రుణ భారంతో భారత్ వికసితమయ్యేనా?
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:04 AM
భారతదేశం దృష్టి ఇప్పుడు కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రాల పైకి మళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో బిహార్, ఏపీ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లో వచ్చిన...
భారతదేశం దృష్టి ఇప్పుడు కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రాల పైకి మళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో బిహార్, ఏపీ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లో వచ్చిన ఫలితాలు కేంద్రంలో రాజకీయ సమీకరణాలను మార్చాయి. బిహార్, ఏపీలో వచ్చిన ఫలితాల ఆధారంగానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. మధ్యప్రదేశ్‌తో పాటు ఒకటి రెండు రాష్ట్రాల్లోనే గత ఎన్నికల ఫలితాలను బీజేపీ పునరావృతం చేయగలిగింది. లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొద్ది రోజుల్లోనే వివిధ రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని తేలింది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్, హిమాచల్‌లో మొత్తం సీట్లు గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఉపఎన్నికల వరకు వచ్చేసరికి నాలుగు సీట్లు కోల్పోయింది. ఇక ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలు, వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోరాటమే జరపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా తానొక్కడే అన్నట్లుగా ముందుండి నిలిచి ప్రచారం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన గురుతర బాధ్యత ఉన్నది.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కంటే 59 సీట్లు తక్కువ గెలుచుకున్న ఇండియా కూటమిలో రోజురోజుకూ ఉత్సాహం పెరుగుతున్నదనడంలో సందేహం లేదు. ఎన్డీఏ కూటమితో పోలిస్తే 1.9 శాతం మాత్రమే తక్కువ ఓట్లు గెలుచుకున్న ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌లోనూ, వెలుపలా సంఘటిత కార్యాచరణను ప్రదర్శిస్తున్నారు. తొలి సమావేశాల్లోనే ఇండియా కూటమి సంఘటితంగా రాహుల్‌గాంధీని లోక్‌సభా పక్ష నేతగా ఎన్నుకోవడం, కలిసికట్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని అడ్డుకోవడం, ఇటీవల నీతిఆయోగ్ సమావేశాలను బహిష్కరించడం కీలక పరిణామాలు. ఇక ద్వితీయ సమావేశాల్లో కూడా ప్రతిపక్షాలు ఇదే దూకుడును ప్రదర్శించాయి. సమయం దొరికితే చాలు ప్రజల మధ్యకు వెళుతున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీలో కొత్త ఉత్సాహం కనపడుతోంది. గతంలో అరుదుగా లోక్‌సభకు వచ్చి మాట్లాడే రాహుల్‌గాంధీ ఇప్పుడు సమయం దొరికితే చాలు సభలో ప్రతిస్పందిస్తున్నారు. తాజాగా మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, అజిత్ దోవల్, అదానీ, అంబానీ ఈ ఆరుగురినీ ఆయన కౌరవ నేతలుగా పోల్చి వారు రచించిన పద్మవ్యూహంలో దళితులు, బీసీలు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, రైతులు, మధ్యతరగతి తదితరులంతా అభిమన్యుల్లా చిక్కుకున్నారని రాహుల్ అభివర్ణించడం లోక్‌సభలో సంచలనం సృష్టించింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన బీజేపీని సంపన్నులు, అగ్రవర్ణాల అనుకూల ప్రతినిధిగా, ఇండియా కూటమిని సామాన్యుల, మధ్య తరగతి వర్గాల ప్రతినిధిగా అభివర్ణించి తమ రాజకీయ పోరును సైద్ధాంతిక పోరుగా మార్చేందుకు సమర్థంగా ప్రయత్నించారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లోక్‌సభ ఫలితాల తర్వాత అనేకమంది దృష్టి రాహుల్‌గాంధీపై మళ్లిందనడంలో అతిశయోక్తి లేదు. రాహుల్ రెండు ప్రసంగాలకూ సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం లభించింది. ఆయన ప్రసంగాలపై టీవీల్లో ప్రైమ్ టైమ్‌లో చర్చలు సాగుతున్నాయి. లోక్‌సభలో రాహుల్ లేచి నిలబడ్డప్పుడల్లా బీజేపీ నేతలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఒకప్పుడు నరేంద్రమోదీని ఆకాశానికెత్తిన చేతన్ భగత్ లాంటి రచయితలు కూడా రాహుల్‌గాంధీని ప్రశంసించడం మొదలుపెట్టారు. రాహుల్ వ్యక్తిత్వంలో, హావభావాల్లో, ప్రసంగాల్లో పరిపూర్ణ పరివర్తన కనపడుతోందని, ప్రజలు ఆయన చెప్పేది వింటున్నారని, బీజేపీ స్వయంకృతాపరాధాల వల్లే రాహుల్‌కు ప్రజాదరణ పెరుగుతోందని చేతన్ భగత్ విశ్లేషించారు.
చేతన్ భగత్ భావిస్తున్నట్లు రాహుల్ ఇదే విధంగా సరైన ఎత్తుగడలు వేస్తే తన లక్ష్యాన్ని సాధించే అవకాశాలున్నాయి కాని అందుకు చాలా దూరం ఉన్నది. కాని ఇండియా కూటమి టేకాఫ్ మూడ్‌లో ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక 2029 వరకు జరిగే ఎన్డీఏ ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఇండియా కూటమి నేతలే కాదు, బీజేపీ నేతలు కూడా మోదీ కదలికలను ఆసక్తితో గమనిస్తున్నారని చెప్పక తప్పదు.
ఈ పరిస్థితుల్లో 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించడం ద్వారా మోదీ సర్కార్ ఈ రాజకీయ పోరునుంచి ప్రజల దృష్టి మళ్లించగలదా అన్నది అనుమానమే. నేతలు భావి లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలను, కార్యాచరణను నిర్దేశించుకోవడంలో తప్పేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయడంలో అందరికన్నా ముందున్నారు. ఆయన 1998లోనే విజన్–2020 పేరిట లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దాని ఫలితాలు కూడా కనపడ్డాయి.
ఇప్పటి వరకూ నరేంద్రమోదీ ప్రసంగాలు, ప్రకటనలు, హావభావాలు ఎంతో చర్చనీయాంశాలయ్యాయి. అయితే దేశంలో మారుతున్న పరిస్థితుల్లో వికసిత్ భారత్–2047 లక్ష్య నిర్దేశాన్ని ప్రజలు ఎంత సీరియస్‌గా తీసుకుంటారన్నది చర్చనీయాంశం. 2023 ఆగస్టు 15న ఎర్రకోటపై మోదీ ప్రసంగించే నాటికి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదు. ఆయన తన స్వంత మనుగడకోసం ప్రయత్నిస్తూనే తాను ఏర్పర్చుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు స్వల్పకాలిక లక్ష్యాలను కూడా విధించుకోవల్సి ఉంటుంది. కాని స్వల్పకాలిక లక్ష్యాలే నెరవేర్చలేనప్పుడు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించగలమా అన్నది ప్రశ్న. ఉదాహరణకు 2022 కల్లా అందరికీ ఇళ్లు నిర్మిస్తామని 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. కాని ఇప్పటికీ ప్రభుత్వం ఈ లక్ష్యానికి చేరువలో కూడా రాలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్, ఈశాన్య రాష్ట్రాలు ఇళ్ల నిర్మాణంలో 50 శాతం లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయాయి. ఐక్యరాజ్యసమితి దశాబ్దంన్నర క్రితం నిర్ణయించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల విషయంలో కూడా భారతదేశం 167 దేశాల్లో 109వ శ్రేణిలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రెండు రోజుల క్రితం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు.
అందువల్ల ఏ లక్ష్యాన్ని విధించుకున్నా అది ప్రసంగాల వల్ల సాధ్యం కాదు. ముఖ్యమంత్రుల సమావేశం కోసం నీతిఆయోగ్ ప్రకటించిన ఆధారపత్రం కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా పనిచేస్తేకానీ వికసిత్ భారత్ లక్ష్యం పూర్తి కాదని స్పష్టం చేసింది. ప్రధానంగా మూలధన పెట్టుబడులు రాష్ట్రాల్లోనే పెరగాలని ఈ పత్రం తెలిపింది. 2047 కల్లా 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడాలంటే ఇప్పుడున్న 3.36 ట్రిలియన్ డాలర్ల కంటే 9 రెట్లు జీడీపీ పెరగాలని, ఇప్పుడున్న 2392 డాలర్ల తలసరి వార్షికాదాయం 8 రెట్లు పెరగాలని ఈ పత్రం ప్రకటించింది. అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఆదాయానికీ, మన దేశ తలసరి ఆదాయానికి హస్తిమశకాంతరం ఉన్నది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – ఈ 8 రాష్ట్రాలే భవిష్యత్తులో ఎంతో కొంత లక్ష్యాన్ని సాధించగలవే కాని మిగతా రాష్ట్రాలు సమీప దూరంలో కూడా లేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
పేదరికాన్ని తగ్గించడం కాదు, అసలు పేదరికమే లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నీతిఆయోగ్ సమావేశంలో ప్రకటించడం వినసొంపుగానే ఉంది. జీ–20 దేశాల్లోనూ, బ్రిక్స్ దేశాల్లోనూ అతి పేద దేశంగా ఉన్న భారత్ ఈ లక్ష్యం సాధించాలంటే అసమానతలు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అతి వేగంగా చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. భారత్‌లో 15–24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న ప్రతి అయిదుగురిలో ఒకరు నిరుద్యోగి అని అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. అందువల్ల అభివృద్ధి వేగాన్ని పెంచడమే కాదు, ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా ఉండాలని, అధిక సంఖ్యలో ఉపాధి కల్పన జరగాలని 14వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు గోవింద్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో 44 శాతం మంది వ్యవసాయంపై, 42 శాతం మంది చిన్నా చితక సంస్థలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నిరుద్యోగులకు అవసరమైన నైపుణ్యాలు కల్పించడం కూడా ఒక సవాలే.
ఆర్థిక లోటు, జీడీపీలో రుణ శాతం తగ్గించడం అతి పెద్ద సవాలు. మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పు రూ. 185.27 లక్షల కోట్లు దాటగా, అది జీడీపీలో దాదాపు 57 శాతానికి చేరుకున్నదని తాజా బడ్జెట్ పత్రాలు సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో 20 శాతానికి మించి అప్పులు చేశాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వివరించింది. ఆర్థిక లోటు, రుణాల విషయంలో రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం.
అందరికీ నాణ్యమైన ఇళ్లతో పాటు నాణ్యమైన సేవలు, 24 గంటలు స్వచ్ఛమైన నీరు, విద్యుత్ సరఫరా, హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్, బ్యాంకింగ్ సౌకర్యాలు, అందరికీ భరించదగ్గ ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలు, అర్థవంతమైన విద్య, అందరికీ నైపుణ్యం, అందరికీ పుష్కలంగా ఉపాధి, యాజమాన్య అవకాశాలు, పట్టణ ప్రాంతాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన జీవన ప్రమాణాలు, నగరాల్లో ప్రపంచ స్థాయి వ్యాపార, ఆర్థిక కేంద్రాలు, ఉత్పత్తి, సేవలు, లాభసాటి వ్యవసాయంతో పాటు అసలు పేదరికమే లేని దేశంగా మారినప్పుడే వికసిత్ భారత్– 2047 లక్ష్యాన్ని సాధించినట్లవుతుందని నీతిఆయోగ్ స్వయంగా పేర్కొంది. గతంలో అసాధ్యమైన కలల ప్రపంచాన్ని తలపించే ఉటోపియన్ సోషలిజం గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఉటోపియన్ కాపిటలిజం గురించి మన నేతలు మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ప్రజలను స్వప్నాల్లో ఉంచినప్పుడే కదా వారు విజయవంతం అయ్యేది! అయితే అసలు వాస్తవాలు సామాన్యుడి జీవితాల్లో ప్రతిబింబిస్తాయి.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)