మైత్రి పదిలం
ABN , Publish Date - Dec 19 , 2024 | 02:19 AM
భారత ప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలో తమ భూభాగాన్ని ఇతరులను వినియోగించుకోనివ్వబోమని శ్రీలంక అధ్యక్షుడు హామీ ఇవ్వడం భారతదేశానికి పెద్ద ఉపశమనం...
భారత ప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలో తమ భూభాగాన్ని ఇతరులను వినియోగించుకోనివ్వబోమని శ్రీలంక అధ్యక్షుడు హామీ ఇవ్వడం భారతదేశానికి పెద్ద ఉపశమనం. అనురకుమార దిసనాయకే మూడురోజుల పర్యటన తరువాత, ఇప్పటివరకూ ఉన్న అనుమానాలు సందేహాలు చాలామట్టుకు ఉపశమించిన మాట వాస్తవం. ఆయన నాయకత్వంలోని జనతావిముక్తి పెరుమన (జేవీపీ)కు చైనా అనుకూల వామపక్షపార్టీ అన్న ముద్ర ఉండటంతో, దిసనాయకే విధానాలు, వైఖరులమీద చాలా అనుమానాలున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడిలాగా, నేపాల్ ప్రధానిలాగా ఈయన కూడా తన తొలి విదేశీపర్యటనకు చైనాను ఎంచుకుంటాడేమోనని భావిస్తున్న తరుణంలో, తొలిగా భారత్‌లోనే కాలూని పాత సంప్రదాయాన్నే దిసనాయకే కొనసాగించడం విశేషం.
భారతదేశం ఒత్తిడికి లొంగి విదేశీ పరిశోధనా నౌకల ప్రవేశం మీద రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం ఓ ఏడాదిపాటు విధించిన నిషేధానికి మరో నెలలో గడువుతీరబోతున్నది. ఈ నేపథ్యంలో, దిసనాయకే ఇచ్చిన హామీని భారతదేశం సానుకూల వైఖరిగా చూస్తోంది. చేసిన అప్పుతీర్చలేక తిరిగి చైనాకే 99సంవత్సరాల లీజుకు రాసిచ్చిన హంబన్‌టోట పోర్టులో చైనా తన నిఘా ఓడలను లంగరేస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా, శాటిలైట్లను, మిసైళ్ళను ట్రాక్ చేసే యువాన్‌వాంగ్ ఓడ విషయంలో భారత్–శ్రీలంక మధ్య ఘర్షణ ఏర్పడింది. భారత్ అభ్యంతరాల మధ్య దీని ప్రవేశాన్ని కాస్తంత ఆలస్యం చేసిన శ్రీలంక ఆ తరువాత మరమ్మతుల ముసుగులో దానిని అనుమతించింది. చీటికీ మాటికీ ఈ నిఘా సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఇప్పుడు సంయుక్త ప్రకటనలో భారతదేశానికి శ్రీలంకనుంచి ఒక నిర్దిష్టమైన హామీ లభించడం పెద్ద ఉపశమనం. రెండేళ్ళక్రితం తీవ్ర ఆర్థికసంక్షోభంలో ఉన్నప్పుడు భారతదేశం ఎంతగా సాయపడిందో శ్రీలంక అధ్యక్షుడికి తెలియనిదేమీ కాదు. రాజపక్సేల ఏలుబడిలో చైనా అప్పుల ఊబిలోకి మరింత జారిపోయి, ఆర్థిక సామాజిక సమస్యను ఎదుర్కొన్న లంకకు భారతదేశం తాను చేయగలిగినంత చేసింది. బాధల్లో ఉన్నప్పుడు భారీగా సాయపడ్డ విషయాన్ని ప్రస్తావించి కృతజ్ఞతలు తెలియచేసిన దిసనాయకే, రాబోయేరోజుల్లో భారతదేశ భద్రతకు నష్టంచేకూర్చే చర్యలేమీ చేపట్టబోరని ఆశించాలి.
తన పర్యటనలో దిసనాయకే భారతదేశంతో రక్షణసహకార ఒప్పందాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. విద్యుత్తు, ఎల్‌ఎన్‌జీ ఇచ్చిపుచ్చుకోవడం, ఇంధన, రక్షణ, వాణిజ్యరంగాల్లో రెండుదేశాల సహకారం మరింత విస్తరించుకోవడం మంచి పరిణామం. తలైమన్నార్– రామేశ్వరం మధ్య ఫెర్రీ సర్వీసు ప్రతిపాదన భౌతిక దూరాన్ని తగ్గించడమే కాక, మానసికంగానూ దగ్గరచేస్తుంది. దిసనాయకేతో చర్చల్లో మత్స్యకారుల అంశం కూడా వచ్చిందని, వారిపట్ల మానవత్వంతో వ్యవహరించాలని నిర్ణయించుకున్నామని మోదీ ప్రత్యేకంగా చెప్పారు. అయితే, లంక తమిళుల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో మనం ఆశాభావం వెలిబుచ్చడం వినా, దిసనాయకేనుంచి నిర్దిష్టమైన హామీ ఏమీ లభించినట్టుగా లేదు. 13వ రాజ్యాంగ సవరణకు లోబడి తమిళ ప్రావిన్సుల్లో ఎన్నికలు, అధికార వికేంద్రీకరణ తదితర అంశాలకు సంబంధించి ఉభయదేశాల సంయుక్త ప్రకటన ఏమీ మాట్లాడలేదని వార్తలు వచ్చాయి. తమిళుల ప్రయోజనాలకు పూర్తిభిన్నంగా, ఇంకా చెప్పాలంటే వారిపట్ల శత్రుపూరిత వైఖరితో వ్యవహరించిన చరిత్ర జనతావిముక్తి పెరుమనకు ఉంది. భారత్–శ్రీలంక ఒప్పందాన్ని, అందులో భాగంగా చేరిన ఈ రాజ్యాంగ సవరణను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కానీ, మొన్న నవంబరు 14న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల సందర్భంలో కానీ, తమిళులకు దిసనాయకే ప్రత్యేక హామీలేవీ ఇవ్వలేదు.
అయినప్పటికీ వారు తమిళపార్టీల కంటే ఆయన కూటమినే అధికంగా ఆదరించారు. తన పర్యటనలో దిసనాయకే ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడాన్ని బట్టి ఆయన తమిళుల ప్రయోజనాలకు కట్టుబడతారని భారతదేశం ఆశిస్తోంది. వచ్చే నెలలో ఆయన చైనాలో పర్యటించబోతున్నారు. అక్కడ జరిగే ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకోవడాలమీద భారత్ ఎలాగూ ఓ కన్నేసి ఉంచుతుంది. అయితే, భారత్ వ్యతిరేకి అన్నభావనకు పూర్తి భిన్నంగా దిసనాయకే మూడురోజుల పర్యటన చక్కని సుహృద్భావంతో ముగిసినందుకు సంతోషించాల్సిందే.