జ్ఞాన భారతానికి ఊపిరి గ్రంథాలయమే !
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:39 AM
సమాజంలోని అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి కూడా సమాచారాన్ని అందించాలన్నదే పౌర గ్రంథాలయాల ప్రాథమిక సూత్రం. పౌర గ్రంథాలయాలు ప్రజాస్వామ్యాన్ని...
సమాజంలోని అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి కూడా సమాచారాన్ని అందించాలన్నదే పౌర గ్రంథాలయాల ప్రాథమిక సూత్రం. పౌర గ్రంథాలయాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలవు, సామాజిక సమానత్వాన్ని పెంపొందించగలవు, నాణ్యమైన సమాచారం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయగలవు. అయితే మన గ్రంథాలయాలు అలాంటి పాత్ర పోషించగలుగుతున్నాయా?
మన దేశంలో ఎన్ని పబ్లిక్ లైబ్రరీలు ఉన్నాయీ అన్న లెక్కే సరిగా లేదు. 1947 నుంచి భారతదేశంలో పబ్లిక్ లైబ్రరీల సంఖ్యపై అధికారిక గణాంకాలు లేవు. గ్రంథాలయాలకు ఒక ప్రత్యేక శాఖ అంటూ కూడా లేకుండా అవి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్నాయి. ఆ శాఖ కింద వీటి నిర్వహణను 1972లో స్థాపించబడిన రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ (RRRLF) చూసుకుంటున్నది. ఈ సంస్థ లెక్క ప్రకారం పౌర గ్రంథాలయాలు 46,746; సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2014లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 54,846; 2011 జాతీయ జనాభా లెక్కల తరువాత ఒక జాతీయ సంస్థ చేసిన సర్వేలో 75,000; తరువాత ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ లెక్క ప్రకారం 1,46,000... ఇలా వేర్వేరు అంకెలతో మన వద్ద ఉన్న లైబ్రరీల సంఖ్యపై జాతీయ స్థాయిలో డేటా సమగ్రత లేదు. రాష్ట్ర స్థాయిలోని డేటా కూడా చాలా రాష్ట్రాల్లో దొరకడం కష్టం. గత సంవత్సరం ఆగస్టు మాసంలో జాతీయ స్థాయిలో ‘గ్రంథాలయాల పండగ’ అనే కార్యక్రమం జరిగిన సందర్భంగా– జాతీయ వ్యాప్తంగా ఆదరణ పొందిన గ్రంథాలయాలకు ప్రభుత్వం అండగా ఉండేందుకు అంగీకరించింది. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా గ్రంథాలయాలకు డైరెక్టరీని తయారు చేయాలన్న ప్రతిపాదన కూడా ఆమోదం పొందింది.
వివిధ రాష్ట్రాలలో గ్రంథాలయాలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ అంటూ లేకపోవడం బాధాకరం. అవి విద్యా శాఖ లోనూ సాంస్కృతిక శాఖ లోనూ విభాగాలుగా ఉంటున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో పబ్లిక్ లైబ్రరీస్ శాఖ, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ఉన్నారు. త్రిపుర స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, హర్యానా పబ్లిక్ లైబ్రరీలు ఉన్నత విద్యా శాఖ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఇది సాంస్కృతిక విభాగం కిందకు వస్తుంది.
తెలుగు రాష్ట్రాలలో అయితే దాదాపు మూడు దశాబ్దాలుగా గ్రంథ పాలకుల నియమాకం జరగ లేదు. 2021 ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) వార్తా కథనం ప్రకారం– భారతదేశం లోని 1.2 మిలియన్ల లైబ్రేరియన్లలో కేవలం 10శాతం మంది మాత్రమే వృత్తిపరంగా అర్హత కలిగి ఉన్నారు. అర్హత కలిగిన గ్రంథ పాలకుల నియామకం దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య. గ్రంథ పాలకులను నియమించటమే గాక, వారికి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందించేందుకు తగిన తర్ఫీదును ఇవ్వాలి. ఇందుకు ఒక మానవ వనరుల విభాగాన్ని జాతీయస్థాయిలో ఏర్పాటు చేయాలి.
దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పౌర గ్రంథాలయాలు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని రాష్ట్ర లైబ్రరీలు స్థిర గ్రాంట్ల ద్వారా, గ్రంథాలయాల సెస్ ద్వారా నిధులు పొందుతున్నాయి. దేశంలో ఆరేడు రాష్ట్రాలు గ్రంథాలయాల నిర్వహణకు లైబ్రరీ సెస్‌ను వసూలు చేస్తున్నాయి. కానీ ఈ పన్ను వసూలు చేసే స్థానిక మున్సిపల్ సంస్థలు సకాలంలో ఈ నిధులను పౌర గ్రంథాలయ శాఖలకు చెల్లింపులు చేయని ఉదంతాలు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు, కర్ణాటకలోని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) పబ్లిక్ లైబ్రరీల శాఖకు 2019 నాటికి రూ.226 కోట్లకు పైగా బకాయిపడింది. గ్రంథాలయాల పన్ను ద్వారా వచ్చిన నిధులను ఇతర శాఖలలో పనుల కోసం కేటాయిస్తున్నారు.
పౌర గ్రంథాలయాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, సామాజిక అసమానతలను సమం చేయడంలో, పౌరులకూ ప్రభుత్వానికీ మధ్య సంధానకర్తలుగానూ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అత్యధిక సంఖ్యలో పౌర గ్రంథాలయాలు కలిగివున్న కేరళ, అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. రెండవ రాష్ట్రంగా ఢిల్లీ, ఆ తర్వాత కర్ణాటక చక్కటి పాత్రను పోషిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలోనే దాదాపు 9000 లైబ్రరీలు ఉన్నాయి. కేరళలో లైబ్రరీలు ట్రస్ట్ లేదా ప్రజల సొసైటీలుగా ఏర్పడి, కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్‌కు అనుబంధంగా ఉంటాయి. అతి తక్కువ పౌర గ్రంథాలయాలు కలిగివున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్ర అక్షరాస్యత కూడా అంతంత మాత్రమే. ప్రతి వీధిలో కనీసం ఒక పబ్లిక్ లైబ్రరీని లక్ష్యంగా పెట్టుకొని దీన్ని దశలవారీగా పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు నడవాలి.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, జపాన్, జర్మనీ, కెనడా, సింగపూర్ దేశాలలో ఆయా దేశాల జనాభా ప్రాతిపాదికన పౌర గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. వాటితోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన, తగు అర్హతలు ఉన్న గ్రంథ పాలకుల ద్వారా చదువరులకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఆ దేశాల ప్రజలు పౌర గ్రంథాలయాలను ‘మావి’ అని సొంతం చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం వల్ల గ్రంథాలయాల వినియోగంతో పాటు వాటి అభివృద్ధి కూడా సమపాళ్ళలో జరుగుతుంది. ఆదరణకు అనుగుణంగానే నిర్వహణ స్థాయి కూడా ఉంటుంది. మన దేశంలో స్వాతంత్రోద్యమంలో తలమానిక పాత్ర పోషించిన పౌర గ్రంథాలయాలు నేడు ఆ స్థాయిలో పనితీరు కనబరచలేకపోతున్నాయి. కారణాలు ఏవైనా వాటిని అధిగమించాలి. గ్రంథాలయాల పునర్జీవనంతోనే మన దేశం జ్ఞాన భారతంగా వర్ధిల్లుతుంది.
డా. రవి కుమార్ చేగోని
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం
(నేటి నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు)