అనుభూతి కవిత్వ చర్చల మధ్య అస్తిత్వ ఒరిపిడి
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:28 AM
ఎలా దొరికిందో దొరికింది బైబిల్.- స్కూల్లో వున్నప్పుడు పాఠ్య పుస్తకాల మీద తిరుగుబాటు బావుటా ఎగరేసి ఖమ్మం లైబ్రరీ లోనో, బెజవాడ ట్రిప్ వేసి ప్రబోధ బుక్ సెంటర్ లోనో, ఖాదర్ బాబాయ్ ఇంట్లోనో దొరికిన ప్రతి పుస్తకం...
నా మొదటి పుస్తకం
‘I came here not to give peace
but to war’ – -Matthew 10:34
ఎలా దొరికిందో దొరికింది బైబిల్.- స్కూల్లో వున్నప్పుడు పాఠ్య పుస్తకాల మీద తిరుగుబాటు బావుటా ఎగరేసి ఖమ్మం లైబ్రరీ లోనో, బెజవాడ ట్రిప్ వేసి ప్రబోధ బుక్ సెంటర్ లోనో, ఖాదర్ బాబాయ్ ఇంట్లోనో దొరికిన ప్రతి పుస్తకం చదివే కాలంలో. అందులో Psalms చదివి, వాటి ప్రేమలో పడిపోయి, కొన్ని బట్టీ కొట్టడం అలవాటైంది. అలా బట్టీ కొట్టిన వాక్యాల్లో ఇదొకటి. అదే 1990 కవిత్వ సంపుటి ‘ఇవాళ’కి టాగ్‌లైన్‌గా మారింది. అట్లా మతప్రతీకల్ని తీసుకొని, సమకాలీన వాస్తవికత గురించి, స్వానుభవాల గురించీ రాయడం ఎక్కువమందికి నచ్చింది. అనుభూతి కవిత్వం గురించి చర్చలు జరుగుతున్న కాలంలో ‘ఇవాళ’లో ఈ అస్తిత్వ ఒరిపిడి చాలామందికి కొత్తగా అని పించింది. అంతకు నాలుగేళ్ల కిందట సీతారాం, ప్రసేన్‌తో కలిసి ‘రక్తస్పర్శ’ అచ్చయినా, అన్నివిధాలుగా నా తొలి పుస్తకం అనదగ్గది ‘ఇవాళ’.
ఇస్మాయిల్ తరచూ ఉత్తరాలు రాసే కాలం అది. ‘‘మీరు తెలుగు కవిత్వం చట్రాలు బద్దలు కొడుతున్నారు. విమ ర్శకులు ఏం అనబోతున్నారో నేను ఇవాళే చెప్పేస్తున్నా- వాళ్లందరి మొదటి వాక్యం- ఇది ‘తెలుగు కవిత్వం’ కానే కాదు!’’ ఆయన అన్నదానికి భిన్నంగా ఏమీ జరగలేదు. అయితే, ఆ మాట పాజిటివ్ కోణం నుంచి అనడం మొదలు పెట్టారు. కవిత్వ అభిమానులు పుస్తకాన్ని హాయిగా అందుకున్నారు. వెంటవెంటనే సమీక్షలు వచ్చాయి. ఫ్రీ వర్స్ ఫ్రంట్ తో సహా ఆ రెండేళ్లలో కనీసం పదిహేను అవార్డులు ‘ఇవాళ’కి దక్కాయి.
ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న తొలిరోజుల నుంచీ పొనుగోటి కృష్ణారెడ్డికి నేనంటే అవ్యాజమైన ప్రేమ. ‘‘నీ కవిత్వం పుస్తకం రావాల్సిందే!’’ అని వెంటాడి మరీ ఈ పుస్తకం వేయించాడు. ఈ పుస్తకానికి స్నేహపూర్వక ప్రూఫ్ రీడర్ కొండేపూడి నిర్మల. పుస్తకంలో ఒక్క అచ్చుతప్పు లేదంటే కారణం ఆమె శ్రద్ధ మాత్రమే. ఇందులో కవితలు తొలిసారిగా విన్నవాళ్లు- అప్పటి నా రూమ్మేట్ సౌదా, ఆంధ్రజ్యోతిలో కొత్తగా చేరిన వంశీకృష్ణ, అల్లం నారాయణ.
పుస్తకం వచ్చేసింది అని తెలియగానే వేగుంట మోహన ప్రసాద్, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, టీయల్ కాంతారావు పరుగుపరుగున ప్రెస్‌కి వచ్చి, తొలి ప్రతులు రెండేసి కొనుక్కున్నారు. ఆ తరవాతి కాపీ బెజవాడ మొగల్రాజ పురంలో మా పక్కింట్లో వున్న చిరకాల మిత్రుడు వేణు గోపాల్‌కి అందింది. ఆవిష్కరణల హడావుడి ఏమీ చేయ లేదు. కానీ, 1992 తరవాత ఈ పుస్తకానికి ఉమ్మడిశెట్టి అవార్డుతో మొదలుపెట్టి మద్రాస్ తెలుగు అకాడెమీ పుర స్కారం దాకా రావడంతో అటు ప్రొద్దు టూరు నుంచి మద్రాస్ దాకా, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా సత్కార సభలు జరి గాయి. నా ప్రమేయం ఏమీ లేకుండానే అప్పటి ప్రసిద్ధులు ఈ సభల్లో అతిథులుగా వచ్చి ‘ఇవాళ’ గురించి మాట్లాడారు.
ఇందులోని ‘ఇదే నా జాతీయ గీతం’ కవితను కొన్ని వందల సభల్లో సినారె విని పించేవారు. అదే సమయంలో కవిత్వంలో ఇంత సంక్లిష్టత అవసరమా అంటూ త్రిపురనేని మధుసూదన రావు గారు ఈ పుస్తకం మీదే దాదాపు 15 పేజీల విమర్శ రాశారు. కెకె రంగనాథా చార్యులు ‘సమాంతర’ వేదిక మీద మొట్టమొదటిసారి ‘‘సంక్లిష్టత’’ అన్న అంశంపై హైదరాబాద్ పిలిపించి మరీ నా చేత ఉపన్యాసం ఇప్పించారు. ఇంకోవైపు ‘‘అఫ్సర్ బ్రాండ్ కవిత్వం’’ అంటూ రాజీవ్ ఆంధ్ర జ్యోతిలో రాసిన సగం పేజీ వ్యాసం అనేక చర్చలకు దారితీసింది. కొత్త కవిత్వానికి ఇది కొండగుర్తు అని కేవీయార్ ప్రతి సభలో ఈ కవిత్వ శిల్పాన్ని, అందులోని ప్రతిఘటన తత్వాన్ని చెప్పేవారు. ‘‘రక్తస్పర్శతో పాటు ఇది నా బెడ్ సైడ్ బుక్’’ అని వీవీ అన్నారు. 1992 ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా శీలా వీర్రాజు గారు అవార్డు మెమేంటోని ఆస్కార్ ఫలకం మోడల్లో చేయడం కూడా అప్పుడు సాహిత్య వార్తగా మారింది. ఆ విధంగా ‘ఇవాళ’ అనేక కొత్తదనాలకు నాంది పలికి, అనిర్వచనీయమైన తృప్తినిచ్చింది, నాకూ నా నిజమైన మిత్రులకు!
అఫ్సర్