యాభై ఏళ్ళ పీడీఎస్‌యూ!
ABN , Publish Date - Oct 24 , 2024 | 02:21 AM
శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం, సమ సమాజం, నూతన ప్రజాస్వామిక విప్లవం లాంటి ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడిన సంస్థ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ). ఈ సంస్థ ఏర్పడి ఈ అక్టోబర్ 12 నాటికి యాభై ఏళ్ళు...
శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం, సమ సమాజం, నూతన ప్రజాస్వామిక విప్లవం లాంటి ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడిన సంస్థ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ). ఈ సంస్థ ఏర్పడి ఈ అక్టోబర్ 12 నాటికి యాభై ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ యాభై ఏళ్ల విప్లవ ప్రస్థానంలో పీడీఎస్‌యూ విద్యార్థుల పక్షాన బాధ్యతగా కొట్లాడుతూనే విద్య ప్రైవేటీకరణకూ, కార్పొరేటీకరణకూ వ్యతిరేకంగా పోరాడింది. సాంప్రదాయ, సంస్కరణవాద విద్యార్థి సంఘాలను తుత్తునియలు చేస్తూ విద్యార్థులు అందరికీ విప్లవ చైతన్యాన్ని అందించింది, పీడీఎస్‌యూ ఇచ్చిన స్ఫూర్తితో విద్యార్థులు హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం నిత్యం సమరశీల పోరాటాలు నిర్వహించారు. తెలుగు సమాజంలో వచ్చిన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, స్త్రీవాద, దళితవాద, అస్తిత్వ, కార్మిక, కర్షక, యువజన, ప్రజాస్వామిక, విప్లవ పోరాటాలలో తనదైన పాత్రను పోషించింది పీడీఎస్‌యూ.
పీడీఎస్‌యూ తన యాభై ఏళ్ళ ప్రస్థానంలో అనేక పోరాటాలు నిర్వహించింది. ఎన్నో హక్కులను సాధించింది. ఉద్యమ నిర్మాణ క్రమంలో అనేకమంది పోరాట యోధులను కోల్పోయింది. పీడీఎస్‌యూ పోరాట స్ఫూర్తిని వివరిస్తూ, అమరవీరుల స్ఫూర్తిని నేడు మరింత ఎత్తి పట్టాల్సిన అవసరం ఉంది. పోరాట స్ఫూర్తితో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవటం కోసం, విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాట జ్వాలలను రగిలించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020ను ప్రతిఘటించాలి. అందరికీ సమానమైన శాస్త్రీయమైన విద్య కోసం, సమానమైన అవకాశాల కోసం సమరశీల పోరాటాలను నిర్వహించాలి. దీనికోసం కలిసి వచ్చే అన్ని విప్లవ విద్యార్థి సంఘాలను ఐక్యం చేసుకోవాలి. తద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవ స్ఫూర్తితో విద్యార్థులంతా తమ సమాజం కోసం పోరు సల్పాలి. అందుకే రెండు పీడీఎస్‌యూ సంస్థల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గాలు ఐక్యంగా యాభై ఏళ్ల పీడీఎస్‌యూకి విప్లవ జేజేలు తెలియజేస్తూ నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలోనూ, నవంబర్ 5న విజయవాడలోనూ పీడీఎస్‌యూ అర్ధ శతాబ్దోత్సవ సభలను నిర్వహిస్తున్నాయి. వీటిని జయప్రదం చేయవలసిందిగా పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులకు, ప్రజాస్వామిక వాదులకు, మేధావులకు, అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
– పి. మహేష్,
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ