Share News

దాపు

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:26 AM

ఎంతకనీ అల్లుకపోను ఎండి పోతవుంటే కన్నీళ్లు వొంచుకోని ఇగురేసుకుంటున్న కార్తి ఎకసెక్కాలాడుతుంటే సాలు మీద ఇత్తనం ఇగిలిస్తుంది...

దాపు

ఎంతకనీ అల్లుకపోను

ఎండి పోతవుంటే

కన్నీళ్లు వొంచుకోని

ఇగురేసుకుంటున్న

కార్తి ఎకసెక్కాలాడుతుంటే

సాలు మీద ఇత్తనం ఇగిలిస్తుంది

ఉలుకు లేదు పలుకు లేదు

ఊ అంటే ఉప్పనే

పేరుకే ఊయ్యాల జానయ్య

ఊగింది లేదు సచ్చింది లేదు అన్నట్టూ

ఒక దాని ఎనుక ఒకటి

ఎటు చూసినా కంప ఎట్టాలే

చెలగేసి చెలగేసి

దాపు కోసం...

దారులు వెతుకుతున్న

నిలబడ్డ కాడల్లా

నిన్నటి పొద్దే నిలదీస్తుంది

నీడలు సుట్టు ముట్టీ

కొలుపు చెబుతున్నయి

కనిపించని తెడల నేల

ఈద లేక కొట్టుక పోతున్న

మాయ చిక్కంలో పెద్ద చాపను


చెర్ల చాపలు కూడ

రంగు రంగుల జెండాలొలే తిరుగుతున్నయి

ఒడ్డు మీద కొంగలతొ పాటు

చాపల సేటు ఉండు

హౌరా లారీలెక్కుతుంటే చాపలు

నేను గులకరాల్లేంటా పడి పోతున్న

ఏముంది నాకు

ఏలు మీద ఎన్నికల మరక తప్పా

కళ్లతోనే కాంటా కొడుతున్రు

అమ్మ అడుగుల్ని

పొత పోసుకున్నా బాగుండేది

అడుగెనుక అడుగు పడేది

కట్టకు ఇటు కట్టకు అటు

వొడిపిల్లు లేదు వొలకసత్త లేదు

ఏసువాసు పట్వకు

సూరు కింద సుట్టకుదురై సుట్టుకున్న

కన్నీల్ల ఎసరు

కల్లం మొకం తిప్పుకుంది

కాలం కడకు జరిగింది

ఎవడు దిగి ఎవడు ఎక్కిన

దిగులు మేఘమే కమ్ముకునేది

కండ్లల్లా కనగులు తిరిగిన

కట్ట మైసమ్మ కట్ట దిగకుండ

కాకిచిత్తర కాల్చి పెట్టిన

ఎద్దుల్లేవు సుద్దుల్లేవు

ఎల్లమ్మ ఎల్లి పోతుంటే కాళ్ల ఏళ్ల పడ్డా

ఉప్పలమ్మా పోకుండా

ఊరి పొలిమేర దగ్గర నిలబడ్డా

బతుకు పందెం పడని పచ్చీసు

పడి మీద పక్షి కన్నీళ్లు కార్చిన

ఇమానం తప్పిన కొడుకు

విమానం దిగలే

చెట్టూ పుట్టే ఆకరి తానమాడే ఊరి పాలోల్లు

లో లోపలి దాపులోకి నిశబ్దంగ జారుకున్న

మునాసు వెంకట్

99481 58163

Updated Date - Nov 04 , 2024 | 12:27 AM