ప్రపంచమంతా మంటగలుస్తున్న మానవ హక్కులు!
ABN , First Publish Date - 2024-02-06T01:58:51+05:30 IST
ప్రపంచ మానవ హక్కుల నివేదిక 2024 జనవరి 11న న్యూయార్క్‌లో విడుదలైంది. హ్యూమన్ రైట్స్ వాచ్ అనే అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ ప్రతి సంవత్సరం ఈ నివేదికను రూపొందిస్తుంది. ప్రస్తుత నివేదిక...
ప్రపంచ మానవ హక్కుల నివేదిక 2024 జనవరి 11న న్యూయార్క్‌లో విడుదలైంది. హ్యూమన్ రైట్స్ వాచ్ అనే అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ ప్రతి సంవత్సరం ఈ నివేదికను రూపొందిస్తుంది. ప్రస్తుత నివేదిక ముప్పై నాలుగవది. మొత్తం 740 పేజీల ఈ నివేదిక ఆఫ్ఘానిస్తాన్ నుంచి జింబాబ్వే వరకు 105 దేశాల్లో 2023 మానవ హక్కుల పరిస్థితిని సమీక్షించింది. యుద్ధకాల దురాగతాలు పెరుగుతున్నాయని, మానవ హక్కుల కార్యకర్తలపై అణచివేతలు, హక్కుల చట్టాలపై ప్రభుత్వాల దాడి పెరుగుతున్నదని నివేదిక వివరించింది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సూత్రాలను వర్తింపజేయడంలో ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాల వల్ల లెక్కలేనన్ని జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని నివేదిక పేర్కొంది.
ఉక్రెయిన్, మయన్మార్ మాదిరిగానే ఇజ్రాయెల్ –హమాస్‌ల మధ్య తిరిగి నెలకొన్న పోరాటం అక్కడి సామాన్యులకు ప్రాణసంకటంగా మారింది. హమాస్ యుద్ధ నేరాలను ఖండించిన అనేక ప్రభుత్వాలు, గాజాపై ఇజ్రాయెల్ దాడులకు అంతగా స్పందించడం లేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో మానవ హక్కుల పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. తాలిబాన్ విస్తృతంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది– ప్రత్యేకించి మహిళలు, బాలికలకు వ్యతిరేకంగా. బాలికలకు మాధ్యమిక, ఉన్నత విద్యపై నిషేధం; మహిళలకు పలు రంగాలలో ఉద్యోగాలపై నిషేధం; మహిళల సంచారం, వాక్ స్వాతంత్ర్యంపై పలు కట్టుబాట్లు; మహిళలు, బాలికలపై పలు ఆకృత్యాల తీరును నివేదిక నిర్ధారించింది. 2024 జాతీయ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్ అధికారులు అణచివేతను కఠినతరం చేశారు. భద్రతా దళాలు ప్రతిపక్ష సభ్యుల మూకుమ్మడి అరెస్టులు చేశాయి. లీకైన పోలీసు అధికారుల సమావేశాల మినిట్లను బట్టి విపక్ష సభ్యులను పోటీకి అనర్హులు చేసే నెపంతో నేరారోపణలు జరిగినాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఐదు లక్షల సభ్యులు రాజకీయ ప్రేరేపిత నేరాలను ఎదుర్కొంటున్నారు. బంగ్లాదేశ్‌లోని మహిళలకు గృహ హింస నుండి న్యాయం పొందేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. 51 శాతంతో ప్రపంచంలో అత్యధిక బాల్య వివాహాల రేటు బంగ్లాదేశ్ కలిగి ఉంది. బాల్య వివాహాలను చట్టబద్ధం చేసిన ఒకే ఒక్క దేశంగా బంగ్లాదేశ్ ఇటీవల అవతరించడం సిగ్గు చేటు.
జిన్‌పింగ్ పాలనలో చైనాలో అణచివేత తీవ్రమైంది. చైనా ప్రభుత్వం జిన్‌జియాంగ్‌లోని ఉయ్‌ఘర్‌లు, ఇతర టర్కిక్ ముస్లింలకు వ్యతిరేకంగా అణచివేత కొనసాగిస్తోంది. టిబెట్, జింజియాంగ్‌లలో విదేశాలలో కుటుంబ సభ్యులు, స్నేహితులను సంప్రదించేవారిని, వారి సంస్కృతి, భాష, మతం కోసం వాదించే వారిని ‘వేర్పాటువాదులు’గా పరిగణించి వారిపై కఠినమైన జైలు శిక్షలు విధించబడుతున్నాయి. చైనా అంతటా, ప్రభుత్వం సామాజిక నియంత్రణలను మరింత కఠినతరం చేస్తోంది. హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం ద్వారా నగరంపై పూర్తి నియంత్రణను చేపట్టింది. అక్కడి నివాసితుల కనీస హక్కులు లేకుండా చేస్తున్నది.
ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంలో మతపరమైన, ఇతర మైనారిటీల పట్ల వివక్ష, కళంకం కలిగించే విధానాలు కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో మతపరమైన హింసాత్మక సంఘటనలు జరిగినాయి. మణిపూర్ రాష్ట్రంలో వందల సంఖ్యలో జాతి ఘర్షణల్లో ప్రజలు చనిపోయారు. జమ్మూ, కశ్మీర్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశం, ఇతర హక్కులపై ఆంక్షలు కొనసాగాయి. ఏడాది పొడవునా భద్రతా బలగాలు జరిపిన చట్టవిరుద్ధ హత్యల నివేదికలు వచ్చాయని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక తెలిపింది. అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై అథ్లెట్లు వారాల తరబడి నిరసన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు విచారణ ఆలస్యం చేశారు. పౌర సమాజ కార్యకర్తలు, స్వతంత్ర పాత్రికేయులు, రాజకీయ ప్రత్యర్థులపై బెదిరింపులు, ఆరోపణల ద్వారా వారిని నిశ్శబ్దపరచడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని నివేదిక పేర్కొంది. మణిపూర్‌లో జాతుల హింసలో రాష్ట్ర నాయకత్వం పాత్ర పోషించిందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక నివేదికను ప్రచురించిన తర్వాత పోలీసులు దానిపై క్రిమినల్ కేసులు పెట్టారని అది గుర్తుచేసింది.
పాకిస్థాన్‌లో మహిళలు, బాలికలపై హింస–అత్యాచారం, హత్య, యాసిడ్ దాడులు, గృహ హింస, విద్య తిరస్కరణ, పని వద్ద లైంగిక వేధింపులు, బలవంతపు వివాహాలు ఆ దేశమంతటా ఉన్న తీవ్రమైన సమస్య అని నివేదిక పేర్కొంది. పాకిస్థాన్‌లో ప్రతి ఏటా 1000 మహిళలు ‘గౌరవ హత్యలకు’ బలైపోతున్నారు. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (UNICEF) అంచనా ప్రకారం 18ఏళ్ల లోపు గల 18.9 మిలియన్ల బాలికలు, 15ఏళ్ల లోపు గల 4.6 మిలియన్ల బాలికల వివాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా మతపరమైన మైనారిటీలు ఎక్కువగా బలవంతపు వివాహాలకు గురతున్నారు.
యూరోపియన్ యూనియన్ తన మానవ హక్కుల బాధ్యతలను తప్పించుకుంది, శరణార్థులను ఇతర దేశాలకు వెనక్కి నెట్టింది. శరణార్థులను దూరంగా ఉంచడానికి లిబియా, టర్కీ వంటి హక్కుల దుర్వినియోగ ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాతో సహా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాల సైనిక పొత్తులు, వాణిజ్య హామీల ఒప్పందాలు మానవ హక్కులకు ఘాతుకంగా మారుతున్నాయి. అమెరికాలో ఆర్థిక, జాతిపరమైన అసమానతలు కొనసాగుతున్నాయి. పేదరికం పెరుగుదలకు దారితీస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక ఖైదీల రేటును అమెరికా కలిగివుంది. ముఖ్యంగా నల్ల జాతీయులు అసమానంగా ఖైదు చేయబడుతున్నారు. 2023లో పోలీసులు చంపిన 800 మందిలో శ్వేత జాతీయుల కంటే మూడు రెట్లు ఎక్కువ నల్ల జాతీయులు ఉన్నారు. అబార్షన్ హక్కులు, LGBTQ+ హక్కులను పరిమితం చేస్తూ రాష్ట్రాలు చట్టాలను ఆమోదించడంతో వారి హక్కులు మరింత క్షీణిస్తున్నాయని నివేదిక పేర్కొన్నది.
నివేదికలో కొన్ని ఆశల సంకేతాలు కూడా ఉన్నాయి. గత నవంబర్‌లో, హింస, ఇతర దుర్వినియోగాలను నిరోధించాలని అంతర్జాతీయ న్యాయస్థానం సిరియా ప్రభుత్వాన్ని ఆదేశించింది. లెస్బియన్, గే, ద్విలింగ, లింగమార్పిడి వ్యక్తులను ‘అన్యాయమైన వివక్ష’ నుంచి రక్షించడానికి జపాన్ పార్లమెంట్ తన మొదటి చట్టాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గత మార్చిలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు, ఆ దేశ బాలల హక్కుల కమీషనర్‌కు ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగాల నుంచి రష్యాకు పిల్లలను బలవంతంగా తరలిస్తున్న యుద్ధ నేరాలపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఈ కొన్ని సంఘటనలు వదిలి, మొత్తంగా చూస్తే, అత్యధిక ప్రభుత్వాలు అంతర్జాతీయ రంగంలో మానవ హక్కుల సమస్యలను విస్మరించడాన్ని సులభతరం చేశాయి. ఎందుకంటే స్వదేశంలో వారి మానవ హక్కుల ఉల్లంఘనలు అంతర్జాతీయ సమాజం సవాలు చేయడం లేదు.
చెన్న బసవయ్య మఠపతి
విశ్రాంత ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం