గౌరిపెద్ది అవధాన పద్య కళాసౌరభం
ABN , Publish Date - Jul 15 , 2024 | 02:10 AM
ఆంధ్ర సారస్వతంలో తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనా సాహిత్యం అనేక అనర్ఘ వాఙ్మయ రత్నాలకు గని. ఆ రత్నాలను త్రవ్వి తీసి, సానపట్టి కాంతి పుంజాలను తెలుగువారి హృదయ మందిరాలలో ఆరని జ్యోతులుగా...
ఆంధ్ర సారస్వతంలో తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనా సాహిత్యం అనేక అనర్ఘ వాఙ్మయ రత్నాలకు గని. ఆ రత్నాలను త్రవ్వి తీసి, సానపట్టి కాంతి పుంజాలను తెలుగువారి హృదయ మందిరాలలో ఆరని జ్యోతులుగా ప్రకాశింప చేసినవారు పండిత ప్రకాండులు వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గార్లు. అంతటి విద్వాంసుల సరసన ఆసీనులై అన్నమయ్య కీర్తనల పరిష్కరణ ఘనతను సాధించినవారు గౌరిపెద్ది రామసుబ్బశర్మగారు (10.09.1922 - 21.01.1991).
మహాభారతాంధ్రీకరణలో సింహభాగం తిక్కనకు దక్కినట్లుగానే అన్నమయ్య కీర్తనల పరిష్కరణ తపస్సులో అధిక భాగం రామసుబ్బ శర్మ గారికి దక్కింది. అన్నమయ్య సంకీర్తనలతో 27 సంపుటాలను పరిష్కరించారు. 19 సంపుటాలకు విస్తృత పరిశోధనాత్మక పీఠికలు రచించారు. ఎన్నో పద్య కావ్యాలు రచించారు. అవధాన విద్యలో అగ్రగణ్యులు. శతాధిక అష్టావధాన, శతావధానాలు చేశారు.
అవధానంలోని అన్ని అంశాలలోనూ శర్మగారి ప్రతిభ నవనవోన్మేషంగా వికసించేది. సంస్కృతాంధ్ర భాషలు రెండింటిలోనూ రసవత్తరంగా సమస్యా పూరణలు సాగేవి. శతావధానులే వీరి అవధానాలలో పృచ్ఛకులుగా పాల్గొనే వారు. ఒకసాటి అష్టావధానంలో గౌరిపెద్ది రామసుబ్బ శర్మగారికి పృచ్ఛకుడు ఇచ్చిన సమస్య- ‘‘వర్జ్యము కాదు మాంస మధుపానము బ్రాహ్మణ జాతికెయ్యెడెన్’’ అనేది. సహజంగా ఇది వ్యవహార విరుద్ధం. ఈ విరుద్ధ భావాన్ని తొలగించి సమస్యను పరిష్కరించాలి. ఈ క్లిష్టతకు తోడు దీనిలో ప్రాసాక్షరం ‘ర్జ్య’ అనే దుష్కర ప్రాస. నిఘంటువులలో ‘ర్జ్య’ సంయుక్తాక్షరం రెండో అక్షరంగా కల పదాలు కనిపించవు. బ్రాహ్మణులకు మాంస మధుపానము వర్జింప (విడిచిపెట్ట) తగినవి కావు అనే సదాచార వ్యతిరిక్త భావాన్ని సానుకూలంగా మలచుకొని అవధానిగారు ఈ విధంగా పూరించారు.
‘‘భర్జ్యములౌచు నంజుడులు పాకమునన్ రుచినించ వచ్చుపో
వర్జ్యము లేక వానినొక వర్గము వారు భుజింపవచ్చుపో
మార్జ్యత గల్గు చోట అనుమానము లేక భుజింప వచ్చు ఆ
వర్జ్యము కాదు మాంస మధుపానము బ్రాహ్మణజాతి కెయ్యెడన్.’’
- ఇలా ‘వర్జ్యము’ అనే పదానికి ‘ఆ’ అనే అక్షరాన్ని ముందు చేర్చి స్వీకరింప దగినవి కావు అనే సముచితార్థాన్ని సాధించారు. సంస్కృత ధాతువులకు ముందు చేరే కొన్ని ప్రత్యయాలు (ప్రాదులు) ధాతువు అర్థాన్ని మార్చి వేస్తాయి. ‘గమనం - ఆగమనం’ అనేది ప్రసిద్ధమైన ఉదాహరణ. పై పూరణ పద్యంలోని ‘భర్జ్యము, మార్జ్యత’ పదాలు పాణిని అష్టాధ్యాయి వ్యాకరణ శాస్త్రం లోని ఉణాది సూత్రాల ఆధారంగా రూపొందింపబడిన పదాలు. ఇది గౌరిపెద్ది వారి పాండిత్య ప్రకర్షకు, వ్యాకరణ శాస్త్ర అధికారానికి ప్రబల నిదర్శనం.
సంస్కృత భాషలోసైతం గౌరిపెద్ది అవధాన చాతుర్యం పలు సందర్భాల్లో ప్రస్ఫుటం అయింది. ఒక పర్యాయం కర్నూలులో చేసిన అవధానంలోని వర్ణనాంశంలో వర్షర్తువు, ఒక కన్య అనే రెండర్థాలతో కూడిన శ్లేషాలంకారంతో సంస్కృత శ్లోకం చెప్పవలసినదిగా పృచ్ఛకుడు అడిగినప్పుడు శర్మగారు-
‘‘తటిల్లతాచారు పయోదరోజ్జ్వలా
నవాంబుధారా రశనోజ్జ్వలత్కటీ
సుబర్హిణోపాత్త మనోహర స్వరా
నికామయా నృత్యతి వర్ణ కన్యా’’ అని వర్ణించారు.
మెరుపు తీగ వంటి శరీర కాంతి, మనోహరమైన వక్షస్థలమూ కలిగి నూత్నమేఘం వలె సౌందర్యవతియైు మొలనూలి కాంతిచే శోభాయమానంగా కదులుతూ నెమలి కంఠ ధ్వని వంటి మనోహర కంఠ ధ్వని కలిగినదై వర్ష సమయంలో ఒక కన్య నృత్యం చేస్తున్నదని స్త్రీ పరమైన అర్థం. మెరుపు తీగలు, అందమైన మేఘాలచే ప్రకాశిస్తూ నూతన జలధారలు కలిగి రశనా కాంతి వలె ప్రకాశమానమై మయూర రావ మనోహరమై స్వేచ్ఛగా వర్ష కన్య నృత్యం చేస్తున్నదని వర్షపరమైన అర్థం. గౌరిపెద్దివారి సంస్కృత పాండితీ గరిమకు ఇది ఒక ఉదాహరణ.
సాధారణంగా పదాలను సందర్భోచితంగా విభజించటం వలన వినూత్న మైన అర్థాలు గోచరించి సన్నివేశానికి సొగసును చేకూర్చుతాయి. అటువంటి స్వారస్యయుతమైన సమస్యా పూరణను గౌరిపెద్ది అవధానాలలో ప్రేక్షకులు ఆస్వాదించి రసానుభూతి నందిన సందర్భాలు కోకొల్లలు. ఒక పృచ్ఛకుడు ఇచ్చిన ‘‘మంచాలన్ బిగియించె గూటములకమ్మా బిందియన్ దేగదే’’ అనే సమస్యను ఈ విధంగా పూరించారు:
‘‘సంచారంబులు మాని ధేనువులు నిశ్శంకంబుగా దొడ్లలో
చంచద్వత్సతరావళీ కలితదుస్సంబాధలై తోచు నా
పంచన్ పెత్తనమేల దూడలవిగో పారెన్ వడిన్ పిండ ని
మ్మంచాలన్ బిగియించె గూటముల కమ్మా బిందియన్ దేగదే’’
- ఇక్కడ అచ్చమైన పల్లె జీవితం నేపథ్యంగా ఈ సమస్య పూరింపబడింది. గోధూళివేళ ధేనువులు సంచారాలు మాని, లేగదూడలు అటూయిటూ గంతులు వేస్తూ ఇరుకు స్థలంలో బాధపడుతున్నాయి. పంచలో పెత్తనం విడిచిపెట్టి పాలు పిండటానికి వెంటనే బిందె తీసుకొనిరా. ఆవులు గూటాలకు బిగించి కట్టివేయ బడినాయి అని ఒక తల్లి తన కుమార్తెతో అంటున్న సన్నివేశాన్ని అవధాని దృశ్యీకరించారు ఈ పద్యంలో. ‘పిండనిమ్ము + అంచు + ఆలన్’ అనే పద విభాగంతో సమస్య తొలగిపోయింది. ‘అనుచు’ అనే క్రియాపదంలో నడుమ ‘ను’ వర్ణం స్థానంలో బిందువు వచ్చి ‘అంచు’ అవవుతుంది. ‘ఆవు + లు’ - ‘లు’ బహువచనం పరమైనప్పుడు ఏకవచన ప్రత్యయం ‘వు’ లోపించి ‘ఆలు’ - అవుతుంది.
అవధానాలలో ఆశువు ఒక అంశం. గౌరిపెద్దివారి ఒక అవధానంలో పార్వతీ పరమేశ్వరుల సమాగమాన్ని సీస పద్యంలో ఆశువుగా వర్ణించమని పృచ్ఛకుడు అడిగినప్పుడు ఆలంకారిక శైలిలో చక్కని సీస పద్యం వారి ముఖతః వెలువడింది. గౌరిపెద్దివారికి శ్రీనాథుని కవిత్వంపైనా, శ్రీనాథుని సీసపద్య రచన పట్లా అపారమైన ప్రీతి. ఆనాటి అవధానంలో శ్రీనాథుని సీస పద్య శైలిని తలపించే రీతిలో సుకుమార భావ సౌందర్యంతో వారు అల్లిన సీసం పండితుల తలలూపింపచేసింది.
‘‘బంధూక కుసుమ ప్రభాహారి కౌశేయ
వీచికా బంధంబు వెలుగులుమీయ
శింజాన మంజీర మంజుల ధ్వనిపాద
విన్యాస తాళంబు విధము దోప
శివుచూడ నడసాగు చిన్నారి చూపులే
దారి చూపెడి ప్రతీహారిగాగ
గిరిరాజసుత వచ్చె తరలిపొండను లీల
మొలనూలిడెల్ బరాబరులు సేయ
మేనికలపంబు వాసన మిడిసి పడగ
సుమకరందము వల చేత సొగసు కూర్ప
మరుని యూపిరి తన్గని మసలు కొనగ
అభవు కొలువంగ వచ్చు మాయమ్మ దలతు’’
కైలాస గిరిపై తపోదీక్షలో ఉన్న పరమేశ్వరుని సేవకై నడచి వస్తున్న పార్వతి రమణీయ రూపాన్ని దర్శింపచేశారు. శైలీ మనోహరత్వం, రచనలో పొంకమూ, పదప్రయోగంలో నాజూకుతనమూ, గౌరి నడకలో విలాసమూ గౌరిపెద్దివారి సీసంలో చిందులు వేశాయి.
అవధానం తెలుగు భాషకు సహజసిద్ధమైన ఆభరణం. తమ అవధానాలద్వారా తెలుగు భాష విశిష్టతను చాటిచెప్పిన ఖ్యాతిని ఆర్జించినవారు గౌరిపెద్ది. సంస్కృ తాంధ్ర భాషాభిజ్ఞతతో, శ్లేషాది అలంకార సౌభాగ్యంతో, పద ప్రయోగ చమ త్కారాలతో, మనోజ్ఞమైన ప్రకృతి దృశ్యాలతో, పౌరాణిక నేపథ్యంతో, జనజీవన సరళితో గౌరిపెద్ది వెలువరించిన అవధాన పద్యాలు తెలుగువారి హృదయాల్లో అమందానందానుభూతిని పండించేవి.
వెలువోలు నాగరాజ్యలక్ష్మి
93941 13848