కులగణనపై దుష్ప్రచారాలు నమ్మవద్దు!
ABN , Publish Date - Nov 06 , 2024 | 01:33 AM
ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నింపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు శ్రీకారం చుడుతున్నది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన...
ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నింపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు శ్రీకారం చుడుతున్నది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన జరిపి తీరుతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 2023 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత్ర సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇదే విధంగా ప్రకటన చేశారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే మడప తిప్పదు. ఈ విషయాన్ని గతంలో ఎన్నోసార్లు చరిత్ర రుజువు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చి నెరవేర్చారు. రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారం నేటి నుంచీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన (సమగ్ర కుటుంబ సర్వే) జరగబోతున్నది. రాష్ట్రంలో ఏ కులాల వారు ఎంతమంది అన్న సమాచారంతో పాటు విద్య, ఉద్యోగ, సామాజిక రాజకీయ రిజర్వేషన్లు ఆయా వర్గాలకు పక్కాగా అందేందుకు ఈ దోహదపడుతుంది.
2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పాలకులు తెలంగాణలో సమగ్ర సర్వేను అట్టహసంగా చేపట్టారు. సర్వే వివరాలను మాత్రం బయటపెట్టలేదు. వాటిని బహిర్గతం చేసేందుకు జంకారు. వివరాలను బుట్టదాఖలు చేశారు. దేశంలో కులగణన చివరిసారిగా 2011లో జరిగింది. ఆ తర్వాత 2014 నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తాత్సరం చేస్తూనే ఉన్నది. కులగణనతో అన్ని వివరాలు తెలిస్తే ఎక్కడ తమ వైఫల్యం బయటపడుతుందోననే భయం వల్ల కావచ్చు. గత పదేళ్లలో నిరుద్యోగం, పేదరికం పెరిగిన అంశం ప్రస్పుటమవుతుందన్న భయంతో కావచ్చు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సమగ్ర కుల సర్వే ప్రజల భవిష్యత్తును నిర్ణయించేందుకు ఉపకరిస్తుంది. సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాల ప్రజలకు అందేలా చూడడం, అందరికీ సమాన అవకాశాలు, సమన్యాయం దక్కేలా చూడటం కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష. ఈ దిశగానే ఈ సర్వే. ప్రతిపక్షాలు లేనిపోని అనుమానాలు కలిగించినా, దుష్ప్రచారం చేసినా ప్రజలు ఏ మాత్రం పట్టించుకోరాదు. నిరంతరం ప్రజల కోసం పాటుపడేదే ప్రజా ప్రభుత్వం. ఇందులో ఏలాంటి అనుమానాలకు తావు లేదు. ప్రభుత్వానికి అండగా ఉండడమే ఏకైక మార్గం.
వెలిచాల రాజేందర్‌రావు
కాంగ్రెస్ నాయకులు, కరీంనగర్.