Share News

హస్తినలో తెలుగు నేతల హల్‌చల్‌

ABN , Publish Date - Nov 20 , 2024 | 02:16 AM

‘తెలుగుదేశం కేంద్రంలో కీలక పాత్ర పోషించడం ఇది మొదటిసారి కాదు. 1989లో ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాం. 1996–1998 మధ్యలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోనూ, ఆ తర్వాత...

హస్తినలో తెలుగు నేతల హల్‌చల్‌

‘తెలుగుదేశం కేంద్రంలో కీలక పాత్ర పోషించడం ఇది మొదటిసారి కాదు. 1989లో ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాం. 1996–1998 మధ్యలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోనూ, ఆ తర్వాత ఆరున్నర సంవత్సరాలు వాజపేయి ప్రభుత్వంలోనూ తెలుగుదేశం ప్రధాన భూమిక నిర్వహించింది. పార్లమెంట్‌లో ఒకప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. ఆ సమయంలో బీజేపీకి రెండు సీట్లు లభిస్తే తెలుగుదేశంకు 35 సీట్లు లభించాయి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత వారం హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిజంగా అవి దేశ రాజధానిలో తెలుగువారికి సంబంధించి బంగారు రోజులు. తొలుత ఎన్టీఆర్‌ను, తర్వాత చంద్రబాబునాయుడును కలుసుకునేందుకు జాతీయ స్థాయి నేతలు ఆసక్తి ప్రదర్శించిన రోజులవి. యునైటెడ్ ఫ్రంట్ రోజుల్లో చంద్రబాబునాయుడు బస చేసే ఏపీభవన్ ఫ్రంట్ ప్రధాన కార్యాలయంలా ఉండేది. వాజపేయి కూడా అనేక కీలక అంశాలపై ఆయనతో చర్చించేవారు. తరుచూ రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకేకాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకోసం చంద్రబాబు తరుచూ వచ్చి సుడిగాలిలా కేంద్ర మంత్రులను కలిసేవారు. ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్లు పారిశ్రామికవేత్తలను ఆకర్షించేవి. ఎన్నోసార్లు ఆయన జాతీయ స్థాయిలో జరిగిన మీడియా సదస్సుల్లో పాల్గొనేవారు.


దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది. హిందుస్థాన్ టైమ్స్ మాత్రమే కాదు, మరో జాతీయ పత్రిక ‘ఇండియా టుడే’ కూడా దేశంలో అత్యంత శక్తిమంతులైన పది మంది నాయకుల్లో ఒకరుగా చంద్రబాబును గుర్తించింది. తెలుగుదేశంకు చెందిన 16 మంది ఎంపీలు లేకపోతే మోదీ ప్రభుత్వం మెజారిటీకి చేరువలోకి వచ్చేది కాదని ఇండియా టుడే పేర్కొంది. దేశంలో అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు బూడిదలోంచి పునరుత్థానమయ్యే ఫీనిక్స్ పక్షిలా మళ్లీ జాతీయ స్థాయిలో ప్రత్యక్షమయ్యారని ఆ పత్రిక ప్రశంసించింది. ఆయన హయాంలో స్థాపించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆయన కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.


చంద్రబాబునాయుడు మాదిరి ఢిల్లీలో చర్చకు వచ్చిన తెలుగు రాష్ట్రాల అధినేతలు తక్కువే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 33 మంది ఎంపీలు రాష్ట్రం నుంచి గెలిచినప్పటికీ ఆయన రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యేవారు. జాతీయ సదస్సుల్లో ఆయన ఏనాడూ పాల్గొనలేదు. యూపీఏ హయాంలో భాగస్వామిగా ఉన్న కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ ఏనాడూ జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేందుకు ప్రయత్నించలేదు. కేంద్రమంత్రిగా ఆయన తన మంత్రిత్వశాఖకు కూడా పెద్దగా హాజరు కాలేదు. ఆ విషయం పార్లమెంట్‌లో కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఆయన ఢిల్లీ వచ్చి జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భాలు అతి తక్కువ. ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడినప్పుడు, పార్టీని బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు కూడా జాతీయ మీడియా అంతగా చర్చించలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ రోజుల తరబడి తుగ్లక్ రోడ్ నివాసంలో ఉన్నప్పటికీ ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నప్పటికీ ఢిల్లీలో మీడియాతో ఎందుకు మాట్లాడడం లేదని నేను ఒకసారి అడిగితే ఆయన ఆ అవసరం లేదని కొట్టిపారేశారు. 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ కూడా కేసీఆర్ మాదిరి కూపస్తమండూకంలా వ్యవహరించారు. ఏపీలో అభివృద్ధి గురించి మాట్లాడేందుకు కానీ, పెట్టుబడులను ఆహ్వానించేందుకు కానీ ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. వ్యక్తిగత ప్రయోజనాలకోసం, కేసుల కోసం మాత్రమే ఆయన నరేంద్రమోదీ, అమిత్ షాలను కలుసుకునేందుకు వచ్చేవారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి మోదీ దృష్టిలో పడేందుకు మాత్రమే తాపత్రయపడేవారు. మిగతా ఎంపీలు కూడా అస్తిత్వం లేనట్లే ఉండేవారు. పోనీ గత అయిదేళ్లలో ఏ–1, ఏ–2లపై ఉన్న కేసుల్లో ఒక్క సెక్షన్ అయినా తగ్గించుకోగలిగారా అంటే అదీ లేదు.


ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే తెలుగు రాష్ట్రాల్లో మరో ముఖ్యమైన నేతగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల కూడా ఢిల్లీలో రాజకీయ వర్గాలు, మీడియా ఆసక్తి ప్రదర్శించడం. కేసీఆర్‌ను ఓడించడంలో రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విఫలమైన తర్వాత రేవంత్‌రెడ్డి వెలుగులోకి రాగలిగారు. అనతి కాలంలోనే వివిధ రాష్ట్రాలకు చెందిన వృద్ధనేతలు తమ స్వంత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేలేక చతికిలపడ్డ సమయంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి ఆ పార్టీకి భవిష్యత్తుపై ఆశ కల్పించారు. బీజేపీ 240 సీట్లు దాటదని సార్వత్రక ఎన్నికల ముందు ఇండియా టీవీ రజత్ శర్మ షోలో ప్రకటించిన తర్వాత జాతీయ మీడియా దృష్టిలో పడ్డారు. రేవంత్ హిందీ, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాట్లాడుతూ ఎదురు దాడులు చేయగలగడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆయనను మహారాష్ట్రలో స్టార్ కాంపైనర్‌గా కూడా మొహరించింది. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో పథకాలను అమలు చేయడం లేదన్న మోదీ ఆరోపణలను ఆయన తిప్పికొట్టడమే కాక, మహారాష్ట్రకు రావల్సిన ప్రాజెక్టులను గుజరాత్ తరలించుకుపోవడాన్ని ఎత్తి చూపి బీజేపీ ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో భవిష్యత్తు ఉన్న నేతల్లో ఒకరుగా ఆయన ఇప్పటికే గుర్తింపు పొందారు.


ఈ రీత్యా ఢిల్లీలో చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు ఎన్డీఏలోనూ, మరొకరు కాంగ్రెస్‌లోనూ కీలకపాత్ర పోషిస్తుండడం గమనార్హం. కాని ఢిల్లీలో ఎంతగా గుర్తింపు పొందినప్పటికీ చంద్రబాబుతో పోలిస్తే రేవంత్‌కు ఉన్న అవరోధాలు ఎన్నో. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకీ ఉన్న తేడా లాంటిది. చంద్రబాబు మాదిరి రేవంత్ ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం లేదు. అంతేకాక చంద్రబాబు ఒక ప్రాంతీయ పార్టీ అధినేత. పూర్తి పార్టీ ఆయన పట్టులో ఉంటుంది. వైసీపీలో ఎవరైనా విమర్శించినా, ఆఖరుకు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసినా అందుకు బలమైన జవాబు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. చంద్రబాబు తనకు కావల్సిన టీమ్‌ను ఏర్పర్చుకోగలరు. అధికార యంత్రాంగంపై పట్టుబిగించగలిగిన శక్తి ఆయనకు ఉన్నది. కాంగ్రెస్ అనే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో రేవంత్‌ ఉన్నారు. కనుక రాష్ట్ర పార్టీపై ఆయన పట్టు అంతగా బిగించలేకపోతున్నారు. రేవంత్‌ను ఎవరైనా విమర్శిస్తే అంతే స్థాయిలో విరుచుకుపడే సీనియర్ నేతలు పెద్దగా లేరు. అంతేకాక ప్రత్యర్థులు విమర్శిస్తుంటే అందుకు ఒకటి రెండు విమర్శలు జోడించి ఢిల్లీకి చేరవేసేవారు ఎక్కువగా ఉంటారు. అధికారులను, టీమ్‌ను ఎంచుకోవడంలో కూడా చంద్రబాబుకున్న సౌలభ్యం ఆయనకు లేదు. ఏది ఎక్కడి నుంచి లీక్ అవుతున్నదో కూడా చెప్పడం కష్టం. అయినప్పటికీ తనకున్న పరిమితులను అధిగమించేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘కాంగ్రెస్ ప్రస్తుత ఫార్మాట్‌ను మార్చాల్సిన అవసరం ఉన్నది. ట్వంటీ ఓవర్ల మాచ్‌లో ఆడాల్సినట్లు ఆడే బదులు ఇంకా టెస్ట్ మ్యాచ్ మాదిరి ఆడుతున్నాం’ అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాల గురించి ఎక్స్‌ప్రెస్ అడ్డా షోలో ధైర్యంగా చెప్పగలగడం రేవంత్‌కే సాధ్యమైంది.


చంద్రబాబు, రేవంత్‌ల తర్వాత ఢిల్లీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రవేశించి రంగంలోకి దిగడం మరో ఆసక్తికరమైన పరిణామం. అమృత్ టెండర్లు, లగచర్ల ఘటనల గురించి ఆయన గత వారం రోజుల్లో రెండుసార్లు ఢిల్లీలో జాతీయ మీడియాలో మాట్లాడారు. ఆశ్చర్యకరంగా కేటీఆర్‌కు జాతీయ మీడియా కీలక ప్రాధాన్యత నిచ్చింది. కనీసం డజన్ ఛానళ్లు ఆయనతో ముఖాముఖి ఇంటర్వ్యూలు చేశాయి. ఆయన కూడా ఇంగ్లీషు, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఆయన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలను విమర్శించడం, అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా లగచర్ల ఘటనపై విరుచుకుపడడం యాదృచ్ఛికం కాదు. నిజానికి కేసీఆర్ హయాంలో కూడా మల్లన్నసాగర్ వంటి ఘటనలు జరిగినప్పటికీ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీలో పెద్దగా మాట్లాడలేదు సరికదా, జాతీయ మీడియాలో సైతం చర్చకు రాలేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్రతిష్టపాలు కావడం, తమ పుట్టల్లో పాములేమున్నాయా అని రేవంత్‌రెడ్డి సర్కార్ త్రవ్వే యత్నం చేయడంతో బీఆర్ఎస్ జీవన్మరణ సమస్యలో పడింది. అందువల్ల కేటీఆర్ ఢిల్లీలో ప్రవేశించి ఊరూవాడ ఏకం చేసి మద్దతు కోసం ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాపై కేటీఆర్ పట్టు బిగించినట్లు స్పష్టమవుతోంది. గత రెండు నెలలుగా కేసీఆర్ ఏమి చేస్తున్నారో తెలియకపోవడంతో పార్టీ పగ్గాలు పూర్తిగా కేటీఆర్ చేతుల్లోకి వచ్చాయన్న విషయం స్పష్టమవుతోంది. అయితేనేం, కనీసం నాలుగు సంవత్సరాలు ఆయన పోరాడక తప్పదు. కాని మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తే తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరిగే అవకాశాలున్నాయి. ఇంటగెలిచిన తర్వాతే రచ్చగెలుచుకోగలమని చంద్రబాబు ఎప్పుడో గ్రహించారు. రేవంత్‌ ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Nov 20 , 2024 | 02:16 AM