Share News

అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌!

ABN , Publish Date - Nov 08 , 2024 | 05:36 AM

ప్రజాస్వామ్య పవనాలను ఎవరు ఆపగలరు? మరి రెండు నెలలలోగా ముగియనున్న 2024 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక సమాజాలకు ఒక మరపురాని ప్రత్యేక సంవత్సరంగా గుర్తుండిపోతుంది.

అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌!

ప్రజాస్వామ్య పవనాలను ఎవరు ఆపగలరు? మరి రెండు నెలలలోగా ముగియనున్న 2024 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక సమాజాలకు ఒక మరపురాని ప్రత్యేక సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఎన్నికల సంవత్సరాలు అన్నిటికీ తల్లిలాంటి ఈ సంవత్సరంలో 60కు పైగా దేశాలలో జాతీయ స్థాయి ఎన్నికలు జరిగాయి. అనేక దేశాలలో ప్రజలు దిగ్భ్రాంతికరమైన తీర్పునిచ్చారు. ప్రభుత్వాలు మారాయి. ఎదురులేని మొనగాళ్లలా వ్యవహరించిన నేతలు అధికార వైభవం కోల్పోవడమో లేక తగ్గిపోవడమో జరిగింది. గతంలో ప్రజల చేత తిరస్కరించబడిన నాయకులు అనూహ్యమైన ప్రజా మద్దతుతో మళ్లీ అధికారానికి వచ్చారు.

ఈ ఏడాది వేసవిలో భారతీయ ఓటర్లు నడుస్తున్న చరిత్రను విస్మయపరిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి 400కు పైగా సీట్లు ఖాయమనుకుంటే గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఈ సారి పార్లమెంటరీ మెజారిటీని కోల్పోయింది. ప్రధాని మోదీ ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనివార్యమయింది. ఆ తరువాత జూలైలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పథనిర్దేశకులు అయిన బ్రిటిష్‌ ప్రజలు యువనేత, సాహసోపేత ప్రధానమంత్రి రిషి సునాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేశారు. ప్రతిపక్షమైన లేబర్‌ పార్టీని అనూహ్య మెజారిటీతో గెలిపించారు. సునాక్‌ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని చాలా మంది ముందుగానే భావించినప్పటికీ లేబర్‌ పార్టీకి తిరుగులేని మెజారిటీ లభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


ఇక అమెరికా. ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామిక దేశమైన అమెరికాలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఘనవిజయంతో చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడుగా ఉండి ఎన్నికలలో ఓడిపోయి తదుపరి పర్యాయం అధ్యక్ష ఎన్నికలలో ఘనవిజయం సాధించిన అధ్యక్షుడుగా ట్రంప్‌ తనకొక విలక్షణ కీర్తిని సృష్టించుకున్నారు. గత 120 సంవత్సరాలలో ఒక అధ్యక్షుడు ఒకసారి విజితుడై మళ్లీ విజేత కావడం ఇదే మొదటిసారి. రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాటిక్‌ పార్టీ తరపున పోటీ చేసిన కమలా హారిస్‌ మధ్య పోటీ సమస్థాయిలో ఉందని ఎవరు గెలుస్తారనేది కచ్చితంగా చెప్పలేమని ఓటర్ల సర్వేలు ఘంటాపథంగా వెల్లడిస్తూ వచ్చాయి. అయితే అమెరికన్‌ ఓటర్ల తీర్పు ఆ అంచనాలకు విరుద్ధంగా ఉండి ప్రపంచ ప్రజలను చకితపరిచింది.

ప్రపంచ ప్రధాన ప్రజాస్వామిక దేశాల ప్రజల తీర్పులలో ఒక స్పష్టమైన పద్ధతి లేదా రీతి గోచరమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎన్నిక, అధికారంలో ఉన్న నేతలు, పార్టీలకు ఒక స్పష్టమైన హెచ్చరికే అవడం పరిపాటి. అధికారంలో ఉన్న వారి పట్ల ఓటర్లలో వ్యక్తమయ్యే అసంతృప్తి, ఆగ్రహం పాలకులకు తెలుస్తూనే ఉండడం కూడా కద్దు. తత్కారణంగా తాము అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుందనే జడుపు కూడా వారికి కలుగుతుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ ఓటమికి ఒక ప్రధాన కారణం. పదవీ విరమణ చేయనన్న అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వ పాలన, విధానాలలో ఆమె భాగస్వామ్యమే.


ప్రజలలో సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందనే సూత్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత సార్వత్రక ఎన్నికల వరకు ఒక మినహాయింపుగా ఉండేవారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలలో ఆయన పార్టీ సైతం 63 స్థానాలను కోల్పోయింది. ఒక దశాబ్ద కాలంగా బీజేపీలోను, దేశ రాజకీయాలలోను తిరుగులేని రీతిలో ఉన్న ప్రభావ ప్రాబల్యాలకు తీవ్ర విఘాతం వాటిల్లింది. నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలలో ఒక అధికార పక్షం గతంలో కంటే మరింత మెజారిటీతో మళ్లీ అధికారానికి రావడమనేది అరుదుగా జరుగుతుంది. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేక మనస్థితి నెలకొనడానికి కారణం ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కోవిడ్‌ అనంతర ఆర్థిక దురవస్థల నెదుర్కోవడంలో సతమతమవుతున్నాయి. సంపన్న రాజ్యమైన అమెరికాలో సైతం కొత్త ఉద్యోగాల సృష్టి జరగలేదు. ఉన్న ఉద్యోగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రజల ఆదాయాలు పడిపోయాయి. జీవన వ్యయాలు అంతకంతకు పెరిగిపోసాగాయి. మరి స్వల్ప ఆదాయాలతో బతుకులను ఈడుస్తున్న కార్మిక శ్రేణులు డోనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి మద్దతుదారులుగా ఉండడంలో ఆశ్చర్యమేముంది? ఆర్థిక వ్యవస్థను బాగుపరచగల సమర్థుడు ఎవరన్నదే ఓటర్ల ఆలోచన. అటువంటి సమర్థ నేతను వారు ట్రంప్‌లో చూశారు. ఆయన విజేత అయ్యారు. భారత్‌లో సైతం లోక్‌సభ ఎన్నికలలో అటువంటి పరిస్థితే ఉన్నది.. ఉదాహరణకు ‘సంవిధాన్‌ ఖత్రే మే హై’ (ప్రమాదంలో రాజ్యాంగం) అన్న నినాదం దళిత ఓటర్లను బాగా ప్రభావితం చేసింది. రిజర్వేషన్ల ప్రయోజనాలను కోల్పోవడం జరిగితే తమకు ఉద్యోగావకాశాలు దాదాపుగా మృగ్యమవుతాయని దళితులు భయపడ్డారు. సరే, రైతుల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యవసాయ రంగ దురవస్థలు, అనిశ్చిత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పాలక బీజేపీ ‘చౌర్‌ సౌ ఆర్‌’ స్వప్నాన్ని భంగపరిచాయి.


ఓటర్ల ప్రాధాన్యాల్లో సాంస్కృతిక గుర్తింపు ఒక ప్రధాన అంశంగా ఉండడమనేది ప్రజల తీర్పుల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉదాహరణకు అమెరికాలో కమలా హారిస్‌ మద్దతుదారులు మరింత సమ్మిళిత ‘కొత్త’ అమెరికాను నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అన్ని మతాల, సకల జాతుల ప్రజలను సమానంగా గౌరవించే ఒక ‘కొత్త’ అమెరికాను నిర్మించుకోవల్సిన సమయమాసన్నమయిందని వారు వాదించారు. అమెరికన్‌ సమాజం ‘వైవిధ్యం’తో వర్థిల్లాలన్న వాదనను డోనాల్డ్‌ ట్రంప్‌ తలకిందులు చేశారు. వలస వచ్చిన, వస్తున్న వారికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. భిన్న జాతుల, మతాలకు చెందిన వలసకారులు అమెరికన్ల శ్రేయస్సును దెబ్బ తీస్తున్నారని ఆయన వాదించారు. ట్రంప్‌ ధోరణి గత లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని మోదీ, బీజేపీ నాయకుల ధోరణికి భిన్నమైనది కాదు.

నాగరిక విలువలు సమున్నతంగా ఉన్న ప్రపంచంలో అయితే, ట్రంప్‌, మోదీ, యోగి లాంటి నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు తీవ్రంగా గర్హింపబడేవి. అయితే 2024 ఎన్నికల ప్రచారాల్లో అటువంటి వ్యాఖ్యలు ఓటర్లలో అత్యధిక సంఖ్యాకులను తమ ఊహాత్మక ‘అంతర్గత’ శత్రువుకు వ్యతిరేకంగా పరిణమింపచేశాయి. మరింత సమ్మిళిత సమాజం కోసం కమాలా హారిస్‌ చేసిన విజ్ఞప్తిని ఆమె ప్రత్యర్థులు పూర్తిగా వామపక్ష– ఉదార వాద రాజకీయ దృక్పథానికి మితిమీరిన ప్రాధాన్యమిస్తుందని, అది ‘శ్వేతజాతి’ అమెరికన్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని దుయ్యబట్టారు; మన దేశంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే నెహ్రూ ఆదర్శానికి నిబద్ధులయిన వారిని ‘బూటకపు లౌకికవాదులు’గా కొట్టివేయడం జరుగుతుంది.


ఒక విధంగా శక్తిమంతమైన రాజకీయ నాయకులు అయిన డోనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్ర మోదీ ఒకే విధమైన విజయ సూత్రాన్ని కనుగొన్నారు. స్వాతంత్ర్య శతాబ్ది (2047) నాటికి ‘వికసిత్‌ భారత్‌’ అనే స్వప్నాన్ని మోదీ పూయించగా ‘అమెరికాను మళ్లీ గొప్ప దేశం’గా రూపొందిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ వాగ్దానం చేశారు. జాతీయవాద భావోద్వేగాలను దృఢతరం చేసే ఈ జనాకర్షక నినాదాలు ట్రంప్‌– మోదీ రాజకీయ సందేశాలలో ప్రధానాంశాలుగా ఉంటున్నాయి. ‘బయటి వ్యక్తుల’ పట్ల భయాలు సృష్టించడం ఇరువురి ప్రచారాలలో ఒక ఉమ్మడి అంశం. అమెరికాలో ప్యూరిటోరికన్‌, హైతియన్‌ వలసకారులకు వ్యతిరేకంగా ట్రంప్‌, భారత్‌లో రోహింగ్యాలు లేదా బంగ్లాదేశీ ఘస్‌ పేటియా (చొరబాటుదారులు)కు వ్యతిరేకంగా మోదీ ఉద్దేశపూర్వకంగా అనుసరిస్తున్న వ్యూహాలలో భాగంగానే ‘బయటి వ్యక్తుల’ పట్ల భయాలు రెచ్చగొట్టడం జరుగుతోంది. ఒక విభిన్న అస్తిత్వాన్ని పటిష్ఠం చేసుకునేందుకు అనుసరిస్తున్న జాగరూక వ్యూహమది: అమెరికాలో ట్రంపియన్‌ అమెరికనిజం, భారత్‌లో బీజేపీ హిందుత్వ భావజాలాలు ఒక జాతీయవాద దాడిగా వ్యక్తమవుతున్న అదుపులేని, చేయలేని సాంస్కృతిక వక్కాణింపు ప్రాతిపదికపై ప్రభవించినవే.

ఈ వ్యూహాలు చెప్పుకోదగిన రీతుల్లో ఫలిస్తున్నాయి. కారణమేమిటి? అటు అమెరికాలోను, ఇటు భారత్‌ లోను ప్రతిపక్షాలు తమ సొంత ప్రత్యేక విధానాలను ప్రతిపాదించడానికి బదులుగా, భావజాల ప్రత్యర్థుల వ్యక్తిత్వాలను సవాల్‌ చేయడమనే వలలో చిక్కుకోవడమే. భారత్‌లో ప్రతిపక్షాలు ఎంతకూ మోదీని విమర్శించడానికే పరిమితమవుతున్నాయి; అలాగే అమెరికాలో డెమొక్రాట్లు అమెరికా భవిష్యత్తు విషయమై ఒక సుసంబంధ దార్శనికతతో ఓటర్లను కొత్త సమున్నత లక్ష్యాల సాధనకు ప్రేరేపించడానికి బదులుగా నిరంతరం ట్రంప్ వ్యక్తిత్వంలోని లోపాలు, లొసుగులను ఎండగట్టేందుకే పరిమిత మయ్యారు. ఈ క్రమంలో ట్రంప్‌ తనను ప్రత్యర్థుల కుట్రకు బాధితుడుగా, వాషింగ్టన్‌ అధికార వ్యవస్థకు ‘బయటి వ్యక్తి’గా చిత్రించుకోవడంలో సఫలమయ్యారు. నరేంద్ర మోదీ తనను తాను ‘చాయ్‌ వాలా కా బేటా’గా చెప్పుకుంటూ ‘నామ్‌ దార్‌’ ప్రత్యర్థులను ఎదుర్కొంటున్న ‘కామ్‌ దార్‌’గా తనను అభివర్ణించుకుని దేశ ప్రజలను ఆకట్టుకున్న విషయం మనకు బాగా తెలుసు.


డోనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్ర మోదీ ఇరువురూ స్వతంత్రంగా, సొంత పద్ధతులతో తమ రాజకీయ విజయాలను సాధించుకున్న సమర్థులే. మోదీ తరచు తన విమర్శకులు ఎంతగా పొరపడుతున్నారో రుజువు చేసిన నాయకుడు. ట్రంప్‌ సైతం ఒకసారి విజితుడు అయిన తరువాత చరిత్రాత్మక విజేతగా ప్రభవించేందుకు తనదైన రీతిలో విజయ పథాన్ని నిర్మించుకున్న అరుదైన నేత. ఐదు సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికల సందర్భంలో కాబోయే విజేత అని ట్రంప్‌ను మోదీ తొందరపాటుగా ప్రస్తుతించారు. ‘అబ్‌ కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌’ అని నినదించారు. 2024లో అమెరికా ఎన్నికల తీరుతెన్నులు ఒక కొత్త విశేషాన్ని సంతరించుకున్నాయి. ప్రపంచ రాజకీయాలలో వాక్శూరులకు ఇంకా స్థానమున్నదన్నదే ఆ విశేషం.

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - Nov 08 , 2024 | 05:36 AM