Share News

కలికాలం! ఇది కృత్రిమ మేధ యుగం!!

ABN , Publish Date - Dec 19 , 2024 | 02:39 AM

బీబీసీ కథనం ప్రకారం భారత సంతతికి చెందిన 26 సంవత్సరాల సుచిర్ బాలాజీ అనే యువ శాస్త్రవేత్త, కృత్రిమ మేధస్సుకు చెందిన ‘ఓపెన్‌ ఏఐ’ సంస్థ పరిశోధకుడిగా పనిచేస్తూ, ‘విజిల్ బ్లోయర్’గా మారిన నేపథ్యంలో...

కలికాలం! ఇది కృత్రిమ మేధ యుగం!!

బీబీసీ కథనం ప్రకారం భారత సంతతికి చెందిన 26 సంవత్సరాల సుచిర్ బాలాజీ అనే యువ శాస్త్రవేత్త, కృత్రిమ మేధస్సుకు చెందిన ‘ఓపెన్‌ ఏఐ’ సంస్థ పరిశోధకుడిగా పనిచేస్తూ, ‘విజిల్ బ్లోయర్’గా మారిన నేపథ్యంలో, శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో హఠాన్మరణం చెందాడని తెలుస్తోంది. ‘ఓపెన్‌ ఏఐ కృత్రిమ మేధస్సు సంస్థ’ అనుసరిస్తున్న ఆక్షేపణీయ విధానాలను ఆయన బహిరంగంగా విమర్శించడమే బహుశా ఆయన ‘బలవన్మరణానికి’ దారితీసి ఉండవచ్చని మీడియా వర్గాల అభిప్రాయం. కొన్నాళ్ల క్రితం సుచిర్‌తో ‘న్యూయార్క్ టైమ్స్‌’ జరిపిన ఇంటర్వ్యూలో, కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఆయన తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు. ఈ సాంకేతికత వల్ల సమాజానికి వాటిల్లే ప్రమాదాలపై తన ఆందోళనను బహిరంగంగా వ్యక్తం చేశారు.


కాపీరైట్‌ చట్టం కింద పరిగణించాల్సిన సమాచారాన్ని, ‘ఓపెన్‌ ఏఐ సంస్థ’ చట్టవిరుద్ధంగా, విచ్చలవిడిగా అనైతికంగా, అక్రమంగా, అసురక్షితంగా, మోసపూరితంగా, ఉపయోగించడాన్ని సుచిర్ తప్పుబడుతూ, తీవ్రంగా విమర్శించారు. ‘చాట్‌జీపీటీ’ లాంటి కృత్రిమ మేధస్సు ఏజెంట్లు, అంతర్జాలాన్ని హానికరంగా మార్చివేస్తున్నాయని ఆయన సుస్పష్టం చేశారు. లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్ ప్రకారం, సుచిర్ బాలాజీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. నవంబర్ 2020 నుంచి ఆగస్టు 2024 వరకు, నాలుగేళ్లపాటు ‘ఓపెన్‌ఏఐ సంస్థ’లో పనిచేశారు. సుచిర్ బాలాజీ ధర్మాగ్రహం వర్తమానంలో, సమీప భవిష్యత్తులో ‘కృత్రిమ మేధస్సు’ కలిగించే ‘హానికర ఫలితాల’ సంకేతమని నిస్సందేహంగా చెప్పవచ్చు. ‘అధికారం, ఆధిపత్యం, అభివృద్ధి’ అనే అసంబద్ధమైన నెపంతో, నేడు అధునాతన సాంకేతికతల నిపుణులు తమ శక్తి-యుక్తులు ఉపయోగించి, సృష్టించిన ఒక వికారమైన విజ్ఞానానికి ‘కృత్రిమ మేధస్సు (ఏఐ)’ అనే నాగరిక నామకరణం చేశారు. అయితే, దీని సంతానం, తరచుగా, వారికి తెలియకుండా, హద్దులు మీరి, పగ్గాలు విదిలించుకుని, వారి నియంత్రణకు అతీతంగా మారాయి, మారుతున్నాయి, భవిష్యత్తులో మారనున్నాయి.

అశోకుడు కళింగ యుద్ధం బీభత్సాన్ని చూసి శాంతి మార్గం అనుసరించాడు, బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. రాబర్ట్ ఓపెన్‌హైమర్ అణుబాంబు అనివార్య దుష్ఫలితాలను సహించలేకపోయాడు. కృత్రిమ మేధ సృష్టికర్తలలో ఒకరైన జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్ ఆ వినూత్న సాంకేతికత అనియంత్రిత ఆవిష్కరణల ప్రమాదాలపై ప్రపంచాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నారు. బహుశా సుచిర్ బాలాజీ కూడా అదే ప్రయత్నం చేసి మృత్యుబారిన పడ్డాడేమో? కృత్రిమ మేధస్సు రంగంలో అగ్రగామి శాస్త్రవేత్తలు జెఫ్రీ హింటన్, డెమిస్ హసాబిస్, జాన్ ఎం జంపర్, జాన్ హాప్‌ఫీల్డ్ 2024 సంవత్సరానికి గాను, నోబెల్ బహుమతులు పొందినవారిలో ఉన్నారు.


హింటన్, హాప్‌ఫీల్డ్‌లు తమ కృషి ద్వారా ‘గణిత, భౌతిక శాస్త్రాల’ మధ్య ఒక వంతెనగా కృత్రిమ మేధస్సును సృష్టించారు. దీనివల్ల తాత్త్విక అన్వేషణకు, వ్యావహారిక ప్రయోగాలకు, కావాల్సిన ఉపకరణాల రూపకల్పన జరిగింది. అలాగే డెమిస్ హసాబిస్, జాన్ జంపర్ ‘ఆల్ఫాఫోల్డ్’ అనే ఏఐ వ్యవస్థ రూపకల్పన చేసి అభివృద్ధి పరిచారు. ఇది ప్రోటీన్ నిర్మాణాలను విశ్లేషించడంలో గణనీయమైన రీతిలో, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. అమినో ఆమ్లక్రమాల ఆధారంగా ప్రోటీన్‌లో పరమాణు నిర్మాణాన్ని కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇది జీవ, వైద్య శాస్త్రరంగాల్లో విప్లవాత్మక ఫలితాలను చూపింది. ముఖ్యంగా ఔషధాల అభివృద్ధి వేగవంతం చేయడం, రోగాలను అణు స్థాయిలో అర్థం చేసుకోవడం, యాంటీబయోటిక్ నిరోధకత వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడింది.

‘ఏఐ డీప్‌లెర్నింగ్ గాడ్‌ఫాదర్’గా పిలవబడే జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్, జాన్ హాప్‌ఫీల్డ్‌తో కలసి ‘న్యూరల్ నెట్‌వర్క్స్’ను రూపొందించారు, ఇది ‘బ్యాక్‌ప్రొపగేషన్ ఆల్గారిథమ్’ అనే విశిష్ట ప్రక్రియ ద్వారా తప్పుల నుండి నేర్చుకోవడం సాధ్యమైంది. దీని ద్వారా ఆధునిక డీప్‌లెర్నింగ్‌కి బలమైన పునాది ఏర్పడింది. ఈ ఆవిష్కరణ కంప్యూటర్ విజన్ నుండి భాషా ప్రక్రియల వరకు వివిధ ఏఐ అనువర్తనాల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఇంగ్లాండ్‌లో జన్మించిన హింటన్, ఎడింబరో విశ్వవిద్యాలయానికి సమర్పించిన పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసంలో ‘న్యూరల్ నెట్‌వర్క్స్‌లో ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్, డిస్ట్రిబ్యూటెడ్ రిప్రజెంటేషన్స్’పై దృష్టిపెట్టారు. ఆయన ఆధారభూత పనితనం కృత్రిమ మేధస్సు దిశను పూర్తిగా మార్చివేసింది. నోబెల్ బహుమతి అందుకున్నప్పటికీ, హింటన్ నిరంతరం ఏఐతో సంభావ్య భావి ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ వస్తున్నారు.


2023లో గూగుల్‌ను వదిలి, హింటన్ ‘అనియంత్రిత కృత్రిమ మేధస్సు అభివృద్ధి’ కలిగించే ప్రమాదాలు, తప్పుడు సమాచారం వ్యాప్తి, మానవాళికి కలిగే ముప్పు గురించి తన ఆందోళనలను బహిరంగంగా వ్యక్తం చేశారు. హింటన్, హాప్‌ఫీల్డ్‌లకు లభించిన గుర్తింపు, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన పలురంగాల్లో మార్గదర్శక ప్రభావాన్ని చూపిస్తుంది. డీప్‌లెర్నింగ్ ప్రధాన భూమికలైన సిద్ధాంతపరమైన ఆల్గారిథమిక్ మౌలికాలను హింటన్, హాప్‌ఫీల్డ్‌లు అందించగా, హస్సాబిస్, జంపర్‌లు శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించగల కృత్రిమ మేధస్సు సామర్థ్యాన్ని శాస్త్రీయంగా రూఢిపరుస్తూ నిరూపించారు. ఈ విజయాలు కృత్రిమ మేధస్సు ద్వంద్వ స్వభావాన్ని కూడా పునరుద్ఘాటించాయి. సమాజానికి కలిగించే ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ, దాని నైతిక, తదితర అస్తిత్వసంబంధ సమస్యలు గణనీయమైనవిగా మిగిలిపోతున్నాయి.

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ఆవిర్భావం, అవసరం, సిద్ధాంతం, పరిణామం, ఆరోహణ, (బహుశా) అవరోహణ, మంచి-చెడు ప్రభావాలు నిజంగా ఆసక్తికరమైనవేనని అనాలి. 1956లో, న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన డార్ట్‌మౌత్ వర్క్‌షాప్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనే పదం సృష్టించబడింది. క్లాడ్ షానన్, జాన్ మక్కార్తీ, నాథనియల్ రోచెస్టర్, మార్విన్ మిన్స్కీలను (ఏఐ) ‘కృత్రిమ మేధస్సు స్థాపక పితామహులుగా’ పరిగణిస్తారు.


అనేక రకాల పనులను ఆటోమేట్ చేయాలని, సామర్థ్యాన్ని పెంచాలని, మానవ మేధో సామర్థ్యాలను మించిపోయే సంక్లిష్టతలను ఎదుర్కొనాలనే మానవ జాతి ఆకాంక్ష నుండి ఆవిర్భవించినదే కృత్రిమ మేధస్సు. కృత్రిమ మేధస్సు పరిణామ క్రమంలో ముఖ్యమైన మైలురాళ్లున్నాయి. వాటిలో ‘చాట్‌జిపిటి’ వంటి సంభాషణల ఏజెంట్ల రంగప్రవేశం, కృత్రిమ మేధస్సును ఒక ‘అత్యవసర దుష్టశక్తి’గా మార్చివేసి, మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తూ, మానవ మెదడు ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తూ, పర్యవేక్షణ వ్యవస్థలలాంటి ఉపయోగంతో పౌర స్వేచ్ఛలను హరించివేస్తోంది. ఫలితంగా, కృత్రిమ మేధస్సు, ఆధునిక ఆవిష్కరణల ప్రమాదాలను సూచిస్తుంది, కాబట్టి, దాని రూపాంతర సామర్థ్యాన్ని చెడుగా వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఒక సవాలుగా మారింది. ‘మొట్ట మొదటి అణ్వాయుధ ఆవిర్భావం, ప్రయోగం, దాని అనుకూల, ప్రతికూల ప్రభావాలు, వాటి మధ్య చోటుచేసుకున్న తేడాలను కూలంకషంగా పరిశీలించడం అవశ్యం.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, అప్పటి అమెరికా ప్రభుత్వం గోప్యంగా చేపట్టిన ‘మాన్‌హట్టన్ ప్రాజెక్ట్’లో భాగంగా ప్రపంచంలో మొదటిసారిగా ‘అణ్వాయుధ పరీక్ష’ జూలై 16, 1945న ‘ది గ్యాడ్జెట్’ పేరిట జరిగింది. ఈ పరికరాన్ని న్యూమెక్సికోలోని లాస్ ఆలమోస్‌లో విజయవంతంగా పరీక్షించారు.


అమెరికా బాంబర్ ‘ఎనోలా గే’ వాయునౌక ద్వారా పేల్చబడిన అణ్వాయుధాలు కనీ-వినీ ఎరుగని అపార విధ్వంసాన్ని కలిగించాయి. ఈ విధ్వంసాన్ని చూసిన ‘అణ్వాయుధ, ఆటామిక్ బాంబ్ పిత’గా పిలువబడే రాబర్ట్ ఓపెన్‌హైమర్, తన ప్రగాఢ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. భగవద్గీతలోని మాటలను ఆయన పదేపదే ఉటంకిస్తూ, ‘ఇప్పుడు నేనే మరణాన్ని; ప్రపంచాలను నాశనం చేసేవాడిని అయ్యాను’ అని ఆవేదనాభరితంగా తన మనస్తాపాన్ని వ్యక్తపరిచాడు.

మౌర్య అశోకుడిలో కలిగిన పరివర్తన, రాబర్ట్ ఓపెన్‌హైమర్ పశ్చాత్తాపం, జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్ ఆవేదనలకు బహువిధ సామీప్యాలు ఉన్నాయి. కళింగ యుద్ధంలో విధ్వంసాన్ని చూసి చలించిన అశోకుడు హింసను త్యజించి, బౌద్ధమతాన్ని స్వీకరించారు. ప్రజల శ్రేయస్సుకు కట్టుబడి శాంతి పరిపాలనకు అంకితమయ్యారు. ఓపెన్‌హైమర్, ‘మాన్‌హట్టన్ ప్రాజెక్ట్’ శాస్త్రీయ డైరెక్టర్‌గా అణుబాంబు సృష్టిలో కీలకపాత్ర పోషించి, ఆ బాంబు ప్రభావానికి బాధపడ్డారు. ఆయుధ నియంత్రణను సమర్థిస్తూ, తన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అలాగే, కృత్రిమ మేధస్సు అభివృద్ధికి ‘గాడ్‌ఫాదర్‌’గా ప్రఖ్యాతిగాంచిన జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్, న్యూరల్ నెట్వర్క్‌ల అభివృద్ధికి కారణమై, ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి కారకుడైనప్పటికీ, కృత్రిమ మేధస్సు అనూహ్య దుష్ఫలితాల గురించి, అది ఆర్థిక వ్యవస్థలపై, సమాజాలపై, మానవ స్వయంశక్తిపై కలిగించే ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మానవ మేధో సృష్టి ఫలితాలను అవగాహన చేసుకోవడంలోనే నిజమైన విజ్ఞానం ఇమిడి ఉంటుంది. శాస్త్రవేత్తల సృష్టి పర్యవసానంగా జరిగే అనర్థానికి దాని కారకులు పశ్చాత్తాపం వెల్లడి చేయడం, మార్పు దిశగా ఒక సంకేతమని, ప్రపంచాన్ని బాధ్యతాయుతమైన భవిష్యత్తు వైపు తీసుకెళ్లగలదని భావించాలి. అశోకుడు, ఓపెన్‌హైమర్, హింటన్, లాంటివారి అనుభవాలు, ఆవేదనల నుండి, ఇటీవలే మరణించిన 26 సంవత్సరాల సుచిర్ బాలాజీ హెచ్చరిక నుండి నేర్చుకోవడం ప్రపంచానికి, మానవాళికి ప్రయోజనకరం.

వనం జ్వాలానరసింహారావు

Updated Date - Dec 19 , 2024 | 02:39 AM