Share News

భారత దేశంలో పుస్తకమే కవిని రాస్తుంది!

ABN , Publish Date - Sep 23 , 2024 | 01:09 AM

‘‘తెలుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది’’ అని తిరుపతి వేంకటకవులు అన్నారు కానీ, తెలుగు ఒక్కదానికే కాదు, మొత్తంగా భారతదేశానికే దీపాల ‘కొరత’ బాగా ఉన్నట్టుంది. అందులో పెద్ద కొరత చరిత్రదీపం. మనకు చరిత్రలు రాసుకోలేదని, చారిత్రక దృష్టి లేదని, ఇంగ్లీషువాడు వచ్చే దాకా మన గురించి...

భారత దేశంలో పుస్తకమే కవిని రాస్తుంది!

‘‘తెలుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది’’ అని తిరుపతి వేంకటకవులు అన్నారు కానీ, తెలుగు ఒక్కదానికే కాదు, మొత్తంగా భారతదేశానికే దీపాల ‘కొరత’ బాగా ఉన్నట్టుంది. అందులో పెద్ద కొరత చరిత్రదీపం. మనకు చరిత్రలు రాసుకోలేదని, చారిత్రక దృష్టి లేదని, ఇంగ్లీషువాడు వచ్చే దాకా మన గురించి మనం తెలుసుకోనేలేదని బాధపడడం మన ఆధునిక ఆత్మవిమర్శలో ఒక అనివార్య అధ్యాయం. ‍సాధారణ చరిత్ర రంగంలోనే అంతటి చీకటి ఉందనుకుని బాధపడితే, ఇక సాహిత్యచరిత్ర సంగతి చెప్పనక్కరలేదు. కావలి వేంకట రామస్వామి, గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం కంటె ముందు మన కవుల గురించి ‘కథలు’ చెప్పుకోవడమే తప్ప, చరిత్రలే లేవు. పైన చెప్పిన ముగ్గురూ కూడా కవులజీవన రేఖలూ కవిజీవితాలూ కవుల చరిత్రలూ తప్ప సాహిత్య ‘చరిత్ర’ రాసినవారు కాదు. బ్రిటిష్ వారు రాకముందు ‘‘మనకు చరిత్ర అంటే బయోగ్రఫీయే’’ అంటారు వెల్చేరు నారాయణరావు. సాహిత్యచరిత్రరచన గురించి ఈ మధ్య ఆయనను (నేను, కరుసాల వెంకటేశ్ కలిసి) ఇంటర్వ్యూ చేసినప్పుడు వెల్చేరు కీలకమయిన, మౌలికమయిన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యక్తి కథ మాత్రమే అయిన చరిత్ర భావనను దేశానికి, ప్రాంతానికి, రంగానికి కూడా అన్వయించి విస్తరించారని ఆయన అన్నారు. ‘‘దేని చరిత్రను రాయాలో ముందు దాన్ని తెలుసుకోవాలి. ఏ వస్తువు చరిత్ర రాస్తారో ఆ వస్తువును తయారుచేయాలి.’’ అని ఆయన అన్న మాట ఎంతో లోతైనది. బహుశా, ఆయన ఉద్దేశ్యంలో, వస్తువు అంటే, కథావస్తువు లాంటి చరిత్రవస్తువు. దేని చరిత్ర అయినా రాయడానికి ముందు దాన్ని ‘భావించాలి’. భావించడం అంటే, కల్పించడం, ఊహించడం, పరికల్పన చేయడం, ఇమాజిన్ చేయడం. ఇప్పుడు మనం చూస్తున్న సాహిత్యచరిత్రల వంటివి రాయాలన్న ఊహ, భావన, 19వ శతాబ్దానికి ముందు రాలేదు. పరికల్పనలు అకాలంగా, కాలాతీతంగా ఉండవు.


తెలుగు సాహిత్యచరిత్రల పరిణామం, రచనాపద్ధతి గురించి తెలుసుకోవాలన్న నా కొత్త ఆసక్తి తగినట్టుగా, ఎంతో అనువుగా ఈ మధ్య తారసపడినవి వెల్చేరు నారాయణరావు రెండు కొత్తపుస్తకాలు. ‘‘తెలుగు సాహిత్యం-–కొత్తకోణాలు’’, ‘‘సంస్కృతి, భాష, చరిత్ర’’. ఈ పుస్తకాలను ‘‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)’’ ప్రచురించింది. ఇందులో మొదటి పుస్తకంలో కేవలం నారాయణరావు ఒక్కరే రాసినవి, రెండోదానిలో ఆయన డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం, పరుచూరి శ్రీనివాస్, పప్పు నాగరాజుల భాగస్వామ్యంతో రాసినవి వ్యాసాలు ఉన్నాయి. వివిధ సాహిత్య సందర్భాలలో రాసిన ఈ వ్యాసాలలో అన్నిటిలో కాదు కానీ, ఎక్కువ వాటిలో సాహిత్యచరిత్ర మీద, సాహిత్యచరిత్ర గురించి చేసిన వ్యాఖ్యలు, ప్రతిపాదనలు ఉన్నాయి. నిజానికి ‘‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’’ దగ్గర నుంచి వెల్చేరు చేస్తూ వచ్చిన సాహిత్య ప్రయత్నం అంతా ఏదో ఒక రకంగా ‘‘ప్రధాన స్రవంతి సాహిత్యచరిత్ర’’ను విమర్శనాత్మకంగా చూస్తూ, ఒక ప్రత్యామ్నాయ చరిత్రను నిర్మించడమే.

‘‘భారతీయులకు చారిత్రక స్పృహ లేదనీ, మంచికో, చెడుకో వలస పాలకుల వల్ల చరిత్ర రచన మనకు అబ్బిన కొత్త లక్షణమనీ వున్న అపోహను తొలగించడమే’’ తమ ఉద్దేశ్యమని వెల్చేరు, ఆయన సహరచయితలు చెబుతారు. అట్లాగని, వలసపాలకుల చరిత్రదృక్పథం, రచనాపద్ధతి భారతీయులకు ఎప్పటి నుంచో తెలుసుననే చెప్పే బాపతు ధోరణి కాదు ఇది. వీరి ప్రకారం, పాశ్చాత్య చరిత్ర రచన ప్రమాణాలతో మనకు ఉన్న మౌలికమైన వ్యత్యాసాలను గుర్తించగలిగితే, దక్షిణ భారత చారిత్రక రచనలను గుర్తించగలం. దక్షిణ భారతంలో చరిత్ర ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియ కాదు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఆ కాలంలో ఏ సాహిత్య ప్రక్రియ ప్రాచుర్యంలో ఉంటే ఆ ప్రక్రియలోనే చరిత్ర రచనలు కూడా సాగాయి.


మరి సాహిత్యచరిత్ర? మనం అనుకుంటున్న సాహిత్యచరిత్ర కూడా ‘‘వలసపాలన ద్వారా వచ్చిన పాశ్చాత్య విద్య’’. ఆ కోవలో కవులు, రచయితల స్థలకాలాలు, వారి పోషకుల వివరాలు తెలుసుకోవడానికి పండితులు పడిన కష్టం మీద వెల్చేరుకు గౌరవం లేకపోలేదు. కానీ, సాహిత్యచరిత్ర అంటే అది కాదు. ‘‘ఏ పుస్తకం ముందు వచ్చిందో, ఏ పుస్తకం తరువాత వచ్చిందో చెప్పుకుంటూ కూర్చోవడం సాహిత్యచరిత్ర కాదు. అలాంటి చరిత్ర మనకి లేకపోయినందుకు మనం విచారించక్కర్లేదు’’ అంటారాయన. కవి, గ్రంథం, పాఠకులు, ఈ మూడు అంశాల మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం సాహిత్యచరిత్రకు ముఖ్యం. రచయిత పుస్తకం రాస్తాడు, పాఠకుడు చదువుతాడు, ఈ పుస్తకానుభవ క్రమమే ఆధునికులు చాలా మంది ఆలోచనలో ఉందని, కానీ భారతదేశంలో పుస్తకమే కవిని రచిస్తుందని వెల్చేరు సూత్రీకరిస్తారు. పుస్తక స్వభావం బట్టి, కవులను ఊహించుకోవడం మన పద్ధతి. వాస్తవం ఉండవచ్చు, లేకపోవచ్చు, కానీ, కవుల కథలన్నీ వారి రచనల్లో కనిపించే వ్యక్తిత్వానికి అనుగుణంగా కల్పితమవుతాయి. కవులను, ఆర్షకవులు, కావ్యకవులు, భక్తికవులు, చాటుకవులు అని నాలుగురకాలుగా వర్గీకరించి, వారి పుస్తకాల ఆధారంగా పాఠకుల ఊహల్లో కవి ఎట్లా రూపొందుతాడో వివరిస్తారు.


బ్రిటిష్ వలసపాలన భారతీయ భావప్రపంచం మీద వేసిన మార్పు మీద విమర్శలో భాగంగా వెల్చేరు సాహిత్యచరిత్ర ప్రతిపాదనలు చేస్తారు. వలసపాలన తెచ్చిన ఆధునికత వల్ల వివిధ భావరంగాలలో ప్రధాన కథనాలు రూపొందాయి. ఆధునిక చరిత్ర వలసవాద ఆధునికత ఫలితమే కాబట్టి, భారతీయులు తమ గతాన్ని చూసే పద్ధతి అదే దారిలో తయారయింది. అయితే, వలసపాలనకు ముందే ఆధునికత మన దగ్గర రూపొందడం మొదలయిందన్న ప్రతిపాదనను వెల్చేరు బలపరుస్తారు. వలసవాద ఆధునికత అలవరచిన చూపును విదిలించుకుని, వలస పూర్వ భారతదేశాన్ని వలసపూర్వ దృష్టితోనే చూడడానికి ఉన్న అవకాశాలను చర్చిస్తారు. మన పూర్వ సాహిత్యాన్ని, నాటి దృష్టితోనే అర్థం చేసుకోవాలని అంటారు. కొన్ని బాహ్య పరిస్థితులను ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటూనే, సాహిత్యంలో అంతర్గత సాక్ష్యాల ద్వారా, వాచక పరీక్ష ద్వారా కొత్త వ్యాఖ్యానాలను అందిస్తారు. 15, 16 శతాబ్దాల కాలం నుంచి, తెలుగు ప్రాంతాలలో వచ్చిన రాజకీయాలలో, పాలకశ్రేణులలో వచ్చిన మార్పులు, కొత్త జీవనవిధానాన్ని తెచ్చాయని, అది సాహిత్యంలో ప్రతిఫలించిందని ఆయన ప్రతిపాదించారు. మునుపు అధికారానికి, సంపదకు ఎడంగా ఉన్న ‘ఎడమచేతి’ కులాలు ఆ కాలంలో ప్రాబల్యం సంపాదించుకున్నాయని, అప్పటి నుంచే మనదైన ఒక ఆధునికత రూపొందుతూ వస్తోందని ఆయన చెబుతారు. అందులో కరణాలు ముఖ్య పాత్ర నిర్వహించారని, ఆధునిక తెలుగుకు వారి లేఖనంలోనే పునాదులున్నాయని ఆయన అంటారు. ఆయన దృష్టిలో, ఆస్థానాల నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చిన పద్యమే చాటువు, అది తక్కువ రకం సాహిత్యం కాదు. గురజాడ అప్పారావులో కనిపించిన ఆధునికత తాను చెబుతున్న దేశీయ ఆధునికత కొనసాగింపేనని, కందుకూరి వీరేశలింగం లాగా గురజాడ వలసవాద ఆధునికుడు కాదని వెల్చేరు వాదన. ‘కన్యాశుల్కం’ నాటకంలో ఆయన దేశీయ ఆధునిత వైపు నుంచి వలసవాద ఆధునికతను హేళన చేశాడని లేదా విమర్శించారని ఆయన ఉద్దేశ్యం. క్షీణ యుగంగా పరిగణించే నాయకరాజుల కాలాన్ని సాహిత్యం వైవిధ్యంతో వికసించిన కాలంగా ఆయన అంటారు.


తెలుగుకు సేవ చేశాడని చెప్పే బ్రౌన్ గ్రంథ పరిష్కరణల పేరుతో అనేక ప్రాచీన గ్రంథాలను సవరించాడని, ఇక్కడి పుస్తకసంస్కృతి బ్రౌన్‌కు అర్థం కాలేదని వెల్చేరు అంటారు. అచ్చుయంత్రం వచ్చే దాకా, పుస్తకానికి తప్పనిసరిగా ఒకే కర్త ఉండవలసిన అవసరం లేదని, మౌఖికంగా మాత్రమే ఉనికిలో ఉండే సాహిత్యానికి స్థిర రూపం ఉండదని, నిరంతరం రూపొందుతూనే ఉంటుందని ఆయన చెబుతారు. సుమతిశతకం బ్రౌన్ ప్రతితో, వావిళ్ల వారి ప్రతిని పోలుస్తూ వెల్చేరు, పరిష్కరణలో భాషా సాంస్కృతిక సవరణలు ఎట్లా ఉంటాయో, ఎక్కువ మంది నోళ్లలో ప్రాచుర్యం పొందే పద్యం ఎట్లా సరళం అవుతుందో ఉదాహరణలతో సహా వెల్చేరు వివరించారు. నీతిశతకాలను వాటిలో చెబుతున్న సాంఘిక నీతిని చర్చించి, దేశకాలాదులను అన్వయించిన తీరు ఆసక్తికరంగా ఉంది. గిడుగు రామమూర్తి, చిన్నయసూరి, కావలి రామస్వామి, బ్రౌన్ వీళ్లందరి గురించీ మనకు తెలిసిందాన్ని వదిలించుకుని, కొత్తగా అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాలు ప్రేరేపిస్తాయి. ఆధునిక కవుల గురించి కూడా ఈ పుస్తకాలలో వ్యాసాలు ఉన్నాయి. ఎవరూ చూడని కోణాలను వెల్చేరు చూపిస్తారు.


ప్రస్తుతం సాహిత్యచరిత్రల మీద వస్తున్న విస్మరణ విమర్శలు కూడా వెల్చేరు చర్చించకుండా పోలేదు. ప్రాబల్య శ్రేణుల నుంచి వచ్చిన రచనలతోనే సాహిత్య చరిత్రలు ఏర్పడుతున్నాయని ఆయన అంగీకరిస్తారు. ‘‘సాహిత్యచరిత్ర కారులందరూ ఉన్న పుస్తకాల కథలు రాశారు.. కానీ, అణచివేయబడ్డ వర్గాలకు ఏ రకమైన సాహిత్యం వుంది, ఆ సాహిత్యం ఎన్ని రూపాలుగా, ఏయే కాలాలలో అణచివేయబడింది అనే విషయం బయటకు వచ్చే పద్ధతిలో సాహిత్యపు ప్రశ్న ఎవరూ వేసుకోలేదు’’, ఈ మాట ఆయన 1990లో అన్నారు కానీ, ఆ తరువాత ఆ ప్రశ్న చాలా మంది వేసుకున్నారు. విషయం ఎంత బయటకు వచ్చిందనేది వేరే విషయం.

కాలక్రమానుగత పద్ధతిలో రాసిన వ్యాసాలు కావు కాబట్టి, సాహిత్యచరిత్రలు చదివిన అలవాటున్నవారికి, ఈ పుస్తకాలు చదివాక, సమాధానపడలేని చాలా ప్రశ్నలు మిగిలి ఉంటాయి. వెల్చేరు ఆలోచనలను ఎంత వరకు స్వీకరించాలో తేల్చుకోలేనంతగా, ఆయన ప్రత్యేకమైన పరిశీలనాదృష్టి పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ దృష్టిని అలవరచుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. కానీ, ఆ చూపు కేవలం అభిరుచి కాదు, ఎంతో అధ్యయనం, పరిశ్రమ కలగలసిన విద్య?

కె. శ్రీనివాస్‌

Updated Date - Sep 23 , 2024 | 01:09 AM