Share News

విజ్ఞాన జగత్తులో జెండర్‌ సమత్వం

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:21 AM

మహిళా భౌతిక శాస్త్ర్తవేత్తల తొలి అంతర్జాతీయ సమావేశం 2002లో పారిస్‌లో జరిగింది. భారత ప్రతినిధిగా పాల్గొన్న రోహిణీ గాడ్బోలే దృష్టికి, ఆ సదస్సు సందర్భంగా వచ్చిన కొన్ని వాస్తవాలు రెండు దశాబ్దాల అనంతరం...

విజ్ఞాన జగత్తులో జెండర్‌ సమత్వం

మహిళా భౌతిక శాస్త్ర్తవేత్తల తొలి అంతర్జాతీయ సమావేశం 2002లో పారిస్‌లో జరిగింది. భారత ప్రతినిధిగా పాల్గొన్న రోహిణీ గాడ్బోలే దృష్టికి, ఆ సదస్సు సందర్భంగా వచ్చిన కొన్ని వాస్తవాలు రెండు దశాబ్దాల అనంతరం, వైజ్ఞానిక పరిశోధనల విషయమై మన విధానంలో ఒక ప్రయోజనకరమైన మార్పుకు దోహదం చేశాయి. 2020లో భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రూపొందించిన ‘సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ (STIP)’ డాక్యుమెంట్‌లో మహిళలకు సమానవకాశాలు కల్పించే దిశగా ‘ఈక్విటీ అండ్ ఇంక్లూజన్’ అనే అధ్యాయం రావడానికి రోహిణీ గాడ్బోలే ప్రధాన కారకురాలు అనడంలో అతిశయోక్తి లేదు. వైజ్ఞానిక పరిశోధనల విధానపత్రంలో ఆ వినూత్న మార్పు ప్రభావం ఇప్పటికిప్పుడు స్పష్టంగా లేకపోయినా పది, పదిహేనేళ్ల తరువాత కొట్టొచ్చినట్లు కనిపిస్తుందనడంలో సందేహం లేదు. ప్రొఫెసర్‌ రోహిణి తీసుకున్న మరో ప్రగతిశీల నిర్ణయం ఫలితంగా 2008లో ‘లీలావతి డాటర్స్– : ది ఉమెన్ సైంటిస్ట్స్‌ ఆఫ్ ఇండియా’ అనే విలువైన పుస్తకం రావడం ఆ గమనంలో ఒక అర్థవంతమైన మజిలీ.


ప్రొఫెసర్‌ రోహిణి గాడ్బోలే 2024 అక్టోబర్ 25 ఉదయం నిద్రలోనే అంతిమ శ్వాస విడిచినట్టు ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సైన్సెస్’ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆ సంస్థలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సెర్న్ (CERN)లో కూడా ఆమె పరిశోధనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విశ్వవిద్యాలయాలలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా బోధించారు. పార్టికల్ ఫినోమెనాలజీ, స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్, హై ఎనర్జీ ఫిజిక్స్ రంగాలలో రోహిణి మూడు దశాబ్దాలకు పైగా పరిశోధనలు చేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ‘హై ఎనర్జీ ఫోటో హైడ్రానిక్ స్ట్రక్చర్’ రూపురేఖలను వివరించడానికి ఆమె ప్రయత్నించారు. ఇది తర్వాత కాలంలో ఎంతో ప్రభావం చూపే పరిశోధన. అంతకుమించి భారత వైజ్ఞానిక రంగంలో మహిళలకు సమాన అవకాశాల కల్పనకు రోహిణీ గాడ్బోలే ఎంతో కృషి చేశారు. మహిళా శాస్త్రవేత్తలకు మరింత విద్యా ప్రోత్సాహం ఇచ్చి, వారిలో పరిశోధనా స్ఫూర్తిని నింపిన వైజ్ఞానికురాలు రోహిణీ గాడ్బోలే. 2019లో పద్మశ్రీ పురస్కారం, ఐఐటి కాన్పూరు గౌరవ డాక్టరేట్, సత్యేంద్రనాథ్ బోస్ మెడల్ మొదలైన వాటితోపాటు ఫ్రెంచ్ ప్రభుత్వ ఆర్డర్ ఆఫ్‌ నేషనల్ మెరిట్‌ను కూడా ఆమె పొందారు.


1848లో సావిత్రి బాయి పూలే కారణంగా దేశంలో తొలి బాలికల పాఠశాల, 1884లో మహదేవ్ గోవింద్ రణడే పూనికతో దేశంలోనే తొలి బాలికల ఇంగ్లీషు పాఠశాల మొదలైన ఫూణే నగరంలో 1952 నవంబర్ 12న రోహిణి ఒక విద్యాధికుల కుటుంబంలో నాల్గవ బిడ్డగా జన్మించారు. తండ్రి ఆదివారం పూట తన చిన్నారి కుమార్తెలకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురించే సైన్సు వార్తలు, వ్యాసాలు వివరించి చెప్పేవారు. ఉదయం సంస్కృతంలో సాగే ఆధ్యాత్మిక విషయాలు వినపడినా రాత్రి భోజనాల దగ్గర మాత్రం సాహిత్యం, రాజకీయాలు, చరిత్ర, కళలు, సంగీతం, ఆర్థిక పరిస్థితులు వంటి విషయాలు లోతుగా చర్చకు వచ్చేవని రోహిణి రెండేళ్ల క్రితం రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. అసలు ఇంగ్లీషు లేకుండా ఏడవ తరగతి దాకా మరాఠీ మీడియంలో చదివినా తాను చిన్నపుడు విన్న గెల్ మాన్ (Gell Mann) జ్విగ్ (Zweig) శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన క్వార్క్స్ (Quarks) సిద్ధాంతం తర్వాతి కాలంలో రోహిణికి జీవితకాలపు పరిశోధనా ఆసక్తిగా మారిపోయింది.


పూణేలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత పాఠశాలలో చదివినా అందులో ఆడపిల్లలకు కేవలం హోమ్ సైన్స్ మినహా మరో విజ్ఞాన సంబంధమైన బోధనాంశం ఉండేది కాదు. అయితే ఆమె మ్యాథ్స్ టీచర్ సొవాని, ఆమె భర్త, సైన్స్ టీచర్ బావ్ సొవాని తోడ్పాటు, ప్రోత్సాహంతో మరాఠి సైన్స్ మేగజైన్ ‘సృష్టి విగ్యాన్’ కారణంగా సైన్స్ సంబంధిత ఆసక్తి ఆమెలో బలపడింది. ఆ కారణంగానే ఉన్నతపాఠశాల స్థాయిలో జనరల్ సైన్స్ మరింత బోధించాలని, ల్యాబ్ మరింత మెరుగ్గా ఉండాలని ఉన్నత పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె గట్టిగా సూచించారు. పెద్దక్క తీసుకుని వచ్చిన నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్‌ అప్లికేషన్ రోహిణీ విద్యాసక్తులను ఒక కొత్త మలుపు తిప్పింది. ఆ ఉపకార వేతనం కారణంగా ఎన్నో సైన్స్ పుస్తకాలు కొని చదవడానికి అవకాశం కల్పించింది. అలాగే సెలవుల్లో ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో నిర్వహించే శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే వెసులుబాటు లభించింది. అందులో ఎంతో మంది యోగ్యులైన మిత్రులు లభించడం అనేది రోహిణి జీవితంలో చాలా కీలకంగా మారింది. అలా పరిచయమైన స్నేహితులలో నోబుల్ బహుమతి పొందిన వెంకీ రామకృష్ణన్, ఖగోళ శాస్త్రవేత్త రమేష్ నారాయణ కూడా ఉన్నారు. అలాగే ఐఐటి బొంబాయిలో ఎమ్మెస్సీ చదువుతున్నప్పుడు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఉమెన్‌కు సంబంధించిన స్కాలర్‌షిప్‌ అప్లికేషన్ ఆమెను విదేశాల్లో చదివించేలా మలుపు తిప్పింది. అయితే అక్కడ పిహెచ్.డి అయిపోయిన తర్వాత అవకాశాలున్నా స్వదేశానికి తిరిగి వచ్చి ముంబైలోని టీఐఎఫ్ఆర్‌లో పనిచేశారు. 1995లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్సెస్‌లో చేరారు. ఈ సంస్థలో ఆమె పరిశోధకురాలుగానే కాకుండా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ నిర్వహించే ఫిజిక్స్ జర్నల్ ‘ప్రమాణ’కు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. మాన్యూల్ డ్రీస్, ప్రబీర్‌రాయ్‌తో కలసి రాసిన ‘సూపర్ సిమెట్రీ’ ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు, విద్యార్థులు అధ్యయనం చేస్తున్నారు.


‘పరిశోధనారంగంలో వివక్ష’ అనే అంశంపై పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సు రోహిణిలో కొత్త ఆలోచనలను పురిగొల్పింది. ఫలితంగా ఒక నూతన దృక్పథంతో తన పాతికేళ్ల పరిశోధక జీవితాన్ని నిశితంగా పరిశీలించుకునేట్టు ఆమెను ప్రేరేపించింది. మేరీ క్యూరీ వంటి వారి జీవితాలు గొప్పస్ఫూర్తిగా మనకు అందుబాటులో ఉన్నా, ఆమె చేరిన స్థాయి మామూలు విద్యార్థులకు కించిత్ భయాన్ని కూడా కలిగిస్తుంది. కనుక స్థానికంగా మన దేశంలోని ప్రతికూల పరిస్థితులను నిభాయించుకుని విజయం సాధించిన మహిళా శాస్త్రవేత్తలను పరిచయం చేసేందుకు సంకల్పించిన రోహిణి, రామ్ రామస్వామితో కలిసి ‘లీలావతి డాటర్స్– : ది ఉమెన్ సైంటిస్ట్స్‌ ఆఫ్ ఇండియా’ అనే స్ఫూర్తిదాయక గ్రంథాన్ని రాశారు. 2008లో బెంగళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆ పుస్తకాన్ని ప్రచురించింది. 12వ శతాబ్దానికి చెందిన భాస్కరుడు బాలవితంతువైన తన కూతురు లీలావతికి వినోదం కలిగించేందుకు ‘లీలావతి గణితం’ రాశారనే చారిత్రక ఐతిహ్యం ఒకటి ఉన్నది. ఆ స్ఫూర్తితోనే రోహిణి తన పుస్తకానికి ‘లీలావతి డాటర్స్’ అని నామకరణం చేశారు. ఈ పుస్తకం మూడో ఎడిషన్‌లో జానకి అమ్మాళ్, అసిమా చటర్జీ, అన్నమణి, కమలాసోనీ మొదలైన వైజ్ఞానిక విదుషీమణుల జీవిత కథనాలతో పాటు మరో 90 మంది మహిళా శాస్త్రవేత్తలు తాము పరిశోధనా రంగంలో చవిచూసిన అనుభవాలను వివరిస్తూ రాసిన వ్యాసాలు ఉన్నాయి. భారతదేశ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో ఉన్న వివక్షను, మహిళా శాస్త్రవేత్తల పరిశోధనా కృషికి ఎదురవుతున్న అవరోధాలకు సంబంధించి తొలిసారి పూర్తిగా దృష్టి పెట్టి, అధ్యయనం చేసి ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మార్పులు వచ్చేట్టు దోహదం చేసిన అపురూప శాస్త్రవేత్త రోహిణీ గాడ్బోలేకు మనందరం నివాళులు అర్పించాలి.

నాగసూరి వేణుగోపాల్

Updated Date - Oct 30 , 2024 | 05:21 AM