Share News

‘బాబాసాహెబ్‌’ను పార్టీలు గౌరవించడం ఎలా?

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:45 AM

బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను అవమానించింది మీరంటే మీరంటూ వైరిపక్షాలు జాతీయ స్థాయిలో తలపడుతున్నాయి. ఎన్నడూ లేనిది పార్లమెంటు ప్రాంగణంలో సభ్యుల మధ్య తోపులాట...

‘బాబాసాహెబ్‌’ను పార్టీలు గౌరవించడం ఎలా?

బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను అవమానించింది మీరంటే మీరంటూ వైరిపక్షాలు జాతీయ స్థాయిలో తలపడుతున్నాయి. ఎన్నడూ లేనిది పార్లమెంటు ప్రాంగణంలో సభ్యుల మధ్య తోపులాట, ఇద్దరు గాయపడడం, పోలీసు కేసులు నమోదయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలూ ఆ మహనీయుడిని తమవాణ్ణి చేసుకుని, ఎదుటి వారి పట్ల అసహనం చూపించడం వారి అవ్యాజప్రేమకు చిహ్నం. అయితే ఆయన్ని ఇలా గౌరవించవచ్చని సూచన. పాలక పక్షమైతే అమలు చెయ్యడం ద్వారా, ప్రతిపక్షమైతే అమలు చేయమని పోరాడడం ద్వారా... 1. అన్ని ఊళ్లలో గ్రంథాలయాలు నెలకొల్పాలి. అధ్యయనం ఎంత అవసరమో ఆయన చెప్పినందుకు. 2. ఉచిత, నాణ్యమైన విద్య అందరికీ అందించాలి. విద్య ఒక్కటే అసలైన ఆయుధమని అన్నందుకు. 3. బ్యాక్‌లాగ్ పోస్టులు అన్నీ భర్తీ చెయ్యాలి. కోట్లాది మంది అర్హులైన నిరుద్యోగులు ఉన్నప్పుడు, లక్షలాది ఉద్యోగాలు భర్తీ కాకపోవడం నేరం. 4. ఆహార భద్రత అందరికీ అందించాలి. దేశంలో సరిపడా ఆహారం ఉన్నా, కాలే కడుపులు గణనీయంగా ఉండడం సిగ్గుచేటు. పిల్లల ఎదుగుదల లోపాలు దేశంలో ఎక్కువే. 5. సంపద పంపిణీలో న్యాయం ఉండాలి. ఆదాయం, సంపద అతి తక్కువ మంది చేతిలో పడి, అత్యధిక శాతం జనాలు పేదరికంలో మగ్గుతున్నారు.


ప్రజానీకం ఆత్మగౌరవంతో ఆర్థికంగా బలపడేలా విధానాలు ఉండాలి. 6. చట్టం ముందు అందరూ సమానులే అన్నది పాటించాలి. తప్పు చేసింది తమవాడైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాల హక్కులు కాపాడే విషయంలో. 7. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతోనే సామాజిక న్యాయం. కుల రహిత సమాజం కల సాకారమయ్యే రోజు కనుచూపు మేరలో లేదు. కులాలు, మతాల మధ్య దూరాలు పెరగకుండా, సాన్నిహిత్యం పెరిగేలా చూడాలి. 8. న్యాయ వ్యవస్థలో అందరికీ ప్రాతినిధ్యం ఉండేలా న్యాయ సంస్కరణలు, రాజకీయ స్వాతంత్ర్యం పట్టాలు తప్పకుండా చూసే ఎన్నికల సంస్కరణలు, అత్యధిక శాతం ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేలాగా ఆర్థిక విధానాల కల్పన చేయాలి.

ప్రస్తుతానికి భిన్నాభిప్రాయాలు ఉండక్కర్లేని, ఈ ఎనిమిది విషయాలపై రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి చూపిస్తే అది అంబేడ్కర్ మార్గం అవుతుంది. ఆయనపై గౌరవం చూపడమే కాకుండా సమాజానికి మేలు చేస్తుంది. ‘అధ్యయనం, ఆత్మగౌరవం, శీలం... ఈ మూడు నాకు ముఖ్యం’ అన్నారాయన. శీలం ఉంటేనే మిగతా రెండూ సాధ్యమయ్యేవి... వ్యక్తికైనా, వ్యవస్థకైనా.

– డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ

Updated Date - Dec 25 , 2024 | 05:45 AM