Share News

జానపదాల బిరుదురాజు

ABN , Publish Date - Apr 14 , 2024 | 02:22 AM

కొందరు శిష్యవర్గం ప్రచారంతో, మరికొందరు అభిమానుల ఆదరణతో, ఇంకొందరు అధికార ప్రాభవంతో గొప్పవారుగా గుర్తింపు పొందుతున్న ఈ రోజులలో, కేవలం తన పరిశోధనల వల్ల, దాని ఫలితమైన రచనల వల్లనే ఎవరికీ సాధ్యంకానంత ఉన్నత శిఖరాలు...

జానపదాల బిరుదురాజు

కొందరు శిష్యవర్గం ప్రచారంతో, మరికొందరు అభిమానుల ఆదరణతో, ఇంకొందరు అధికార ప్రాభవంతో గొప్పవారుగా గుర్తింపు పొందుతున్న ఈ రోజులలో, కేవలం తన పరిశోధనల వల్ల, దాని ఫలితమైన రచనల వల్లనే ఎవరికీ సాధ్యంకానంత ఉన్నత శిఖరాలు అధిరోహించిన అక్షరాల జాతీయ ఆచార్యుడు– డా. బిరుదురాజు రామరాజు. ఈ నెల 16న 99వ జయంతి జరుగుతున్న జానపద సాహిత్యోద్ధారకుడు రామరాజు– ఆనాటి నుంచి శతజయంతి సంవత్సరంలో ప్రవేశిస్తున్నాడంటే– నిజాయితీ, కృతజ్ఞత గల పరిశోధక ప్రముఖులకు, వారి శిష్యులకు, బంధుమిత్ర వర్గానికి, ప్రతిభాసంపన్నుల కృషిని గుర్తించి, గౌరవించే ప్రభుత్వానికి ఎంత అపురూపమైన, స్ఫూర్తిదాయకమైన ఘటనో! కాని ఇంతవరకు ఆ దాఖలాలు కన్పించకపోవడం శోచనీయం.

ఈనాడు అన్ని విశ్వవిద్యాలయాల్లో జానపద సాహిత్యానికి విశిష్ట సాహిత్యంతో సమానమైన పీఠం లభించిందంటే, దాని వెనక రామరాజు కృషి ఎంతో ఉంది. శిథిలమై, జీర్ణమైపోతున్న జానపద సాహిత్య విలువలను వెలికి తెచ్చి, దేశం ముందు పెట్టి, అందులోని గొప్పతనాన్ని, కమ్మదనాన్ని రుచి చూపించిన పండిపోయిన పండితుడు రామరాజు. ఇంటర్నెట్‌, గూగుల్‌ సౌలభ్యం లేని కాలంలో అహోరాత్రులు, కాలిబాటల్లో, ముళ్లదారుల్లో, ఎడ్లబండ్లలో, ఎండ– వానల్లో ఊరూరా తిరిగి మరుగున పడిపోతున్న పసిడి సాహిత్యాన్ని అష్టకష్టాలు పడి సేకరించి ‘జానపద సాహిత్యం’పై సాధికారమైన పరిశోధన గ్రంథం వెలువరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో చేసిన తొలి పరిశోధనే కాకుండా, జానపద సాహిత్యం గురించి దక్షిణ భారతంలోని విశ్వవిద్యాలయాల్లో అన్ని భాషల్లోను ఇది తొలి పరిశోధన. వారి తర్వాతనే మిగతా విశ్వవిద్యాలయాల్లో ఇతర భాషల్లోను జానపద సాహిత్యంపై పరిశోధన ప్రారంభమైంది, జానపదుల జీవన విధానాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రారంభమైంది. ప్రామాణికమైన వీరి పరిశోధనా వ్యాసమే ఆ తర్వాత వారందరికీ మార్గదర్శకమైంది. అందులో నుంచే చిలవలు పలువలుగా ఎన్నెన్నో సిద్ధాంతగ్రంథాలు వచ్చాయి. వీరి పరిశోధనా గ్రంథమే సినీ కవులకు మూలగ్రంథం.

వీరి సిద్ధాంత గ్రంథాన్ని కొందరు చాదస్త పండితులు చులకనగా చూశారు. దానితో వారిని ఢీకొనాలనే ధ్యేయంతోనే వందలాది సంస్కృత ఆంధ్ర తాళపత్ర గ్రంథాలను సేకరించి పరిష్కరించి ముద్రించారు. సంస్కృతంలో కూడా ఎం.ఏ చేశారు. ‘సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల చేయూత’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం పూర్తి చేశారు. కాని కారణాంతరాల వల్ల సమర్పించనే లేదు. ఆ గ్రంథాన్ని వారు 2002లో వెలువరించారు. ఇందులో 224 మంది కవుల రచనల గురించి సమగ్రంగా ఒకచోట ఇవ్వడం వారి పఠనశీలాన్ని, పరిశోధనా సామర్థ్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఇంగ్లీషులో ఈ అంశంపై వెలువడింది కేవలం ఇదొక్కటే గ్రంథం కావచ్చు.

తొలినాళ్లలో వీరొక చక్కని కవి. కాని వీరిలోని పరిశోధనా పాటవాన్ని గమనించిన సుప్రసిద్ధ సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి సలహా మేరకు కవిత్వం రాయడం మానివేసి తన జీవితం సమస్తం పరిశోధనా రంగానికే అంకితం చేసిన పరమేశ్వరుడు ఆయన. వారు కవిత్వం రాసిన రోజుల్లో ఎం.ఏలో ఉన్నప్పుడు, బి.ఏ చదువుతున్న సి. నారాయణరెడ్డితో కలిసి ‘రామనారాయణ కవులు’గా జంట కవిత్వం రాశారు. సినారె స్థాయిలో కవిత్వం చెప్పగలిగిన రామరాజు, కవిత్వం జోలికి పోకుండా తన జీవితాన్ని పరిశోధనకు, విమర్శకు అంకితం చేయడం వెనక ఎంత పట్టుదల, పరిశ్రమ ఉందో వేరుగా చెప్పనవసరం లేదు. ‘‘జానపద సాహిత్యం శిష్ట సాహిత్య సౌధానికి పునాది’’ అన్నది రామరాజు అభిప్రాయం.

దాదాపు మూడున్నర దశాబ్దాల కాలం విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడుగా సేవలందించి ఎంతోమందిని ఉత్తమ ఆచార్యులుగా తీర్చిదిద్దారు. పేర్వారం జగన్నాథం, రవ్వా శ్రీహరి లాంటి వీరి శిష్యులు వైస్‌ ఛాన్సలర్లు అయ్యారు. ఆచార్య రామకోటి శాస్త్రి, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య యం. వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతిరావు, ఇందుర్తి ప్రభాకరరావు, ఇటీవల ఆచార్య తిరుమలరావు వంటి ఎందరో శిష్యులు, ప్రశిష్యులు వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగు జానపద శాఖల్లో ఉన్నా, ఎందుచేతనో గాని కేవలం ఒకే ఒక విదుషీమణి– కంచి విజయలక్ష్మి మాత్రమే ‘‘డా. రామరాజు జీవితం–రచనలు’’ అనే అంశంపై పరిశోధన 25 సంవత్సరాల క్రితం చేశారు.

ఊరు పేరు తెలియని ఎందరో అనామకులపై అనేక పరిశోధనలు చేయించే, లేదా ఒకే అంశంపై పదేపదే పరిశోధనలు చేయించే విశ్వవిద్యాలయ ఆచార్యులకు డా. రామరాజు పరిశీలించి, పరిష్కరించి, వెలుగులోకి తెచ్చిన సంస్కృత గ్రంథాలపై పరిశోధన వేరుగా చేయించవచ్చుననీ, వారు సేకరించిన తాళపత్ర గ్రంథాలను, ప్రపంచానికి తెలియజేసిన వ్యాసావళి పైనే ప్రత్యేక పరిశోధన చేయించవచ్చునని తెలియకపోదు. అంతేకాదు మరుగునపడిన మాణిక్యాలను తాను వెలికి తీశారు. చరిత్రకెక్కని చరితార్థులను పరిచయం చేశారు. వాటిపై కూడా పరిశోధన చేయించవచ్చు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవలను గురించి, ఇంగ్లీషులో రచించిన పలు పరిశోధన వ్యాసాలపై పరిశోధన చేయించవచ్చు. అంతదాకా ఎందుకు? ‘ఆంధ్ర యోగులు’ గొలుసు గ్రంథాలపైనా పరిశోధన చేయవచ్చు. కాని అలక్ష్యం జరిగింది. వారి శతజయంతి సందర్భంగానైనా ఈ అంశాలలో కొన్నింటిపైనైనా, మన విశ్వవిద్యాలయాలు పరిశోధనకు శ్రీకారం చుడితే సంతోషం.

వరంగల్‌ సమీపంలోని దేవునూరులో 1925 ఏప్రిల్‌ 16న లక్ష్మీదేవి –నారాయణరాజు దంపతులకు జన్మించిన రామరాజు, మడికొండలో వారి పెదనాన్న రాఘవరాజు కనుసన్నలలో పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అక్కడ పుట్టిన హేమాహేమీలు, సమకాలీనులైన అభినవ పోతన వానమామలై వరదాచార్యులు, ‘రైతు రామాయణం’ కర్త వానమామలై జగన్నాథాచార్యులు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, వారి సోదరుడు కాళోజీ రామేశ్వరరావు, ‘గంగిరెద్దు’ కావ్యకర్త పల్లా దుర్గయ్య, ‘సరస్వతీ సాక్షాత్కారం’ లాంటి కావ్యాలు రాసిన అనుముల కృష్ణమూర్తిల స్నేహం లభ్యమై తెలుగు పట్ల అభిమానానికి, మమకారానికి దోహదం చేసింది. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో హైదరాబాద్‌కు రావడంతో, పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన సురవరం ప్రతాపరెడ్డి దృష్టి ఆకర్షించారు. ఆయన వద్దే తాళపత్ర గ్రంథ సేకరణ, శోధన నేర్చుకున్నారు. చదువుకుంటూ హైదరాబాద్‌ సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష రాసి సెలక్టయి, జిల్లా పంచాయితీ అధికారిగా ఉద్యోగం సంపాదించారు. అదే ఉద్యోగంలో కొనసాగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో శిఖర స్థాయికి చేరేవారు. కాని ఆయన ఆ ఉద్యోగంలో చేరక నిజాం కళాశాలలో బి.ఏలో చేరారు. హైదరాబాద్‌ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడై హైదరాబాద్‌ విమోచనకై నిజాం వ్యతిరేక సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లారు. ఆ తర్వాత ఎం.ఏ పూర్తి చేశారు. దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ టికెట్‌ ఇస్తామన్నా, సురవరం వారి సలహాపై తిరస్కరించారు. పిన్న వయసులోనే 1951లో లెక్చరరై, పిదప రీడర్‌ అయి, ఆచార్య పదవి అలంకరించి ఎంతోమంది శిష్యప్రశిష్యులకు స్ఫూర్తిమంతమైన గురువయ్యారు.

తెలుగు శాస్త్రీయ పరిశోధన రంగంలో మార్గదర్శకుడైన డా. రామరాజు– 123 సంవత్సరాల క్రితం తెలుగుభాషకు ఏ మాత్రం ఆదరణలేని నిజాం నిరంకుశ పాలనా కాలంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సంస్కృతీ వికాసానికి పాటుపడే మహదాశయంతో స్థాపించిన ‘శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం’కు 1956 నుంచి 1959 దాకా, మళ్లీ 1963 నుంచి 1965 దాకా గౌరవ కార్యదర్శిగా, అంతకుముందు 1960 నుంచి 1962 దాకా ఉపాధ్యక్షులుగా సేవలందించారు.

వారి గౌరవార్థం మా భాషా నిలయం 2019లో ‘డా. బి. రామరాజు స్మారక పరిశోధక పురస్కారం’ ఏర్పాటు చేసి, ప్రతియేటా ఒక పరిశోధక ప్రముఖుడికి ప్రదానం చేస్తున్నాం. ఈ యేడాది ‘డా. రామరాజు జీవితం–రచనలు’ అనే అంశంపై పరిశోధన చేసిన ఏకైక విదుషీమణి శ్రీమతి కంచి విజయలక్ష్మికి ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు రావిచెట్టు రంగారావు సభామందిరం, (శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం)లో భాషా నిలయం గౌరవ అధ్యక్షులు డా. కె.వి. రమణాచారి ప్రదానం చేస్తారు.

టి. ఉడయవర్లు

(ఏప్రిల్‌ 16: బిరుదురాజు రామరాజు శతజయంతి సంవత్సరం ఆరంభం)

Updated Date - Apr 14 , 2024 | 02:22 AM