గాంధర్వ యోగి... సంగీత రత్నాకరుడు
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:04 AM
శాస్త్రీయ సంగీతంలో ఎందరెందరో ఫిడేలు వాయిద్యాన్ని చేతపట్టినా భారతావనిలో ఒకే ఒక్కరికి ‘ఫిడేలు నాయుడుగారు’ అనే పేరు లభించడటం ఆంధ్రులకు గర్వకారణం. ఫిడేలు వాయిద్యం కోసమే ద్వారం వెంకటస్వామి నాయుడు...
శాస్త్రీయ సంగీతంలో ఎందరెందరో ఫిడేలు వాయిద్యాన్ని చేతపట్టినా భారతావనిలో ఒకే ఒక్కరికి ‘ఫిడేలు నాయుడుగారు’ అనే పేరు లభించడటం ఆంధ్రులకు గర్వకారణం. ఫిడేలు వాయిద్యం కోసమే ద్వారం వెంకటస్వామి నాయుడు జన్మించారని లోకులు అనుకోవడలో ఆశ్చర్యంలేదు. ఆయన జీవితమంతా వాయులీనానికే అంకితమైంది. పుట్టుకతోనే వచ్చిన దృష్టి మాంద్యమనే లోటు నాయుడు జీవితంలో మరేలోటు లేకుండా చేసింది. ఈ వైకల్యమే వారి వైదుష్య వికాసానికి కారణమైంది. ఒక దురదృష్టం మరొక అదృష్టానికి దారితీసి ఫిడేలు వాదనలో ‘ద్వారం నాయుడు బాణీ’గా విఖ్యాతి పొందుటకు అంకురార్పణ అయింది. తాను నేర్చి, ఏర్పరచుకొన్న బాణీ సుస్థిరమయ్యేటందుకు ప్రతీ రోజు సుమారు ఏడు గంటల పాటు పదకొండు సంవత్సరాలు కఠోరమైన క్రమశిక్షణ, దీక్షతో గతి తప్పకుండా సాధకం చేసి ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడుగా కచేరీలు చేస్తుండేవారు. వంశపారంపర్యంగా వచ్చిన మిలిటరీ మనస్తత్వపు లక్షణాలు కావలసిన మానసిక ధైర్యాన్ని, పట్టుదలను ఇచ్చాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ యుద్ధంలో పోరాడే సైనికునిలా జీవితరంగంలో ముందుకు దూసుకుని వెళ్లడమేగాని వెనక్కు అడుగువెయ్యని సాహసి నాయుడుగారు. ఆయన వేషం నిరాడంబరం, మనస్సు సాగర గంభీరం.
అప్పటికి దక్షిణ దేశంలో సంగీత కళాశాలలు లేవు. విద్యలకు నిలయమైన విజయనగరంలో 1919లో ప్రప్రథమ సంగీత కళాశాలను మహారాజావారు స్థాపించి ‘హరికథా పితామహ’ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసును మొదటి ప్రిన్సిపాల్‌గా నియమించారు. అప్పటికే నాయుడుగారు చాలా ప్రాంతాలలో తమ వాయులీన విద్యను ప్రదర్శిస్తూ శ్రోతల మన్ననలు పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ సంగీత కళాశాలలో చేరి మరింత ఉన్నత విద్యను అభ్యసించాలనేది ఆయన అభిలాష. కళాశాల ప్రారంభోత్సవం నాడు మహారాజావారు, నారాయణదాసు, ఇంకా ఇతర ప్రముఖుల సమక్షంలో నాయుడుగారు కచేరి చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన రాజావారు, దాసుగారు నాయుడును విద్యార్థిగా గాక నేరుగా వయోలిన్ అధ్యాపకులుగా నియమించారు. సుమారు మూడు పుష్కరాల పాటు అనగా మొదటి పదిహేనేళ్లు అధ్యాపకునిగా, (నారాయణదాసు ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం) ప్రధానాచార్యులుగా బాధ్యతలు చేపట్టి మరో పద్దెనిమిది సంవత్సరాలు సంగీత విద్యకు ఉత్కృష్ట సేవలు అందించారు. అధ్యాపకులుగా ఉన్న రోజుల్లో కూడా ఆయన విద్యార్థిలాగా నిరంతర సాధన చేసేవారు. రోజూ లెక్కలేనన్ని త్రిస్థాయిలు వాయించేవారు. అయన దినచర్య సంగీతజ్ఞులకు ఆదర్శప్రాయంగా ఉండేది. శ్రావ్యమైన వయోలిన్ వాదనం ప్రతీరోజు చెవిని పడుతూ ఉండాలని, అదీ సాధనే అని నాయుడు అభిమతం.
ఒకానొక సందర్భంలో అన్న వెంకటకృష్ణయ్య తమ్ముడిని అమృత్‌సర్‌లో ఉన్న ప్రఖ్యాత నేత్రవైద్యుని వద్దకు తీసుకువెళ్లాలని తలపెట్టారు. నాయుడుగారు అందుకు అంగీకరించలేదు. కారణమేమని ప్రశ్నించగా ‘సంగీతానికి మనోనేత్రం అవసరం. బాహ్యనేత్రాలు నాకు లేకపోవడం నుంచి నా మనోనేత్రాన్ని నేను వికసించేటట్లుగా చేసుకోగలిగాను. నా సంగీతం కూడా పరిపక్వదశకు వస్తోంది. మన సంగీతం ఏకత్వాన్ని సూచిస్తుంది. అందుకే ఇది ఏకస్వర సంగీతం. దీనికి తపస్సు అవసరం. కన్నులు ఉండడంవల్ల చూపులు బుద్ధికి చాంచల్యాన్ని కలిగిస్తాయి. ఏ వైద్యుడైనా నాకు ఇప్పుడు కన్నులు ప్రసాదిస్తే నా మనోనేత్రం భగ్నమై నా సంగీతానికి ముప్పు రావచ్చు. అందుచేత నా సంగీతం కోసం నేను నా బాహ్యనేత్రాలను సంపర్పించుకోదలచుకున్నాను’ అని నాయుడు అన్నారు.
1927లో మద్రాసులో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలో నాయుడుగారు కచేరీ చేసి దక్షిణాది విద్వాంసుల, శ్రోతల మనస్సులను ఆకట్టుకున్నారు. ఆ రోజులలో దక్షిణాది విద్వాంసులలో వయోలిన్ వాయిద్యానికి గోవిందస్వామి పిళ్ళై గారిది పెట్టింది పేరు. చాలా రోజులకు ఆ మహావిద్వాంసునికి సరియైన వారసుడుగా నాయుడుగారు దొరికారని అందరూ ఆనందించారు. 1929 దసరా ఉత్సవాలలో కాకినాడ సరస్వతీ గానసభలో గోవిందస్వామి పిళ్ళై వయోలిన్ కచేరి చేయవలసి ఉంది. అనారోగ్య కారణంగా రాలేక ఆయన సంస్థ వారికి రాసిన లేఖలో తనకు బదులుగా వెంకటస్వామినాయుడు సోలో కచేరీ జరిపించమన్నారు. శ్రోతలందరి కరతాళధ్వనుల మధ్య నాయుడుగారి కచేరీ జరగటం; నాటినుంచి వారి సోలో కచేరీలు, సహకార వాద్య కచేరీలు భారతావని అంతటా జరుగటం ఆరంభమయింది. ఆయన కీర్తిప్రతిష్టలు దినదినమూ పెరిగాయి. వేరేవారి వాద్యంలో లేని గొప్పతనం నాయుడు వాద్యంలో ఉందని అందరూ గుర్తించారు. ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ వాయిస్తే పంచదశ గమకాలు వినిపిస్తూ అందులో రవ్వ, పొడి ప్రత్యేకంగా శ్రావ్యంగా ఉంటాయి. ఎవరి వాద్యంలో వినపడని నాదశుద్ధి నాయుడుగారి చేతిలోనే వినపడుతుంది. కర్ణాటక బాణీలో వయోలిన్ వాద్య విద్యకు ఆయన సింహద్వారం వంటివారు. ఏ వ్యక్తికైనా నిమిత్తమాత్రంగా ఒక గురువు ఉండి తీరాలి. అందుచేతనే త్యాగయ్య గారు ‘గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు’ అంటారు. అన్న వెంకటకృష్ణయ్య చూపిన మార్గంలో అవధులు దాటి వాయులీన వాదనంలో ఉన్న మర్మములను వశపరచుకున్నారు. చాలా సందర్భాల్లో ‘నాకు ఇద్దరే గురువులు. - ఒకరు మా అన్నయ్య వెంకటకృష్ణయ్య, ఇంకొకరు నా చెవి. ఇంకెవరి దగ్గరా నేను నేర్చుకోలేదు’ అని నాయుడుగారు అంటుండేవారు. తమ ప్రజ్ఞాపాటవాలతో తన ముందుతరం వాయులీన విద్వాంసులు చూపని అనేక ప్రక్రియలను తన వాద్యంలో చేర్చుకుని వాటికి గౌరవాదరాలు సాధించిన సంగీత భాస్కరుడు నాయుడుగారే. ఫిడేలు వాద్యం చాలా బాగా వాయించే విద్వాంసులు ఎంతోమంది ఉన్నప్పటికీ నాయుడు వాద్యంలో ఉన్న లాఘవం, నాదశుద్ధి, శృతిశుద్ధి, మాధుర్యం, సర్వతోముఖ వాద్య విధానం మొదలైనవి నాయుడుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి సార్వభౌముడిని చేశాయి. ఆయన వాద్యంలో రసావేశమే కానీ వీరావేశం ఉండేది కాదు.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ చెన్నపురిలో నాయుడుగారి వయోలిన్ వాదన విని ‘ఆయన ఏ రాగాన్ని వాయించినా, ఎంత మృదువుగా, ఎంత ఘనంగా కమాను తీడినా నాదమునందు స్నిగ్దత, గాంభీర్యము కొంచమైనను చెదరినదన్నమాట ఒక్కసారైనను మా అనుభూతికి రాలేదు’ అని అన్నారు. భైరవి వంటి ఘనరాగాలు అయన ప్రస్తారం చేసినప్పుడు మంద్రంలో నాదపుష్టి మేఘపు ఉరుమును, అతితారంలో వారు చూపే కొన్ని ద్రుత ప్రక్రియలు మెరుపును స్ఫురింపచేసేవి. కమాను తేల్చి రాగప్రస్తారం చేసేవారాయన. రెండు తీగలమీద ఒకే పర్యాయం వ్రేలువేసి కమానును ద్రుతంగా త్రిప్పుచు కొన్ని నాదాలు సృష్టించడంలో, ఇంకా ఇటువంటి ప్రక్రియలలో ఆయనకు ఆయనే సాటి. ‘శుభపంతువరాళి’ వంటి రాగం వాయిస్తే శ్రోత తప్పనిసరిగా కంటి వెంట బాష్పాలు రాల్చవలసిందే. దృఢసంకల్పంతో, ఏకాగ్ర దృష్టితో బహిరంగమైన చేష్టలేమీ లేక ఫిడేలే తామై, తామై ఫిడేలయ్యి నాదామృత సొగసులు కురిపించిన ‘ఫిడేలు నాయుడుగారు’ జనం హృదయాలలోనే గాక నాలుకపై నాట్యమాడడం సహజం.
కవీశ్వరులు నాయుడుగారిని కీర్తించారు. ‘ఈ వాయులీన సాహిత్య మాధుర్యముల్.. దేవతాస్త్రీ కంఠదీప్తరావమ్ములో, పారిజాతామోదభావమ్ములో, సురనదీ జీవమ్ములో...’ అని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించగా; ‘ఒక గంధర్వుడు బంధముక్తుడయి నీలోన్మీలితాకాశ వీథికి ఏగెన్...’ అని గుంటూరు శేషేంద్రశర్మ ప్రస్తుతించారు. నాయుడుగారికి సన్నిహితులైన శ్రీరంగం నారాయణబాబు ‘నాయుడు గారూ! మీ వ్రేళ్ళు ఘనరాగ పంచకం! మీ శరీరమాకాశం! మీ హస్తం హరివిల్లు! చిత్రచిత్ర వర్ణాలు శ్రీవారి వ్రేళ్ళు! మీ వ్రేళ్లు పలికే వేళల విశ్వరూపమే వినిపిస్తుంది కనిపిస్తుంది’ అని కీర్తించారు. నాయుడుగారి వైదుష్యం తలచుకున్నప్పుడల్లా మనకు అన్నమయ్య పదాలు ‘ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము.. అనంత సూర్యతేజుఁడట కాంతి చెప్పనంత.. దనుజాంతకుండట ప్రతాపమెంత...’ స్ఫురణకు వస్తాయి. ఆంధ్ర, తమిళ, కన్నడ సంగీత ప్రియులను ఒక్కటిగా కలిపిన కర్ణాటక సంగీతములాగ కన్నడనాడులో పుట్టి, తెలుగునాట మనుగడ గడిపి, తమిళనాడులో స్థిరపడి సుమారు అర్ధశతాబ్ది పాటు సంగీతప్రియులకు వయోలిన్ వాదనలో వరప్రసాదిత నిపుణతతో, అందచందాల పరిశీలనతో అపాకృతం, అనిర్వచనీయం అయిన ఆత్మానందం చేకూర్చిన ఫిడేలు నాయుడుగారు మరువలేని మరపురాని మధురమైన మహామనీషి. ఇటువంటి మహోన్నత వ్యక్తికి జాతి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు?
యనమండ్ర వేంకటకృష్ణయ్య
(నవంబర్ 8: ద్వారం వెంకటస్వామి నాయుడు జయంతి)