దళితవాద సాహిత్యమన్నా, కవిత్వమన్నా ఇష్టం
ABN , Publish Date - Sep 02 , 2024 | 02:55 AM
వసుదేంద్ర తేజోతుంగభద్ర (తెలుగు అనువాదం). దాని తరువాత కూడా చదివిన పుస్తకాలు ఉన్నాయిగానీ, ఈ మధ్య కాలంలో అంతగా ఆకట్టుకున్న పుస్తకం మరొకటి ఇంకా తగల్లేదు...
చదువు ముచ్చట
ఆఖరుగా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు?
వసుదేంద్ర తేజోతుంగభద్ర (తెలుగు అనువాదం). దాని తరువాత కూడా చదివిన పుస్తకాలు ఉన్నాయిగానీ, ఈ మధ్య కాలంలో అంతగా ఆకట్టుకున్న పుస్తకం మరొకటి ఇంకా తగల్లేదు.
బాల్యంలో/ యవ్వనంలో మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?
బాల్యంలో అంటే చెప్పలేను గానీ, నా పంతొమ్మిదేళ్ల వయసులో ఎక్కువసార్లు, ఎక్కువరోజులు చదివిన పుస్తకం చెలం ‘శశిరేఖ’. చెలం ఆడవాళ్ల వైపు నుంచి రాశాడూ అంటారు గానీ నాకెందుకో పురుషుల గురించి, పురుషుల స్వభావాలను ఎత్తిచూపుతూ రాశాడనిపిస్తుంది.
ఒకప్పటికీ ఇప్పటికీ మీరు చదివే తీరు ఎలా మారింది?
నాన్న పరిచయం చేసిన రామాయణ, మహా భారతాలతో మొదలై స్కూల్ డేస్‌లో మధుబాబు, తరవాతి కాలంలో యండమూరి, యద్దనపూడి సులోచనారాణి, సూర్యదేవర రామ్మోహనరావు లాంటి రచయితలని చదివేవాడ్ని. ఏకైక కారణం– అవి మాత్రమే అందుబాటులో ఉండటం. ఆ తరువాత ఎంపిక మారింది. ఇప్పుడు ఫిక్షన్‌కి పూర్తిగా దూరం కాలేదు గానీ చరిత్ర, మైథాలజీల ఆధారంగా వచ్చే రచనలన్నా, భారతదేశ సామాజిక అంశాల మీద వచ్చే రచనలన్నా ఇష్టంగా ఉంటుంది. ఇక కవిత్వం విషయంలో దళితవాద సాహిత్య మన్నా, కవిత్వమన్నా ఇష్టం. మద్దూరినో, కలేకూరినో, ఎండ్లూరి సుధాకర్‌నో చదివినంత ఉద్వేగంగా మిగతా కవిత్వాన్ని చదవలేను. మన చరిత్రని, సమకాలీన సమాజాన్ని సులభంగా అర్థం చేసుకోవటానికి ఈ రకం సాహిత్యం ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఒక సినిమా కథ లాంటి నవలని/ అందాన్ని వర్ణించే కవిత్వాన్ని మాత్రమే చదివి ‘నేను చదువరిని’ అనుకోవటం ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.
మీ నమ్మకాల్ని, దృక్పథాన్ని ప్రభావితం చేసిన రచయిత?
ఇద్దరున్నారు... కళ్యాణరావు, కాశీభట్ల వేణుగోపాల్. ఈ ఇద్దరూ నాలో ఉన్న చిన్నప్పటి నమ్మకాలనీ, నా ఆలోచనా తీరునీ మార్చుకునేందుకు ఉపయోగపడ్డారు. ఒకరు నా చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవ టానికి, మరొకరు నన్ను నేనే చెక్ చేసుకో వటానికి. అయితే ఈ ఇద్దరిలోనూ ఒకరే అంటే మాత్రం కళ్యాణ రావుగారి వైపే మొగ్గుతాను. నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఎన్ని పొరలుగా విడదీసి చూస్తే అర్థం చేసుకోగలమో తెలుసుకోవటానికి ఆయన చాలా ఉపయోగపడ్డారు.
సాహిత్యంలో మీకు ఆల్టర్ ఈగోలా అనిపించిన పాత్ర ఏది, ఎందుకు?
కాశీభట్ల వేణుగోపాల్ ‘నేనూ చీకటి’ నవల లోని ప్రధాన పాత్ర. అత్యంత నిర్లక్ష్యంగా ఉంటూనే విపరీతమైన ప్రేమలో మనుషులని చూసే మనిషిలా ఉండగలగటం అంత ఈజీ కాదనిపిస్తుంది. ఎవ్వరి మీదా వ్యతిరేకత లేని మనిషి అందరినీ వ్యతిరేకించే వ్యక్తిగా మారాలని, అతనిలా ఉండాలనీ అనిపిస్తూ ఉంటుంది.
అందరూ గొప్పదని చెప్పినా మీకు అంతగా నచ్చని పుస్తకం?
వడ్డెర చండీదాస్ గారి ‘హిమజ్వాల’ ఎందుకో మరీ సాగదీసినట్టుగా అనిపించింది. అన్ని పేజీలని వాడకుండా కూడా కథ చెప్పొచ్చన్నది నా అభిప్రాయం. ఇక్కడ ఆయనని ఏమాత్రం కించపరచటం లేదు గానీ నా వరకూ ఆ పుస్తకమ్మీద ఉన్న ఉద్దేశం మాత్రం అంతే.
ఏ గత కాలం రచయితనైనా కలిసి మాట్లాడగలిగితే ఎవరితో, ఏం మాట్లాడతారు?
త్రిపుర. ‘‘ఇంత రిచ్ ఫెల్లోవి కదా. హయిగా బతికేయకుండా ఇలాంటి కథలని రాసేంత విషాదం నీ జీవితంలో ఎక్కడ ఉంది? అంతటి బాధని దాచుకున్నావా? రాయటం కోసం తెచ్చిపెట్టుకున్నావా?’’ అని అడగాలని ఉంది.
ఏదైనా పుస్తకం నుంచి మీకు తరచుగా గుర్తొచ్చే వాక్యం/ కవితా పంక్తి?
అనామధేయుడు అనబడు కవి రాసిన ఈ వాక్యలు దాదాపుగా ఏదో ఒక సందర్భంలో తలుచుకునే మాటలు:
‘‘కవిత్వమంటే కమ్యూనిస్టు మేనిఫెస్టో కాదేమో గానీ
గ్రీన్‌హంట్‌లో చెదిరిపడిన దేహాల ధిక్కారనయనాలు మాత్రం
కచ్చితంగా కవిత్వమే...’’
(నరేష్కుమార్ సూఫీ కవి, కథకుడు. అతని కవిత్వ సంపుటి ‘నిశ్శబ్ద’, కథల సంపుటి ‘పేరులేని వెన్నెల’.)
నరేష్కుమార్ సూఫీ