ఉనికి చాటే రాతలు నావి!
ABN , Publish Date - Sep 23 , 2024 | 01:07 AM
నవలలోని ‘పిల్లోడు’ నా ఈడువాడు. ఇద్దరం ఒకే వీధివాళ్లం. మగపిల్లల్తో కలవకుండా ఆడపిల్లల్తో ఆడుతూ కనబడేవాడు. చిన్నతనం నుంచి కూడా పరధ్యానంగా, భయం భయంగా ఉండేవాడు. టీనేజీకి వచ్చాక అందరికీ వాడేంటో పూర్తిగా తెలిసింది. ఎవరూ వాడిని వాడిలాగా...
మూడు ప్రశ్నలు
సోలోమోన్ విజయ్ కుమార్
ఇటీవల తెచ్చిన మీ మొదటి నవల ‘సన్ ఆఫ్ జోజప్ప’ గురించి చెప్పండి? మొదటిసారి నవల రాసిన అనుభవం ఎలా వుంది?
నవలలోని ‘పిల్లోడు’ నా ఈడువాడు. ఇద్దరం ఒకే వీధివాళ్లం. మగపిల్లల్తో కలవకుండా ఆడపిల్లల్తో ఆడుతూ కనబడేవాడు. చిన్నతనం నుంచి కూడా పరధ్యానంగా, భయం భయంగా ఉండేవాడు. టీనేజీకి వచ్చాక అందరికీ వాడేంటో పూర్తిగా తెలిసింది. ఎవరూ వాడిని వాడిలాగా స్వీకరించలేదు. వాడి మానాన వాడ్ని బతకనివ్వనూ లేదు. రోజూ ముఖాన నవ్వడాలు, అవమానాలూ వాడ్ని మరింతగా ముడుచుకుపోయేలా చేశాయి. తన ఇరవయ్యో ఏట ఉరి వేసుకుని చనిపోయాడు. నేను ఈనాటికీ బాధపడి దుఃఖపడే నా ఊరి మనుషుల్లో వాడొకడు. ఆ బాధ, దుఃఖాలే ‘సన్ ఆఫ్ జోజప్ప’ నవలకు నేపథ్యం అయ్యాయి. అయితే నవలలో వాడు చనిపోయాడని నేను డైరెక్ట్‌గా చెప్పలేదు. వాడు ఎప్పుడు కన్నీరుపెడితే అప్పుడు వచ్చి చేతులు చాచి వాడ్ని చంకనెత్తుకొనే ఊహాలోకపు తండ్రి ‘జోజప్ప’ నవల ఆఖరులో చీకటి రాత్రి వీధి చివరన నిలుచుకొని చేతులు చాపుతాడు. వాకిట నిలుచుకొని చూసిన పిల్లోడు ఆయన కనపడిన ప్రతిసారిలాగానే (ఆయన చంకన ఎక్కేందుకు) అడుగు ముందుకు వేస్తాడు. అక్కడితో నవల ముగుస్తుంది. అలాగ వాడు ‘శాశ్వతంగా జోజప్ప చంకనెక్కాడని’ చెప్పకనే చెప్పాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వాడిని కొందరు పాఠకులు ట్రాన్స్ జెండర్‌గా పొరబడ్డారు. కాదు వాడు ‘గే’ అని అతికొద్దిమంది పాఠకులే గ్రహించగలిగారు. వాడు చనిపోయినప్పటికీ నవల ‘‘అ సమాప్తం’’ అన్నాను. ఎందుకంటే మీలోనో నాలోనో మన ఇళ్లల్లోని ఎవరోఒకరిలోనో ‘పిల్లోడు’ దాగి లేడని, ఉండబోడని కచ్చితంగా చెప్పగలమా? ఇక మొదటి నవల రాసిన అనుభవం గురించి అడిగారు కదా, ‘‘The only book that is worth writing is the one we don’t have the courage or strength to write. The book that hurts us (we who are writing), that makes us tremble, redden, bleed’’ అన్నారు ప్రముఖ ఫ్రెంచ్ రచయిత్రి Helene Cixous. కత రాయడం ద్వారా రెండు మూడు పేజీల్లో అనుభవించే Trembling, Reddening, bleeding నవల రాయడం ద్వారా వంద పేజీల్లో అనుభవించినట్టయ్యింది.
హోమోసెక్సువల్ ఇతివృత్తంతో సాగే ఈ నవలలోని కథనం ప్రధాన పాత్ర అనుభవాలను ఉన్నదున్నట్టు నిస్సంకోచంగా చెబుతుంది. రాస్తున్నప్పుడు ఇతివృత్తాన్ని, భాషనీ పాఠకులు స్వీకరిస్తారా లేదా అనే ఆలోచనలు ఏమైనా కలిగేవా?
హోమోసెక్సువల్ అనే కాదు అది ఏదైనా కానీయండి ఉన్నది ఉన్నట్టు నిస్సంకోచంగా ఎందుకు చెప్పకూడదు? బతుక్కి ముసుగేసి, సోకాల్డ్ సాహిత్యానికీ ముసుగేసి మనం సాధించే ప్రయోజనం ఏముంటుంది? ముసుగేసింది సాహిత్యం ఎట్లా అవుతుంది? మోసం అవుతుంది కానీ! ఏదైనా ఆకాశం నుంచి ఊడిపడిన అద్భుతం ఉందనుకోండి, దాన్ని చెప్పడానికైనా ఉపయోగించాల్సింది మనం ఎరిగిన భాషనే కదా? ఆకాశం నుంచి పడింది కాబట్టి ‘ఆకాశ భాష’ అంటూ ప్రత్యేకంగా తయారు కావాలంటే కుదురుతుందా? ఒకవేళ తయారు చేసినా పొసగుతుందా? ఒకటి చెప్ప గలను, నా రాతల్లో మేధావినో సంస్కారినో నీతి బోధకుడినో వెతకబూనడం వృథా ప్రయాస. ఎందుకంటే రాసే ప్రక్రియ ఏదైనా నోరులేనివాళ్లు చెప్పుకోలేనివి, నోరున్నవాళ్లు చెప్పేందుకు అసహ్యపడేవే విధిగా ఎంచుకుంటాను. నా రచనలకి కేంద్రం అటువంటి చీకటి లోకమే. అక్కడి భాషని, ఇతివృత్తాలని సోకాల్డ్ వెలుతురి ప్రపంచం తట్టుకోలేకపోవచ్చును. కానీ ఆ చీకటిలోకం ఎక్కడో లేదనీ, మీ మధ్యనే - చాలాసార్లు మీ లోపలనే– కోరలు చాస్తూ ఉంటుందనే పచ్చి నిజాన్ని ‘ముసుగుబుద్ధితో’ మీరు అంగీకరించక అందుకు గింజుకుని నన్ను తప్పుపట్టడం ఏమి న్యాయం? పాఠకుల స్వీకారం గురించి అడిగారు కదా, వెలుగుచూడని జీవితాలను రాయడం ద్వారా వాటి ఉనికిని చాటాలి అనే ఉద్దేశం తప్ప మరొక యావ నాలో లేనప్పుడు ‘తరువాత ఏమిటి రాయడం’ అనే ఆలోచన ఉంటుంది కాని రాసి బైటకు వెళ్లిపోయిన రచనను పట్టుకొని వేలాడడం ఉండదు. దాని మీద మీరు దుమ్మెత్తి పోయండి గాక! దానికి విలువ అనేది ఉంటే మట్టిపొరల కింద ఎన్నాళ్లైనా నిక్షేపంలాగా నిలిచి ఉంటుంది కనుక ‘రేపటివాడు’ ఎవడో తవ్వి తీసి చదువుకుంటాడు. విలువ అనేదే లేదా? ఆ మట్టిలోనే చివికి మట్టైపోతుంది. ఇప్పటివరకూ ఏ రచయిత అయినా వాస్తవంలో అంతకుమించి మూట కట్టుకున్నది ఏమైనా ఉందా?
మీ మొదటి పుస్తకం ‘మునికాంతపల్లి కత’ల్ని కొందరు కథలుగా చూడలేదు దీనిపై మీ స్పందన? మీ తర్వాతి రచన ఏమిటి, అది కూడా మొదటి రెండు పుస్తకాల్లాగే సువర్ణముఖి నది ఒడ్డునే జరుగుతుందా?
అవును ‘మునికాంతపల్లి కత’ల్ని లంజ కతలు, లంజల భాష అన్నాడొక ప్రముఖ రచయిత. ‘సన్ ఆఫ్ జోజప్ప’ నవలని యాక్ థూ అన్నాడొక పెద్దమనిషి. పచ్చి బూతుల నవల చదివాను తల తిరిగిపోయింది అన్నది ఒక అమ్మ. ఎవరి నోరైనా వారి అవగాహనా స్థాయిని బట్టే మాట్లాడుతుంది. ఐరిష్ రచయిత Samuel Beckett -‘‘ఎప్పుడైనా ప్రయత్నించావా? ప్రయత్నించి విఫలమయ్యావా? పర్లేదు, మళ్లీ ప్రయత్నించి మళ్లీ విఫలమవ్వు. మరింత బాగా విఫలమవ్వు (Fail Better)’’ అన్నాడు. నా వరకూ రచయితగా పటం కట్టించి పెట్టుకోదగిన మాటలవి. నా రాతలు కూడా అలాంటివే అని చెబుతాను. ఒకదానికంటే మరొకటి మరింత బాగా విఫలమవుతూ ఎటువంటి సాహిత్యపు రీతి రివాజుల్ని పాటించవు నా రాతలు. అవసరాన్ని బట్టి ‘ఎంత చెత్తగానైనా’ విషయాన్ని చెప్పడమే ముఖ్యంగా భావిస్తాయి కానీ నా రాతల్లోని అట్టడుగు బతుకులు సాహిత్యపు కొలతల్ని, ప్రమాణాలని, భాషా కౌశలాన్ని, వాక్య నిర్మాణాన్ని, ఘనమైన విశేషణాలనీ, సోకాల్డ్ కీర్తి కిరీటాలనీ నమ్మవు, అసలు లెక్కే చేయవు. కాబట్టి మేధావులు నా రాతల్ని దూరం పెట్టడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లు దూరం పెట్టారు కాబట్టే ‘‘నాకు నేను మిగిలాను’’. అయితే చదువుకున్న యువత నా రాతల్ని గుండెలకు హత్తుకుంటోంది. అట్టడుగు బతుకుల దైన్యాన్ని, యాసల విలువని ఎరిగిన పెద్దలు కొందరు మనసారా ప్రోత్సహిస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు తమ పుస్తకాల అరల్లో ఆంగ్ల సాహిత్యంతో పాటూ నా రెండు పుస్తకాలను సంబరంగా చేర్చుకున్నారు. వాళ్లందరూ ‘గే’లు కాకపోయినా ‘సన్ ఆఫ్ జోజప్ప’ గురించి ఆప్యాయంగా తడిగా ఎంతోసేపు మాట్లాడారు. ఇలా ద్వేషంతో పాటుగా ప్రేమని కూడా అధికంగా సంపాదించుకుంటోన్న ‘Fail better’ రాతలు నావి.
ఇక నా తర్వాత రచన గురించి అడిగారు– కుటుంబసభ్యుల వల్లనే వ్యభిచారంలోకి దించబడిన మైనర్ అమ్మాయి, మొగుడు వదిలేస్తే దిక్కులేక ముష్టెత్తేందుకు తన ఇద్దరు చిన్నపిల్లల్ని రోజూ బస్టాండుకు పంపుకున్న తల్లి, మతపిచ్చితో కాపురాన్ని నరకం చేసుకున్న ఇల్లాలు... ఇలా రాస్తే మా ఊరివాళ్ల కతలే నవలికలు కాగలవు. ‘ప్యార్దనలు’ పేరిట నేను రాస్తున్న క్రైస్తవ జీవనానికి సంబంధించిన కవితలు సగంలో ఉన్నాయి. అవును ఇవన్నీ మొగిలేరు (సువర్ణముఖి నదికి అసలు పేరు) ఒడ్డుకు చెందిన బతుకు కతలు. వీటిలో ఏది తర్వాతి రచనగా వస్తుందో కానీ చివరగా ఒక మాట చెబుతాను, మీ రెండవ ప్రశ్నకు జవాబులో ‘ఉనికి చాటాలి అనే ఉద్దేశం నాది’ అన్నాను. అదే నేను నా రాతల ద్వారా చేస్తోంది. ఉనికిని తెలియజేయాలనే తపనని నాగరికతకు పై మెట్టు అన్నారు చరిత్రకారులు. గుహ గోడలపైన వేలఏళ్లకి ముందరి చేతి ముద్రలు, జంతువుల్ని వేటాడే బొమ్మలు అందుకు ఉదాహరణలు. అలాగ, ‘‘దిగువ పంటనాడు’’ (తిరుపతి జిల్లా పరిధిలో నేను పుట్టి పెరిగిన నాయుడుపేట మండలంలోని మొగిలేటి ఒడ్డున చిగురుపాడు గ్రామం - దాని చుట్టుపక్కల మండలాలు) బతుకుల ఉనికిని మా యాసలోని పదసంపదతో కతలుగా చెప్పడమే నా ‘విఫల’ రాతల లక్ష్యం. రూట్స్ ద్వారా అలెక్స్ హేలీ, చెదిరిన సమాజం ద్వారా చినువా అచబే చేసింది అక్షరాలా అదే.
సోలోమోన్ విజయ్ కుమార్