Share News

ఎల్లమ్మ వచనాలు

ABN , Publish Date - Aug 05 , 2024 | 05:33 AM

చెరువులు వాగులు కుంటలు నీ నడుముకు చుట్టుకుంటయ్‌ గవ్వల మాలలై ఆషాడ బోనాలై పగలూ రాత్రులు నీకు జీవుల...

ఎల్లమ్మ వచనాలు

చెరువులు వాగులు కుంటలు

నీ నడుముకు చుట్టుకుంటయ్‌

గవ్వల మాలలై ఆషాడ బోనాలై

పగలూ రాత్రులు నీకు జీవుల

వొనగంట్లాట కడగండ్ల మూట

అమ్మా మాయమ్మా

రేణుకెల్లమ్మ...

నీ పాదముద్రలు మా పద్యనిద్రలు

నీ అదృశ్యమూ మా దృశ్యమూ

రెండూ వొక తీగ పూవులే...

జుంటి తేనెలో ముంచిన చందమామలు

నీ రెండు కండ్లు

అమ్మా మాయమ్మా

రేణుకెల్లమ్మా...

తమలపాకుల తోటలు... నీ చల్లని మాటలు

రాగిరి చెరువు మీది దీపం... గుట్ట మీది గుండాల తానం

నల్లని నీ ఆకాశ జడ... మొగిలి మొగ్గల జాడ

అమ్మా మాయమ్మా

రేణుకెల్లమ్మా...

పచ్చాపలు నీకు గాలినెగిరి పొర్లు దండాలు పెడ్తున్నాయి

వలవిసిరే చేతులకు ముద్దులు కడుతున్నాయి

తాటిగంపలల్ల తామే దూకి నిన్ను తలపోస్తున్నాయి

అమ్మా మేము మనుషుల ఆకలి తీరుస్తాము

నువ్వు మా ఆకలి తీర్చు అంటూ

నీ తొట్టెలెక్కి కూర్చుంటున్నయ్‌

అమ్మా మాయమ్మ

రేణుకెల్లమ్మా...

అన్ని సౌలతులు తక్కువయినా

నిన్ను మొక్కుకుంటే చాలు

నీ ఆత్మ మా జీవజీవాల కోసమే తండ్లాడుతుంటది

నీ దీవెనార్తిది గుట్టల చెరువుల భాష

గువ్వల పంటల గవ్వల భా‌ష

అమ్మా మాయమ్మ

రేణుకెల్లమ్మా...

కుట్రలు మన్యాది పానాది సరిహద్దులు

కుంచెడు శోకం సోలెడు నమ్మకం

కుట్రలు బాగు సాగు సంతలు

మాటలు పాటల చింతల ముంతలు

నువ్వొఖ్క తల్లివే నిజ వాస్తవం

అమ్మా మాయమ్మా

రేణుకెల్లమ్మా...

సిద్ధార్థ

Updated Date - Aug 05 , 2024 | 05:33 AM