ఆధార్ లేకపోతే ఆదివాసీలకు విద్యాహక్కు ఉండదా!
ABN , Publish Date - Oct 31 , 2024 | 02:34 AM
దేశ రాజ్యాంగం గురించి ఏ మాత్రం తెలిసినవారికైనా అందులో ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ ఒకటి ఉంటుదని; ఆ హక్కులకు భగం కలిగేలా చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు లేదా శాసనసభలకు కూడా లేదని; ఈ విషయంలో...
దేశ రాజ్యాంగం గురించి ఏ మాత్రం తెలిసినవారికైనా అందులో ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ ఒకటి ఉంటుదని; ఆ హక్కులకు భగం కలిగేలా చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు లేదా శాసనసభలకు కూడా లేదని; ఈ విషయంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి... ఎవరూ ఎలాంటి కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వలేరని తప్పక తెలుస్తుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కుకు, వ్యక్తి స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 21–A ప్రాథమిక హక్కులలో ఒక భాగం. 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సుగల బాలబాలికలకు ఉచితంగా, తప్పనిసరిగా విద్యను బోధించాలని అది చెపుతుంది. ఆ వయస్సు బాలలకు విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం గుర్తిస్తున్నది.
సీదరపు సంగీతకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు. తండ్రి లక్కు, తల్లి రోజా. వారిది బర్నగూడ గ్రామం, పట్టుచెన్నూరు పంచాయితీ, సాలూరు మండలం. ఆదివాసీల కోసం అంటూ ఏర్పాటు చేసిన ‘మన్యం పార్వతిపురం’ జిల్లా వారిది. సంగీత అమ్మ చనిపోయింది. తానిప్పుడు బడికి వెళ్లలేదు. ఎందుకంటే తనకు ఆధార్ కార్డు లేదు. లచ్చన, పార్వతిల బిడ్డ పూనురు శిరీష, కొత్తూరు గ్రామం, సాలూరు మండలం, అదే మన్యం జిల్లా. ఉప్మా బడి అని పిలిచే అంగన్‌వాడికి శిరీష వెళ్ళలేదు. ఎందుకంటే తనకూ ఆధార్ లేదు. కొండగొర్రె స్పందనది మరో చిత్రమైన కేసు. తాను పార్వతిపురం బాలికల జూనియర్ కాలేజీలో చేరింది. అయితే కాలేజీ యాజమాన్యం ఆమె పదవ తరగతి సర్టిఫికెట్‌లోను, ఆధార్‌లోను పుట్టిన తేదీల మధ్య కొన్ని నెలల తేడా ఉన్నట్లు గుర్తించి అది సరి చేసుకు రమ్మని పంపేసారు. ఆమె తల్లిని తీసుకొని ఆధార్ సెంటర్‌కు వెళ్ళింది. ఆధార్‌లో మార్పుచేయాలంటే జనన ధ్రువపత్రం కావాలని అన్నారు. అందులో ఐదు నెలల తేడా వుంది. కనుక సరిచేయడం కుదరదు. సంగీత చదువు సాగాలంటే ముందు జనన ధ్రువపత్రంలో పుట్టిన తేదీ మారాలి, తరువాత పదవ తరగతి సర్టిఫికెట్‌లో మారాలి, ఆ తర్వాత ఆధార్‌లో మారాలి. ఈ మార్పులు ఎప్పటికి పూర్తి అవుతాయో తెలీదు. వీరందరూ ఆదివాసీ బిడ్డలు. బిడ్డ పుట్టినప్పుడు తిథి, వార, రాశి, గోత్రాలు చూసుకొని, రాసుకొనే సమాజం కాదు వారిది.
రాజగారి ఏడు చేపల కథలాగా– ఈ ఆదివాసీ పిల్లలకు ఆధార్ ఎందుకు లేదని విచారిస్తే తెలిసిన విషయం– వీరి తల్లులు బిడ్డలను ఇంటి వద్దనే కన్నారట. అంటే ఆసుపత్రికి రాలేదు. అక్కడికి ఎందుకు రాలేదంటే వారికి రహదారి లేదు. ఆసుపత్రిలో పురుడు కాలేదు గనుక వారు జనన ధ్రువపత్రం ఇవ్వరట. సదరు ధ్రువపత్రం లేదు గనుక ఆధార్ నమోదు అవ్వదట. ఆధార్ లేదు గనుక వారికి బడిలో, అంగన్‌వాడిలో ప్రవేశం లేదు. ఫలితంగా ఆర్టికల్ 21ఎ వారికి రద్దు చేయబడింది. ఒక్క ఆధార్ కార్డు ముక్క రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై పైచేయి సాధించింది.
చింతల దేవిది మరో చిత్రమైన సమస్య. ఆ బాలిక ఆసుప్రతిలోనే జన్మించింది. అయినా ఆధార్ కార్డు లేదు. ఎందుకంటే ఆసుపత్రి నుండి గడువు లోగా ధ్రువపత్రం తీసుకోలేదు గనుక ఇప్పడు ఇవ్వరట. జనన ధ్రువపత్రం లేదు గనుక ఆధార్ లేదు. ఆధార్ లేని వారిని రాజ్యాంగమే కాదు దేవుడు కూడా కాపాడలేడు. దేవి అమ్మా నాన్నలైన తవుడు, కొత్తమ్మలకు అలా ధ్రువపత్రం వెంటనే తీసుకోవాలని తెలీదు. దాని అవసరం ఒకటి ఉంటుందని కూడా తెలీదు. వారిది పత్రాల సమాజం కాదు, ఆదివాసీ మాట సమాజం.
అసలు సమస్య వేరే ఉంది. ఆసుపత్రిలోనే పురుడు పోసుకోవాలని, జననం జరిగిన వెంటనే ధ్రువపత్రం తీసుకోవాలని, ఆధార్ లేకపోతే బడిలోనూ, అంగన్ వాడిలోనూ ప్రవేశం లేదన్న నియమాలు ఎవరిని ఉద్దేశించి చేశారు? మైదాన ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేశారు. అవే నియమాలను, యథాతథంగా ఆదివాసీ ప్రాంతలకు అన్వయించారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు, రాజ్యాంగం అమలులోకి వచ్చి 74ఏళ్ళు కావస్తున్నా రహదారులు లేని కొండ ప్రాంతాలు, ఆదివాసీ ఆవాస గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. మరి ఆసుపత్రిలో ప్రసవం జరగలేదని మీరు ఎవరిని శిక్షిస్తున్నారు? ఒకవేళ ఆసుపత్రిలో కాన్పు జరిగినా గడువులోగా జనన ధ్రువపత్రం తీసుకోలేదని ఆదివాసీ బిడ్డలను శిక్షించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? నోటరీ అఫిడవిట్ తెస్తే తప్ప ధ్రువపత్రం ఇవ్వమని ఇప్పుడు చెపుతున్నారు. ఆ నోటరీ ఎక్కడ ఉంటాడో, అందుకు ఎంత ఖర్చు అవుతుందో ఆదివాసీ అమ్మా నాన్నలకు తెలుస్తుందా?
సాధారణ ప్రాంతాలకు ఉద్దేశించిన నియమాలను, విధానాలను, ఉత్తర్వులను, చట్టాలను (పార్లమెంట్ లేదా శాసనసభలు చేసి చట్టాలను) ఏజెన్సీ ప్రాంతాలకు వర్తింపజేసే సమయంలో, ఆదివాసీ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని, వాటిలో మార్పు చేసే, లేదా వాటి అమలును పాక్షికంగా లేదా పూర్తిగా నిలిపివేసే విశేషమైన అధికారాలను రాజ్యాంగం 5వ షెడ్యూల్ రాష్ట్ర గవర్నర్‌లకు ఇచ్చింది. అందుకే 5వ షెడ్యూల్‌ను బి.డి.శర్మ రాజ్యాంగంలో రాజ్యాంగం అన్నారు. ఇంతటి శక్తివంతమైన రాజ్యాంగ హక్కు ఆదివాసీలకు ఉన్నప్పుడు, మైదాన ప్రాంతాల కోసం రూపొందించిన జనన, మరణ ధ్రువపత్రాల మంజూరీ నియమాలను నేరుగా ఆదివాసీ ప్రాంతాలకు ఎలా అన్వయిస్తారు? ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కే లేనప్పుడు, ఆధార్ కార్డు లేదని విద్యా హక్కును అడ్డుకొనే అధికారం ఎవరు ఇచ్చారు? గత ఏడాది సెప్టెంబర్‌లో, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ 22 మండలాల్లో సర్వే చేయిస్తే 12,470 మంది బాలబాలికలకు జనన ధ్రువపత్రాలు లేవని తేలింది. తూర్పు కనుమలతో నిండిన ఈ జిల్లాలో నిజానికి ఇది లెక్కకు రాని చాలా తక్కువ సంఖ్య. కలెక్టర్ సర్క్యులర్ ఇస్తూ– ఆదివాసీల నుండి నోటరీ ధ్రువపత్రం అడగవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 22న అదే జిల్లా కలెక్టర్ అలాంటిదే మరొక అర్జెంట్ ఉత్తర్వు ఇచ్చారు. ఈ లోగా విద్యా సంవత్సరంలో ఐదు నెలలు గడిచిపోయింది. ఈ ఉత్తర్వులు సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. ఆదివాసీలకు అనుగుణంగా జనన/ మరణ ధ్రువపత్రాల మంజూరు నిబంధనలను మార్చాలి. ఇందుకు గిరిజన సంక్షేమ శాఖ చొరవ తీసుకోవాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమశాఖ దేశంలో ఒక పటిష్టమైన, ఆదర్శవంతమైన మంత్రిత్వ శాఖగా ఉండేది. ఎస్.ఆర్. శంకరన్, ఇ.ఎ.ఎస్. శర్మ, బి.ఎన్. యుగంధర్ వంటి ఎందరో అధికారులు ఆదివాసీల హక్కులను కాపాడేందుకు అవసరమైతే ముఖ్యమంత్రులతో సైతం తలపడేవారు. పాలకులకు రాజ్యాంగాన్ని గుర్తు చేసేవారు. ఆదివాసీ ప్రాంతాలు లేదా 5వ షెడ్యూల్ ప్రాంతాలు అనే ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ ప్రాంతం ఒకటి ఉందని పాలన వ్యవస్థ మరచిపోవడం మొదలుపెట్టి చాలా కాలం అయ్యింది. 1995లో డాక్టర్ బి.డి. శర్మ ‘‘ఆదివాసీ ప్రాంతాలు కనుమరుగు కానున్నాయా?’’ (Whither Tribal Areas?) అనే పుస్తకం రాశారు. ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయనే విషయాన్ని పాలకులు ఎలా మార్చిపోతున్నదీ ఆయన వివరించారు. ఈ మతిమరుపు జబ్బును ఎలా వదిలించాలన్నది నేడు ఆదివాసీ సమాజం ముందు ఉన్న పెద్ద సవాలు.
పి.ఎస్. అజయ్‌కుమార్