ప్రహసనంగా మారుతున్న పార్లమెంట్
ABN , Publish Date - Dec 11 , 2024 | 01:06 AM
ఒక గుర్రానికీ, దుప్పికీ మధ్య ఘర్షణ జరుగుతుంది. దుప్పితో నెగ్గుకురాలేని గుర్రం వేటగాడి వద్దకు వెళ్లి సహాయం కోరుతుంది అందుకు సరేనన్న వేటగాడు నీ దవడల మధ్య ఇనుప కడ్డీ పెట్టి కళ్లెం బిగించేందుకు, నీ వీపుపై....
ఒక గుర్రానికీ, దుప్పికీ మధ్య ఘర్షణ జరుగుతుంది. దుప్పితో నెగ్గుకురాలేని గుర్రం వేటగాడి వద్దకు వెళ్లి సహాయం కోరుతుంది అందుకు సరేనన్న వేటగాడు నీ దవడల మధ్య ఇనుప కడ్డీ పెట్టి కళ్లెం బిగించేందుకు, నీ వీపుపై జీను వేసి నేనెక్కి నడిపించేందుకు అనుమతించు చాలు. నీ శత్రువును వెంటాడి వేటాడొచ్చు.. అని అంటాడు. ఈ షరతులకు గుర్రం అనుమతిస్తుంది. చివరకు దుప్పినైతే వేటగాడు వేటాడి చంపుతాడు కాని గుర్రాన్ని అలాగే అదుపులో ఉంచుకుంటాడు. దుప్పిమీద కోపంతో వేటగాడి సహాయం కోరితే జీవితాంతం వేటగాడి అదుపులో ఉండాల్సి వస్తోందని గుర్రం బాధపడుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రీసులో ఒక బానిస చెప్పిన పిట్టకథల్లో ఇదొకటి.
‘ప్రజాస్వామ్యాలు ఎలా మరణిస్తాయి’ (హౌ డెమాక్రసీస్ డై) అన్న పుస్తకంలో హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన రాజనీతి శాస్త్రజ్ఞులు స్టీవెన్ లెవిట్క్సీ, డేనియల్ జిబాల్ట్ ఈ పిట్టకథను ఉటంకిస్తూ ఎన్నికైన నేతలు తమ అధికారాన్ని పెంచుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని ఎలా హరిస్తారో వివరించారు. అమెరికా ప్రజాస్వామ్యంపై డోనాల్డ్ ట్రంప్ ప్రభావాన్ని కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. పరస్పర సహనం, గౌరవం అధికార ప్రతిపక్షాలు ఎలా కోల్పోతాయో ఈ రచయితలు వివరించారు. వెనిజులా, రష్యా వంటి లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లో పరిస్థితులను కూడా వారు తమ వాదనలను సమర్థించుకునేందుకు ఉదహరించారు.
భారతదేశంలో కూడా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అనిపించదు. గత పది రోజులుగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను చూస్తుంటే అసలు ప్రజాస్వామ్య ప్రక్రియను కొనసాగించేందుకు ఎవరికైనా ఆసక్తి ఉన్నదా అనిపిస్తుంది. 18వ లోక్‌సభ ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ తన ప్రభుత్వం సభలోనూ, బయటా ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తుందని, కాని ప్రతిపక్షం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ప్రజలు ఆశిస్తారని, సభలో హంగామా సృష్టించడం వారికి నచ్చదని చెప్పారు. నవంబర్ 25న శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా మోదీ దాదాపు ఇదే వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తిరస్కరించిన గుప్పెడు మంది తమ స్వార్థపర రాజకీయ ప్రయోజనాలకోసం పార్లమెంట్‌ను భగ్నం చేయాలని చూస్తున్నారని కొత్త ఆలోచనలతో, ఉత్సాహంతో వచ్చిన కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు రెండూ పెద్దగా జరగలేదు. బీజేపీని 240 సీట్లకు కుదించామన్న ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తొలి సమావేశాల్లో కలిసికట్టుగా సభలో తమదే పై చేయి అన్నట్లుగా వ్యవహరించాయి. కాని బడ్జెట్ సమావేశాలకూ శీతాకాల సమావేశాలకూ మధ్య జరిగిన హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించడంతో ప్రతిపక్షాల నైతిక స్థైర్యం దెబ్బతిన్నది. కాని సరిగ్గా శీతాకాల సమావేశాలకు ఒకటి రెండు రోజుల ముందు అదానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ముడుపులు చెల్లించారని అమెరికన్ ప్రాసిక్యూటర్లు ఆరోపించడం ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఉత్సాహాన్ని రేకెత్తించింది. దీనితో అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉభయ సభలను స్తంభింపచేయడం మొదలు పెట్టారు. రాజ్యాంగ దినోత్సవం, ఒకటి రెండు బిల్లులపై చర్చలు జరిగినప్పటికీ గత 15 రోజులుగా పార్లమెంట్‌లో పెద్దగా కార్యకలాపాలు జరగలేదు.
అసలు పార్లమెంట్‌లో జరుగుతున్నది ప్రజలు గమనిస్తున్నారా? ఎంతమందికి పార్లమెంటరీ కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉన్నది? జాతీయ స్థాయిలో ఢిల్లీలో కాలుష్యం, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన, సిరియాలో తిరుగుబాటు వంటి వార్తలకు వచ్చిన ప్రాధాన్యం కూడా పార్లమెంట్ సమావేశాలకు రావడం లేదు. పార్లమెంట్‌లో ఎంపీలు లిఖిత పూర్వకంగా అడిగే ప్రశ్నల్లో, మంత్రులు ఇచ్చే జవాబుల్లో పస కనబడడం లేదు. అంతా యాంత్రికంగా, మొక్కుబడిగా జరుగుతున్నట్లు కనపడుతోంది. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా పార్లమెంట్‌లో అద్భుతమైన ప్రసంగాలు కానీ, చర్చలు కానీ జరిగిన దాఖలాలు లేనే లేవు. ఒకప్పుడు హేమాహేమీలైన నేతలు మాట్లాడుతుంటే మీడియా, అతిథుల గ్యాలరీలు కిక్కిరిసిపోయి కనిపించేవి. ఇప్పుడు పార్లమెంట్ గ్యాలరీలు మీడియా ప్రతినిధులు లేక వెలవెలబోతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అధిక దూరం నడవాల్సి రావడం, పార్లమెంట్‌లో చర్చలు జరగకపోవడం వల్ల మీడియా ప్రతినిధులు ఎప్పుడో కాని వెళ్లవలసిన అవసరం కూడా కనపడడం లేదు. మొదటి లోక్‌సభ సగటున ఏడాదికి 135 రోజులు సమావేశమయితే రాను రానూ ప్రతి లోక్‌సభ సమావేశాలు తగ్గిపోతూ వస్తున్నాయి. 17వ లోక్‌సభ కేవలం 55 రోజుల పాటే సమావేశమైంది. పార్లమెంట్‌లో ఆమోదించే అనేక బిల్లులు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాని వాటి గురించి కూడా పార్లమెంట్‌లోనూ, బయటా జరగాల్సిన చర్చ జరగడం లేదు. చర్చ లేకుండా వాటిని ఆమోదించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 17వ లోక్‌సభలో 35 శాతం బిల్లులపై కేవలం గంటలోపే చర్చ జరిగి ఆమోదం పొందాయి. 18వ లోక్‌సభ ముగిసే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.
అసలు ‘మోదీ అదానీ ఏక్ హై’ అని పార్లమెంట్‌లో నినాదాలు చేస్తూ, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ప్రతిపక్షాలకు మీడియాలోనూ, బయటా ఎంత ప్రాధాన్యత లభిస్తోంది? అదే సమయంలో కశ్మీర్ స్వతంత్రతను సమర్థించిన అమెరికన్ పారిశ్రామికవేత్త జార్జి సోరోస్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలున్నాయని బీజేపీ నేతలు చేస్తున్న వాదనలను ఎంత మంది పట్టించుకుంటున్నారు? నిజానికి ఈ అంశాలు ఎన్నికల ప్రచారంలోనూ చర్చకు వచ్చాయి కాని ఈ ఆరోపణల ఆధారంగా ప్రజలు ఓటింగ్ చేశారని చెప్పేందుకు ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు. కాని పార్లమెంట్ సమావేశాల సమయంలోనే వీటిని ప్రస్తావించి సభను భగ్నం చేసేందుకు ఇరు పక్షాలు ఎందుకు పూనుకుంటున్నాయి?
నిజానికి పార్లమెంట్ సజావుగా జరగాలని అధికార ప్రతిపక్షాల్లో ఎవరు అనుకుంటున్నారో చెప్పడం కష్టం. ఉభయ పక్షాలూ తాము అధికారంలో లేనప్పుడు పార్లమెంట్ ప్రతిష్టంభనను ఆయుధంగా వాడుకున్నవారే. 1987లో బోఫోర్స్ కుంభకోణంపై ప్రతిపక్షాలు 45 రోజుల పాటు సభ స్తంభించిపోగా 2010లో శీతాకాల సమావేశాలు మొత్తం 2జీ కుంభకోణంపై అట్టుడికిపోయాయి. 2012లో బొగ్గు కుంభకోణంపై ఆరు రోజుల పాటు సభలు జరగలేదు. అప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేసేందుకు వెనుకాడలేదు. ‘పార్లమెంట్‌ను స్తంభింపచేయడం ప్రజాస్వామ్యానికి మంచిది. అదేమంత అప్రజాస్వామికం కాదు’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ నాడు వ్యాఖ్యానించారు. ‘పార్లమెంట్‌ను సరిగ్గా పనిచేసేందుకు అనుమతించకపోవడం కూడా ప్రజాస్వామ్య లక్షణమే’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కూడా వ్యాఖ్యానించారు. 2001లో తెహెల్కా కుంభకోణంపై కూడా కాంగ్రెస్ 17 రోజులు పార్లమెంట్‌ను స్తంభింపచేసినప్పుడు కూడా తన్ను తాను సమర్థించుకుంది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ప్రతిష్టంభనను సమర్థించుకుంటోంది.
నిజానికి బోఫోర్స్, హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం 2జీ కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించిన తర్వాత సభలు సజావుగా సాగాయి. జేపీసీలకు తమ పార్టీ సభ్యులే చైర్మన్లుగా ఉంటారని, వాటి ద్వారా ప్రభుత్వాలు క్లీన్ చిట్ ఇప్పించుకోవడం సాధ్యమని తెలిసినప్పటికీ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి పట్టువిడుపులకూ ఆస్కారం కల్పించడం లేదు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఒకే అంశంపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్‌కు ఒప్పుకోనప్పుడు ఇతర అంశాలపైన అయినా చర్చించేందుకు అవి ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే ఈ ప్రతిష్టంభనకు కారణమని కొత్తగా సభ్యురాలైన కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వాధ్రా కూడా విమర్శించారు. ఎవరూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేనందువల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. గతంలో ఇందిరాగాంధీ తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి విదేశీ శక్తులు కారణమని తరుచూ ఆరోపించేవారు ఇప్పుడు బీజేపీ కూడా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపిస్తోంది.
దీనివల్ల కొన్ని అవాంఛనీయమైన పరిణామాలు జరుగుతున్నాయి. సోనియాగాంధీకి విదేశీ నిధులపై బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, ఇతర ఎంపీలు సభలో ప్రకటనలు చేయడాన్ని అనుమతించడంతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రతిపక్షాలపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం, మణిపూర్, రైతుల నిరసనపై నోటీసులను తిరస్కరించడం ఒక ఎత్తైతే, రాజ్యసభ చైర్మన్‌పైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు నిర్ణయించడం రాజకీయాలను మరింత అనారోగ్యకరంగా మార్చాయి. కాంగ్రెస్ వైఖరి రాజ్యాంగానికే అవమానమని జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. గతంలో వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి వారిని శాంతిపచేసేవారు. ఇప్పటి రాజ్యసభ చైర్మన్ అధికార పార్టీ నేతల కన్నా కటువుగా మాట్లాడుతున్నట్లు కనపడుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరిగినా ప్రతిపక్షాలు నెగ్గే అవకాశం లేదు అయినప్పటికీ పెద్దల సభ చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించడం, దానిపై చర్చ జరగడం ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు. ఇలా జరగడం పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి. అధికార, ప్రతిపక్షాల మధ్య సంబంధాలు ఇంత విషపూరితంగా మారేందుకు ఎవరు కారణం? 18వ పార్లమెంట్ తొలి రెండు సమావేశాలే ఇలా జరిగితే రానున్న అయిదు సంవత్సరాలు ఎంత దారుణంగా మారతాయో చెప్పలేము.
భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అనేది దేశ పాలక ప్రతిపక్షాల చేతుల్లో లేదని రోజురోజుకూ స్పష్టమవుతోంది. ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఏ ఒక్క రాజకీయ నేతకూ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య ఆలయమైన పార్లమెంటు సమావేశాలు, చర్చలు హాస్యాస్పదంగా, విషాదంగా మారకుండా చూడడం ప్రజల బాధ్యత.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)