Share News

మళ్లీ విద్వేషాలు విజృంభిస్తున్న వేళ..

ABN , Publish Date - Dec 18 , 2024 | 02:15 AM

కొందరి పేర్లు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. ఎంత కాలం గడిచిపోయినా చరిత్రలో వారి పేర్లను, వారు చేసిన పనులను చెరిపివేయడం అంత సులభం కాదు. పాములపర్తి వెంకట నరసింహారావు ఇదే...

మళ్లీ విద్వేషాలు విజృంభిస్తున్న వేళ..

కొందరి పేర్లు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. ఎంత కాలం గడిచిపోయినా చరిత్రలో వారి పేర్లను, వారు చేసిన పనులను చెరిపివేయడం అంత సులభం కాదు. పాములపర్తి వెంకట నరసింహారావు ఇదే డిసెంబర్ మాసంలో దివంగతులై రెండు దశాబ్దాలు గడచిపోయాయి. ఇప్పుడు మరోసారి ఆయన పేరు స్మరించుకునే అవసరం నేటి రాజకీయ నాయకులకు కలిగింది. సుప్రీంకోర్టుకు, జాతీయ సమగ్రతా మండలికి బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను కూడా విస్మరించి, ఆ పార్టీ అగ్రనేతల సమక్షంలో బాబ్రీ మసీదు కట్టడం కూల్చివేత జరిగింది. ఈ ఘటనకు పీవీనే చాలా మంది తప్పుపట్టారు. అయితే అంతకు సరిగ్గా ఏడాది ముందే 1991లో ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపచేసి దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మతపరమైన భావోద్వేగాలు తలెత్తకుండా చూసింది కూడా పీవీయే అన్న విషయం చాలా మంది మరిచిపోయారు! సంభల్‌లో మతపరమైన హింసాకాండ, మధురలో వివాదం నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కూడా ఆ చట్టం గుర్తుకువచ్చింది. ఇదే ఏడాది ప్రథమంలో పీవీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ చట్టాన్ని రద్దు చేయాలని తమ పార్టీ నేతలే అంటుంటే వారించలేకపోతోంది. నరసింహారావును అనేక సార్లు అగౌరవపరిచిన కాంగ్రెస్ నేతలకు కూడా ఇప్పుడు పీవీ ప్రభుత్వమే ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఆమోదింపచేసిన విషయం గుర్తుకు వచ్చింది.


నిజానికి ఈ చట్టంపై మళ్లీ చర్చ రేపి తీగ లాగింది కొద్ది రోజుల క్రితం పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌. ఒక మత ప్రదేశపు స్వభావాన్ని మార్చడం 1991 చట్టం క్రింద నిషేధించినప్పటికీ, ఆ ప్రదేశపు మత స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడాన్ని ఆ చట్టం అడ్డుకోలేదని చంద్రచూడ్ వ్యాఖ్యానించి ప్రస్తుత వివాదాలన్నిటికీ తెర లేపారు. దేశంలో అనేక ప్రాంతాల్లోని ప్రార్థనా స్థలాలలో సర్వేల కోసం పిటిషన్లు దాఖలయ్యాయి. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ సర్వేకు ఆదేశించిన స్థానిక కోర్టు ఈ చట్టం ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 1991 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తాజాగా యూపీలోని సంభల్ మసీదులో అలాంటి సర్వేను జిల్లా కోర్టు అనుమతించినందుకే గత నెలలో మతపరమైన హింసాకాండ జరిగింది.


ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ప్రార్థనా మందిరాల విషయంలో దేశంలో అన్ని కోర్టులు యథాతథ స్థితి నెలకొనేలా చూడాలని గత వారం ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1991 చట్టం చెల్లుతుందా లేదా అన్న విషయం తాము తేల్చేంతవరకూ ప్రార్థనా స్థలాల్లో సర్వేలు జరిపించాలని దాఖలైన పిటిషన్లను ఏ కోర్టూ నమోదు చేసుకోవద్దని, ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అసలు ఈ చట్టం రాజ్యాంగబద్ధతపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లో తన అభిప్రాయం ఏమిటో చెప్పాలని స్పష్టంగా నిర్దేశిస్తూ 2025 ఫిబ్రవరి 17 వరకు తదుపరి విచారణను వాయిదా వేసింది. దీనితో కనీసం మూడునెలల వరకైనా ప్రార్థనా స్థలాల విషయంలో మత పరమైన భావోద్వేగాలకు అడ్డుకట్ట వేసినట్లైంది.


అయోధ్యలో రామజన్మభూమిపై బీజేపీ నిర్వహిస్తున్న ఉద్యమం తారస్థాయికి చేరుకుంటున్న సమయంలో అధికారంలోకి వచ్చిన పీవీ నరసింహారావు, వచ్చీ రాగానే దేశవ్యాప్తంగా ఇతర ప్రార్థనాస్థలాల్లో ఇలాంటి భావోద్వేగాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రార్థనాస్థలాల్లో యథాతథ పరిస్థితిని పరిరక్షించేందుకు చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు 1991 జూలైలో రాష్ట్రపతి వెంకట్రామన్ పార్లమెంటు ఉభయ సభల నుద్దేశించి చేసిన ప్రసంగంలోనే స్పష్టం చేశారు. ఆ తరువాత సెప్టెంబర్‌లో రెండు రోజుల పాటు లోక్‌సభలో అద్భుతమైన చర్చ జరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని వర్గాలు దేశంలో అసహనం వ్యాప్తి చేయాలని చూస్తున్నాయని, ప్రజలు ఏనాడో మరిచిపోయిన వివాదాలను తిరగదోడి తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయని, అలాంటి కొత్త వివాదాలు రేకెత్తకుండా ఉండేందుకే ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) బిల్లును ప్రవేశపెడుతున్నామని హోంమంత్రి ఎస్.బి. చవాన్ స్పష్టం చేశారు. ప్రేమ, శాంతి, సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పర్చడమే ఈ బిల్లు లక్ష్యమని అన్నారు. బీజేపీ నుంచి ఆడ్వాణీ, జస్వంత్ సింగ్, ఉమాభారతి, రాంనాయక్ తదితరులు; కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్, పిఎం సయీద్, మణిశంకర్ అయ్యర్; సీపీఐ(ఎం) నుంచి సోమనాథ ఛటర్జీ; సీపీఐ నుంచి ఇంద్రజిత్ గుప్తా, గీతా ముఖర్జీ అత్యంత ప్రతిభావంతంగా చర్చలో పాల్గొన్నారు. ఆ చర్చల ప్రామాణికతతో పోలిస్తే ఇవాళ్టి చర్చలు పేలవంగా కనిపిస్తాయి. ఈ బిల్లు వల్ల మనం సాధించేది ఏమీ లేదని, కొత్త వివాదాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఆడ్వాణీ అన్నారు. ప్రతి వివాదానికీ పరిష్కారం లభించాల్సిందేనని, అన్ని మత ప్రదేశాల పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని ఉమాభారతి స్పష్టం చేశారు. తర్వాతి కాలంలో బీజేపీకి మిత్రుడుగా మారిన అప్పటి జనతాదళ్(యు)కు చెందిన దళిత నేత ఒకరు ఈ బిల్లును బలంగా సమర్థించారు. ఈ దేశంలో 33 కోట్లమంది దేవుళ్లు ఉన్నప్పటికీ దేశంలోని 5,76,00౦ గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందడం లేదని గుర్తు చేశారు. లక్షలాది ప్రజలు ఆకలితో, వైద్య చికిత్సలు లేకుండా, ఉపాధి లభించకుండా మరణిస్తున్నారని, ఇలాంటి తీవ్రమైన అంశాలను పరిష్కరించకుండా మతపరమైన ఘర్షణల్లో కూరుకుపోవడం శోచనీయమని, ఎక్కడ మసీదు ఉందో, ఎక్కడ ఆలయం ఉందో తేల్చడం ప్రధానం కాదని సీపీఐ(ఎం) నేత సోమనాథ ఛటర్జీ అన్నారు. అదే సమయంలో అయోధ్య వివాదాన్ని చర్చల ద్వారా లేదా న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.


ప్రార్థనాస్థలాల బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఒక్క అయోధ్యలో మినహా దేశంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎక్కడా ప్రార్థనాస్థలాల విషయంలో వివాదాలు రేగలేదు. ఒక్క అయోధ్య అంశం వల్లనే బీజేపీ క్రమక్రమంగా ఎన్నికల రాజకీయాల్లో పుంజుకొన్నది కనుక ఇతర అంశాలను పక్కన పెట్టింది. అయోధ్యతో బస్ ఝాంకీ హై, కాశీ మధురా బాకీ హై అని ఒకప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేసేవారు. కాని మేనిఫెస్టోలో మాత్రం ఇతర ప్రార్థనా స్థలాల గురించి ప్రస్తావించకుండా సంయమనం పాటించారు. కాశీ, మధుర మాటేమిటి? అని 2022 లో బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాను ప్రశ్నించినప్పుడు ఏ వివాదమైనా కోర్టులు, రాజ్యాంగం ద్వారా పరిష్కరించుకోవాల్సిందేనని చెప్పారు. అయోధ్య ఉద్యమం ఒక మినహాయింపు మాత్రమేనని, ప్రతి మసీదులోనూ శివలింగం గురించి వెతకడం సరైంది కాదని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఆసేతు హిమాచలాన్ని సమైక్య పరిచే శ్రీరాముడు వివాదాల్ని సృష్టించడని, ఆయన పరిష్కారాలు సూచిస్తారని రామమందిర ప్రారంభం తర్వాత ప్రధాని నరేంద్రమోదీ కూడా అన్నారు. చారిత్రక తప్పిదాలను సవరించడం కన్నా శాంతి సామరస్యాలతో కలసికట్టుగా జీవించడంపై దృష్టి కేంద్రీకరించాలని ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వంటి బీజేపీ నేతలు కూడా అన్నారు. అయోధ్య తీర్పు సమయంలో కూడా ప్రార్థనా స్థలాల చట్టం ప్రాధాన్యాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దేశ రాజకీయ వ్యవస్థలో అత్యంత కీలకమైన లౌకికవాద లక్షణాలను ఈ చట్టం కాపాడుతుందని ఒకప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఒక తీర్పులో స్పష్టం చేశారు. కనుక మళ్లీ ఈ రకమైన వివాదాలు రేకెత్తడం, సుప్రీంకోర్టు కూడా కలుగచేసుకోవాల్సి రావడానికి కారణమేమిటి? పైకి ఎన్ని చెప్పినప్పటికీ దేశమంతటా మతపరమైన భావోద్వేగాలు రేకెత్తించి ప్రయోజనం పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తుందా? జమిలి ఎన్నికలకూ, ప్రస్తుత పరిణామాలకూ ఏమైనా సంబంధం ఉన్నదా? పీవీ హయాంలో ఆమోదించిన ప్రార్థనా స్థలాల చట్టంపై తన అభిప్రాయం ఏమిటో మోదీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాతే ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది.


ఇంతకీ ఈ మతపరమైన భావోద్వేగాలపై పీవీ అభిప్రాయం ఏమిటి? ‘దేశంలో రక్తపాతాన్ని నివారించలేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు’ అని ఆయన 1992 జూలై 24న జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అన్నారు. మతతత్వవాదం వల్ల ఎన్నో దేశాలు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నాయని ఆయన తనపై ప్రవేశపెట్టిన ఆవిశ్వాస తీర్మానానికి జవాబు చెబుతూ అన్నారు. దేశ పాలన రాజ్యాంగం ప్రకారం సాగాల్సిందేనని, మూక మనస్తత్వం ఉన్నవారికి లొంగితే రాజ్యాంగానికి తిలోదకాలివ్వాల్సిందేనని పీవీ అన్నారు. మతం, రాజ్యం రెండూ వేరువేరేనా? ‘ఒక ముస్లిం రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ దుస్సహమైన అహంకారంతో నోరుపారేసుకుంటూంటే ఓ హిందూ పటేల్‌ అతణ్ణి హృదయపూర్వకంగా సమర్థిస్తాడు. ఓ హిందూ మేనేజర్‌ హిందూ మహిళలను అవమానిస్తూ ఒక ముస్లిం జాగీర్దార్‌కు విధేయుడుగా ఉంటాడు. ప్రజల్ని అష్టకష్టాలు పెడుతున్న ముస్లిం ప్రభువుల దుష్టపాలనకు లొంగి ఉండాలని ఒక హిందువు తన కుమారుడికి ఉద్బోధిస్తాడు’ అని నిజాం కాలంలో పరిస్థితుల గురించి తన ‘లోపలి మనిషి’ నవలలో పీవీ రాశారు. మూడు దశాబ్దాలు గోల్కొండను ఏలిన ఇబ్రాహీం కులీ కుతుబ్ షాను ‘మల్కిభరామా!’ అని కందుకూరి రుద్రకవి కీర్తించాడు. చరిత్రను శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలి. అలా కాకుండా విద్వేష వైఖరిని అవలంబిస్తే అశాంతిని ఆహ్వానించడమే అవుతుంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Dec 18 , 2024 | 02:15 AM