Share News

కుల, మత ఎజెండాల ‘మహా’ ప్రశ్నలు

ABN , Publish Date - Nov 13 , 2024 | 03:26 AM

దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల నుంచి రిజర్వేషన్లను లాక్కొని మైనారిటీలకు కేటాయించే యోచనలో కాంగ్రెస్‌ ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్రలో అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ మీ మంగళ సూత్రాలను....

కుల, మత ఎజెండాల ‘మహా’ ప్రశ్నలు

దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల నుంచి రిజర్వేషన్లను లాక్కొని మైనారిటీలకు కేటాయించే యోచనలో కాంగ్రెస్‌ ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్రలో అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ మీ మంగళ సూత్రాలను లాక్కొని ముస్లింలకు పంచిపెడుతుందని’ గత లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఉద్ఘాటనకు, ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు పెద్ద తేడా లేదు. మహారాష్ట్రలో ఎన్నికల ఘట్టం సమీపిస్తున్నకొద్దీ నరేంద్రమోదీ, అమిత్ షాల్లో ఎవరో ఒకరు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి కూడా అమిత్ షా హాజరు కాకపోవడం మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది.

లోక్‌సభ ఎన్నికల తర్వాత కులం, రిజర్వేషన్లు, మతం మళ్లీ మహారాష్ట్ర ఎన్నికల్లో విస్తృతంగా చర్చనీయాంశాలు అవుతున్నాయి. రాహుల్‌గాంధీ కుల జనగణనను మరోసారి ప్రధాన అంశంగా చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి మోదీ, అమిత్ షాలతో సహా సమస్త బీజేపీ శ్రేణులు యధా ప్రకారం మత ప్రాతిపదికన ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ‘మీరు విడిపోతే వేరవుతారు’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటిస్తే ఏకే హైతో సేఫ్ హై (కలిసి ఉంటే సురక్షితంగా ఉంటాం) అని మోదీ ప్రకటించారు.


భారతదేశ రాజకీయాల్లో మతం పాత్ర ఏ మేరకు ఉన్నదో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో వెల్లడవనున్నదా? గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మాదిరి ప్రజలు కుల ప్రాతిపదికగా ఏకమై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారా? అన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతోంది. ప్రజలు మత ప్రాతిపదికన ఏకం కాకుండా కుల సమస్యను ప్రధానంగా ఎజెండాపైకి తీసుకురావడానికి గత లోక్‌సభ ఎన్నికల నుంచీ కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. రాహుల్‌గాంధీ స్వయంగా తెలంగాణకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కుల సర్వే గురించి పార్టీ నేతలతో చర్చించారు.

90 సీట్లున్న హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి స్వయంకృతాపరాధాలే అధికంగా కారణమయ్యాయి. అక్కడ మత ప్రాతిపదికన ప్రజలు ఓట్లు వేశారని చెప్పడానికి వీల్లేదు. అందువల్ల 288 సీట్లున్న మహారాష్ట్రను, తమ ఎజెండాను నిరూపించుకోవడానికి ఒక ప్రయోగశాలగా బీజేపీ పరిగణిస్తుందనడంలో సందేహం లేదు. 2014లో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతపరమైన భావోద్వేగాలు పెరిగిపోయాయి. ఒక పద్దతి ప్రకారం బీజేపీ ప్రజలను మత ప్రాతిపదికగా ఏకం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. పది సంవత్సరాల నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు దేశంలో మతపరమైన భావనలు విస్తరిస్తున్నాయి. మతాన్ని తమ అస్తిత్వానికి నిదర్శనంగా భావించేవారు పెరిగిపోతున్నారు. కాని మతం ఒక ఓటు బ్యాంకుగా మారుతుందా అన్న సందేహాలు లేకపోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సీట్లు సగానికి పడిపోవడం, రామమందిరం నిర్మించిన అయోధ్యలో కూడా బీజేపీ పరాజయం చెందడం ఈ సందేహాలకు కారణం. అంతటితో ఆ పరాజయాన్ని అంగీకరించడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వద్ద మరో ఆయుధం లేదనే చెప్పాల్సి ఉంది. ఎన్నికల సమయం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలు ప్రభుత్వ పనితీరు, ప్రజల సమస్యలు, అభివృద్ధి లాంటి వాటికన్నా మత ప్రాతిపదికన ప్రచారం చేసేందుకు మొగ్గు చూపడమే ఇందుకు నిదర్శనం.


మరో వైపు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు కూడా కులాన్ని ఒక ఎజెండాగా మార్చడం కంటే వేరే గత్యంతరం లేదు. హర్యానాలో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ వెనుకబడిన వర్గాల రాజకీయాలనే ఎజెండాగా మార్చుకుంది. బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ రాజ్యాంగంపై దాడిచేస్తున్నాయని గతవారం నాగపూర్‌లో జరిగిన సంవిధాన్ సమ్మేళన్‌లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. బుద్ధుడు, అంబేడ్కర్, ఫూలే తదితరుల ఆలోచనలకు ప్రతిఫలమైన రాజ్యాంగాన్ని భారతీయ జీవన విధానానికి దర్పణంగా అభివర్ణించారు. కులజనగణన చేస్తే కాని దేశంలో వెనుకబడిన, అణగారిన వర్గాల వారు ఏ మేరకు ఉన్నారో, వారికి 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించాలో లేదో తెలుస్తుందని రాహుల్ అన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీ నుంచీ దేవేంద్ర ఫడ్నవీస్ దాకా బీజేపీ నేతలందరూ తీవ్రంగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి వంద సీట్లు కూడా తేలేకపోయిన, హర్యానాలో పార్టీకి అధికారం సాధించలేకపోయిన రాహుల్‌గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఇంకా సీరియస్‌గా ఎందుకు తీసుకుంటోంది? పట్టువదలని విక్రమార్కుడులా మళ్లీ మళ్లీ వెనుకబడిన వర్గాల రాజకీయాలను భుజాన వేసుకుంటున్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోందా? బీసీలు, ఆదివాసీలు, దళితులు హిందూత్వ ప్రభావం నుంచి నిజంగా జారిపోయే అవకాశాలు ఉన్నాయా? ఈ వర్గాలు మైనారిటీలతో కలిసి మళ్లీ కాంగ్రెస్, ప్రతిపక్షాల ఓట్ బ్యాంకును సంఘటితం చేయడం సాధ్యమవుతుందా? కుల ఆధారిత రాజకీయాలను దెబ్బతీసి హిందూ ఓటర్లను బీజేపీ సంఘటితం చేయగలుగుతుందా?


మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఈ ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశాలున్నాయి. హిందువుల ప్రయోజనాలకోసం పోరాడిన బాల్ ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రేతో పాటు వివిధ శక్తులు కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్ల హిందువుల ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా హిందువుల ఓట్లను సంఘటితం చేయడం మాత్రమే కాదు, ఓబీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడం బీజేపీకి కీలకంగా మారింది. మహారాష్ట్రలో 175 సీట్లలో ఓబీసీలు నిర్ణాయక స్థితిలో ఉన్నారని బీజేపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. విదర్భలో కూడా 62 సీట్లలో 36 సీట్ల ఫలితాలను ఓబీసీలు నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఓబీసీల్లో 60శాతం పైగా ఉన్న కుంభీల ఓట్లు తమకే లభిస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. మరో వైపు మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మూలంగా అసాధారణమైన స్థాయిలో ఓబీసీలు సంఘటితమవుతున్నారని ప్రకాశ్ అంబేడ్కర్ లాంటి వారు చెబుతున్నారు. జారంగే పటేల్ వంటి మరాఠా కోటా ఉద్యమకారులను చేరదీసినందుకు ఓబీసీలు ఆగ్రహంతో ఉన్నారని, మరో వైపు మరాఠా కోటాను డిమాండ్ చేసినవారు కూడా మద్దతునీయడం లేదని విశ్లేషణలు వినపడుతున్నాయి. తాజాగా జారంగీ పటేల్ తన అభ్యర్థులందర్నీ ఉపసంహరించుకోవడం ప్రతిపక్షాలకే సహయపడుతుందని విశ్లేషకుల అంచనా.

జార్ఖండ్‌లో ఆదివాసీలను ఉమ్మడి పౌర స్మృతి పరిధిలోకి తేబోమని బీజేపీ పదే పదే ప్రకటించడం ద్వారా ఆదివాసీల ఓట్లు చీలకుండా ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు ఆదివాసీలకు ప్రత్యేక స్మృతిని అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గడచిన కొద్ది దశాబ్దాలుగా ఆర్‌ఎస్‌ఎస్ ఆదివాసీల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు బీజేపీకి ఎంత ప్రయోజనం చేకూర్చగలవో ఈ ఎన్నికల్లో తేలనున్నది.


ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలు కూడా వెనుకబడిన వర్గాల రాజకీయాలకు ఒక పరీక్ష అని చెప్పక తప్పదు. అక్కడ కూడా సార్వత్రక ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లను బీజేపీ సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. విడిపోతే వేరవుతాం అన్న నినాదం ఒకవైపు, విడిపోము, వేరు కాము, కలిసికట్టుగా ఉందాము అన్న నినాదం మరోవైపు పోస్టర్ల రూపంలో అంతటా వెలిశాయి. రాహుల్ గాంధీ నినాదం నఫ్రత్ కే బజార్ మే మెహబ్బత్ కే దుకాణ్ (విద్వేష మార్కెట్‌లో ప్రేమ దుకాణం) అన్న నినాదాలు కూడా పోస్టర్లుగా మారుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేయకుండా బీజేపీకి వ్యతిరేకంగా కేవలం ఎస్‌పీనే దించడం మూలంగా కుల రాజకీయాలకు, మత రాజకీయాలకూ మధ్య ప్రధాన పోటీ ఏర్పడింది. సమాజ్ వాదీ పార్టీ యధా ప్రకారం పీడీఏ (పిఛ్డా, దళిత్, అల్పసంఖ్యాక్) ఫార్ములాను ప్రయోగిస్తోంది.

నరేంద్రమోదీ 2014లో భారతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత బీజేపీ రథం చాలా చోట్ల కుల రాజకీయాలను ఛేదించగలిగింది కానీ మండల్ అనంతర రాజకీయాలను పూర్తిగా ఓడించలేకపోయింది. గడచిన పదేళ్లలో తనకు లభించిన అవకాశాలను బీజేపీ సమర్థంగా ఉపయోగించుకుని ఉంటే ప్రతిపక్షాలు కుల రాజకీయాలను ఎజెండాగా మార్చుకునేందుకు అవకాశం లభించి ఉండేది కాదు. రాజ్యాంగం, సామాజిక న్యాయం చర్చనీయాంశాలుగా మారేవి కావు. మత అస్తిత్వానికి పోటీగా కుల అస్తిత్వం పెరిగేందుకు ఆస్కారం లభించి ఉండేది కాదు. దానికి తోడు మైనారిటీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితమయ్యే పరిస్థితులు వచ్చేవి కావు.


భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని మోదీ కొంతమేరకు మార్చగలిగారు. కాని కుల సమీకరణలను రూపుమాపడంలో ఆయన పూర్తిగా సఫలం కాలేకపోయారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓబీసీలను, దళితులను, ఆదివాసీలను హిందూత్వ పరిధిలోకి తీసుకురావడం అంత సులభం కావడం లేదు. మోదీ లాంటి బలమైన నాయకుడి ఆధ్వర్యంలో జాతీయవాదం ఒకశక్తిగా మారగలదనే అభిప్రాయం చాలా మందిలో ఉన్నప్పటికీ ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నవారు కూడా కనపడుతున్నారు. ఒక ఆధునిక ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందాల్సిన దేశంలో కులం, మతం ఇంకా ఎన్నికల ప్రధాన ఎజెండాగా కొనసాగుతుండడం, ప్రజల నిజమైన సమస్యలకు ప్రాధాన్యం లభించకపోవడం ఎంత విషాదకరం?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Nov 13 , 2024 | 03:26 AM