Share News

ఆనాటి ‘మండుతున్న తరా’నికి అంకితమిచ్చాను!

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:40 AM

వ్య క్తిగతంగా నా మొదటి కవితా సంపుటి ‘మండు తున్న తరం’ 1972 అక్టోబర్‌లో వెలువడింది. అంతకుపూర్వమే 1965–68 మధ్య ‘దిగంబరకవులు’ మూడు సంకలనాల్లోని ఆరుగురు కవులలో ఒకడిగా...

ఆనాటి ‘మండుతున్న తరా’నికి అంకితమిచ్చాను!

నా మొదటి పుస్తకం

వ్య క్తిగతంగా నా మొదటి కవితా సంపుటి ‘మండు తున్న తరం’ 1972 అక్టోబర్‌లో వెలువడింది. అంతకుపూర్వమే 1965–68 మధ్య ‘దిగంబరకవులు’ మూడు సంకలనాల్లోని ఆరుగురు కవులలో ఒకడిగా నా కవితలున్నాయి. వాటిని మినహాయించి, నేను 1969–1972లో రాసిన కవితల్లోంచి ఏరి 24 కవితలను ‘మండుతున్న తరం’లో చేర్చాను. ఈ కవితలన్నీ వివిధ పత్రికల్లో ఆ కాలంలో వెలుగు చూసినవే!

‍అ‍సలు 1960 నుంచి 1965 వరకు కె. యాదవరెడ్డిగా రాసిన కవితలన్నీ ఒక సంపుటిగా ఆనాడే రావలసింది. వచన కవితోద్యమ రోజులవి. స్వంత ఖర్చుతో ఎవరికి వారు పుస్తకం వేసుకోవలసిందే తప్ప పబ్లిషర్స్‌ లేరు. నేను ఆర్థికంగా వెలుసుబాటు లేనందువల్ల, వడ్డీకి అప్పు చేసి పుస్తకం అచ్చు వేయించాలనే ధైర్యం లేక ప్రచురించలేదు. 1970లో విరసం ఆవిర్భావం తర్వాత, సంస్థాగత నిమగ్నత వల్ల 1972 దాకా ఆగవలసి వచ్చింది.

ఆనాడు అందరి మిత్రులు ‘నవయుగ పబ్లిషర్స్‌’ సాంబశివరావు గారు ప్రచురణ పరంగా ఆదరించారు. తెనాలి లోని భారతీప్రెస్‌లో నా ‘మండు తున్న తరం’ తోపాటు, జ్వాలాముఖి, సి.యస్‌. రావు రచనలను కూడా ముద్రించారు. 60 పేజీలలో 24 కవితలతో చిత్రకారుడు చంద్ర వేసిన ముఖచిత్రంతో, రెండు రూపాయల వెలతో 1972లో వెలువడింది.


నేను ‘విరసం’ సంస్థాపక సభ్యుడిగా తర్వాత కార్యదర్శిగావున్న రోజులవి. ఈ మొదటి సంపుటిని– ‘‘ఈ దేశంలో రాజుకొన్న/ శ్రామిక విప్లవం కోసం/ మహత్తరమైన మార్పు కోసం/ మండిన – మండుతున్న/ ఈనాటి తరం కోసం’’ అని అంకితమిచ్చాను. ఈ సంపుటిలోని ‘భయం’ కవిత వివిధ భాషల్లోకి అనువాదమై ప్రశంసలు పొందింది. ‘రక్తాన్ని చిందించిన కత్తి’ ఏడు పేజీల దీర్ఘ కవిత– ఇది ఇతివృత్తంతో కూడినది. ‘కంటి లోంచి జారిపోతున్న జెర్రిపోతు’ కవిత ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా విమర్శనాత్మకంగా రాసిన ఖండిక. ఇక ఈ సంపుటిపై వచ్చిన సమీక్షల్లో ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సమీక్ష పేర్కొనదగినది.

ఈ పుస్తకానికి ‘ఈ కవిత్వం ఎందుకు’ అని నేనే ముందు మాట రాసి ఆనాటి పరిస్థితులను వివరించాను. 1969–70లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దారి తప్పి, యువకుల త్యాగాలతో కొందరు నాయకులు గద్దెనెక్కారని ఎండగట్టాను. విప్లవ యువతను మండుతున్న తరంగా (The burning generation) భావించి, విప్లవ కవితా ఝంఝ విస్తృతంగా వీస్తూనే ఉంటుందని– ‘‘సమాజం లోంచి ప్రతిధ్వనించి తిరిగి సమాజం లోకి– శాస్త్రీయ మార్క్సిస్టు దర్శనం దిక్కు చూపించగా ఆనాటి యువతరం తిరుగుబాటు, నక్సల్బరీ – శ్రీకాకుళ పోరాటాల ఊపునిచ్చి ముందుకు తోశాయి’’ అని కవితల నేపథ్యాన్ని స్పష్టం చేశాను.

91778 81201

Updated Date - Sep 16 , 2024 | 04:41 AM