ఉన్నత విలువల ఖని
ABN , Publish Date - Dec 03 , 2024 | 06:10 AM
మన తొలి దేశాధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ 140వ పుట్టిన రోజు నేడు. ఆయన 1884 డిసెంబర్ 3న బిహార్ లోని జీరాడి గ్రామంలో మహదేవ్ సహాయి, కమలేశ్వరిదేవి దంపతులకు జన్మించారు. వీరు ధనికులైనా నిరాడంబర...
మన తొలి దేశాధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ 140వ పుట్టిన రోజు నేడు. ఆయన 1884 డిసెంబర్ 3న బిహార్ లోని జీరాడి గ్రామంలో మహదేవ్ సహాయి, కమలేశ్వరిదేవి దంపతులకు జన్మించారు. వీరు ధనికులైనా నిరాడంబర జీవితాన్ని సాగించేవారు. రాజేంద్రప్రసాద్ జీవితమంతా బిహార్ పౌరుడిగా గడిపినా ఆయన పూర్వీకులు మాత్రం ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు.
కలకత్తా, ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యాభ్యాసం సమయంలో రాజేన్ బాబు నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులైన విద్యార్థులు స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శిగా భారీ మెజారిటీతో గెలిపించారు. 1910లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఆయన న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1917 వరకు కలకత్తా, బిహార్ న్యాయస్థానాలలో న్యాయవాదిగా గడిపారు. రాజేంద్ర ప్రసాద్ న్యాయ పరిజ్ఞానం, వాదనా పటిమలు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ జస్టిస్ అశుతోష్ ముఖర్జీని ఆకట్టుకోవడంతో యూనివర్సిటీ ‘లా’ విభాగంలో అధ్యాపకునిగా నియమించారు.
బిహార్‌లోని ‘చంపారన్’ రైతుల దుస్థితిని స్వయంగా పరిశీలించడానికి 1917లో వచ్చిన మహాత్మాగాంధీ వ్యక్తిత్వానికి ఆకర్షితుడైన రాజేంద్రప్రసాద్ ఆయనకు అనుయాయిగా మారారు. అంతవరకు ఆడంబర జీవితం గడిపిన రాజేంద్రప్రసాద్ ఒక్కసారిగా నిరాడంబరుడిగా, సంఘ సేవకుడిగా, ఉదార స్వభావుడిగా రూపాంతరం చెందారు. మహాత్ముడు 1919లో దేశవ్యాప్తంగా ఇచ్చిన ‘సత్యాగ్రహం’ పిలుపును పురస్కరించుకుని ప్రజా చైతన్యమే లక్ష్యంగా బిహార్‌లోని అన్ని వర్గాల ప్రజలను సమీకరించి సత్యాగ్రహోద్యమాన్ని విజయవంతం చేశారు రాజేంద్రబాబు. బహిరంగ సభలను నిర్వహించి ప్రజలలో చైతన్య దీపికలను రగిలించారు.
సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకునేందుకు 1920లో న్యాయవాద వృత్తిని, పాట్నా విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యత్వాలను త్యాగం చేశారు రాజేంద్రప్రసాద్. 1921లో ప్రభుత్వ కళాశాలలను బహిష్కరించమని పిలుపునిచ్చి, అదే సంవత్సరం జనవరి 5న తన స్వగృహంలోనే జాతీయ కళాశాలను ప్రారంభించారు. తన జీవితంలో అనేక విద్యా సంస్థలతో సంబంధ, భాంధవ్యాలను ఏర్పరచుకొని విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారు. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించారు. గ్రామీణ విశ్వవిద్యాలయాల ఆవశ్యకతను విపులీకరించారు. మన విద్యావిధానం నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి దోహదం చేసేదిగా ఉండాలని ఆయన సూచించారు. గాంధీజీ ఆశయాలను ప్రచారం చేసే నిమిత్తం బిహార్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించి, అక్కడి వారి స్థితిగతులను ఆకళింపు చేసుకొని ప్రజలకు చేరువయ్యారు.
రాజేంద్రప్రసాద్ జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా 1923లో పదవీ భాధ్యతలు చేపట్టారు. 1928లో విదేశీ యాత్రలు ప్రారంభించి అక్కడి ప్రజలతో యుద్ధ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు. భారతదేశ ఉద్యమాల గురించి బహుళ ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ‘సైమన్ గో బ్యాక్’ పిలుపు అందుకొని రాజ్యాంగ సంస్కరణల కమిటీ బహిష్కరణోద్యమాన్ని బిహార్‌లో సమర్థంగా నిర్వహించారు. అనేకసార్లు బ్రిటిష్ ఖాకీల దౌర్జన్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నడిపారు. 1934 నుంచి 1940 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వర్ణోత్సవాలను 1935లో సమర్థంగా నిర్వహించారు. అదే సంవత్సరంలో ‘సంపూర్ణ స్వరాజ్యం’ కోసం పిలుపునిచ్చారు. 1939లో కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండా యుద్ధం ప్రకటించినందుకు నిరసనగా ప్రాంతీయ ప్రభుత్వాల నుంచి కాంగ్రెస్ వాదులు అందరినీ రాజీనామా చేయించారు. అలా యుద్ధ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టారు. 1941 మే నెలలో ఉవ్వెత్తున లేచిన మత కలహాలను తన చర్యల ద్వారా, వాగ్ధాటితో అదుపు చేశారు. బాధితులను స్వయంగా పరామర్శించి కాంగ్రెస్ సేవా దళాలను స్థాపించి ఆదుకున్నారు.
ఆపద్ధర్మ ప్రభుత్వంలో 1946లో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు కృషి చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు ‘గ్రో మోర్ ఫుడ్’ అనే నినాదాన్ని ఇచ్చారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో రాజ్యాంగపరంగా ఏర్పడిన అసెంబ్లీకి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ పిమ్మట 1950, 1952, 1957 సంవత్సరాలలో స్వతంత్ర భారతావనికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన సారథ్యంలో భరతమాత పునీతమైంది. తన అధికారాన్ని సామాన్య మానవుని సంక్షేమానికి వినియోగించిన కార్యదక్షుడు రాజేంద్రప్రసాద్. ఉన్నత విలువలను ప్రదర్శించి దేశ, విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న బాబూ రాజేంద్రప్రసాద్ చిరస్మరణీయుడు. 79వ ఏట 1963 ఫిబ్రవరి 28న ఆయన తన జీవన యాత్రను ముగించారు. అదే ఏడాది భారత ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ను ప్రకటించింది.
పి.బి.ఆర్. ప్రసాదరావు
(నేడు బాబూ రాజేంద్రప్రసాద్ జయంతి)