Share News

మోదీ పాలనలో అంతా సుభిక్షమేనా?

ABN , Publish Date - Apr 17 , 2024 | 05:42 AM

భారతదేశం 2047 నాటికి ప్రపంచంలో అమెరికాను సైతం తలదన్ని అగ్రరాజ్యంగా మారడం ఖాయమని, ఈ లక్ష్యం సాధించేందుకు తాను ఒక్క క్షణం కూడా వృథా చేయదలుచుకోలేదని ప్రధానమంత్రి...

మోదీ పాలనలో అంతా సుభిక్షమేనా?

భారతదేశం 2047 నాటికి ప్రపంచంలో అమెరికాను సైతం తలదన్ని అగ్రరాజ్యంగా మారడం ఖాయమని, ఈ లక్ష్యం సాధించేందుకు తాను ఒక్క క్షణం కూడా వృథా చేయదలుచుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ‘మోదీకా గ్యారంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఆయన చేసిన ప్రసంగం విన్నవారెవరికైనా ఆయన ఆత్మవిశ్వాసం అబ్బురం కలిగిస్తుంది. కవర్ పేజీపై ‘మోదీ కా గ్యారంటీ’ క్రింద ‘ఫిర్ ఏక్ బార్ మోదీ కా సర్కార్’ (మరోసారి మోదీ ప్రభుత్వం) అన్న వాక్యాలతో ప్రింట్ చేసిన ఈ మేనిఫెస్టోలో మోదీ అన్న పదంతో పాటు అడుగడుగునా నరేంద్రమోదీ ఛాయా చిత్రాలు మనను అలరిస్తాయి. గ్యాస్ సిలిండర్‌లను మహిళలకు ఇస్తున్నట్లు, వృద్ధులను ఆలింగనం చేసుకుంటున్నట్లు, ఆడపిల్లలను దీవిస్తున్నట్లు, యువకులతో మాట్లాడుతున్నట్లు, మెట్రో రైలులో ప్రయాణిస్తున్నట్లు, ఆవులను నిమురుతున్నట్లు, విదేశీ నేతలతో చెట్టపట్టాలేసుకున్నట్లు, పార్లమెంట్‌లో రాజదండంతో నమస్కరిస్తున్నట్లు, పట్టుపంచెలతో తిరుగాడుతున్నట్లు ఊర్థ్వ పుండ్రాలతో వెలిగిపోతున్నట్లు రకరకాల మోదీలు, రకరకాల హావభావాలతో ఎంతో హృద్యంగా మనకు దర్శనం ఇస్తారు. ఏ పేజి తిప్పినా ప్రతి వాగ్దానం ముందు మోదీ గ్యారంటీ అన్న పదాలను చేర్చారు.

ఎవరు అవునన్నా, కాదన్నా 1951లో ఏర్పడిన జనసంఘ్, 1980లో రూపాంతరం చెందిన భారతీయ జనతా పార్టీలు రెండూ ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగిన తమ అస్తిత్వాన్ని ఇవాళ నరేంద్రమోదీ అనే మహా అస్తిత్వంలో విలీనం చేసినట్లు కనపడుతోంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ప్రేమ్‌నాథ్ డోగ్రా, డిపి ఘోష్, బలరాజ్ మధోక్, దీనదయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్ ముఖ్, కుశాభావ్ థాక్రే, అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ ఆడ్వాణీ మొదలైన నాయకుల చారిత్రక పరంపర ఇవాళ ఒక మహా కేంద్ర బిందువు వద్ద ఆగిపోయినట్లు కనిపిస్తోంది. ఆ బిందువు ఎవరో కాదు నరేంద్రమోదీ. ప్రజలకు వాగ్దానాలను నెరవేరుస్తామన్న నమ్మకం కలిగించడం కోసమే ‘మోదీ కా గ్యారంటీ’ అన్న పదాలను ఉపయోగించామని ప్రధానమంత్రి చెప్పుకున్నారు. అంటే పార్టీ పేరు కన్నా తన పేరుకే ఎక్కువ విలువ ఉన్నట్లు ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక్కడే మోదీ ఆత్మవిశ్వాసం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ దేవుడూ మనకు ఫలానా మేలు చేస్తానని వాగ్దానం చేయడు. కాని దేవుడి దగ్గరకు వెళితే తమకు మంచే జరుగుతుందని ఈ దేశంలో కోట్లాది ప్రజలు విశ్వసిస్తారు మోదీ కూడా ఆ విశ్వాసాన్ని మనకు కలుగచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవుడు కాకపోయినా దైవాంశ సంభూతుడు అనే అభిప్రాయాన్ని కలుగ చేస్తున్నారు. మోదీని విశ్వసిస్తే భారతదేశం భూతల స్వర్గంగా మారుతుందని, ఒక అందమైన కలల సామ్రాజ్యంగా మారుతుందని, ఆకలి దప్పులు లేని సమాజం ఏర్పడుతుందని, అంతటా అభివృద్ధి, సంపద విలసిల్లుతాయని, మోదీ అనే శక్తి ముందు పాకిస్థాన్, చైనాతో పాటు పలు దేశాలు మోకరిల్లుతాయని, ఎలాంటి ఉగ్రవాదమైనా తోకముడుస్తుందని, అవినీతిని పూర్తిగా రూపుమాపేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని నమ్మించేందుకు అనేక గ్యారంటీలు ఇస్తున్నారు. ఈ గ్యారంటీలను మనస్ఫూర్తిగా నమ్మి 400కు పైగా సీట్లతో తనకు పట్టాభిషేకం చేస్తారని మోదీ స్వయంగా విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ భవనాన్ని, అయోధ్యలో రామమందిరాన్ని తానొక్కడే ఆవిష్కరించినట్లు ఈ దేశంలో బీజేపీని తానొక్కడే గెలిపించగలనని ఆయన భావిస్తున్నారు. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఈవీఎంలో బటన్ నొక్కే ప్రతి వ్యక్తి మనసులో తానే మెదలాలని ఆయన ఆశిస్తున్నారు.

ఎలాగూ ఎన్నికల సమయంలో తప్పదు కాబట్టి మొక్కుబడిగా బీజేపీ కూడా ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించింది కాని కళ్ల ముందు మోదీ లాంటి మహావ్యక్తి ఉండగా వేరే మేనిఫెస్టోను ఆవిష్కరించాల్సిన అవసరం లేదు. అందువల్లే బీజేపీ మేనిఫెస్టోలో పెద్ద ఆర్భాటాలు లేవు. వివాదాస్పద, భావోద్వేగ అంశాలు లేవు. గత మేనిఫెస్టోలో చెప్పినట్లు జాతీయ పౌరుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా వలస వచ్చిన వారిని ఏరి పారేస్తామన్న వాగ్దానం లేదు. ధరలను తగ్గిస్తామని, రైతుల ఆదాయం ఫలానా సంవత్సరానికల్లా రెట్టింపు చేస్తామన్న అలవిమారిన హామీలూ లేవు. మధుర, కాశీ వంటి వాటి జోలికి పోలేదు. రైతులకు మద్దతు ధరపై చట్టబద్ధత కల్పిస్తామని, యువకులకు శిక్షణతో పాటు భృతి కల్పిస్తామని, ప్రతి పేద మహిళకూ రూ. లక్ష నగదు ఇస్తామని, ఖాళీలుగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని, కులజనగణన జరిపి అన్ని వర్గాలకు సరైన సామాజిక న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లాంటివేవీ బీజేపీలో మనకు కనపడవు. అసలు అలాంటి హామీలు ఇవ్వాల్సిన అవసరమే లేదని బీజేపీ భావిస్తున్నట్లు కనపడుతోంది, అంతేకాదు, ఎన్నికల సంస్కరణలు, పోలీసు సంస్కరణలు, న్యాయవ్యవస్థకు చెందిన సంస్కరణలు వంటి బృహత్తర ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో అమలు చేస్తున్నారు కనుక బీజేపీ ఈ స్మృతిని అమలు చేస్తుందన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. మొత్తంగా 78 పేజీల మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు పాతవే. ఈ మేనిఫెస్టోను చదివిన వారికి మోదీ రాజ్యంలో అంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్లు బీజేపీ బలవంతంగా విశ్వసిస్తున్నట్లు అర్థమవుతుంది. అందువల్ల కొత్తగా ఏమీ చేయనవసరం లేదని, ఇదే వేగంతో పనిచేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చగల శక్తి మోదీకే ఉన్నట్లు బీజేపీ నేతలు విశ్వసించకతప్పడం లేదు.

తాను చేస్తున్న పనులన్నీ సరైనవేనని ఒక నాయకుడు భావిస్తున్నారంటే ఆయనకు తనపై తనకే తిరుగులేని నమ్మకం ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ దేశంలో ప్రతిపక్ష నేతలందర్నీ అవినీతిపరులుగా చిత్రించి ఈడీ, సీబీఐ సంస్థలు జైళ్లలో వేయడాన్ని సరైన చర్యగానే ఆయన భావిస్తున్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. ఈడీ, సీబీఐలు తాను చెప్పినట్లు నడుచుకుంటున్నాయన్న ఆరోపణలను ఆయన తాజాగా ఒక సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొట్టి పారేశారు. ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు సేకరించడం రాజ్యాంగ వ్యతిరేకమని, అక్రమమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తే అది న్యాయపూరితమేనని మోదీ బావిస్తున్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకే తాను ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టానని ఆయన వాదిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం సవ్యంగా ఉన్నదని, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. ఇజ్రాయిల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలను కూడా ఉటంకించి దేశాన్ని సురక్షితంగా ఉంచగలిగిన దివ్యశక్తి తానేనని సంకేతాలు పంపుతున్నారు. తానెవర్నీ భయపెట్టడం లేదని కూడా చెప్పుకున్నారు. మోదీ తన విశ్వరూపాన్ని తానే పెంచుకుని ప్రతిపక్షాలను పిపీలికాలుగా భావిస్తున్నారు.

తాను జరిపే ఉధృత ప్రచార యుద్ధంలో ప్రతిపక్షాల హామీలు గాలికి కొట్టుకుపోతాయని, ద్రవ్యోల్బణం, అవినీతి, నల్లధనంపై తాను చెప్పే మాటల్నే జనం విశ్వసిస్తారని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో తలెత్తే ప్రశ్నలకు జవాబివ్వడం అనవసరమని, అసలు తను ప్రశ్నలకే అతీతుడననేది ఆయన అభిప్రాయంలా కనపడుతోంది. మోదీ మహా బల సంపన్నుడనే సందేశం ప్రజలకు వెళ్లేందుకు, మానవమాత్రులైన ఏ ప్రతిపక్షనేతకూ తనను ప్రశ్నించే యోగ్యతలేదని వారు భావించేలా చేసేందుకు ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆయనలోని గురుత్వాకర్షణ శక్తికి తిరుగులేదని బీజేపీ నేతలు సైతం భావిస్తున్నారు. అచ్చేదిన్ ఆయేగీ, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, హర్ హర్ మోదీ, విశ్వగురు, అమృతకాల్ అంటూ ఆయన ఇచ్చిన నినాదాలన్నీ వారు వల్లెవేస్తున్నారు.

విచిత్రమేమంటే ఏ పార్టీ ఎన్ని వాగ్దానాల వర్షం కురిపించినా అనంతపురం లాంటి కరువు ప్రాంతాల్లో యువకులు వలస వెళ్లకుండా ఉండలేరు. బిహార్‌లోని పల్లెల్లో వృద్ధులు ఢిల్లీలో పనిచేసే తమ పిల్లలు పంపించే కూలి డబ్బుల కోసం ఎదురు చూడకుండా ఉండలేరు. యూపీలో పిహెచ్‌డి చేసిన యువకులు సైతం రూ. 8 వేల జీతానికి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేయక తప్పడం లేదు. ఉపాధి హామీ పథకాలు నిర్వీర్యమై కూలి గిట్టుబాటు అయ్యే పరిస్థితులు ఎక్కడా లేవు. గ్రామీణ నిరుద్యోగిత శాతం రోజురోజుకూ పెరుగుతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెబుతోంది. ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశ స్థానం 111 ర్యాంకు నుంచి పడిపోవడం లేదని, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో 80 కోట్ల మంది ఉచిత ఆహార ధాన్యాలపై ఆధారపడాల్సి రావడం కూడా వాస్తవాలే. ప్రతి ఏటా లక్షలాది విద్యాధికులు, వృత్తి నిపుణులు ఇతర దేశాల్లో ఉపాధి కోసం ఆశగా వెళుతున్నారు. అగ్రరాజ్యంగా మారనున్న మన భారతదేశంలో ఉపాధి కోసం వచ్చే వారెంతమంది? ఎందుకు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆదాయం కన్నా అప్పులు ఎక్కువై శ్రీలంక వంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి?

అందువల్ల మరో కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. ఇది మోదీ అనే మహా వ్యక్తికీ ప్రతిపక్షాలకూ మధ్య జరుగుతున్న ఒక మహా పోరాటం. మోదీ వశీకరణ శక్తికి, ప్రచార నైపుణ్యానికి, పార్టీ నేతలు, కార్యకర్తలు గత్యంతరం లేక లోబడవచ్చేమో కాని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మోదీ మయం కాగలుగుతుందా? ప్రజలు తమ విచక్షణా శక్తిని, వివేచనను ఉపయోగిస్తారా? వాస్తవాలకూ, ప్రచారానికీ మధ్య తేడాను గమనిస్తారా అన్న ప్రశ్నలకు ఈ ఎన్నికల ఫలితాలు సమాధానమిస్తాయి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Apr 17 , 2024 | 05:42 AM