‘‘దళిత కవిత్వం అంటేనే ప్రశ్నించడం.’’
ABN , Publish Date - Jan 15 , 2024 | 02:16 AM
లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా కవి, అంతర్జాతీయ పర్యటన శాఖా నిపుణులు తుల్లిమల్లి విల్సన్ సుధాకర్‌తో ఇంటర్వ్యూ....
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ : పలకరింపు
లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా కవి, అంతర్జాతీయ పర్యటన శాఖా నిపుణులు తుల్లిమల్లి విల్సన్ సుధాకర్‌తో ఇంటర్వ్యూ.
సుధాకర్ గారూ, పాతికేళ్ల కిందటి కవిత్వారంభ యవ్వనం, ఇప్పుడు సాఫల్య దశకు చేరిందని అనుకుంటున్నారా?
నా కవిత్వం సాఫల్య దశకు చేరిందో లేదో పాఠకులే చెప్పాలి. నేను చెప్పడం సాహసమే అవుతుంది. రాయాల్సింది చానా ఉంది.
కాకపొతే గత పాతికేళ్లుగా నేను నిరంతర సమస్యల అధ్యయనంతో కవిత్వం రాస్తున్నందున, ఎప్పటికప్పుడు నవీకరించబడే వ్యక్తీకరణ ప్రక్రియలో వ్రాయడం, నాకంటూ ఒక వ్యక్తీకరణను సృష్టించుకోడం వల్ల నా కవిత్వం ఎప్పుడూ కొత్తదనాన్ని వెతుకుతున్నట్లు అనిపిస్తుంది. సొంత అభివ్యక్తిని సాధించడంలో విజయం సాధించానేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.
ఆశ్చర్యకరమై పోలికలు, సంక్లిష్టంగా అనిపించే అల్లికలు, పదునైన ఆగ్రహం, ప్రత్యేకమైన డిక్షన్... వీటిని మీ కవిత్వంలో ప్రధాన పనిముట్లు అనుకోవచ్చా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి నేను రాస్తున్నాను. నేను విశ్వవ్యాప్త ప్రేమ, బాధ, కోపం, పోరాటాలను కవిత్వంలో వ్యక్తీకరిస్తున్నాను. వీటిని కవిత్వంలో వ్యక్తీకరించే సాధనాలు నాకు ఎన్నో దొరికాయి. కవిత్వంలోనే ప్రశ్నించడం ఒకటి. దళిత కవిత్వం అంటేనే ప్రశ్నించడం. అదే పనిముట్లతో గిరిజనులు, మైనార్టీల సమస్యల గురించి రాయగలిగాను. సమకాలీన ప్రపంచంలోని ప్రధాన స్రవంతిలో ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకుని, కవిత్వపాదాల్లో నిరసన, ప్రతిఘటన తెలియజేశాను. వ్యవస్థలో మార్పు కోరుకున్నాను. ఆంధ్రాలో దళితుల ఊచకోత, మణిపూర్‌లో క్రైస్తవులపై జరుగుతున్న హింస, హిజాబ్, పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణకాండ, వీటన్నింటి మీద కవిత్వం రాసాను. రాయడానికి ప్రపంచ సమస్యలే నాకు పెద్ద కాన్వాసు. వీటినుండి స్ఫూర్తి పొందుతున్నాను. ఇంకా రాయాల్సింది ఎంతో ఉంది.
కవిగానే కాదు, పర్యాటక రంగ నిపుణునిగా కూడా మీకు జీవనసాఫల్య పురస్కారం ఇస్తున్నారు. ప్రపంచ పర్యటన మీ కవిత్వానికి ఎంతవరకు ఉపయోగపడింది?
చాలా మంది ఫీల్డులో ఎలాటి పాత్ర లేకుండానే పాల్గొనకుండానే ఉద్యమంలోకి వస్తుంటారు. కొంతమంది జర్నలిజం వార్తల ఆధారంగా కవిత్వం రాస్తారు, వివిధ సమస్యలపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ గందరగోళంలో వాస్తవాలు మరుగుపడుతుంటాయి. నిజానిజాలు కనిపెట్టడానికి ఎంతమందికి మూడో నేత్రం ఉంది? వివిధ దేశాలను సందర్శించే అవకాశం ఉండడం వల్ల కొన్ని కదలికలను, ఉద్యమాలను దగ్గరగా చూడగలిగాను. దక్షిణాఫ్రికాలో నల్లవారి బాధలే కాదు, తెల్లవారి కష్టాలు, భారతీయుల కష్టాలు, నల్లజాతీయుల ఆధిపత్యం కూడా చూడగలిగాను. మొరాకో వెళ్లినప్పుడు కాసాబ్లాంకా మురికివాడల్లో ప్రజల ఆత్మగౌరవ పోరాటాలు చూశాను. అభివృద్ధి చెందిన జపాన్‌లో కూడా అనేక రెస్ర్టాంట్‌లలో స్థానిక ప్రజలు, మైనారిటీలకు వ్యతిరేకంగా అనేక సైన్ బోర్డులు చూసాను. వివక్షాపూరిత చట్టాలు, జాత్యహంకార ప్రజలు కనబడతాయి. ఇవన్నీ దగ్గరగా చూడగలిగాను. దుబాయ్‌లో ఉన్నప్పుడు వలస కార్మికుల అవస్థలు కనబడుతుండేవి. ఇవన్నీ నాకవిత్వంలో రాసాను.
మార్క్సిస్టులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. దళితోద్యమకార్యకర్తలు కూడా దళితుల సమస్యలను పూర్తిగా తెలుసుకుని రాస్తుంటారు. అలాంటి ప్రపంచానుభవం నాది. వివిధ ప్రదేశాల్లోని సమస్యలను చూసే అవకాశం లభించింది. అవన్నీ నా కవిత్వంలో నిలిచిపోతాయి.
పేరు చూడకుండానే కవిత్వ కర్తను గుర్తుపట్టగలిగే అతి కొద్ది మంది కవుల్లో మీరు చేరారు, మీ వ్యక్తీకరణలోనే కాక, మీరు ఎంచుకునే వస్తువుల్లో కూడా మీ ముద్ర కనిపిస్తుంది. వాట్ నెక్ట్స్?
"Death of author' కాన్సెప్ట్ వినే ఉంటారు. సాహిత్య సిద్ధాంతంలో, కవి కవిత్వం మీద ఎప్పటికీ ఆధిపత్యం వహించడు. కవి మరణిస్తాడు. కవిత్వం మాత్రమే మిగిలి ఉంటుంది. కవిత్వం రాసాక కవి మరణిస్తాడు. మరణం తరువాత, పాఠకులు మరిన్ని కళాకృతుల కోసం తహతహ లాడుతుంటారు. అలాంటి వాతావరణంలో పేర్లు చదవకుండా కేవలం కవిత్వం చదివి, కవి ఎవరో చెప్పగలిగిన బృందంలో నేనున్నందుకు సంతోషిస్తున్నాను. ఒక వ్యక్తి ఆరాధన కంటే వస్తువు మీద కవిత్వం రాసినప్పుడు ఇది జరుగుతుంది. ఈ లక్షణం కొనసాగుతుంది. అయితే వైయక్తిక అనుభూతులతో భావాలతో భావ కవిత్వం కూడా రాశాను. కానీ నిరసన కవిత్వంలోనే వ్యక్తిగత అనుభూతులతో రాసినవి ఎన్నో ఉన్నాయి. కవిత్వంలో విశాల దృక్పథంతో రకరకాల అంశాలతో కవిత్వం రాస్తూ వచ్చాను.
95380 53030