ఇబ్బందిఖానా
ABN , Publish Date - Jul 29 , 2024 | 02:13 AM
‘‘ఇయ్యాల వొస్తవనుకున్న...’’ అంటుంది అమ్మ. అనుకున్నవి జరిగే కాలమాన పరిస్థితులు కావు; ప్రపంచం అంతకన్నా కాదు. దౌడ్ టైటిల్ సాంగ్ మన జాతీయగీతం...
‘‘ఇయ్యాల వొస్తవనుకున్న...’’ అంటుంది అమ్మ.
అనుకున్నవి జరిగే కాలమాన పరిస్థితులు కావు;
ప్రపంచం అంతకన్నా కాదు. దౌడ్ టైటిల్ సాంగ్
మన జాతీయగీతం. లౌడ్‌గా చెప్పలేని
నిస్సహాయులం.
ఇల్లు రాత్రి పడుకోవడానికి మాత్రమే పనికొచ్చే
లాడ్జి. ఉదయం అనేది రేపటికి తయారవ్వడానికి
తగిలించుకునే బ్యాడ్జి.
మరయంత్రం మనం. తంత్రం పట్టుబడని విఫల
వీరులం. వికటాట్టహాసం చేసే మనుషులకు
వినోద సాధనాలం.
డస్సిపోయి ఇంటికి చేరతాం. డల్‌నెస్‌నంతా
పక్కకు తోసి ఫోన్ చేసి పలకరిస్తాం కదా...
‘‘ఇయ్యాల వొస్తవనుకున్న...’’ అంటుంది అమ్మ.
!!!
ఎవరి రావడం పోవడం ఇప్పుడు వాళ్ళ చేతుల్లో
లేదని చెప్పడానికి గొంతు పెగలదు. అది విని
కలతతో ఆమె పడే కొత్త బాధకు
కారణం కాకూడదని
మనకు మనం చెప్పుకునే సంజాయిషీలోనే...
మరోరోజు మరణిస్తుంది!
మోహన్ రుషి