Share News

ఈ కూలి రేట్లతో ఎలా బతికేది?

ABN , Publish Date - Dec 18 , 2024 | 02:02 AM

జీవన స్థితిగతుల్లో మార్పు లేక కూలీలు బతుకుబండి అతికష్టం మీద లాగుతున్నారు. కూలీ రేట్లు పెరగడం లేదు. కాని ప్రజా ప్రతినిధుల వేతనాలు మాత్రం పెచ్చుమీరి పెరుగుతున్నాయి....

ఈ కూలి రేట్లతో ఎలా బతికేది?

జీవన స్థితిగతుల్లో మార్పు లేక కూలీలు బతుకుబండి అతికష్టం మీద లాగుతున్నారు. కూలీ రేట్లు పెరగడం లేదు. కాని ప్రజా ప్రతినిధుల వేతనాలు మాత్రం పెచ్చుమీరి పెరుగుతున్నాయి. చెమట చుక్కల్ని నమ్ముకొన్న కూలీలకు రోజుకు రూ.300 నుంచి 400 వరకు గిట్టుబాటు అవుతున్నది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా కూలీ రేట్లు ఇస్తున్నారు. కనీస రోజుకూలీ కేరళ రాష్ట్రంలో అధికంగా రూ.670 ఉన్నది. కాగా మహారాష్ట్రలో అతి తక్కువగా రూ.240 ఉన్నది. ప్రజాప్రతినిధులు అత్యధికంగా వేతనాలు పొందుతున్న రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ఇక్కడ ప్రజాప్రతినిధులు నెలవారీగా రూ.2.50 లక్షల దాకా వేతనం పొందుతున్నారు. ప్రజాప్రతినిధుల వేతనాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. కాని కూలీ రేట్లు పెరగక కూలీలు శ్రమ దోపిడికి గురవుతున్నారు. కూలీలు మధ్యప్రదేశ్‌లో రూ.290, మహారాష్ట్రలో రూ.240, జమ్మూ కశ్మీర్‌లో రూ.453, బిహార్‌లో రూ.267, హిమాచల్‌ ప్రదేశ్‌లో రూ.343, ఉత్తర ప్రదేశ్‌లో రూ.271, కర్ణాటకలో రూ.264, తెలంగాణలో రూ.415 కూలిగా పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.300 నుంచి రూ.400 వరకు కూలీ రేట్లు ఉన్నాయి.


ఆయా రాష్ట్రాలతో పాటు తెలంగాణ లోనూ ఆంధ్రప్రదేశ్‌ లోనూ సగటు కూలీ రేట్లలో తగ్గుదల ఉంటున్నది. దిన కూలీలు, అడ్డా కూలీలు, వ్యవసాయ కూలీలు ఇలా అసంఘటిత రంగంలో పనిచేసే కూలీలకు దిన కూలీ గిట్టుబాటు కాక ఆర్థికంగా చితికి పోతున్నారు. తమకు రోజువారీ కూలి చట్టబద్ధంగా అందేలా పాలకులు చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. రోజువారీ కూలీ సక్రమంగా గిట్టుబాటు అయ్యేలా సమగ్ర కూలీ చట్టం తీసుకువచ్చి కూలీల జీవితంలో పాలకులు వెలుగు నింపాలి.

గుర్రం రాంమోహన్‌ రెడ్డి

Updated Date - Dec 18 , 2024 | 02:02 AM