Share News

అమరావతితోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:44 AM

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక పరిపుష్ఠి సాధించాలన్నా, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోవాలన్నా రాజధాని అనేది చాలా కీలకం. ఒక దేశానికి గానీ, ఒక రాష్ట్రానికి గానీ రాజధాని నగరంతోనే ప్రత్యేక గుర్తింపు...

అమరావతితోనే అభివృద్ధి సాధ్యం

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక పరిపుష్ఠి సాధించాలన్నా, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోవాలన్నా రాజధాని అనేది చాలా కీలకం. ఒక దేశానికి గానీ, ఒక రాష్ట్రానికి గానీ రాజధాని నగరంతోనే ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అందుకే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కూడా మహర్దశను పట్టించే రీతిలో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించాలని చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించి అమరావతి నిర్మాణం చేపట్టింది. అయితే రాష్ట్రప్రజల ఆశలను ఛిద్రం చేస్తూ, వారి ఆకాంక్షలను చిదిమేస్తూ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ తీసుకున్న తుగ్లక్ నిర్ణయం అమరావతికి శరాఘాతంగా పరిణమించింది. ఈ నిర్ణయాన్ని మేధావులు, రైతుసంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఐదేళ్ళ నుంచి ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అమరావతి నుంచి రాజధానిని మార్చి మూడు ముక్కలు చేయడమంటే రైతులకు వెన్నుపోటు పొడిచి రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని, దీనివల్ల ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందదని ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వస్తే అందరూ మెచ్చే రాజధానిని నిర్మిస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్ రాజధాని పరిసరగ్రామాల్లో పర్యటించినప్పుడు ఊదరగొట్టారు. రాజధానిని కేవలం 19 గ్రామాలకు పరిమితమయ్యేలా నగరపాలకసంస్థ ఏర్పాటుకు ప్రయత్నించడం, అమరావతి బృహత్ ప్రణాళికను దెబ్బతీసే కుట్రలు చేయడం వంటి ఎన్నో అరాచకాలకు పాల్పడుతూ, రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా చేశారు.

ప్రజారాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులను జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అవమానించని రోజంటూ లేదు. 29 గ్రామాల పరిధిలో భూసమీకరణ కింద 34,322 ఎకరాల భూములు ఇచ్చిన 29,881 మందిలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ. ఈ ఐదేళ్లు వారు పడ్డ బాధలు వర్ణనాతీతం. కడుపునిండా తిండికి, కంటినిండా నిద్రకు నోచుకోని వీరిని పోలీసులు అడుగడుగునా దాడులు, అక్రమ కేసులు, అవమానాలతో వేధించారు. ఆ రైతులు ఎలాంటి దీక్షలు, ఆందోళనలు చేయడానికి వీల్లేదన్నట్టుగా జగన్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తూ ఐదేళ్లలో వారిపై 800కు పైగా కేసులు బనాయించింది. దాదాపు 280 మంది రైతులు గుండెలు బద్దలై చనిపోయినా జగన్ సర్కార్ మనసు కరగలేదు. కౌలు చెల్లించకుండా వేధించటం, అసైన్డ్ భూముల రైతులకు వార్షికకౌలును నిలిపివేయటం, భూసమీకరణ ఒప్పందంలో భాగంగా రైతులకు ఇవ్వాల్సిన స్థలాలను అభివృద్ధి చేయకుండా నిలిపివేయడం వంటి వికృతచర్యలకు పాల్పడింది. 144, 40సెక్షన్లు విధించి గ్రామాలను అష్టదిగ్బంధం చేస్తూ దొంగతనాల పరంపర కొనసాగించింది. కాంట్రాక్టు ఏజెన్సీలు నిల్వ చేసుకున్న కంకరను, మట్టిని అధికారపార్టీ నేతలు మాయం చేశారు. నిర్మాణాల్లోని ఇనుపచువ్వలు, ఇసుక, మట్టి తరలించుకుపోయారు. మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేస్తూ ఇతర ప్రాంతాలకు చెందినవారికి రాజధానిలో ఇళ్లస్థలాలు ఇవ్వడం, ఆర్‌–5 జోన్ ఏర్పాటుచేయడం, రైతులు ఇచ్చిన భూములను ఇష్టానుసారంగా అమ్మేయటం వంటి ఎన్నో చర్యలకు పాల్పడింది.

రాజధానిగా అమరావతిని కాపాడుకోవడానికి స్థానిక రైతులు సాగించిన ఉద్యమం దేశ ఉద్యమాల చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కరోనాలు, తుఫానులు, నిర్బంధాలు, కర్ఫ్యూలు, పోలీసుల దౌర్జన్యాలు, దాష్టీకాలు, అక్రమ కేసులు, అరెస్టులు, వేధింపులు, లాఠీలదెబ్బలు ఇలా ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నదాతల పోరాటం అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉంది. రాబోయే 50 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేదానికి అమరావతి అద్దం పడుతుందని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే పత్రిక ఇటీవల పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచస్థాయి నగరంగా అవతరించబోతున్న ఆంధ్రుల కలల రాజధానిని ఉద్దేశపూర్వకంగా పాడుబెట్టారు. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడా లేవు. రాజధాని మార్పు వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని గుర్తించాలి. మరోవైపు అమరావతిలో పూర్తికాని నిర్మాణాలు పూర్తయినట్లు చూపించి వాటిలో అధికారులు, ప్రజాప్రతినిధులు నివాసం ఉంటున్నట్లుగా తప్పుడు జీవోలతో బ్యాంకులను బురిడీ కొట్టించే కుట్రలకు జగన్ ప్రభుత్వం పాల్పడుతోంది.

దేశంలోని ఏ రాష్ట్ర రాజధానిని తీసుకున్నా అది ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. ముంబాయి వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందడం వల్ల మహారాష్ట్రకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కోల్‌కతా దేశంలోనే అత్యుత్తమైన ప్రాంతంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌ ఐటి పరిశ్రమలు, ఫార్మాకంపెనీలు, విద్యాసంస్థలకు వేదికగా మారడంతో ఆ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఆదాయ వనరుగా మారింది. బెంగళూరు ఐటి పరిశ్రమలకు వేదికగా నిలవడంతో కర్ణాటకకు ప్రత్యేక ఆదాయాన్ని సమకూరుస్తోంది. విద్యాసంస్థలకు, వ్యాపారాలకు చెన్నై కేంద్రంగా ఉండి తమిళనాడు అభివృద్ధికి తోడ్పడుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఉపాధి, సంపద సృష్టించే రాజధాని లేకపోవడంతో నేడు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అట్టడుగు స్థాయికి చేరింది.

ప్రజా రాజధాని నిర్మాణాన్ని మధ్యలో ఆపేయటంతో వందలాది భవనాలు, రోడ్లు, పదుల సంఖ్యలో ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అమరావతికి వస్తున్న ప్రజానీకం ఆ నిర్మాణాల పరిస్థితిని, చెట్లు పొదలతో నిండి పాడుబడ్డట్టు ఉన్న రాజధాని ప్రాంతాన్ని చూసి ఎంతో కలత చెందుతున్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని నాశనం చేసేశాడని జగన్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలు, న్యాయస్థానాలు మూడు రాజధానుల విధానాన్ని అడ్డుకోవడంతో జగన్ అరాచకపు అజెండాకు కొంతమేర అడ్డుకట్ట పడినా రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్మించ తలపెట్టిన అమరావతిని పూర్తి చేయలేని పాలకుడిని ఎంత త్వరగా ఇంటికి పంపిస్తే అంత మంచిది. ధర్మంపై అధర్మం ఎప్పటికీ విజయం సాధించదు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో అమరావతిని నాశనం చేయాలన్న జగన్ లక్ష్యానికి అడ్డుకట్ట వేసేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అందరూ గ్రహించాలి.

పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి

Updated Date - Apr 24 , 2024 | 05:44 AM