దక్షిణాదికి పొంచి ఉన్న ప్రమాదం!
ABN , Publish Date - Apr 16 , 2024 | 04:01 AM
దేశంలోని ఉత్తర–దక్షిణ తేడాలు అందరికీ తెలిసినవే. భాష, సంస్కృతుల్లో ఇవి కొట్టొచ్చినట్లు కనపడతాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడి రాకపోకలు పెరిగిన తర్వాత అవి ఇంకా బాగా తెలిసొచ్చాయి. ఈ తేడాలు ఆధారంగానే...
దేశంలోని ఉత్తర–దక్షిణ తేడాలు అందరికీ తెలిసినవే. భాష, సంస్కృతుల్లో ఇవి కొట్టొచ్చినట్లు కనపడతాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడి రాకపోకలు పెరిగిన తర్వాత అవి ఇంకా బాగా తెలిసొచ్చాయి. ఈ తేడాలు ఆధారంగానే ద్రవిడవాదం తలెత్తింది. భాషల తులనాత్మక పరిశీలనను దేశ చరిత్రలో కీలక ఘట్టంగా చెప్పుకోవాలి. ఉత్తర, దక్షిణ భాషల విభిన్నత అప్పుడే బాగా తెలిసింది. ఈ రెండిటి పుట్టుక వేరనీ అప్పుడే స్పష్టమైంది. సంప్రదాయ పండితుల ఆలోచనలు వీటికి పూర్తి విరుద్ధంగా ఉండేవి. భాషలన్నీ సంస్కృతం నుంచే వచ్చాయని గట్టిగా నమ్మేవారు. సంస్కృత సంప్రదాయాలు, ఆలోచనల ప్రభావం శతాబ్దాలపాటు బలంగా కొనసాగింది. అందుకే దక్షిణాది భాషలకు సొంత మూలాలు ఉన్నాయన్న భావన సంప్రదాయ పండితులకు తట్టలేదు. తట్టినా సంస్కృతాన్ని దైవభాషగా భావించటం వల్ల దాన్ని పట్టించుకోలేదు.
భాషల పరిశీలన వల్ల మరో సంగతి వెల్లడైంది. సంస్కృతానికి కొన్ని యూరోపు భాషలకున్న బంధం బయటపడింది. ఆ బంధం ఇతర విషయాల పరిశోధనకు దారి తీసింది. ఆర్యుల స్థానికత గుట్టును తెలిపింది. వారి వలసల చరిత్ర వెలుగులోకి వచ్చింది.. భారత్‌కు వారెప్పుడు తరలి వచ్చారో స్థూలంగా వెల్లడైంది. ఇవన్నీ ఇప్పుడు అందరికీ తెలిసిన సాధారణ విషయాలు. కానీ ఆర్యులరాక ఒకప్పుడు ఎన్నో సంచలనాలకు కారణమైంది. 100–150 ఏళ్ల క్రితం అది సృష్టించిన ప్రభావం ప్రగాఢమైంది. చరిత్ర పరిశోధనలో తేలిన ప్రతి ఘట్టాన్నీ సమకాలీన అవసరాల కోసం వాడుకోవటం అన్నిచోట్లా జరిగింది. దక్షిణాదిన పలురంగాల్లో ఆనాడు నెలకొన్న బ్రాహ్మణ ఆధిక్యతపై ఆగ్రహంగా ఉన్న వర్గాలకు ఆర్యవలస సిద్ధాంతం అలాగే ఉపకరించింది. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సమర్థించటానికి కావాల్సిన సిద్ధాంతాలు సంస్కృతంలో పుష్కలంగా ఉన్నాయి. దాన్ని వ్యతిరేకించే వర్గాలకు బలమైన సిద్ధాంతం ఒకటి కావాలి. ఎక్కడ నుంచో వచ్చిన ఆర్యులు ఉత్తరాదిలో ఒకనాడు ఉండే ద్రవిడులను తరిమేశారనే సిద్ధాంతం అట్లా బ్రాహ్మణ ఆధిక్యతను ఎదుర్కొనే సాధనంగా పరిణమించింది. ఆ తర్వాత ద్రవిడ దృక్కోణం నుంచి చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. మూలవాసులనూ, ద్రవిడులనూ, వాళ్ల సంస్కృతులనూ, భాషలనూ ఆర్యులు అణచివేశారనే భావనే ఇందులో ప్రధానమైంది. ఈ అణచివేతల్లో నిజనిజాలెంత ఉన్నా ఒకటి మాత్రం చారిత్రక వాస్తవం. ఆర్యుల వలసలపై చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉంది. హిందూత్వవాదులు మాత్రం దీన్ని అంగీకరించరు. విదేశీగడ్డ నుంచి వచ్చిన వారివల్లే వేద సమాజం ఏర్పడిందని అంగీకరిస్తే హిందూమత స్వదేశీయతకు అర్థం లేకుండా పోతుంది. ఆర్యుల వలసలపై అంగీకారమున్నా ద్రవిడులను దక్షిణాదికి నెట్టివేశారనే ప్రతిపాదనను చరిత్రకారులు ఇప్పుడు అంగీకరించటం లేదు. ఆర్య–ద్రవిడ వైషమ్య దృష్టి నుంచి గతాన్ని చూడటమూ తగ్గిపోయింది. కానీ వందేళ్ల కిందట ఈ దృష్టితోనే దక్షిణాదిలో ఆత్మగౌరవ ఉద్యమాలు ఊపిరులు పోసుకున్నాయి. జ్యోతిరావు పూలే, రామస్వామి నాయకర్ సిద్ధాంతాలు అలా మొగ్గతొడిగినవే.
వీటిని కాసేపు పక్కనపెట్టి సమకాలీన చిత్రాన్ని చూద్దాం. ఒకనాటి ఆర్య–ద్రవిడ వివాదంతో సంబంధం లేకుండా ఉత్తరాది–దక్షిణాది మధ్య ఇప్పుడు కొత్త విభజనలు పొడచూపుతున్నాయా? అని ప్రశ్నించుకుంటే అవుననే జవాబు చెప్పాలి. అభివృద్ధిపరంగా రాష్ట్రాల మధ్యన తలెత్తిన వ్యత్యాసాలు, కేంద్ర ప్రభుత్వం చేతిలో విపరీత అధికారాల కేంద్రీకరణ, ఉత్తరాదిని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న విధానాలను దక్షిణాదిపై బలవంతంగా రుద్దటం, దక్షిణాది నుంచి ఉత్తరాదికి భారీగా ఆదాయం తరలి వెళ్లటం, లోక్‌సభలో దక్షిణాది సీట్లు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉండటం లాంటి అంశాలు ప్రధానంగా వీటికి దోహదం చేస్తున్నాయి. ‘సౌత్ వర్సస్ నార్త్: ఇండియాస్ గ్రేట్ డివైడ్’ పేరుతో ఆర్.ఎస్. నీలకంఠన్ రాసిన పుస్తకం కూడా అదే కోవలోది.
విద్య, ఆరోగ్యాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాదితో పోల్చితే పురోగతిని సాధించాయి. ఈ ప్రగతి జనాభా పెరుగుదలను బాగా ప్రభావితం చేసింది. చదువుకున్న మహిళలకు పుట్టే పిల్లల సంఖ్య తక్కువ. కుటుంబ నియంత్రణ పాటింపు ఎక్కువ. సంతాన సాఫల్య రేటూ బాగా తగ్గింది. మరణాల రేటు దిగువకు జననాల రేటు పడిపోతోంది. వృద్ధుల సంఖ్య దక్షిణాదిన పెరుగుతోంది. శిశు మరణాల్లో దక్షిణాది–ఉత్తరాది మధ్య తేడాలు బాగా పెరిగాయి. కాన్పు సమయంలో మరణించే తల్లుల సంఖ్యలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సూచీలోనైనా ఉత్తరాదిన వెనుకబాటే కన్పిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, డాక్టర్ల అందుబాటు, టీకాల కార్యక్రమం, అంగన్‌వాడీల్లో సౌకర్యాలు.. ఇలా దేన్ని పరిగణనలోకి తీసుకున్నా ఇదే పరిస్థితి. వీటిని పరిగణించకుండా ఉత్తరాదిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆరోగ్యరంగంపై విధానాలను రూపొందిస్తోంది. నేషనల్ హెల్త్ మిషన్‌లో నిర్దేశించిన లక్ష్యాల్లో చాలా వాటిని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడో దాటేశాయి. కేరళ, తమిళనాడులు సొంత విధానాలతో ఆరోగ్యరంగంలో సాధించిన ప్రగతిని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ప్రోత్సహించాల్సిన కేంద్రం చాలా విషయాలను ఏకపక్షంగా తన చేతుల్లోకి తీసుకుంటోంది. విద్య, వైద్యం అనేవి రాష్ట్ర ప్రభుత్వాలు చూడాల్సిన విషయాలు. స్థానిక అవసరాలకు అనుగుణంగా వైద్యులను తయారుచేసుకునే బాధ్యత కూడా రాష్ట్రాలపైనే ఉంటుంది. నీట్ లాంటి పరీక్షల వల్ల రాష్ట్రాలు అయిష్టంగా వైద్య సీట్లను వదులుకోవాల్సి వస్తోంది. వైద్యరంగంలోనే గాక ఇతర వాటిల్లోనూ దేశమంతటికి ఏకరీతిగా వర్తింపచేసే విధానాల వల్ల చెడే ఎక్కువ జరుగుతోందని నీలకంఠన్ గణాంకాల ఆధారంగా వివరించారు.
ఉన్నత విద్యలోకి యువతీయువకులు ప్రవేశించటంలో కూడా ఉత్తర–దక్షిణాల మధ్య తేడా ఉంది. జాతీయ సగటు 26 శాతాన్ని మించి తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు ముందుకు వెళుతున్నాయి. ఆ సగటుకు ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా దూరంగానే ఉన్నాయి. పాఠశాల స్థాయిల్లో చదువుమానే పిల్లలు ఉత్తరాదిలో ఎక్కువ. ఇలాంటి విభిన్న పరిస్థితులను అన్ని స్థాయిల్లోనూ కనపడతాయి. వీటిని పట్టించుకోకుండా జాతీయ విద్యా విధానం పేరుతో దేశవ్యాప్త అర్హత పరీక్షలు, బోధనా మాధ్యమంపై ఆదేశికాలు వెలువడుతున్నాయి. ఏదో రూపంలో హిందీని తప్పనిసరిగా నేర్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అనేక కారణాల వల్ల దక్షిణాదిన ఇంగ్లిషు బోధనా మాధ్యమం బాగా ప్రాచుర్యం పొందింది. ఆ మాధ్యమంలో ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న పిల్లల సంఖ్య దక్షిణాదిలో గణనీయంగా పెరుగుతోంది. కర్ణాటకలో 53శాతం, తమిళనాడులో 91శాతం, కేరళలో 81శాతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80 శాతం పిల్లలు ఇలా చదువుతున్నవారే ఉన్నారు.
వ్యవసాయం నుంచి వస్తుతయారీ, సేవల రంగంలోకి అడుగు పెట్టటంలో కూడా దక్షిణాదిలో వేగం పుంజుకుంటోంది. గ్రామీణ కుటుంబాల్లో సైతం వ్యవసాయం మీద ఆధారపడటం తగ్గుతోంది. కర్ణాటకలో గ్రామీణ ప్రాంతంలో 55శాతం, తెలంగాణలో 52శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 42శాతం, తమిళనాడులో 35శాతం, కేరళలో 27శాతం కుటుంబాలు గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడగా.. రాజస్థాన్‌లో 78శాతం, యూపీలో 75 శాతం, మధ్యప్రదేశ్‌లో 71శాతం, ఛత్తీస్‌ఘడ్‌లో 68శాతం కుటుంబాలు దానిపై జీవిస్తున్నాయి.
ఇక పట్టణాల్లో జీవించే వారి సంఖ్య కూడా దక్షిణాదిలో బాగా పెరుగుతోంది. తమిళనాడులో 48శాతం, కేరళలో 48శాతం, కర్ణాటకలో 39శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం (2011 జనాభా లెక్కల ప్రకారం) మంది పట్టణాల్లో జీవిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌లు మాత్రమే తమిళనాడు, కేరళకు దగ్గర్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 22శాతం, బిహార్‌లో 11శాతం, రాజస్థాన్‌లో 25శాతం మధ్యప్రదేశ్‌లో 28శాతం, హిమాచల్‌లో 10శాతం మంది మాత్రమే పట్టణాల్లో జీవిస్తున్నారు. మహిళా శ్రామికుల వాటా కూడా దక్షిణాదిన ఎక్కువ.
1971 నుంచి 2011 వరకూ జనాభా లెక్కలను తీసుకుంటే ఉత్తరాది–దక్షిణాదిల మధ్య పెరుగుదలల్లో తేడాలు స్పష్టంగా కనపడతాయి. నాలుగు దశాబ్దాల్లో రాజస్థాన్‌లో జనాభా 166 శాతం పెరిగింది. అది కేరళలో 56 శాతం మాత్రమే. బిహార్‌లో 146శాతం పెరిగితే తమిళనాడులో అది 75 శాతమే. జనాభాను తగ్గించుకున్న రాష్ట్రాలకు ఏదోవిధంగా కేంద్రం నుంచి వచ్చే ఆదాయంలో గండి పడటం, 2026లో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో లోక్‌సభ సీట్లు తగ్గే ప్రమాదం పొంచి ఉండటం.. దక్షిణాది ముందు ప్రస్తుతం పెనుసవాళ్లుగా మారాయి. దక్షిణాది నుంచి పన్నుల రూపంలో తీసుకునేది ఎంత? ఇచ్చేది ఎంత? అనే ప్రశ్నలు అయిదారేళ్లుగా గట్టిగానే వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతలు వందలసార్లు గణాంకాల ఆధారంగా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోనూ అదే జరుగుతోంది.
ఒక ఓటుకు ఒక విలువ అన్నది ప్రజాస్వామ్యంలో కీలకం. మనకు 15లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గాలూ ఉన్నాయి. 30 లక్షల ఓటర్లున్నవీ ఉన్నాయి. దీంతో ఒక ఓటుకు ఒకే విలువ అనేదానికి అర్థం లేకుండా పోతుంది. కొత్తగా చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అనివార్యం. దాన్ని ఆపలేం. లోక్‌సభ సీట్లు తగ్గితే బలహీనమయ్యే పరిస్థితి దక్షిణాదికి రాకుండా ఉండాలంటే కేంద్రం చేతిలోని అధికారాలను గణనీయంగా తగ్గించటమే మార్గం. రాష్ట్రాలకు కీలక అధికారాలు బదలాయింపు జరిగితే లోక్‌సభలో సీట్ల పెంపు సమస్య కాకపోవచ్చు. అంబేడ్కర్ సూచించినట్లు రాజ్యసభలో చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటే లోక్‌సభలోని సంఖ్యాధిక్యత సృష్టించే విపరిణామాలను కొంతైనా ఆపే అవకాశం ఉంటుంది. అమెరికా సెనెట్ చాలా వరకూ ఆ పనిని చేసిందని కూడా అంబేడ్కర్ చెప్పారు. అమృతకాలంలో కచ్చితంగా జరగాల్సింది నిజమైన వికేంద్రీకరణ. జరుగుతుంది మాత్రం పక్కా కేంద్రీకరణ. పన్నుల విధింపు అధికారం కేంద్ర ప్రభుత్వ అధికారానికి ఆయువుపట్టు. జీఎస్టీతో ఆ పట్టు మరింతగా పెరిగింది. రాష్ట్రాలకు సొంత వనరులను గణనీయంగా సమీకరించుకునే అధికారమే అసలైన సమాఖ్య అస్తిత్వానికి నిదర్శనం. అధికార కేంద్రీకరణ ఆగకపోతే ప్రస్తుతం ఉత్తరాది–దక్షిణాది మధ్య రేగుతున్న వివాదాలు మరోచోటా కనపడొచ్చు!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)