విద్యారంగంలో వినూత్న వికాసం
ABN , Publish Date - Nov 08 , 2024 | 04:55 AM
తెలంగాణ విద్యారంగానికి దశాబ్దాలుగా పట్టిన గ్రహణం తొలగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దార్శనికతతో ఇప్పుడు విద్యారంగంలో సరికొత్త కాంతులు ప్రసరిస్తున్నాయి.
తెలంగాణ విద్యారంగానికి దశాబ్దాలుగా పట్టిన గ్రహణం తొలగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దార్శనికతతో ఇప్పుడు విద్యారంగంలో సరికొత్త కాంతులు ప్రసరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను తెలంగాణ బిడ్డలు అందిపుచ్చుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలు తెరుచుకుంటున్నాయి. వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకం, దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రమోషన్ల కల్పన, వసతిగృహ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం, విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకం, నిపుణులను తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు... ఇవన్నీ తెలంగాణ విద్యా రంగంలో వస్తున్న విప్లవానికి నిదర్శనాలు.
తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్య, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభించాలనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రగాఢ ఆకాంక్ష. అందుకే విద్యా శాఖను ఆయన తన దగ్గరే పెట్టుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే విద్యావ్యవస్థ బలోపేతానికి నడుం బిగించారు. వేసవి సెలవుల్లోనే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతులకు వీలుగా రూ.667.25 కోట్లను కేటాయించారు. సమైక్య రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందాయి. ఆ వెంటనే ఉపాధ్యాయుల పదోన్నతులు, నియామకాలపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టారు. ప్రత్యేక రాష్ట్రంలో గత పాలకులు ఉపాధ్యాయుల పదోన్నతులపై శీతకన్ను వేశారు. పదేళ్ల పాటు కోర్టు కేసులు, ఇతర సాకులతో ఈ ప్రక్రియను అటకెక్కించారు. ఏ రంగంలోనైనా పనిచేసే వారికి గుర్తింపు, అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి కృషి చేశారు.
ఫలితం 20 వేల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. ఈ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో, అత్యంత పారదర్శకంగా వివాదరహితంగా విద్యా శాఖ పూర్తి చేసింది. నియామకాలే తెలంగాణ ఉద్యమ నినాదమైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం వహించింది.
పదేళ్ల కేసీఆర్ పాలనలో నాలుగుసార్లు మాత్రమే టెట్ నిర్వహించి, ఒకే ఒక్క డీఎస్సీ, అదీ కేవలం 8 వేల పోస్టులతో సరిపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో పదకొండు నెలల కాలంలోనే 11,062 ఉపాధ్యాయుల నియామకం పూర్తి అయింది.
ఎక్కువ మంది డీఎస్సీకి హాజరయ్యేందుకు వీలుగా టెట్‌ను ముందుగానే నిర్వహించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరిలో నిర్వహించనున్న టెట్‌కు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిన ఫలితంగా ఇప్పుడు రాష్ట్రంలో 99 శాతం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారు, నాణ్యమైన బోధన సాగుతోంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాలను వేర్వేరుగా ఉంచి, సామాజిక వర్గాల వారీగా పిల్లలను శాశ్వతంగా వేరు చేసే విధానానికి స్వస్తి చెప్పాలనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావన. అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో 20 నుంచి 25 ఎకరాల్లో ఈ స్కూల్స్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని వసతిగృహాలు ఒకే సముదాయంలో ఉండడంతో విద్యార్థుల మధ్య స్నేహసంబంధాలు పెరగడంతో పాటు విద్యా, క్రీడాపరమైన వికాసానికి దోహదపడుతుంది. కేజీ టూ పీజీ పేరుతో ఉద్యమ కాలం నుంచి ఊదరగొట్టిన కేసీఆర్ తన హయాంలో ఇటువంటి ఒక్క విద్యా సంస్థనూ ఏర్పాటు చేయలేదు. అందుకు భిన్నంగా హామీ ఇవ్వకపోయినా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు.
ఇక, రాష్ట్ర విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను రూ.2,106 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఐటీసీ) మార్చివేస్తున్నారు. అలాగే అకడమిక్ కోర్సులకు పరిశ్రమల అవసరాలకు మధ్య అంతరాన్ని పూడ్చడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో సరికొత్త ఆలోచనలు ఉన్న పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ఈ క్రతువులో భాగస్వాములను చేశారు. పరిశ్రమల్లోని సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులకు నూతన కోర్సులను ఈ ఐటీసీలు, స్కిల్ యూనివర్సిటీ అందజేస్తాయి. వీటిల్లో శిక్షణ పొందే విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోనున్నారు.
విద్య, పరిశోధనలకు నిలయాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలను గత ప్రభుత్వం రాజకీయ క్రీడలకు వేదికలుగా మార్చివేసింది. పోలీసుల పహారాతో జైళ్లుగా తయారు చేసింది. అందుకు భిన్నంగా, రాజకీయాల ప్రమేయం లేకుండా ప్రతిభకు పట్టం కడుతూ వైస్ ఛాన్సలర్ల నియామకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి చేశారు. విశ్వవిద్యాలయాల ప్రతిష్టను పెంచి, వాటికి పూర్వవైభవం తీసుకురావాలని వైస్ ఛాన్సలర్లతో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
సగం కాలే కడుపుతో చదువుకోవడం ఎంత కష్టమో అది అనుభవించే బిడ్డలకే తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో డైట్ చార్జీలను పెంచారు. ఫలితంగా రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతిగృహాల్లోని 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. అలాగే విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలనూ పెంచారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.300 కోట్ల భారం పడుతున్నది. విద్యపై చేసే ఖర్చును భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిగా చూస్తున్నందున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ శాఖపై చేసే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. తన పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ విద్యారంగంపై శీతకన్ను వేయడంతో తెలంగాణ బిడ్డలు తీవ్రంగా నష్టపోయారు. ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల మూల్యాంకనాన్ని నాటి మంత్రి కేటీఆర్ సన్నిహితునికి అప్పజెప్పడం, ఆ కంపెనీ నిర్లక్ష్యంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన చీకటి రోజుల నుంచి ఇప్పుడు తెలంగాణ విద్యారంగం వెలుగులోకి వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణలో విద్యా విప్లవాన్ని సృష్టిస్తోంది. దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్న విద్యావేత్త కొఠారి మాటలను ఆచరణలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి అన్ని విధాలా అండగా నిలబడడమే ప్రస్తుత మన కర్తవ్యం.
-దూదిపాళ్ల విజయకుమార్ ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి