Share News

వచన కవిత్వ మూలాల అన్వేషణలో శిష్‌ట్లా దొరికాడు!

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:34 AM

తెలుగులో మొదటిసారి వచన కవిత్వం రాసిన శిష్‌ట్లా ఉమా మహేశ్వరరావు (1909–1953) కథలు, కవిత్వం, గేయాలు, నాటికలు, వ్యాసాలతో కలిపి మొత్తం 800 పేజీల పుస్తకం ‘శిష్‌ట్లా ఉమామహేశ్వరరరావు సర్వలభ్య సాహిత్యం’ ఇటీవల...

వచన కవిత్వ మూలాల అన్వేషణలో శిష్‌ట్లా దొరికాడు!

మూడు ప్రశ్నలు

తెలుగులో మొదటిసారి వచన కవిత్వం రాసిన శిష్‌ట్లా ఉమా మహేశ్వరరావు (1909–1953) కథలు, కవిత్వం, గేయాలు, నాటికలు, వ్యాసాలతో కలిపి మొత్తం 800 పేజీల పుస్తకం ‘శిష్‌ట్లా ఉమామహేశ్వరరరావు సర్వలభ్య సాహిత్యం’ ఇటీవల విడుదలైంది. ఏటుకూరి ప్రసాద్‌, యామిజాల ఆనంద్‌ల సంపాద కత్వంలో వచ్చిన ఈ పుస్తకంలో శిష్‌ట్లా రచనలతోపాటు, శిష్‌ట్లాపై సమకాలీన రచయితలూ, కుటుంబ సభ్యులూ రాసిన రచనలను కూడా జత చేసి ఈ పుస్తకాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా సంపాదకుల్లో ఒకరైన ఏటుకూరి ప్రసాద్‌తో వివిధ ‘3 ప్రశ్నలు’.


శిష్‌ట్లా ఉమామహేశ్వరరావు రచనలతో 2016లో మీరే తెచ్చిన పుస్తకాన్ని ఇప్పుడు మరింత పెంచి ఇంత విస్తృతంగా వేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

1998లో ఆయన కవిత్వాన్ని మొదట ప్రచురించాం. అప్పట్లో కొందరు శిష్‌ట్లానే మొదటి వచన కవిత్వం రాశాడని అనేవారు కానీ, నాకేం సాక్ష్యం దొరకలేదు. ఆ తర్వాత ప్రయత్నం చేస్తే ‘విష్ణుధనువు’, ‘నవమి చిలుక’ పుస్తకాలు దొరికాయి. వాళ్లూవీళ్లూ ఆయనపై రాసిన వ్యాసాలు కొన్ని దొరికాయి. అవన్నీ కలిపి 1998లో ‘శిష్‌ట్లా ఉమామహేశ్వర రావు కవిత్వ సమాలోచనం’ అని పేరు పెట్టి వేశాం. ఆ తర్వాత ఇంకేం రాశాడా అని నేనూ, యామిజాల ఆనంద్‌ వెతకటం మొదలు పెట్టాం. మరికొన్ని కవితలు, చిన్నపిల్లల పాటలు, నాటికలు, వ్యాసాలు దొరికాయి. వీటికి ఆయన రాసిన ‘సిపాయి కథలు’, మరికొన్ని కథలు కూడా కలిపి 2016లో నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌ ద్వారా ‘శిష్‌ట్లా ఉమామహేశ్వరరావు రచనలు’ పుస్తకాన్ని తెచ్చాం. తర్వాత వెతికేకొద్దీ గత సంపుటంలో రాని చాలా కథలు, పాటలు, నాటికలు, వ్యాసాలు దొరుకుతూనే ఉన్నాయి. అలాగే శిష్‌ట్లాపై ఇతరులు రాసిన వ్యాసాలు కూడా మరిన్ని దొరికాయి. అవీ తీసుకున్నాం. ఈ సంపుటం కోసం జరిపిన అన్వేషణలోనే శిష్‌ట్లా జర్నలిస్ట్‌గా కూడా పని చేశారన్న విషయం మాకు తెలిసింది. ఆయన బరంపురం నుంచి ఒక పిల్లల మేగజైన్‌ ఎడిట్‌ చేశాడు. ‘జమీన్‌ రైతు’ పత్రికలో ‘బెజవాడ లేఖలు’ పేరుతో రాజకీయ వ్యంగ్య వ్యాసాలు రాశాడు. ఇవన్నీ కలిపితే మొత్తం రెండు వందల పేజీలు అదనంగా చేరాయి. అలా ఇదిగో 800 పేజీల పుస్తకం అయ్యింది. ఈ పుస్తకం వేసిన తర్వాత కూడా కొత్తగా రెండు కథలు దొరికాయి!


మీకు శిష్‌ట్లాపై ఇంత ఆసక్తి ఎందుకు?

ఇదంతా మొదలుపెట్టింది ఆయన మీద ఆసక్తితో కాదు. వచన కవిత మొదట రాసింది ఎవరూ అనే నా అన్వేషణలో ఆయన దొరికాడు. ఈ పుస్తకంలో చూస్తే ఆయన సమకాలికులు అందరూ చెప్పిన మాట ఒకటే– ఆయనే వచన కవితకు ఆద్యుడూ అని. తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి శిష్‌ట్లాను ‘‘అత్యాధునిక కవుల్లో పూర్వుడు’’ అంటాడు. శ్రీశ్రీ కూడా ‘‘మా కవితలన్నీ ఇంకా పత్రికల్లో ఉండగానే శిష్‌ట్లా కవిత్వం అప్పటికే పుస్తకంగా వచ్చేసింది’’ అంటాడు. శ్రీరంగం నారాయణ బాబు కూడా అదే మాట అంటాడు. ఇలా శిష్‌ట్లా సమకాలీ కులు అందరూ ఆయన గురించి ఏమన్నారో కూడా ఈ పుస్తకంలో పెట్టాం. అలాగే కుటుంబ సభ్యులని కూడా వెతికి పట్టుకున్నాం. వారి ద్వారా అనేక కొత్త విషయాలు కూడా తెలిశాయి. శిష్‌ట్లా బెనారస్‌లో ఎమ్మే చదివాడు. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ సభలన్నీ లక్నో లోనూ అలహాబాద్‌ లోనూ జరిగేవి. శిష్‌ట్లా వాటన్నిటికీ హాజరు అవుతుండేవాడు. అక్కడ ఆయన ఇంగ్లీష్‌ మాట్లాడితే ‘‘దొరలకంటే బాగా మాట్లాడుతున్నాడే’’ అనేవారట. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు చెప్పారు. ఈ పుస్తకానికి రచనలు వెతికిపెట్టడంలోనూ, శిష్‌ట్లా కుటుంబ సభ్యులను కాంటాక్ట్‌ చేసి వివరాలకు సేకరించడంలోనూ నా సహసంపాదకుడు యామిజాల ఆనంద్‌ కృషి మరువలేనిది.


శిష్‌ట్లాది ‘‘విపరీత మనస్తత్వం’’ అంటాడు అబ్బూరి వరద రాజేశ్వరరావు. శ్రీశ్రీ, కొడవటిగంటి తదితరులు కూడా ఇలాంటి సూచన చేశారు. కానీ ఏ ఒక్కరూ స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ఏమిటీ ‘‘విపరీత మనస్తత్వం’’?

శిష్‌ట్లా హోమోసెక్సువల్‌. శ్రీశ్రీ చెప్తాడు కూడా ఒకచోట– మేమంతా మాట్లాడుకునే సమయంలో ఏదో కోపం వచ్చి శిష్‌ట్లా లోపలికి వెళ్లాడూ, అతని వెంబడి ఒక నలుగురు అబ్బాయిలు లోపలికి వెళ్లారూ అని. కొడవటిగంటి ‘‘అతనో వెలివేయబడ్డ మనిషి’’ అంటాడు. ఈయన చనిపోయిన తర్వాత స్వయంగా తండ్రే ‘‘ఎవ్వరూ అతని దహనకాండకు పోవద్దూ’’ అని చెప్పాడట. శిష్‌ట్లా సోదరుడి వరసయ్యే ఎస్వీ నరసింహం స్వయంగా నాతో అన్నాడు, ‘‘ఉమ్మాయిని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదీ’’ అని. అయితే నేనేమంటానంటే– మనిషిగా ఆయన గురించి తక్కువే మాట్లాడినా, ఆయన సాహిత్యం గురించి చాలా మాట్లాడాలి. శ్రీశ్రీలో కూడా లేనివిధంగా సాహిత్యపరంగా అనేక ప్రక్రియల్లో ప్రవేశం ఉంది శిష్‌ట్లాకు.

ఏటుకూరి ప్రసాద్‌

Updated Date - Dec 23 , 2024 | 01:34 AM