మానవతా ధార్మికుడు రతన్ టాటా
ABN , Publish Date - Oct 18 , 2024 | 02:50 AM
రతన్ టాటా మరణం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఎంతోమంది తమ కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినట్టు బాధపడి, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ దుఃఖాన్ని వెలిబుచ్చారు. సాధారణ వ్యక్తులు సైతం...
రతన్ టాటా మరణం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఎంతోమంది తమ కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినట్టు బాధపడి, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ దుఃఖాన్ని వెలిబుచ్చారు. సాధారణ వ్యక్తులు సైతం టాటా సన్స్ గ్రూప్ గురించి తెలుసుకుని మరీ బాధపడటం టాటాలపై ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. వ్యాపారాలు అందరూ చేస్తారు కానీ విలువలతో కూడిన వ్యాపారాలు చేస్తూ, సంపదను రోజురోజుకు పెంచుకోవడం ఒక ఎత్తు అయితే, వచ్చిన లాభాల్లో మళ్ళీ సమాజానికే సింహభాగం కేటాయించడం, నైతికత, విలువలతో వ్యాపారం చేయటం టాటా గ్రూప్ ప్రత్యేకత. ఇదే టాటాను ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇదొక్కటే కాదు సామాజిక అవసరాలు తీరుస్తూనే కాలానుగుణంగా వస్తున్న మార్పులతో పోటీపడి సామాన్య భారతీయుని కలలను సాకారం చేసేందుకు రతన్ టాటా తాపత్రయపడ్డారు. గుజరాత్‌లోని నవ్సారలో ఒక చిన్న బట్టల మిల్లుతో ప్రారంభమైన టాటాల ప్రస్థానం, నేడు ప్రపంచంలో వందకు పైగా దేశాల్లో అన్ని రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రపంచమే అబ్బురపడేలా సాగుతోంది.
గుజరాత్‌లో నూలు పరిశ్రమతో జంషెడ్‌జి టాటా గ్రూప్‌ను 1870లలో స్థాపించారు. ఆ తర్వాత ఈ గ్రూప్ ప్రస్థానం మనకు తెలియంది కాదు. ఒక్క టాటానే కాదు పార్శీలు అందరూ కష్టపడి పని చేయటంలోనూ, కాలానుగుణంగా మారడంలోనూ, వ్యాపార మెలకువల్లోనూ ప్రపంచంలోనే అగ్రగణ్యులు. ప్రస్తుతం మన దేశంలోని 145 కోట్ల మంది జనాభాలో పార్శీల జనాభా కేవలం 60 వేలు మాత్రమే. కానీ అనాదిగా దేశం కోసం విప్లవాత్మక మార్పులు తేవటంలో వారి పాత్ర అమోఘం. దేశంలో మొదటి బట్టల మిల్లు, మొదటి న్యూస్ పేపర్, మొదటి భారతీయ బ్యాంక్ స్థాపన పార్శీలే చేశారు. ముంబైలో సింహభాగం వ్యాపారాలే కాకుండా, ముంబైని ఆర్థిక రాజధానిగా మలిచింది కూడా పార్శీలే. కేవలం ఆర్థికంగానే కాక సాంఘిక రాజకీయ జీవనంలో కూడా వారి భాగస్వామ్యం వెలకట్టలేనిది. స్వాతంత్రోద్యమ కాలంలో కూడా ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ లాంటి వారు, ప్రఖ్యాత సైంటిస్టు హోమి జహంగీర్ బాబా, పల్లోంజి మిస్త్రీ, గోద్రెజ్, పునావాల, వాడియాల కుటుంబాలు పార్శీలవే. ఇక జంషెడ్‌జి టాటా అయితే స్వామి వివేకానందతో చికాగో నుంచి చేసిన ప్రయాణమే తన వ్యాపార సామ్రాజ్యాన్ని మలుపు తిప్పిన ఇనుము ఉక్కు పరిశ్రమల స్థాపనకు ప్రేరేపించిందని చెప్పారు.
స్వాతంత్ర్యం తరువాత జరిగిన అభివృద్ధిలో రతన్ టాటా నవభారత నిర్మాణానికి పునాదులు వేశారనడంలో సందేహం లేదు. ఆధునిక శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా రోజురోజుకీ వస్తున్న మార్పులను టాటా గ్రూప్‌కు అన్వయిస్తూ ప్రపంచంలోని మేటి సంస్థలకు దీటుగా నిలుపుతూనే సగటు భారతీయుని ఆలోచనలను, ఆకాంక్షలను తీర్చేందుకు నిత్య శ్రామికుడిగా మారాడు. ఎంతలా అంటే తాను వివాహం చేసుకుంటే మళ్ళీ వ్యాపారానికి ఇచ్చే సమయం ఉండదేమో అన్నంతగా. రతన్ టాటా చూపిన దాతృత్వ మార్గం మాత్రం కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యంలో ప్రకంపనలు సృష్టించింది.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలలో భాగంగా పేదల కోసం ఎన్నో వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారాయన. కంపెనీ లాభాల్లో రెండు శాతమో, ఐదు శాతమో లాభాలను టర్నోవర్‌ను బట్టి వినియోగించాలని సీఎస్ఆర్ చట్టం రూపొందించినా, రతన్ టాటా మాత్రం ఏకంగా 50 నుంచి 60శాతం లాభాలను సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించటం నిజంగా ఆదర్శనీయం. విపత్తుల వేళ ఆయన చూపిన మానవతావాదం కార్పొరేట్‌లను విస్మయానికి గురిచేసింది. కరోనాకాలంలో పీఎమ్ కేర్స్‌కు ఏకంగా 1200 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం, ఆయన చేతులకు ఎముకలు లేవని మరోమారు నిరూపిం చింది. దేశంలోని ప్రతి పౌరునికి టాటా గ్రూప్‌పై అభిమానం ప్రేమ కలిగేందుకు కారణం ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు. కార్పొరేట్ ఉద్యోగులకు, కంపెనీలకు సామాజిక స్పృహ ఉండాలని టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ స్థాపించడం చూస్తే సేవా గుణాన్ని, దాతృత్వాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ఆయన పడ్డ తాపత్రయం అర్థమవుతుంది.
గుండు పిన్ను నుంచి విమానాల వరకు ఆయన స్పృశించని రంగం అంటూ ఏదీ లేదు. వారసత్వ కట్టడాలను పరిరక్షించడం కోసం తాజ్ హోటల్స్ పేరుతో లాభాపేక్ష లేకుండా అందరూ సందర్శించేలా చేశారు. కార్పొరేట్ వ్యాపారాలకు మానవతా విలువలు జోడించి, విజయం సాధించిన ఆధునిక వ్యాపారవేత్త ఆయన. భవిష్యత్తు భారతాన్ని అంచనా వేసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. వేగంగా నడవాలంటే ఒంటరిగా, దూరం నడవాలంటే తోడుగా నడవాలన్న ఆయన మాటలు దూరదృష్టితో టాటాల సామ్రాజ్యం, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెప్పింది కావచ్చు.
సామాన్య భారతీయుని కలల కారు ప్రయాణాన్ని లక్ష రూపాయలతో నానో కారు ద్వారా తీర్చి ఆయన సంచలనమే సృష్టించారు. నానో ద్వారా నష్టాలు వచ్చినా కష్టంగా భరించారు. ఇతర వ్యాపారాల్లో లాభాల ద్వారా ఈ నష్టాన్ని పూడ్చారే తప్ప సామాన్యుని కలలను మాత్రం చెరిపి వేయలేదు. ఆయన ఆచరించి చూపిన వ్యాపార మార్గం వ్యాపార నిర్వహణ శాస్త్ర విద్యార్థులకు, నిర్వాహకులకు పాఠాలుగా మిగిలిపోతాయి. దురదృష్టవశాత్తూ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీలను విమర్శించే క్రమంలో టాటాలకు, బిర్లాలకు దోచిపెడుతున్నారంటూ ఊతపదంగా వాడేవారు. టాటాలు ఎప్పుడు కూడా రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉన్నారు. టాటా అంటేనే ట్రస్ట్, వ్యాపారం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు అభిమానం, ఆత్మీయత అని నిరూపించారు రతన్ టాటా. భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మనసున్న వ్యాపారవేత్త. దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు ఆపన్న హస్తాన్ని అందించే నిర్మల దేశభక్తుడు. ఆదాయం కంటే ఆత్మసంతృప్తి ముఖ్యమని కోట్లాదిమంది భారతీయుల హృదయాలను దోచుకుని చాలా లాభాన్ని సంపాదించి మూటగట్టుకెళ్లిన నిజమైన భారతరత్నం.
డా. దొంతగాని వీరబాబు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ