Share News

చట్టం మారిస్తేనే ఫిరాయింపులు ఆగేది!

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:44 AM

దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుస్థిరత కోసం, ప్రజాస్వామ్య సంస్థల శ్రేష్ఠతను కాపాడేందుకుగాను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. 1985లో ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతూనే...

చట్టం మారిస్తేనే ఫిరాయింపులు ఆగేది!

దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుస్థిరత కోసం, ప్రజాస్వామ్య సంస్థల శ్రేష్ఠతను కాపాడేందుకుగాను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. 1985లో ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతూనే ఉన్నది. ప్రభుత్వాల మనుగడను ప్రశ్నార్థకం చేసే పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవటానికి ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. కాలక్రమంలో కొంత మేర ఫిరాయింపులు తగ్గినప్పటికీ అందులో లోపాలు క్రమంగా బయటపడుతున్నాయి. అందుకే ఈ చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నది.

దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే ఈ ఫిరాయింపుల జాడ్యం ఉన్నది. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా పార్టీ మారటం అనే జాడ్యం వల్ల చాలా ప్రభుత్వాలు కూలిపోయాయి. ఈ ఫిరాయింపులు కేవలం ఎన్నికలపైనే కాకుండా ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిపైనా నైతిక ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ చట్టాని కంటే ముందు చాలా తీవ్రంగా ఫిరాయింపులు జరిగాయి. ఆర్థిక లాభం, పదవుల కోసం ప్రజాప్రతినిధులు పార్టీలు మారేవారు. దీనివల్ల ప్రభుత్వాలు మెజారిటీని కోల్పోయి, ఎన్నికలు జరుగకుండానే కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యేవి. 1960లో హర్యానాలో గయారాం అనే ఎమ్మెల్యే ఒకే రోజులో చాలా పార్టీలు మారటం వల్లనే ‘ఆయారాం, గయారాం’ అనే పదం స్థిరపడిపోయింది. ఇలాంటి సంఘటనల వల్లనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అవసరం ఏర్పడింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా, 10వ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో పొందుపర్చారు. ఈ చట్టం ద్వారా పార్టీ మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం లభించింది. సభ్యులు పార్టీ విప్‌ ధిక్కరించినా, స్వచ్ఛందంగా పార్టీని వదిలిపెట్టినా అనర్హతకు గురవుతారు. ఈ చట్ట ముఖ్య ఉద్దేశ్యం సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటు, సభ్యులు ఎన్నికైన పార్టీలోనే కొనసాగటం. మొదట్లో పార్టీ ఫిరాయింపులు ఆగినప్పటికీ ఆ తర్వాత ఈ చట్టంలోని లోపాలు బయటపడ్డాయి. అందులో మొదటిది– ఏదైనా పార్టీలో చీలిక వచ్చి మూడో వంతు సభ్యులు పార్టీ మారవచ్చనే నిబంధన. దీన్ని నివారించటానికి రెండింట మూడు వంతుల మంది సభ్యులు అంగీకరిస్తేనే విలీనం జరిగేలా 2003లో 91వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనివల్ల తక్కువ మంది సభ్యుల ఫిరాయింపు ఆగిపోయింది.


ఈ చట్టం అమలుపై అనేక విమర్శలు, సవాళ్లు ఎదురయ్యాయి. అందులో ముఖ్యమైనది, స్పీకర్‌ లేదా సభాధ్యక్షుడు అనర్హతపై నిర్ణయం తీసుకోవటం. లోక్‌సభ లేదా అసెంబ్లీ, రాజ్యసభ లేదా మండలిలో అనర్హతపై స్పీకర్‌దే తుది నిర్ణయం. ఈ బాధ్యతను కొందరు ఆలస్యం చేయటం లేదా దుర్వినియోగం చేయటం వల్ల జవాబుదారీతనం లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో స్పీకర్‌ లేదా సభాధ్యక్షులు, సంవత్సరాలు లేదా నెలల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చట్ట స్ఫూర్తికి తూట్లు పొడిచారు. నిర్ణయంలో ఆలస్యం వల్ల కొందరు పార్టీ మారినా ఎలాంటి అనర్హత, చర్యలు లేకుండా తప్పించుకోలిగారు. సభాధ్యక్షులపై పెట్టిన ఈ బాధ్యతకు ఎలాంటి కాల వ్యవధి లేకపోవటం ఈ చట్టంలో అతిపెద్ద లోపంగా మారింది. మరోవైపు పార్టీ విప్‌లు జారీచేయటంలో ఎలాంటి నిబంధనలు లేకపోవటం సమస్యగా మారింది. విప్‌లు ఆయా పార్టీ ప్రతినిధులకు సభలో జరిగే ఓటింగ్‌లపై క్రమశిక్షణ చర్యలు కీలకమైనవి. కానీ, విప్‌ల జారీ వివాదాస్పదంగా మారి, సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అడ్డంకులుగా తయారయ్యాయి. స్పీకర్‌ నిర్ణయం, న్యాయసమీక్షకు లోబడి ఉన్నప్పటికీ చాలాసార్లు న్యాయస్థానాలు శాసన సంబంధిత విషయాల్లో తలదూర్చేందుకు ఆసక్తి చూపట్లేదు. ఇది అతిపెద్ద ప్రతిబంధకంగా మారింది. అందుకోసమే ఈ చట్టంలో ఉన్న సవాళ్లను తొలగించాలి.


స్పీకర్‌ లేదా సభాధ్యక్షులు అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవటానికి సమయాన్ని నిర్దేశించాలి. చట్టంలో నిర్దేశిత సమయాన్ని చేర్చకపోవటం వల్ల అనవసరమైన ఆలస్యం, అధికార దుర్వినియోగం జరుగుతున్నది. తద్వారా ప్రజాప్రతినిధులు తమ పదవుల్లో కొనసాగేందుకు ఆస్కారం ఏర్పడుతున్నది. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకునేలా చట్ట సవరణ చేసి, ఆ బాధ్యతను స్పీకర్లు/ సభాధ్యక్షులపై పెట్టడం వల్ల సమస్యను అధిగమించవచ్చు. ఈ బాధ్యత వల్ల స్పీకర్లు/ సభాధ్యక్షులు నిర్దేశిత సమయంలో నిర్ణయాలు తీసుకొని ప్రజాస్వామిక పద్ధతులను పాటించేలా చేయవచ్చు.

విప్‌ల జారీ పార్టీల అంతర్గత విషయమైనప్పటికీ, సభ్యులకు తగిన విధంగా విప్‌ జారీ చేశారా లేదా అన్న విషయం వివాదాస్పదమవుతున్నది. విప్‌ల జారీని బహిరంగం చేసి మీడియాలో ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల పార్టీ సభ్యులు ఆదేశాలను తగిన విధంగా అర్థం చేసుకొని జవాబుదారీతనంతో మెలిగేలా చట్టం సహకరిస్తుంది. ఏదైనా వివాదం చెలరేగినప్పుడు ప్రజా బాహుళ్యంలోనే తేల్చుకునే అవకాశం ఉంటుంది. పార్టీ ఆదేశాలను సక్రమంగా పాటించేలా సభ్యులకు ఒక దిశా నిర్దేశం వలె పనిచేస్తుంది. కీలక అంశాల్లో పార్టీ నిర్ణయాలు ప్రజలకు అర్థమయ్యేందుకు ఈ సవరణ దోహదపడుతుంది. విప్‌లను ధిక్కరించే సభ్యులు ప్రజల దృష్టిలో పడేలా ఉపయోగపడుతుంది. సభ్యుల్లో క్రమశిక్షణ, శాసనవ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. అంతేకాకుండా, భారత ప్రభుత్వం 1990లో దినేశ్‌ గోస్వామి, 1994లో హశీం అబ్దుల్‌ హలీమ్‌, 1999లో 170వ లా కమిషన్‌, రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ చేసిన పార్టీ ఫిరాయింపులను నిరోధించటానికి చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల పవిత్రతను, ప్రభుత్వాల సుస్థిరతను కాపాడటానికి పార్టీ ఫిరాయుంపుల నిరోధక చట్టం ఎంతగానో దోహదపడింది. కానీ, ఈ చట్టం అమలులో ఉన్న లోపాలను నివారించి పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉన్నది. నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవటం, పార్టీ విప్‌లను ప్రజల్లోకి వెలువరించటం లాంటి సవరణలు ఈ చట్టాన్ని బలోపేతం చేస్తాయి.


అయితే ఇక్కడ ఓ చోద్యం చూడండి.. రాజ్యాంగంలో పొందుపర్చిన షెడ్యూల్‌ 10 ప్రకారం ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌/ సభాధ్యక్షులకే ఉండాలి. కానీ, 2020లో సుప్రీంకోర్టు జస్టిస్‌ నారీమన్‌ బెంచ్‌ కేశం మేఘచంద్ర సింగ్‌ వర్సెస్‌ స్పీకర్‌ మణిపూర్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం ఎలక్షన్‌ కమిషన్‌కు ఉండాలని, లేదా వారిపై ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. చట్టసభలపై ఎలక్షన్‌ కమిషన్‌ లేదా, ట్రిబ్యునల్‌ ఆధిపత్యం చెలాయించడం సరికాదు. అలాచేస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం మొత్తానికే నీరుగారిపోయే ప్రమాదం కూడా పొంచి ఉన్నది.

ఒకే దేశం -ఒకే ఎన్నికను జరపాలనుకుంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకంటే ముందుగా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ సవరణ ద్వారా బలోపేతం చేయాలి. దీనివల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారకుండా, క్రమశిక్షణతో మెలిగి ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది. ప్రధానమంత్రి, లోక్‌సభా నాయకుడు నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ చట్ట సవరణ జరిగేలా కృషిచేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌/ సభాధ్యక్షులకే ఉండాలి. అది కూడా నిర్దిష్ట సమయంలోనే. కాబట్టి నాలుగు వారాల్లోనే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినప్పుడే సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

బోయినపల్లి వినోద్‌కుమార్‌

మాజీ పార్లమెంట్‌ సభ్యులు

Updated Date - Oct 23 , 2024 | 01:44 AM