Share News

ట్రంప్‌ అనంతర ప్రజాస్వామ్యం!

ABN , Publish Date - Nov 15 , 2024 | 02:33 AM

డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్షుడు! అనేక కఠిన ప్రశ్నలను ఎదుర్కోవలసిన కాల మిది. పాలనా పద్ధతులలో ప్రజాస్వామ్యం సర్వోత్తమమైనదా? సమాజానికి కీడు, ప్రజలకు హాని చేస్తున్న...

ట్రంప్‌ అనంతర ప్రజాస్వామ్యం!

డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్షుడు! అనేక కఠిన ప్రశ్నలను ఎదుర్కోవలసిన కాల మిది. పాలనా పద్ధతులలో ప్రజాస్వామ్యం సర్వోత్తమమైనదా? సమాజానికి కీడు, ప్రజలకు హాని చేస్తున్న ప్రజాస్వామ్యంతో మన మెలాంటి బాంధవ్యం కలిగి ఉండాలి? ఒక పాలనా పద్ధతిగా ప్రజాస్వామ్యం మెరుగుపడగలదనే ఆశాభావానికి నీళ్ళొదులుకోవాలా?

ప్రజాస్వామ్యంపై ఈ సంశయాలకు, డోనాల్డ్‌ ట్రంప్‌ అధికార పునరాగమనం దాకా మనం వేచి ఉండవల్సిన అవసరం లేదు. 2016లో ఆ మహాశయుడు అమెరికా అధ్యక్షుడుగా తొలిసారి ఎన్నికయినప్పుడే ప్రజాస్వామ్యం సర్వోత్తమమైనదేనా అనే ప్రశ్నను మనం వేసుకుని ఉండవల్సింది. లేదూ, నరేంద్రమోదీ 2019లో రెండో సారి విజయం సాధించినప్పుడైనా ఆ ప్రశ్నను మనకు మనమే సంధించుకుని ఉండవల్సింది. బహుశా, 2002లో గుజరాత్‌ మారణకాండ తక్షణ అనంతరమే ఆయన తిరుగులేని ప్రజామోదాన్ని పొందినప్పుడే ఆ ప్రశ్న మనలో బలంగా ఉదయించి ఉండవల్సింది.


నిజానికి ఉనికిలో ఉన్న ‘ప్రజాస్వామ్యాలు’ శ్రేష్ఠమైనవి కావు. ప్రజాస్వామ్య పాలన ఫలితాలు పర్యవసానాలు ప్రశంసనీయంగా ఉండడం లేదన్నది అందరికీ తేట తెల్లంగా తెలిసిన సత్యం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన నాయకులు, మళ్లీ మళ్లీ ఎన్నికవుతున్న నేతలు రాజకీయ కల్లోలాలకు కారణమవుతున్నారు. నిరర్థక నిర్ణయాలతో సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. అవినీతిని పెంపొందిస్తున్నారు. నేరాలు ప్రబలిపోతున్నా ఉపేక్షిస్తున్నారు. జాతుల మధ్య వైరాలను ప్రోత్సహిస్తున్నారు. తెగల మధ్య చిచ్చు పెడుతూ అంతులేని మారణ కాండను సృష్టిస్తున్నారు. పర్యావరణ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నారు అయినప్పటికీ ఎంతో మంది ‘ప్రజాస్వామిక’ పాలకులు తమ ప్రజాదరణను, అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు! ఇదేమీ ఎవరికీ కొత్త విషయమేమీ కాదు. సంపన్న యూరోపియన్‌ సమాజాలకు వెలుపల ఏమి జరుగుతుందో నిష్పాక్షికంగా చూడండి: సాధారణ, క్రియాత్మక ప్రజాస్వామ్యాలు తమ ప్రజలకు సమకూరుస్తున్న ప్రయోజనాలు అనేవి చాలా వరకు కట్టుకథలే కాదూ? ఇటువంటి నిర్ణయానికి మనం రాలేకుండా ఉండడం అసాధ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థల విజయ గాథలు సాధారణంగా యాదృచ్ఛిక పరిణామాలు మాత్రమే. పైగా అవి నిస్సందేహంగా స్వల్పకాలిక అద్భుతాలే, అంతకుమించి అవేమీ సార్థకమైనవి కావు.


ప్రజాస్వామిక పాలన ఫలితాలను అంచనా వేయడంలో కేవలం మూడు వాదనలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని సమర్థించగలిగేవిగా ఉన్నాయి. ఒకటి– ప్రజలకు శ్రేయస్సును సమకూర్చడంలో నియంతృత్వ ప్రభుత్వాల కంటే ప్రజాస్వామిక ప్రభుత్వాలు అసమర్థంగా వ్యవహరించడం లేదు. రెండు– పాలన దుష్పలితాలను కనుగొని, సరిదిద్దేందుకు అవకాశాలను ప్రజాస్వామ్యం సమృద్ధిగా కల్పిస్తుంది. మూడు– ప్రజాస్వామ్య పాలన తాను ఆశిస్తున్నది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పౌరుని ఆత్మ గౌరవాన్ని ప్రజాస్వామ్యం పెంపొందిస్తుంది, కాపాడుతుంది. నియంతృత్వ పాలనా వ్యవస్థలను నిర్ద్వంద్వంగా తిరస్కరించేందుకు ఈ వాదనలు చాలు. అయితే ఈ వాదనలే ఆధునిక ప్రపంచ ప్రజాస్వామ్యాన్ని తిరుగులేనిరీతిలో ఆమోదించేందుకు సరిపోవు.

‘జనసమ్మతమైన’ నాయకులు ప్రజాస్వామ్యం కారణంగా కాకుండా ప్రజాస్వామ్య ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నప్పటికీ అధికారాన్ని గెలుచుకుని నిలబెట్టుకోగలుగుతున్నారనే కట్టుకథను విశ్వసించడానికి ప్రజాస్వామ్య సమ్మోహన శక్తే కారణమవుతోంది. సమస్యేమిటంటే మార్కెట్‌ వైఫల్యాల మాదిరిగానే ప్రజాస్వామిక వైఫల్యాలు వైపరీత్యాలే గానీ, ప్రజాస్వామిక సంస్థలు సక్రమంగా పనిచేయక పోవడం వల్ల సంభవిస్తున్నవి కానేకావు. మరింత స్పష్టంగా చెప్పాలంటే మనం ప్రజాస్వామ్యంగా పరిగణించే రాజకీయ వ్యవస్థలో వాటి సంభవనీయతకు అవకాశాలు మనమే కల్పించాం. ప్రజాస్వామ్యమనేది అధిక సంఖ్యాకుల పాలన అయితే, అటువంటి పరిణామాల సంభవనీయతను అది స్పష్టంగా అనుమతిస్తుంది.


ఈ వాస్తవాన్ని అంగీకరించడాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిగా పొరపడవచ్చు. అది ఎంత మాత్రం పొరపాటు భావన కాదని నిశ్చితంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్య భావనను సంరక్షించుకోవాలంటే వాస్తవ ప్రజాస్వామ్యాల పనితీరు, సాధించిన విజయాల చరిత్రను నిశితంగా, నిష్పాక్షికంగా తనిఖీ చేయవలసి ఉంది.

ప్రజాస్వామ్య వ్యవస్థల్లో వైపరీత్యాలు సంభవించడం, అపసవ్య ధోరణులు పెచ్చరిల్లడం సహజసిద్ధ పరిణామాలు. ఇందుకు విరుద్ధమైన వైఖరులను సరిదిద్దవలసిన అవసరమున్నది. లేనిపక్షంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజల పేరుతో ప్రజల పక్షాన ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశమున్నది. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు (26, నవంబర్‌ 1949) రాజ్యాంగ సభలో డాక్టర్‌ అంబేడ్కర్‌ వెలువరించిన చరిత్రాత్మక ప్రసంగం ఆ ప్రమాదం గురించే మనలను అప్రమత్తం చేసింది. మానవేంద్రనాథ్‌ రాయ్‌ ‘పార్టీ రహిత రాజకీయాలు’, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై లోక్‌ నాయక్‌ జేపీ విమర్శలు నూతన ప్రజాస్వామ్య నమూనా కోసం మేధో చిత్తశుద్ధితో, నైతిక నిబద్ధతతో చేసిన అన్వేషణల ఫలితాలే.


ఇటీవలి కాలంలో రాజకీయాల వాస్తవ జగత్తును సరైన రీతిలో అర్థం చేసుకునేందుకు మనకు తోడ్పడిన రాజకీయ సైద్ధాంతికులలో ప్రముఖుడు జాన్‌ డన్‌. ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితికి మూలంగా ఉన్న ఒక ఏకీకరణ గురించి ఆయన మనలను అప్రమత్తం చేశారు. మనం నేడు ప్రజాస్వామ్యంగా పరిగణిస్తున్నది మూడు అంశాలు ఒకటిగా కలగలుపు అయిన భావన అని ఆయన పేర్కొన్నారు. మన కాలంలో ప్రజాస్వామ్యం అనేది విస్తృతంగా వినియోగమవుతున్న, అదే విధంగా దుర్వినియోగమవుతున్న మాటలలో ప్రముఖమైనది. ఆశ్చర్యకరంగా అది సార్వజనీనమైనది. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ సంభాషణల్లో రాజకీయ అధికారాన్ని కోరుకునేందుకు వాడబడుతున్న ప్రభావశీలమైన పదమది. ఒక ఆదర్శంగా ప్రజాస్వామ్యం చాలా ప్రభావశీలమైనది, స్ఫూర్తిదాయకమైనది. వర్తమానంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రత్యర్థి లేని ఆదర్శమది. సమాజాన్ని మొత్తంగా ప్రభావితం చేసే సమష్టి నిర్ణయాలపై పౌరులు అందరికీ సమాన, సమర్థమైన నియంత్రణ ఉండాలనేది ప్రజాస్వామ్య దార్శనికత. అంతిమంగా ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ యంత్రాంగం లేదా క్రియా విధానానికి ప్రతీక.

నేడు మనం ఒక బ్రహ్మాండమైన మాయ, ఒక భావనాసంబంధమైన యుక్తిని ఎదుర్కొంటున్నాం. పదం, ఆదర్శం, క్రియా విధానం (ది వర్డ్‌, ది ఐడియల్‌, ది మెకానిజం)గా ప్రజాస్వామ్యం మూడు అర్థాలకు ఒక తుల్యతను సృష్టించడమే ఆ యుక్తి. ఇదొక మేధో చాతుర్యం. ఒక ఆదర్శంగా ప్రజాస్వామ్య సమ్మోహన శక్తిని, ప్రజల వైయక్తిక, సమష్టి వ్యవహారాలలో నిత్యం వాడుకలో ఉండే మాట– ప్రజాస్వామ్యం –ను మరింతగా సుదృఢపరిచేందుకు ఉపయోగిస్తున్నారు. అలా ఆదర్శం, పదం సంయుక్త ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని ప్రజాస్వామిక పాలకులుగా చలామణీ అవుతున్న వారిని సమర్థించేందుకు వినియోగిస్తున్నారు. ఈ మూడు ఎంతగా కలగలుపు అయిపోయాయంటే ఒక ప్రభుత్వ నమూనాగా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడమనేది అసలు ప్రజాస్వామ్య ఆదర్శంపై దాడిగా భావించడం జరుగుతోంది. మరి ప్రజలను విశేషంగా ఆకట్టుకునేది, మంత్రముగ్ధులను చేసే వాటిలో ప్రజాస్వామ్య ఆదర్శం ముఖ్యమైనది. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో అటువంటి ‘ఆకర్షణీయత’ అవిశ్వసనీయమైన ప్రమాదకరమైన ప్రభుత్వాలను సమర్థించేందుకు ఒక సాకు అవుతోంది!


రాజ్య పాలనా వ్యవహారాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత సమున్నతం చేసే ఏ కార్యనిమగ్నత అయినా ఒక భావనగా, ఒక ఆదర్శంగా ప్రజాస్వామ్యాన్ని వాస్తవంగా ఉనికిలో ఉన్న ప్రభుత్వ రూపాల నుంచి వేరు చేసి చూడాలి. ప్రజాస్వామ్యంగా పరిగణన అవుతున్న దేనినైనా సరే నిరాలోచనగా ప్రస్తుతించడమనేది మేధో పరంగా నష్టం చేసేది మాత్రమే కాకుండా రాజకీయంగా విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంది. వర్తమాన ప్రపంచంలో పాలకులు అందరూ తమను తాము ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకుంటున్నారు. నిరంకుశ పాలనా పద్ధతులకు సైతం ప్రజాస్వామ్య ముద్ర వేయించుకోవడానికి ఆరాటపడుతున్న నియంతృత్వ పాలకుల సంఖ్య తక్కువేమీ కాదు. ఈ దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని ఒక భావనగా, ఒక విశేషణంగా ఏకీకరణ చేయడం నైతిక భ్రష్టత, రాజకీయ వైకల్యానికి దారి తీస్తుంది.


ఇప్పుడు మనముందు రెండు సంభావ్య మార్గాలు ఉన్నాయని ప్రజాస్వామ్య సైద్ధాంతికుడు జాన్‌ డన్‌ బలంగా వాదించారు. ఆయన సూచించిన మొదటి ప్రత్యామ్నాయం ఫ్రజాస్వామ్య సమ్మోహనశక్తిని అధిగమించి, ప్రజాస్వామ్య ఉత్కృష్ట ఆదర్శాల నుంచి ‘ప్రజాస్వామిక మైనవి’గా చలామణి అవుతున్న ప్రభుత్వాలను వేరు చేయాలి. నైతిక యోగ్యత విషయమై ప్రజాస్వామిక ప్రభుత్వాలకు ప్రత్యేక హక్కులు ఏవీ లేని, అవి కేవలం మరొక ప్రభుత్వ రూపంగా మాత్రమే పరిగణించాలని జాన్‌ డన్‌ పేర్కొన్నారు. ఇది చాలా యుక్తియుక్తమైన వాదన. ఎందుకని? ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మంచి చేయడం లేదనే వాస్తవాన్ని తిరస్కరించే పరిస్థితులలో ఇంకెంత మాత్రం లేము. ఇక రెండో మార్గం మౌలికంగా భిన్నమైనది. ప్రజాస్వామ్యాన్ని పునర్‌ జాగృతం చేసి, శక్తిమంతం చేయడమే అది. ఇందుకు ప్రజాస్వామ్య సమున్నత ఆదర్శాలను మనం మనసా వాచా కర్మణా పాటించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పేరు పొందిన వ్యవస్థలు, సమాజాలలో ఆ ఆదర్శాలు వాస్తవంగా ఎలా ఆచరణలో ఉన్నాయో నిశితంగా పరీక్షించాలి. సదరు సమాజాల ప్రజాస్వామిక స్వభావాన్ని నిగ్గు తేల్చాలి. ప్రజాస్వామికమైనవిగా పిలవబడుతున్న పాలనా వ్యవస్థలు వాస్తవంగా తమ ప్రజల శ్రేయస్సుకు దోహదం చేసే పాలనను ఎంత మాత్రం అందించడం లేదనే కఠోర వాస్తవాన్ని ఆమోదించేందుకు సంసిద్ధత చూపాలి. ఒక పరిపూర్ణ ప్రజాస్వామ్య వ్యవస్థ, సమగ్ర ప్రజాస్వామ్యానికి ప్రామాణిక నమూనా అనేది ఎక్కడా లేదు. ఇది మనం అంగీకరించి తీరవలసిన వాస్తవం. మహా అయితే సంభావ్య ప్రజాస్వామ్యాలు మాత్రమే ఉన్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యమనేది ఇంకా పరిపూర్ణ పరిణతి పొందని దశలో ఉన్న ఆదర్శంగా మాత్రమే ఉన్నది. అదొక అసంపూర్ణ లక్ష్యంగా మిగిలిపోయింది. ఈ వాస్తవాన్ని మనకు బాగా ఎరుక పరిచినందుకు డోనాల్డ్‌ ట్రంప్‌కు మనం కృతజ్ఞత చెప్పాలి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Updated Date - Nov 15 , 2024 | 02:33 AM