నాకు విమర్శ కూడా సృజన ప్రక్రియే!
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:43 AM
‘Post truth’ అని లీ మెక్‌ఎంటైర్ పుస్తకం చదివాను. కె.ఎన్.వై. పతంజలినీ, వర్తమాన ప్రపంచాన్నీ, రచనలనీ ఈ కాన్సెప్ట్ నేపథ్యంలో అర్థం చేసుకోవడం, విశ్లేషించగలగడం నాకు బావుంది....
చదువు ముచ్చట
ఈమధ్య చదివిన/ చదువుతున్న పుస్తకం?
‘Post truth’ అని లీ మెక్‌ఎంటైర్ పుస్తకం చదివాను. కె.ఎన్.వై. పతంజలినీ, వర్తమాన ప్రపంచాన్నీ, రచనలనీ ఈ కాన్సెప్ట్ నేపథ్యంలో అర్థం చేసుకోవడం, విశ్లేషించగలగడం నాకు బావుంది.
బాల్యంలో మొదటిసారి ఏ పుస్తకం ఇష్టంగా చదవటం గుర్తుంది?
బుచ్చి బాబు గారు బహుశా నేను మొదట చదివిన రచయిత. 1989లో నేను ఇంటర్‌లో ఉండగా తొలిసారి, ఆ తరువాత చాలాసార్లు ఆయన నవల, కథలు, వ్యాసాలు చదువుతూనే ఉన్నాను. ఈ సాహిత్య ప్రపంచం లోకి నన్ను తీసుకువచ్చిన రచయిత ఆయన.
మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రభావితం చేసిన రచయిత?
మళ్ళీ అదే సమాధానం. బుచ్చిబాబు గారు, ఇంకా పతంజలి శాస్త్రి గారు– ఈ ఇద్దరూ జీవితాన్ని ఎటువంటి పరదాలూ లేకుండా అన్ని వైపుల నుండి, అన్ని లోతుల నుండి చూడడం కొనసాగించారు. ఇప్పుడు కూడా పతంజలిశాస్త్రి గారు కథకి కొత్త సాంకేతికత, కొత్త భాష అద్ది నా లాంటి పాఠకులను విస్మయపరుస్తూనే ఉన్నారు.
తెలుగులో మీకు బాగా నచ్చిన విమర్శ పుస్తకం?
ఇది చెప్పడం కష్టం అండి. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా విమర్శ కూడా సృజన ప్రక్రియగా అనిపిస్తుంది. మనకు అరవై య్యవ దశకం నుండి తొంభైయ్యవ దశకం వరకు వచ్చిన వ్యాస సంపుటాలు అన్నీ దాదాపు ‘ఫార్ములా, దానికి వివరణ’ లాగే వచ్చాయి. ప్రతిదానికీ ఏదో ఒక సిద్ధాంత నేపథ్యం ఉంది. ఇది తప్పని నేను అనడం లేదు. కానీ ఇది ఒక్కటే విమర్శ కాదు. వీరభద్రుడు గారి తొలి రెండు విమర్శ గ్రంథాలు ‘సహృదయునికి ప్రేమలేఖ’, ‘సాహిత్యం ఎందుకు’ ఈ రెండూ ఖచ్చితంగా ఆయా రచనలకు కొత్త పాఠకులను పరిచయం చేస్తాయి.
సాహిత్యంలో మీకు నచ్చిన కల్పిత పాత్ర?
భమిడిపాటి జగన్నాథ రావు గారి కథ ‘మువ్వలు’లో ఒక రెండు నిమిషాలు వచ్చి వెళ్లి పోయే పాత్ర ఒకటి ఉంది. కథ మొత్తాన్ని ఈ పాత్ర ప్రభావితం చేస్తుంది. ఒక అప్రధాన పాత్ర, జస్ట్ కాజువల్‌గా వచ్చినట్లుగా కనపడే ఈ పాత్ర అంటే నాకు ఇప్పటికీ ఫస్ట్ క్రష్ అంత ఇష్టం.
ఏ గత కాలం రచయితనైనా కలిసి మాట్లాడగలిగితే ఎవరితో, ఏం మాట్లాడతారు?
‘వేలుపిళ్లై’ రాసిన సి. రామచంద్రరావు గారిని కలిసి, ‘మీరు మళ్లీ ఎందుకు కథలు రాయలేదు’ అని అడగాలని ఉంది.
మీ పఠనాభిరుచి కాలంతోపాటు ఎలా మారింది?
నేను మొదట్లో పుస్తకాల మీద వచ్చిన విమర్శను ముందు చదివి, ఆ తరువాత ఆ రచనలని చదివేవాడిని. ఇప్పుడు రచనలను ముందు చదువుతు న్నాను. అంతే కాదు వర్తమాన కాలానికి సంబంధించి ఒక అలెర్ట్‌నెస్ కూడా ఇవాళ రచయితలకు, పాఠకులకు అవసరం. అందువల్ల సృజనాత్మక రచనలతో పాటు, ఇతర సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత సంబంధిత గ్రంథాలు కూడా చదవాల్సిన అవసరం ఉందని గ్రహించాను. బహుశా ఇది చెయ్యకపోతే ఏ గ్రంథాన్ని మనం పూర్తిగా విశ్లేషించలేం.
(నండూరి రాజగోపాల్ విమర్శకుడు, ‘చినుకు’ పత్రిక సంపాదకుడు.
ఆయన పుస్తకాలు– సాహిత్య పరామర్శ వ్యాసాల సంపుటి ‘అనంతరంగాలు’, సంపాదకీయ వ్యాసాల సంపుటాలు ‘మొదటి పేజీలు’, ‘వర్తమానం’.)