేశంలో అదీ గ్రామీణ ప్రాంతాలలో అమలు చెయ్యాలనుకోవడంలో ఔచిత్యం కనిపించడం లేదు.

73వ రాజ్యాంగ సవరణ ఫలితంగా రెండు కొత్త ప్రాతినిధ్య వ్యవస్థలు– మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (జడ్పీటీసీ) – సృష్టించబడ్డాయి. ఈ కారణంగా ప్రాతినిధ్య వ్యవస్థలో కొంత గందరగోళం నెలకొని వుంది. ఇవి, ఆరో వేలు లాంటివనే అభిప్రాయం ఒకటి గట్టిగా ఉన్నది. కొత్తగా పుట్టిన ఎంపీటీసీ/జడ్‌పీటీసీ వ్యవస్థలు నిరర్థకమైనవి అనే భావన బలంగా ఉంది. ఆయితే ఈ వ్యవస్థలను సృష్టించటం వెనుక ఉన్న నిగూఢ లక్ష్యాలు అర్థం చేసుకునే ప్రయత్నం లేదు. ఆ నిగూఢ లక్ష్యాలు ఏమిటి? సర్పంచికి, ఎంపీటీసీకి మధ్య అనివార్య పోటీ లేక ఘర్షణ వాతావణం నెలకొల్పడం. ఈ పోటీ లేక ఘర్షణ ప్రజలకు మంచి చేస్తుందనే నమ్మకం; ఒకే నియోజకవర్గం నుండి ఇద్దరు ప్రతినిధులలో ఒకరు స్థానిక వ్యవహారాలు చూసేందుకు, ఇంకొకరు ఉన్నత పాలనా సంస్థలో తమ నియోజక అభివృద్ధికి పాటుపడేందుకు, ఒకే ప్రతినిధి సర్వంగా మారిపోయి ప్రజలను పీడిస్తే ప్రత్యామ్నాయ ప్రతినిధిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు. ఇవేమీ అర్థం చేసుకోకుండా కొత్త వ్యవస్థలకు జవసత్వాలు సమకూర్చేందుకు కనీసం ప్రయత్నించకుండా వాటిని పురిట్లోనే చంపేశారు? ఎంపీటీసీ /జడ్‌పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు.


73వ రాజ్యాంగ సవరణ లక్ష్యం సంపూర్ణ వికేంద్రీకరణ. పంచాయతీల వ్యవస్థాగత నిర్మాణం, విధులు, నిధులు, సిబ్బంది, స్వయం నిర్ణయాధికారం కలిగి స్థానిక ప్రభుత్వాలుగా రూపొందాలని ఆకాంక్ష. అయితే ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 రూపొందించబడలేదు, దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇంతవరకు పంచాయతీరాజ్ శాఖ చేయలేదు. రాజ్యాంగం పదకొండవ షెడ్యూల్ ప్రకారం పంచాయతీలకు బదిలీ చేయవలసిన 29 అంశాలను యథాతథంగా పంచాయతీరాజ్ చట్టాన్ని ఒకటవ షెడ్యూలులో చేర్చి, ప్రభుత్వం అవసరాలను బట్టి ఆయా అంశాలను పంచాయితీలకు బదిలీ చేస్తుందని పేర్కొన్నారు. తర్వాత ఏదో మొక్కుబడిగా పది అంశాలను బదలాయించినట్లుగా ఆదేశాలు ఇచ్చారు కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. అలాగే చట్టం రెండవ షెడ్యూల్లో మండల ప్రజాపరిషత్ నిర్వర్తించవలసిన 15 అంశాలు/ విధులు పేర్కొన్నారు. కానీ ఆయా శాఖల తాలూకా నిధులను గాని, సిబ్బందిని గాని మండల ప్రజాపరిషత్ నియంత్రణలో ఉంచలేదు. ఏతావాతా తేలేది ఏమిటంటే మూడు అంచెల వ్యవస్థలో దేనికీ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న 29 అధికారాలు, నిధులు, విధులు, సిబ్బంది చట్టపరంగా దఖలు పరచబడలేదు. 73వ రాజ్యాంగ సవరణకు ముందు ఉన్న పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతున్నది.


73వ రాజ్యాంగ సవరణ అనంతరం ప్రభుత్వ పాలనా విధానాలలోనూ, వాటి అమలు, పర్యవేక్షణ, సమీక్షా పద్ధతుల్లోనూ పెనుమార్పులు వచ్చాయి. ముఖ్యంగా సమాచార, కమ్యునికేషన్ టెక్నాలజీ రంగంలో సాధించిన ప్రగతి రియల్ టైమ్ గవర్నెన్స్‌కు తెరలేపింది. ప్రజల వద్దకు పాలన నుంచి గడప వద్దకే పాలనకు వచ్చాం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య దూరం అనేది మాయమయిపోయింది. కేంద్రీకృత పాలన వికేంద్రీకృతమై ప్రజల ముంగిట్లోకి వచ్చింది. ‘సోషల్ మీడియా’ విస్ఫోటనం ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం అనే పదానికి అర్థాన్ని మార్చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ లాగే రియల్ టైమ్ ప్రజల భాగస్వామ్యం నడుస్తోంది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోను జిల్లాలు చిన్నవైపొయాయి. అలాగే పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో పంచాయతీరాజ్ సంస్థలను పునర్ నిర్వచించాల్సిన ఆవశ్యకత ఉంది. అలా అని ప్రభుత్వ పాలనలో ఈ వ్యవస్థల అవసరం తీరిపోయిందని అనలేం. కానీ వీటి ప్రాథమ్యాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పునర్ నిర్వచించాల్సి ఉంది. ఈ వ్యవస్థలు నిర్వర్తించాల్సిన అంశాలు ఇప్పటికే చాలానే ఉన్నాయి. అవేమిటో అధ్యయనం చేసి, తదనుగుణంగా చట్టసవరణ చెయ్యాలి. మారిన రాజకీయ, సామాజిక, సాంకేతికతల పరిస్థితులకు అణుగుణంగా ఈ వ్యవస్థలను తీర్చిదిద్దాలి.

ఏది ఏమైనప్పటికీ, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాది. దేశ ప్రజాస్వామిక మనుగడ పంచాయతీరాజ్ వ్యవస్థ పని తీరుమీదే ఆధారపడి ఉంటుంది. భావి నేతలను సృష్టించేవి ఈ వ్యవస్థలే. ప్రజాస్వామిక నడవడికకు అవి ప్రాథమిక బడులు. దురదృష్టం ఏమిటంటే ప్రజలు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ వాటిని అధికార అంచెలుగానే చూస్తున్నారు. సమావేశాలు నిర్వహించటం, సమస్యలు చర్చించటం, పరిష్కారాలు కనుగొనటం అనే బాధ్యతను మరిచిపోయారు. సంకుచిత రాజకీయాలతో పంచాయతీరాజ్ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇందుకు ప్రజా ప్రతినిధుల భాధ్యత ఎంత ఉన్నదో, పంచాయతీరాజ్ అధికారులకూ అంతే బాధ్యత ఉన్నది.

పరదేశి కె. ఎరికిపాటి

విశ్రాంత పంచాయతీరాజ్ అధికారి

Updated Date - Nov 13 , 2024 | 03:18 AM