మోదీ ఇండియా, రాహుల్ భారత్
ABN , Publish Date - Sep 25 , 2024 | 05:09 AM
‘మనం మన దేశం గురించి మరణించకపోవచ్చు... కానీ మన దేశం కోసం తప్పనిసరిగా జీవించాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తన అమెరికా పర్యటనలో భాగంగా లాంగ్ ఐలాండ్‌లోని ఒక స్టేడియంలో...
‘మనం మన దేశం గురించి మరణించకపోవచ్చు... కానీ మన దేశం కోసం తప్పనిసరిగా జీవించాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తన అమెరికా పర్యటనలో భాగంగా లాంగ్ ఐలాండ్‌లోని ఒక స్టేడియంలో 13 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దాదాపు 60 బస్సుల్లో అమెరికాలోని 40 రాష్ట్రాల నుంచి భారతీయులను రప్పించారు. ‘భారతదేశం అవకాశాలకోసం ఎదురుచూడడం లేదు. అవకాశాలను కల్పిస్తోంది. ప్రతి భారతీయుడికీ భారతదేశం, దాని విజయాల పట్ల ఆత్మవిశ్వాసం ఉన్నది’ అని మోదీ అన్నారు. సరిగ్గా మూడు వారాల క్రితం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇదే అమెరికాలో విస్తృతంగా పర్యటించి అనేక అంశాలను ప్రస్తావించారు. మోదీ తన అమెరికా పర్యటనలో రాహుల్ ప్రస్తావించిన అంశాలు ఏవీ లేవనెత్తలేదు. తన పాలనలో దేశం అభివృద్ధి చెందుతున్న తీరు, మౌలిక సదుపాయాల విషయంలో శీఘ్ర ప్రగతి గురించి వివరించారు. దాదాపు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా చేశామని, ప్రపంచానికి మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని చెప్పుకున్నారు. సహజంగానే ‘భారత మాతాకీ జై’ అన్న నినాదాలు మిన్నుముట్టాయి. ఆనందోత్సాహాలతో ఎంతో మంది స్త్రీ పురుషులు మోదీతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడడంలో ఆశ్చర్యం లేదు.
మోదీకి పెద్ద ఎత్తున జనాన్ని రప్పించి మాట్లాడడమంటే చాలా ఇష్టం. కేంద్రంలో తొలిసారి అధికారంలోకి రాగానే 2014లో మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోను, 2016లో కాలిఫోర్నియాలోని శాన్జోస్లోను, 2018లో టెక్సాస్‌లోని హ్యూస్టన్లోనూ ఆయన ఇదే విధంగా అమెరికాలో భారతీయ జనాన్ని రప్పించి మరీ వారి ముందు అనర్ఘళంగా ప్రసంగించి హర్షధ్వానాలు స్వీకరించారు.
మోదీ పర్యటించడానికి కొద్ది రోజుల ముందు రాహుల్‌గాంధీ కూడా ఆమెరికాలో మూడు రోజుల పాటు పర్యటించారు. యువజనులు, సాంకేతిక నిపుణులు, విద్యార్థులను, జర్నలిస్టులను కలుసుకున్నారు. అమెరికాలో ట్రక్కు నడుపుతూ ప్రమాదానికి గురైన ఒక సిక్కు డ్రైవర్‌ను, ఆయన మిత్రులను కూడా కలుసుకుని వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. ఇండియా రాగానే కర్నాల్‌లో ఆ డ్రైవర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మోదీ, రాహుల్ ఇద్దరూ ఆమెరికాలో పర్యటించినప్పటికీ వారు కలుసుకున్న ప్రజలు వేరు, మాట్లాడిన అంశాలు వేరు. ఇప్పటి వరకూ అమెరికా వంటి అగ్రరాజ్యానికి వెళ్లి నరేంద్రమోదీ చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడిన భారతీయ నేత లేరు. గత పది సంవత్సరాలుగా రాహుల్‌గాంధీ పడుతూ, లేస్తూ, పాఠాలు నేర్చుకుంటూ అటు పార్లమెంట్‌లోనూ, బహిరంగ సభల్లో మాత్రమే కాకుండా అమెరికాకు కూడా వెళ్లి మాట్లాడగలిగిన స్థాయికి చేరుకున్నారనడంలో సందేహం లేదు. ఈ ఇద్దరి పర్యటనలు వారి ఆలోచనా దృక్పథాలను ప్రతిఫలించాయి. ఒక ప్రధానిగా మోదీ భారతదేశంలో అద్భుతాలు జరుగుతున్నాయని, తన హయాంలో అభివృద్ధి తార స్థాయికి చేరుకున్నదని చెప్పుకోవడం సహజం. అదే సమయంలో భారతదేశంలో నిరుద్యోగం గురించి, ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు లేకపోవడం గురించి, ప్రతిపక్ష పార్టీల అణచివేత గురించి, రైతుల సమస్యల గురించి రాహుల్ అమెరికాలో భారత జనానికి వివరించారు. మోదీ మాటలు విని హర్షధ్వానాలు చేసే ప్రేక్షకులు వేరు. రాహుల్ మాటలు విని ప్రశ్నలు లేవనెత్తే జనం వేరు. ఈ ఇద్దరూ తమ ఆడియెన్స్‌ను తాము సృష్టించుకున్నారు. రాహుల్‌గాంధీలా వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌కు మోదీ వెళ్లి జర్నలిస్టులతో మాట్లాడే అవకాశాలు లేవు. భారతదేశంలోనే ఆయన గత పదేళ్లలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఇరువురి భావాల ఘర్షణకు అమెరికా వేదిక అయింది.
తేడా ఏమంటే మోదీ ఇప్పటికే తనతో ప్రభావితమైన వారితో మాట్లాడితే రాహుల్ తన ప్రభావం చూపేందుకు అమెరికాలో రకరకాల భారతీయ వర్గాలను కలుసుకున్నారు. ఇద్దరూ ఒకే ఇండియా గురించి మాట్లాడారు. అయితే మోదీ ప్రచారం చేసిన ఇండియా వేరు, రాహుల్ ప్రదర్శించిన ఇండియా స్వరూపం వేరు. ఒకరిది సంపన్న భారతదేశం, అభివృద్ధి కోసం ఉరకలు వేస్తున్న ఇండియా అయితే మరొకరిది నిరుద్యోగం, అధిక ధరల మధ్య సతమతమవుతూ, పలు అణచివేతలను ప్రతిఘటిస్తున్న భారతదేశం. మోదీ, రాహుల్‌లలో ఎవరు వాస్తవం చెబుతున్నారనుకోవాలి? నిజానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ప్రస్తావించిన వేర్వేరు ఇండియాలు భారతదేశంలో ఉన్నాయని ఎవరైనా అంగీకరించక తప్పదు. మోదీ తన హయాంలో సృష్టించిన సంపద గురించి మాట్లాడితే రాహుల్‌గాంధీ ఈ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం గురించి మాట్లాడారు. ‘నేను మోదీని ద్వేషించను.. నా ఆలోచనా విధానం వేరు, ఆయన ఆలోచనా విధానం వేరు..’ అని రాహుల్ వాషింగ్టన్‌లోని జార్జిటౌన్ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతూ చెప్పారు.
రాహుల్‌గాంధీ తన అమెరికా పర్యటనలో సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపు గురించి మాట్లాడారు. చైనా దళాలు చొచ్చుకురావడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను భారతదేశంలో ఎవరూ పెద్దగా ఖండించలేదు. నిజానికి ఈ విషయంలో మోదీ ప్రభుత్వంలో కూడా ఆందోళన నెలకొన్నది. అందువల్ల ఒక వైపు అమెరికాలో మోదీ క్వాడ్ సమావేశంలో పాల్గొని, కీలకమైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నప్పటికీ మరోవైపు చైనాతో చర్చలకు ద్వారాలు తెరిచారు. కొద్ది రోజుల క్రితం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ జాతీయ రక్షణ సలహాదారుల సమావేశంలో భారత భద్రతా సలహాదారు అజిత్ డోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ, చైనా విదేశాంగ మంత్రితోనూ చర్చలు జరిపారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నుంచి ఇరు దేశాల సైన్యాలు తక్షణమే వెనక్కు వెళ్లేలా చేయాలని కోరారు. అంతకు ముందు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గడంతోపాటు భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే చైనాతో వ్యాపార సంబంధాలు సజావుగా సాగడం ముఖ్యమని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ లాంటి వారు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా దూకుడు గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉన్నదని చెప్పక తప్పదు. చైనా బలగాలు వెనక్కు తగ్గేలా చేయడం మోదీకి కూడా రాజకీయ అవసరం.
స్థూలంగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్ద సమస్యల్లేవు. 13 సంవత్సరాలు గుజరాత్లో ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన తర్వాత ఆయన పది సంవత్సరాలు కేంద్రంలో అధికారం చెలాయించారు. భారతీయ జనతా పార్టీని రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో గెలిపించిన మోదీ మూడోసారి కూడా ఆ పార్టీకి 240 సీట్లు సంపాదించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. ఇప్పటికీ బీజేపీ, దాని మిత్రపక్షాలు 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. లోక్ సభలో 543 సీట్లలో 293 సీట్లు, రాజ్యసభలో దాదాపు సగం సీట్లు ఎన్డీఏకు ఉన్నాయి. మరో అయిదేళ్ల వరకూ నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీకి ఢోకా లేదని చెప్పేందుకు అనేక కారణాలున్నాయి.
అయితే రాజకీయాల్లో స్థిరత్వం పూర్తిగా సంఖ్యా బలంపై ఆధారపడి ఉండదు. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, మన పాలన ఎలా సాగుతుంది, మన విధానాలు ఎలా ఉన్నాయి, ఇతర రాజకీయ పార్టీలకు ఎంత మేరకు జనాదరణ లభిస్తుంది అన్న అంశాలపై ప్రభుత్వం గ్రాఫ్ పెరుగుతోందా, పడిపోతుందా సులభంగా చెప్పవచ్చు. మోదీ మూడోసారి తక్కువ సంఖ్యాబలంతో గెలిచిన తర్వాత మళ్లీ పూర్తి మెజారిటీ సాధించేలా పార్టీని నడిపించడం ఆయనకు కత్తిమీద సాములా కనపడుతోంది. ఒకరి నాయకత్వంలో పార్టీ దినదిన ప్రవర్ధమానమవుతుంటే అందరూ ఆరాధించేవారే కనపడుతుంటారు. కాని అదే పార్టీ దెబ్బతినడం ప్రారంభమవుతే బహిర్గత విమర్శకులతో పాటు అంతర్గత ప్రత్యర్థులు కూడా సిద్ధమవుతారు. శ్రీశ్రీ అన్నట్లు నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరిపోతుంటే నిబిడాశ్చర్యం ప్రదర్శించినవారే నేలకు రాలిపోతున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారు. మోదీకి ఇకనుంచి అగ్ని పరీక్షలు మొదలు కానున్నాయి. హర్యానా, జమ్ము–కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆయన శక్తి సామర్థ్యాలకు పరీక్షగా మారనున్నాయి. ఇప్పటి వరకూ ప్రతి ఎన్నికలోనూ మోదీయే తాను ముందుండి నిలిచి ఉధృతంగా ప్రచారం చేసి గెలిపించారు. పార్టీ అంతా ఆయనపైనే ఆధారపడవలసిన పరిస్థితి ఆయనే కల్పించారు. ఎన్నికల్లో గెలిపించడం అనేది సింహంపై స్వారీ చేయడం లాంటిదని ఆయనకు కూడా తెలుసు. ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు మోదీ, షాలు ఇంతవరకూ ప్రయోగించిన అస్త్రాలు ఇక ముందు కూడా పనిచేస్తాయో లేదో చెప్పలేము.
మోదీకి ఎన్ని సమస్యలున్నాయో రాహుల్‌కు కూడా అన్ని సమస్యలున్నాయి. బీజేపీ అంతా మోదీ వైపు చూస్తున్నట్లు ఇండియా కూటమి అంతా రాహుల్ నాయకత్వ శైలిపైనే ఆధారపడి ఉన్నదని చెప్పక తప్పదు. అందువల్ల రాహుల్ వేసే ప్రతి అడుగూ, మాట్లాడే ప్రతి మాటా ఆచితూచి మాట్లాడక తప్పదు. మోదీ ఎదుర్కొనే ప్రతి సమస్యను రాహుల్ తనకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ 99 సీట్లు సాధించిన తర్వాత ఆయన ప్రతిపక్ష నేతగా అమెరికా వెళ్లి మాట్లాడే ధైర్యం చేయగలిగారు. కాని ఇంటగెలవకుండా రచ్చగెలవడం సాధ్యం కాదు. అనేక చోట్ల సంస్థాగత బలహీనతలు, అసమ్మతి, అసంతృప్తి, నాయకుల మధ్య కుమ్ములాటలు కాంగ్రెస్ సహజలక్షణాలుగా మారాయి. ఏఐసీసీ హర్యానా నేతలతో నిండిపోవడం, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలనుంచి నేతలు ఢిల్లీ చుట్టూ తిరగడం చూస్తుంటే పాత సంస్కృతిలోంచి కాంగ్రెస్ ఇంకా బయటపడలేదని తెలుస్తోంది. నరేంద్ర మోదీ, రాహుల్గాంధీలలో ఎవరు దేశానికి దిశానిర్దేశం చేయగలరు?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)