Share News

స్త్రీవాద కవయిత్రుల తండ్రి ప్రేమ

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:31 AM

ఒక నాన్న వేలుపట్టి నడిపించి మార్గదర్శనం చేసే దిక్సూచి కావొచ్చు. ఇంకో నాన్న మధ్యలోనే గాడి కింద పడేసి అనుబంధాల్ని విడిచినవాడు కావచ్చు. కొందరికి నాన్న ఇష్టుడు. మరికొందరికి పెత్తనం చెలాయించే...

స్త్రీవాద కవయిత్రుల తండ్రి ప్రేమ

ఒక నాన్న వేలుపట్టి నడిపించి మార్గదర్శనం చేసే దిక్సూచి కావొచ్చు. ఇంకో నాన్న మధ్యలోనే గాడి కింద పడేసి అనుబంధాల్ని విడిచినవాడు కావచ్చు. కొందరికి నాన్న ఇష్టుడు. మరికొందరికి పెత్తనం చెలాయించే అధికారం. అమ్మని బానిసగా చూసే నాన్నలూ ఉన్నారు. నాన్న పేరు మీదే కదా పితృ స్వామ్య వ్యవస్థ ఉంది. ఐతే, స్త్రీవాదాన్ని బలంగా వినిపించిన కవయిత్రులు కొందరు వాళ్ళ తండ్రిని హృదయాలకు హత్తుకున్నారు.

ఘంటసాల నిర్మల తన తండ్రి స్మృతిలో వెలువరించిన కవిత ‘ఒక మామూలు నాన్నారి కోసం’. రైల్వే శాఖలో నలభై ఏళ్ల పాటు పనిచేసిన తండ్రి జీవితాన్ని కవయిత్రి మన ముందుంచుతారు. ఎక్కే రైలుతో దిగే రైలుతో దాదాపు 40ఏళ్ల జీవితం గడిచిపోయిందంటారు: ‘‘నాన్నారూ/ ఉన్నన్నాళ్ళూ మాకు జవజీవాల్ని సమకూర్చి/ జీవితాల్ని అమర్చి పెట్టినన్నాళ్ళూ మీరు/ సమాజం రుద్దిన విలువల చట్రంలో ఆపాదించిన/ సూత్రాల చక్రంలో నలుగుతూ/ నలుగుతున్నాననుకోకుండానే కాలాలు గడిపారు/ సగం జీవితం చద్ది అన్నమే! రెండు క్యారేజీలతో ఇవాళ తెల్లవారుజామున/ మెయిలుకో, సర్కారుకో డ్యూటీ ఎక్కితే మళ్ళీ రావడం రేపు రాత్రికే’’ అని దిగులుపడతారు కవయిత్రి. నాన్న తనకోసం లెక్కలు చెప్పడం, స్టీలు క్యారేజీ తనకు ఇచ్చి సత్తు క్యారేజీ మోసుకెళ్ళడం, పోటీలో బహుమతులు వస్తే ఆయనే గెలిచినట్టు ఆనంద పడటం, పెద్దమ్మాయి సంగీతానికి పరవశం చెందడం... ఇలా ఎన్నో తీపిగుర్తులను కవయిత్రి కవితలో నమోదు చేశారు. ‘‘అంత చిరంతపు తీపి బాల్యాన్ని/ ఇంత ఘాటయిన క్రమశిక్షణనీ/ రంగరించి ఇచ్చిన మీరు/ అలా చెప్పకుండా అధాటున/ వెళ్ళిపోయారేం/ నాన్నారూ! ఉద్యోగాసాంతం అసలెప్పుడూ ఆఖరి నిమిషంలోనే బండి అందుకున్న మీరు/ ఎంత డ్యూటీ అయిపోయిందనుకుంటే మాత్రం/ అంత అకస్మాత్తుగా వెళ్లిపోతారా!’’ అని విలపిస్తారు. ఆయన దూరమైన ‘దిగులు దుఃఖం’ ఉండ కడుతూనే ఉంది. కళ్ళ కాల్వలు ఎడ తెగడం లేదని కవయిత్రి కలం కన్నీరు కార్చింది.


పితృస్వామ్య వ్యవస్థపై తిరుగు బావుటా ఎగరేసిన కవయిత్రి మందరపు హైమవతికి నాన్న మాత్రం అమ్మలా కనపడ్డాడు. ఈ కవయిత్రి నాన్నను గుండెల్లో పెట్టుకున్నారు. ‘‘అమ్మ బొజ్జలో బజ్జున్నది/ ఆడపిల్లని తెలిస్తే/ విషం సూది గుచ్చి/ విముక్తి గీతం పాడుతారు/ కొందరు నాన్నలు/ నాన్నకు నేనంటే ఆరో ప్రాణం’’ అంటూ అక్షరాల్లో దాచుకున్నారు. కొందరికి నాన్నంటే చందమామ కథల్లో రాక్షసుడు. నాన్నని చూస్తే గుండెల్లో బాంబులు పేలతాయి. ఏం కావాలన్నా అమ్మే మధ్యవర్తి. కానీ కవయిత్రి నాన్న ఇందుకు మినహాయింపు: ‘‘బాల్యంలో నా అభీష్ట క్రీడాస్థలం/ నాన్న వక్షస్థల మైదానం/ చిన్న ప్పుడు నిద్ర మంచం మీద నుంచి కింద పడి/ గుక్క పట్టి ఏడుస్తున్నప్పుడు/ భుజం మీద ఎత్తుకొని తెల్లవార్లు జోకొట్టి/ నిద్రపుచ్చిన లాలి పాట’’ అని నాన్నకి కితాబు ఇస్తారు. వానలో తనతో పాటు పడవలు వదిలిన బాలుడు నాన్న, గగన వీధి నుండి దిగి ఇంటికొచ్చిన చందమామ నాన్న, శీతాకాలం గోరువెచ్చని సూరీడు నాన్న, మార్కులు తగ్గినపుడు అమ్మ కోప్పడితే చల్లని మాటల ఛత్రం నాన్న... అంటూ కవయిత్రి నాన్నను పొదువుకుంటారు. ‘‘ప్రపంచ సాహిత్యంలో నా అభిమాన పదం నాన్న’’ అని ప్రకటిస్తారు. ఒక స్త్రీవాద కవయిత్రి ‘నాన్న’ నా అభిమాన పదం అని ప్రకటించారంటే తండ్రి ఆమెను ఎంత ప్రభావితం చేశాడో తెలిసిపోతుంది.


ఉన్నట్టుండి వెళ్లిపోతారని తెలిసినా, వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాల నుండి తేరుకోవడం కష్టమే. అవెప్పుడూ కళ్ళ ముందు కదులుతుంటాయి. అలాంటి జ్ఞాపకాల కలబోతతో ‘కొనసాగింపు’ అనే కవిత రాశారు శిలాలోలిత. ‘‘నాన్న వెళ్ళి తలుపేసుకున్నారు. అయితే, అది ఎప్పటికీ తీయని తలుపు’’ అని కవయిత్రి విలవిలలాడిపోతారు. ‘‘అర నిమిషం కరెంటు పోయినా/ ఊపిరాడని నాన్నను/ గాజు ముక్కల గదిలో మూసేశాం కదా/ చిన్నప్పుడు స్నానాలు చేయించిన నాన్నను/ బాకీ తీర్చుకోవడానికా అన్నట్లు తలో చెంబూ నీళ్ళు పోసి స్నానాలు చేయించాం’’ అంటారు.

నాన్న ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని పొంది వెలిగిన మరో కవయిత్రి చల్లపల్లి స్వరూపారాణి. ‘నాన్న కోసం’ అనే కవితలో నాన్నను ఆమె ఆంతరంగిక మిత్రుడుగా చూస‍్తారు. బాల్య స్నేహితుడిగా చాటుతారు. తండ్రి ముందు భూమ్యాకాశాలు చిన్నబోతాయంటారు. తండ్రి స్మృతి తొలిపొద్దులా మెరుస్తూనే ఉంటుందట. ‘‘మా నాన్న రిమోట్ నాన్న కాదు, పోలీసు నాన్న కాదు’’ అంటూ పొంగిపోతారు. అంతలోనే నాన్న జ్ఞాపకాల ‘అపరాధ శిలువ’ గుండె కెత్తుకున్నాను అని ఇలా వేదనకు గురౌతారు: ‘‘నీ సమాధి తల వాకిట్లో/ వెలితి వెలితిగా నిలబడి/ బొట్లు బొట్లుగా కరిగే/ కొవ్వొత్తిని నేనే నాన్నా’’.


కొన్ని సందర్భాల్లో తండ్రి మాటలను పిల్లలు పెడచెవిన పెడతారు. ‘నీకేం తెలుసు పో’ అంటారు. కానీ వారు సంతానాన్ని పొందాక, తండ్రి పాత్ర ఏమిటో నెమ్మదిగా తెలుస్తుంది. తండ్రి దూరమయ్యాక అర్థం కావడం మొదలవుతాడు. ఈ నేపథ్యంలో శైలజామిత్ర ‘తండ్రి స్మృతి’ కవిత రాశారు: ‘‘నాన్నా! సగానికి పైగా జీవితం గడిచాక/ ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతున్నావు/ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి/ కలిస్తేనే ఒక రోజవుతుందని తెలుసు కాని/ స్వార్థం, అసూయ, కపటం, అబద్ధం/ కలగలిపితేనే నేడొక మనిషని ఒకప్పుడు నువ్వు చెప్పింది గుర్తుకు వచ్చి/ ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతున్నావు నాన్నా’’ అంటూ తండ్రి చెప్పిన సమాజ పోకడల్ని కవయిత్రి గుర్తు చేసుకున్నారు.


కొందరు నాన్నలు అపురూప జ్ఞాపకాలైతే, మరికొందరు చేదు జ్ఞాపకాలు. కె. గీత ‘చివరి స్పర్శ’ కవిత రెండు పార్శ్వాలనూ చూపిస్తుంది. నాన్న ఒక గుణపాఠంగా మిగిలాడు గానీ, ఏ ఒక్క గుండె లోనూ చిత్రపటం కాలేకపోయాడని కవయిత్రి బాధపడతారు. తండ్రి వీపు మీద ఆడిన బాక్సింగ్, భుజాలపై తిరిగిన రంగుల రాట్నం... ఇలా కొన్ని జ్ఞాపకాల్ని చెబుతారు. ఐతే తల్లిని కొట్టిన తండ్రిని పెట్రోలు పోసి తగలేయాలనిపించిందని కూడా నిక్కచ్చిగా చెప్తారు: ‘‘అమ్మ కళ్ళు నిండినప్పుడల్లా/ పెట్రోలేసి నిన్ను తగలెయ్యాలన్పించేది/ నిన్న -ఎందుకో బతికితే బావుణ్ణనిపించింది/ హఠాత్తుగా పాడె మీంచి లేచి/ నువ్వు నడిచెళ్ళిపోతే బావుణ్ణనిపించింది’’ తండ్రి బతకాలని కవయిత్రి కోరుకున్నారు. ‘‘నువ్వు నాకు వద్దనిపించే నాన్నవి/ అమ్మని కష్టపెట్టిన రాక్షసుడివి/ అయినా నా శరీరంలో భాగం కాలిబూడిదైనట్లయింది/ పార్థివ కర్ణంలో అన్నయ్య ‘డేడీ’ అని పిల్చినపుడు/ నిన్ను పట్టి కుదిపి తీసుకెళ్ళి పోవాలన్పించింది’’ అంటారు. ‍

ఈ కవితలన్నీ కూడా కవయిత్రులు వాళ్ల తండ్రులు చనిపోయాక రాసిన కవితలు. సాహితీ లోకంలో తమ తండ్రులకి వాళ్ళు ఇచ్చిన గొప్ప నివాళి. తండ్రి చనిపోయాక ఆయన కూర్చున్న కుర్చీ, పడుకునే మంచం, తినే కంచం, చదివే పుస్తకం దేన్ని చూసినా ఆ జ్ఞాపకాల లోకి వెళ్ళిపోతాం. చదవాలే గాని ప్రతీ తండ్రీ ఒక బతుకు పుస్తకం.

సుంకర గోపాలయ్య

94926 38547

Updated Date - Dec 30 , 2024 | 12:31 AM