సాధారణ చరిత్ర, సాహిత్య చరిత్ర కలిసి నడవాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 05:58 AM
మానవ ప్రయాణ కథనమే చరిత్ర అని స్థూలంగా అనుకుంటే, అందులో సాహిత్య ప్రయాణ కథనమే సాహిత్యచరిత్ర. అనేక శాస్త్రాల అన్వయం అవసర మయ్యే ప్రక్రియ సాహిత్యచరిత్ర. తెలుగు సాహిత్యచరిత్రకు...
మానవ ప్రయాణ కథనమే చరిత్ర అని స్థూలంగా అనుకుంటే, అందులో సాహిత్య ప్రయాణ కథనమే సాహిత్యచరిత్ర. అనేక శాస్త్రాల అన్వయం అవసర మయ్యే ప్రక్రియ సాహిత్యచరిత్ర. తెలుగు సాహిత్యచరిత్రకు చాలా చరిత్ర ఉంది. అందులో చాలా పాయలు, కోవలు ఉన్నాయి. ప్రాధాన్యా లున్నాయి. వివక్షలున్నాయి. ఉల్లేఖనలకు, విస్మరణలకు సామాజిక, రాజకీయ కోణాలున్నాయి. ఆధునిక సాహిత్య ఉద్యమాలన్నిటిలోను చరిత్ర ఒక ప్రధాన సంవాదాంశంగా ఉంటూ వచ్చింది. తెలుగు సాహిత్య చరిత్ర ప్రస్థానాన్ని సమీక్షించుకోవడానికి, కొత్త చూపులు జోడించడానికి, ఖాళీలు పూరించడానికి ఉపయుక్తమయ్యే ప్రయత్నంగా, సాహిత్య, సామాజిక చరిత్రకారులతో చేస్తున్న సంభాషణలలో మొదటిది వకుళా భరణం రామకృష్ణతో ఈ ఇంటర్వ్యూ. బ్రిటిషాంధ్ర సాంఘికోద్యమాల చరిత్రపై సాధికారమైన పరిశోధన చేసి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్‌తో గాఢానుబంధం కలిగి, ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర సంపుటాల రూపకల్పనకు సారథ్యం వహించిన రామకృష్ణ, సాహిత్య, సాధారణ చరిత్రల మధ్య సంబంధం గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
చరిత్ర రచన భారతీయులకు అలవాటు లేని విషయమని, వలసవాదులతోనే అది మొదలయిందని అనుకోవడం ఇప్పటికీ సరిఅయినదేనా?
మనం యివ్వాళ చరిత్రగా పరిగణించే రీతిలో, చరిత్ర రచన వలసపాలనకు ముందు లేని మాట, ఒప్పుకోడానికి కష్టమైనా, నిజమే! అంతకు ముందు చారిత్రక గ్రంథాలంటూ ప్రత్యేకించి లేవు. శాసనాలు (అశోకుడు, సముద్రగుప్తుడి కాలంలో వెలువడ్డ శాసనాలు- ప్రధానంగా, చరిత్రకు ఉపకరించే (గుప్తుల చరిత్ర), అలహాబాద్ స్తంభ శాసనం, సాహిత్యపరంగా బాణుడి ‘‘హర్ష చరిత్రము’’ (ఇందులో ప్రశస్తి, పొగడ్తలు, అతిశయోక్తులున్నాయి), మొగలుల కాలంలో వెలువడ్డ విదేశీయాత్రికుల రచనలు, అప్పటి ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులు లభిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన వలసవాదులు జారీచేసిన ఉత్తర్వులు, వారి వాణిజ్య కార్యకలాపాలు రికార్డయ్యాయి. శాస్త్రీయ రచనా పద్ధతికి ఇదే మొదలు.
తెలుగువారి చరిత్ర రచన ప్రారంభం ఎట్లా జరిగింది? మొదటి ఆధునిక తెలుగు చరిత్ర రచనగా దేనిని పరిగణించవచ్చు?
19వ శతాబ్దంలో ఆవిర్భవించిన సాంస్కృతిక పునరుజ్జీవనంలో తెలుగువారి చరిత్ర మొదలైంది. జాతీయస్థాయిలో వచ్చిన మేధో మధనంలో భాగంగా, తెలుగు మేధావులు తెలుగు జాతి చరిత్ర, సంస్కృతులపై దృష్టి సారించారు. జాతీయోద్యమ భావజాలానికి మరింత బలం చేకూరుతుందన్న భావంతో, చరిత్రకారులు, జాతీయ వాద చరిత్ర రచన అనే ఆలోచనా సరళిని ప్రోత్సహించారు. ఈ క్రమంలో విద్వాంసులు, సాహిత్యకారులైన కల్నల్ మెకంజీ, చార్లెస్ బ్రౌన్, జిల్లా మాన్యుయల్స్, గెజిటీర్లను వెలికితీసి చరిత్రనిర్మాణానికి పూనిక చేశారు.
1900 సంవత్సరంలో లండన్ నుంచి ప్రచురితమైన రాబర్ట్ సీవెల్ రాసిన విస్మృత సామ్రాజ్యం (ఊౌటజ్ట్ట్ఛౌుఽ ఉఝఞజీట్ఛ), ఆంధ్రుల చరిత్రరచనకు దోహదం చేసింది. కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిని స్థాపించారు. ఈసంస్థ ద్వారా 1910-36 మధ్య కాలంలో, కొమర్రాజు వారి ప్రోత్సాహంతో, మధ్యాంధ్ర దేశ చరిత్రపై విజయనగర సామ్రాజం వరకు, మూడు సంపుటాలు వెలువరించారు. 1925లో చిలుకూరి, కొమర్రాజు, మల్లంపల్లి, భావరాజు ప్రభృతులు కలిసి ‘ఆంధ్రా హిస్టారికల్ రిసెర్చి సొసైటీ’ ని స్థాపించారు. ఒక త్రైమాసిక పరిశోధక సంచికను ప్రారంభించారు. ఆంధ్రదేశ చరిత్ర రచనలో యిదొక పెద్ద మలుపు.
ఆంధ్రుల చరిత్ర సాధికారికంగా విజ్ఞానచంద్రికాగ్రంథమండలి ఆధ్వర్యంలో, కొమర్రాజు లక్ష్మణరావు రచనతో ఆరంభమైందని భావించడం కద్దు. నిజమే! కానీ, ఆ ప్రచురణకు ముందు, కొన్ని ప్రయత్నాలు జరిగాయి. గంగాదేవి రాసిన ‘మధురా విజయం’ (వీరకంపరాయ చరిత్ర) సంస్కృతంలో రాసిన సాహిత్యగ్రంథం. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర రాయ, బుక్కరాయల వంశానికి చెందిన వీరకంపరాయ జీవితం, అందులో వస్తువు. గంగాదేవి వీరకంపరాయని భార్య. వీరకంపరాయడు మధురను క్రీ.శ. 1371లో జయించాడు. ఆ చారిత్రక సందర్భంలో చోటు చేసుకొన్న ముఖ్యఘటనలను ఈ గ్రంథంలో గంగాదేవి పేర్కొంది.
19వ శతాబ్ది ప్రథమభాగంలో, కావలి సోదరుల (వెంకట బొర్రయ్య, వెంకట రామశాస్త్రి) పూనికతో, విస్తారమైన, ముఖ్యమైన చారిత్రక ఆధారాలను, స్థానికంగా లభిస్తున్న ప్రాచీన, ఇతిహాస, పురాణ వ్యాఖ్యలను, వివరణలను, వాటితో పాటు తాటాకులపై రాసిన సమాచారాన్ని, అనువాదాలు, పటాలు (క్చఞట), చిత్రలేఖనాలు, పురావస్తు ఆధారాలు, శిల్పాలు, రాగి రేకులపై లభించిన శాసనాలను, తాటియాకులపై రాసి భధ్రపరిచిన చారిత్రక, సామాజిక అంశాలను, నాణేలను సేకరించి భద్రపరిచారు. అనేక లిపులను వెలికితీసి, సరిచేసి, తుదిరూపాన్నిచ్చారు.
కావలి సోదరులు రాసిన దక్కన్ కవుల చరిత్ర, దక్షిణదేశ చారిత్రక పరిణామాల ఆనవాళ్లను సేకరించి భద్రపరిచారు. కావలి వెంకట బొర్రయ్యను శాసన సాహిత్య ప్రముఖుడిగా, వాస్తవానికి తెలుగు ప్రజల చరిత్రకు ఆద్యుడిగా పరిగణించాలి.
కావలి వెంకట బొర్రయ్య తర్వాత, బుక్కపట్నం రాఘవాచార్యులు రచించిన ‘ఏజీట్టౌటడ ౌజ అుఽఛీజిట్చట’ గ్రంథంలో కళింగ రాజవంశాల గూర్చిన సమాచారం లభ్యమవుతున్నది. మద్రాసులోని ‘ప్రాచీన చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ప్రతుల గ్రంథాలయం (క్చుఽఠటఛిటజీఞ్టట ఔజీఛట్చటడ)లో దీనికి సంబంధించి రాతప్రతులు లభ్యమవుతున్నాయి.
ఓరియంటలిస్టులు మొదలైనవారు భారతదేశం మీద కల్పించిన దృక్పథ చట్రం ప్రభావంతోనో, దానికి ప్రతిక్రియగానో భారతీయ చరిత్ర రచన మొదలైందనుకుంటే, తెలుగువారి చరిత్ర రచనను ఎజెండా మీదకు తెచ్చినవి ఏ కారణాలు?
మీరన్నట్లు, భారతీయ చరిత్ర విషయంలో జరిగిందదే! తెలుగువారి చరిత్ర భారతదేశ చరిత్రలో అంతర్భాగంగా, అదే నేపథ్యంలో ప్రారంభమైంది. యూరోపియన్ సాహిత్యం ద్వారా పాశ్చాత్య సంస్కృతిని ఆకళింపు చేసుకొన్న తెలుగు రచయితలు, నూతన సాహిత్యసృష్టిలో భాగంగా తెలుగు కవుల చరిత్రను ఆధునిక దృక్పథంతో రాయనారంభించారు. పత్రికారచనలో కూడ కొత్త పుంతలు, దీని ప్రభావంతో ఏర్పడ్డాయి. కందుకూరి సాహిత్య కృషికి, గురజాడ, గిడుగులు మరింతగా దోహదం చేసి, వస్తుపరంగా, భాషా పరంగా తెలుగు సాహిత్యసంస్కృతులను ముందుకు తీసుకెళ్లారు. గురజాడ స్థానిక చరిత్రల రచనకు కూడా శ్రీకారం చుట్టారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపన ద్వారా కొమర్రాజు లక్ష్మణరావు చరిత్ర, సంస్కృతులపై పరిశోధనా దృక్పథాన్ని జోడించి రచనలు చేశారు. 1912లో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఒక పరిశోధనా త్రైమాసిక పత్రిక ప్రారంభమైంది. కాలగర్భంలో కలిసిపోయిన శాసనాలను వెలికితీసి, వాటిలోని సారాంశాన్ని చరిత్ర రచనకు పనిముట్టుగా ఉపయోగించుకున్నారు. అప్పుడు వెలువడ్డ ముఖ్యమైన రచనల్లో, ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకోదగ్గవి- మారేమండ రామారావు రాసిన ‘కాకతీయ చరిత్ర’, నేలటూరు వెంకట రమణయ్య రాసిన ‘విజయనగర మూడవ రాజవంశములోని పతనములు’, సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘికచరిత్ర’ మొదలైనవి.
సాధారణ చరిత్రకు, సాహిత్య చరిత్రకు ఉండే సంబంధం ఏమిటి? సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రరచనకు అనేక దినుసులను సాహిత్యం సమకూరుస్తున్నది, మరి సాహిత్యచరిత్ర కారులు సాధారణ చరిత్ర నుంచి తీసుకోవలసినంత తీసుకుంటున్నారా?
సాధారణ చరిత్ర అన్ని అంశాలను (చారిత్రక, సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక) సవివరంగా వ్యక్తీకరిస్తుంది. ఈ కృషికి దోహదం చేస్తూ, సాహిత్యం, ఆయా కాలాల్లో, అప్పటి సమాజాల్లో నెలకొన్న పరిస్థితుల్ని వ్యక్తపరుస్తుంది. ఈ వ్యక్తీకరణ నేరుగా, సరళరేఖలా వుండదు.
సాహిత్య చరిత్రకారులు, కొద్దిమందిని మినహాయిస్తే, సాధారణ చరిత్రాంశాలను తీసుకోడం లేదు. దీనికి ఈ రెంటిమధ్య వున్న ముఖ్య సంబంధం తెలియకపోవడం ఒక కారణమైతే, సాధారణ చరిత్రపొరలలో దాగివున్న సాహిత్యాంశాలను గ్రహించగలిగిన శిక్షణ, నైపుణ్యం లేకపోవడం మరో కారణం. ఇలా జరగనప్పుడు, సాహిత్య చరిత్ర సమగ్రం కాదు.
సాధారణ చరిత్ర రచన కేవలం పాలకుల వంశావళులు, దండయాత్రలు యుద్ధాల జాబితాలను దాటి జనజీవనంలోని స్థితిగతులను సూక్ష్మస్థాయి దాకా పట్టుకోగలుగుతోంది. సాహిత్య చరిత్ర రచన కవుల, రచయితల, ప్రక్రియల, ఉద్యమాల కాలక్రమ చరిత్రగానే కొనసాగుతోందా? ఇతర సామాజిక, మానవీయ శాస్త్రాలతో సమన్వయం ఎంత వరకు జరుగుతోంది?
అవును. అంతర్ సామాజిక శాస్త్ర అధ్యయనం (inter- social sciences disciplinary studies) ప్రక్రియ ఈనాడు ప్రాముఖ్యం లోకి వచ్చింది. దీని వల్ల చరిత్ర అధ్యయనంలో విషయ పరిజ్ఞానం పెరిగింది. సాహిత్య చరిత్రలో ఈ ప్రక్రియ జరుగుతున్నది కానీ, ఊపందుకోలేదు. సాహిత్య చరిత్ర కారులకు సామాజిక, మానవీయ శాస్త్రాలతో, కొద్దిమందిని మినహాయిస్తే, పరిచయం, పరిజ్ఞానం తక్కువ. ఇది సాహిత్యకారుల లోపం కాదు. సాహిత్య చరిత్రను బోధించే ప్రక్రియలోనే లోపం వుంది. సాహిత్యకారులకు ఇతర సామాజిక శాస్త్రాల విషయాలు బోధించే, పరిశోధించే విధానాల్లో మార్పు రావాలి. ఈ విషయంలో విశ్వవిద్యాలయాల్లో తగు మార్పులు చేయాలి. తెలుగు భాష, బోధన, సాహిత్యం, పరిశోధన రంగాల్లో కొనసాగుతున్న మునుపటి, కాలం చెల్లిన సంప్రదాయాలు, పద్థతులు మారాలి.
ఆంధ్రలో సామాజికోద్యమాల చరిత్ర రచనలో మీది ప్రత్యేకమైన కృషి. అందులో సాహిత్యంతో సహా రకరకాల వాఙ్మయాన్ని ఆధారాలుగా తీసుకున్నారు. తెలుగు సాహిత్యచరిత్ర కారులకు తప్పనిసరిగా అవసరమయ్యే వాచక, వాచకేతర వనరుల గురించి మీ సూచనలు, సలహాలు..?
‘వాచక’, ‘వాచకేతర’ వనరుల గూర్చి ఒక పట్టిక ఇక్కడ ఇవ్వలేను. కొన్ని సూచనలు, సలహాలు: 1) చారిత్రక దృక్పథంతో, కొద్దోగొప్పో, చారిత్రక అంశాలతో కూడిన సాహిత్యం. 2) ఏ అంశంపై పరిశోధన చేస్తున్నారో, దానిపై లభ్యమయ్యే రచనలు సేకరించడం. 3) యాత్రా చరిత్రలు; స్వీయ చరిత్రలు; రచయితల, సామాజిక, రాజకీయ వేత్తల ఆత్మకథలు, అనుభవాలు, జ్ఞాపకాలు. 4) వాచకేతర వనరుల్లో... ఇంటర్వ్యూలు 5) ఆయా కాలాలపై, అప్పటి కాలంలో ప్రచురించిన సమకాలీన అనుభవాలతో కూడిన రచనలు.. ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. సాహిత్యచరిత్ర కారులు విస్తారంగా, తమ పరిశోధనకు సంబంధించి లభ్యమయ్యే సామాజిక శాస్త్రాల్లోని విషయాలను సంప్రదించడం చేయాలి. ఇక, వనరుల గూర్చి ఇతమిత్థంగా, ఫలానా అని చెప్పలేము. అవి పరిశోధించే విషయాలను బట్టి, ఒక ఆధారాన్ని సంప్రదిస్తే, అది మరొక వనరుకు దోహదం చేస్తుంది. ఇది, ఈ ప్రక్రియ, పరిశోధన మొదలై ఆఖరు దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగాలి.
చరిత్రకారుడిగా మీరు అభిమానించే తెలుగుసాహిత్యచరిత్ర కారులెవరు?
అందరి పేర్లూ ఇక్కడ ఉటంకించలేను. ముఖ్యంగా ఇంకా రాస్తున్నవారిని ఎంచి చెప్పలేను. పూర్వులలో గురజాడ, కె.వి. రమణారెడ్డి తరువాత కె.వి. రమణారెడ్డి, జి.యన్. రెడ్డి, ఆరుద్ర, వెల్చేరు నారాయణరావు, కె.కె. రంగనాథాచార్యులు... వీరి చరిత్ర రచనను నేను అభిమానించాను.
(ఇంటర్వ్యూ : కె. శ్రీనివాస్)
వకుళాభరణం రామకృష్ణ