Share News

ఎగిసిన బంగ్లా అలలకు ఎవరు కారణం?

ABN , Publish Date - Aug 07 , 2024 | 02:27 AM

‘నేను పెను తుఫానును, నేను విధ్వంసాన్ని.. నాకే దయాలేదు, అన్నిటినీ ముక్కలు ముక్కలు చేస్తాను. నాకే నిబంధనలూ లేవు, చట్టాలూ లేవు, దారిలో ఉన్నవాటినన్నిటినీ ధ్వంసంచేస్తాను...

ఎగిసిన బంగ్లా అలలకు ఎవరు కారణం?

‘నేను పెను తుఫానును, నేను విధ్వంసాన్ని.. నాకే దయాలేదు, అన్నిటినీ ముక్కలు ముక్కలు చేస్తాను. నాకే నిబంధనలూ లేవు, చట్టాలూ లేవు, దారిలో ఉన్నవాటినన్నిటినీ ధ్వంసంచేస్తాను. నేను శివుడిని, తలపై చంద్రుడిని, నుదుటిపై సూర్యుడిని ధరించిన పినాకపాణిని. నేను ప్రళయాగ్రహాన్ని, అల్లకల్లోల సముద్ర ఘోషను. నేను సూర్యోదయపు నూతన యవ్వనాన్ని...’

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బంగ్లాదేశ్ జాతీయ కవి నజ్రుల్ ఇస్లాం కొన్ని దశాబ్దాల క్రితం రచించిన ‘విద్రోహి’ కవిత గుర్తుకు వస్తున్నది. ఎన్నో ఏళ్లుగా అసహనంగా ఉన్న సముద్రం ఆగ్రహంతో పెల్లుబుకినట్లు, నిశ్శబ్దంగా ఉన్న అగ్నిపర్వతం పెటిల్లున పేలినట్లు, ఉన్నట్లుండి ఆకాశం కుప్పకూలినట్లు బంగ్లాదేశ్‌లో జనాగ్రహం రోడ్లపై ప్రవహించింది. కనిపించిన వాటిని ధ్వంసం చేసింది. చట్టసభల్లోకి, ప్రధాని రాజప్రాసాదంలోకి ప్రవేశించి విశృంఖల కృత్యాలకు పాల్పడింది. బంగ్లా అంతటా ఆ దేశ వ్యవస్థాపకుడు ముజిబుర్ రహ్మాన్ విగ్రహాలను కూల్చివేశారు. ఎంతో కాలంగా ఊపిరిబిగపట్టుకుని ఎన్నో దుర్మార్గాలను సహిస్తూ వస్తున్న ప్రజానీకానికి తమ కసి తీర్చుకునేందుకు దేశం దేశమే ‘రేజ్ రూమ్’ (ఆగ్రహాన్ని వ్యక్తం చేసే గది)గా మారింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఒక నిప్పుకణిక మాత్రమే. కాని బంగ్లాదేశ్ రగులుకునేందుకు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నది. బంగ్లాదేశ్ పాలకులు కానీ, ఆ పాలకులకు స్నేహంగా ఉన్న భారతదేశ నేతలు కానీ జరగబోయే ఉత్పాతాన్ని గ్రహించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనందువల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తింది.


ఈ ప్రజాగ్రహం కేవలం కొన్ని మతతత్వ శక్తులు, అమెరికా, చైనా, పాకిస్థాన్ అనుకూల ప్రేరేపిత శక్తుల వల్ల వ్యక్తమైంది కాదు. ఆఖరుకు అక్కడి ప్రతిపక్షాలతో కూడా నిమిత్తం లేకుండా జనం వీధుల్లోకి ప్రవేశించారు. బంగ్లాదేశ్‌లో దుర్మార్గాలకు అంతు లేనప్పుడు, అణిచివేత తార స్థాయికి చేరుకున్నప్పుడు అన్ని శక్తులూ ఏకమై చేసిన తిరుగుబాటు ఇది. ఆరు నెలల క్రితమే బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. కాని ప్రజాగ్రహానికి ఎన్నికల ఫలితాలతో నిమిత్తం ఉండదని, బూటకపు ప్రజాస్వామ్యాన్ని నాయకులు గౌరవించినా ప్రజలు సహించలేనప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారని ఈ పరిణామాలు నిరూపించాయి.

తిరుగుబాట్లు అనేక రకాలుగా జరుగుతాయి. అవి హింసాకాండ, ఆగ్రహ జ్వాలలకే దారితీయాల్సిన అవసరం లేదు. శ్రీలంక, నేపాల్, వెనిజులా తదితర దేశాలతో పాటు భారతదేశంలో కూడా అనేకసార్లు ప్రజా ఉద్యమాలకు కావల్సిన రసాయనాలు తయారయ్యాయి. కాని వాటి ఉపశమనానికి కూడా పరిస్థితులు దోహదం చేశాయి. కొన్నిసార్లు ప్రజాస్వామికంగా ప్రజల తీర్పులే వారి ఆగ్రహాన్ని ఉపశమింపచేస్తాయి. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ప్రభుత్వం పట్ల ఏర్పడిన ప్రజావ్యతిరేకత ఆమె ఓటమితో సమసిపోయింది. యూపీఏ పదేళ్లపాలనపై, కాంగ్రెస్ రాజకీయాలపై ఆగ్రహాన్ని ప్రజలు బీజేపీని ఎన్నుకోవడం ద్వారా తీర్చుకున్నారు. మళ్లీ ఇటీవల అదే బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ తగ్గించి ప్రజలు పాలకులు తప్పులు సవరించుకునేందుకు, ప్రతిపక్షాలు సంఘటితమయ్యేందుకు అవకాశాన్ని కల్పించారు. దేశంలో ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు అనేక సందర్భాల్లో ప్రజాగ్రహాలను తమకు అనుకూలంగా తిప్పుకున్నాయి. బంగ్లాదేశ్‌లో జరిగినట్లు మన ప్రతిపక్షాలు కూడా నిరాశా నిస్పృహలకు గురై ఎన్నికలను బహిష్కరించకుండా సంయమనం పాటించడం కూడా ఒక రకంగా మంచిదైంది.


కాని బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అవామీ లీగ్ సర్కార్ ప్రజల ఆగ్రహం రోజురోజుకూ పెరిగేందుకే కాని చల్లారేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. బూటకపు ఎన్నికలను నిర్వహించి, నకిలీ ప్రత్యర్థులపై విజయం సాధించి అధికారాన్ని శాశ్వతం చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత బేగం జియాను అవినీతి ఆరోపణలపై జైలు పాలు చేసింది. ఆమె కుమారుడు, రాజకీయ వారసుడు లండన్‌కు ప్రవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ ప్రత్యర్థులందర్నీ అణిచివేసింది. న్యాయ వ్యవస్థ ప్రజలను రక్షించే బదులు భక్షించే వ్యవస్థగా మారి జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, పౌర సమాజ సంస్థల గొంతు నొక్కేందుకు ఉపయోగపడింది. అక్కడ ప్రభుత్వం నియమించిన న్యాయమూర్తులే కాని, మన దేశంలో మాదిరి కొలీజియం వ్యవస్థ లేదు. 2018లో రూపొందించిన డిజిటల్ సెక్యూరిటీ చట్టం ఆధారంగా ఎవరు ఏ మాత్రం విమర్శలకు పాల్పడినా అణిచివేతకు గురి చేయడం సామాన్యమైంది. మీడియా భయంతో స్వయం సెన్సార్‌షిప్ చేసుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. పత్రికా స్వేచ్ఛ విషయంలో 180 దేశాల్లో బంగ్లాదేశ్ 163వ స్థానంలో ఉన్నదని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ తెలిపింది. పెద్ద ఎత్తున నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో ఆ దేశం సతమతమవుతోంది.

బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలు పెంచుకోవడం భారత్‌కు వ్యూహాత్మకంగా అవసరమే. ఈశాన్య భారత రాష్ట్రాలకు అక్కడి నుంచి దగ్గరి దారి ఉన్నది. దక్షిణాసియా– పది ఆసియాన్ దేశాల అనుసంధానానికి బంగ్లాదేశ్ కీలకం. ఏడు దేశాల సభ్యత్వంతో కూడిన బిమ్స్‌టెక్‌లో మన ప్రాంతీయ ఆకాంక్షలకు బంగ్లాదేశ్ కేంద్ర బిందువు. పాకిస్థాన్, చైనాలతో ఉన్న శత్రుత్వం రీత్యా బంగ్లాతో స్నేహం అవసరమని మన ప్రభుత్వం భావించింది. చమురు ఉత్పత్తుల సరఫరా, సైనిక సహాయం ద్వారా హసీనా ప్రభుత్వానికి అండగా నిలిచింది. కాని ఈ స్నేహ సంబంధాలు మితిమీరిపోవడంతో భారత్ లేకుండా హసీనా ప్రభుత్వం మనుగడ లేదనే అభిప్రాయానికి దారి తీసింది. ‘హసీనా వెనుక భారతదేశం అండగా లేకపోతే ఆమె నెప్పుడో గద్దె దించేవారం’ అని ఖలీదా జియా ఒక సందర్భంలో అన్నారు. హసీనా తన నియంతృత్వ పోకడలతో భారత్ ప్రతిష్ఠను కూడా దెబ్బతీశారని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ 2017లోనే ఒక వ్యాసంలో రాశారు.


హసీనా హయాంలో బంగ్లాదేశ్ బహుళ సాంస్కృతిక సంప్రదాయాలను కోల్పోయిందని, అక్కడ సంపదను హస్తగతంచేసుకున్న కొద్ది మంది వ్యాపారస్తులు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారని, అడుగడుగునా అవినీతి కొనసాగుతోందని ఆయన వివరించారు. నిజానికి పాకిస్థాన్‌లో మాదిరి బంగ్లాలో కూడా ఇస్లామిక్ పాలనను రుద్దేందుకు జమాత్ ఏ ఇస్లామియా వంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలకు అక్కడి ప్రజలు ఊతమివ్వడం లేదని, కేవలం షేక్ హసీనాకు తగ్గిన జనాదరణవల్లే బంగ్లాదేశ్ ప్రజలు భారత్‌కు వ్యతిరేకంగా, ఇస్లామిస్టు మితవాదులకు అనుకూలంగా మారారని ఆయన చెప్పారు. తాజా పరిణామాల తర్వాత బంగ్లాలో ఏర్పడే ప్రభుత్వంపై ఏ శక్తుల ప్రభావం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.

జనవరిలో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా గెలుపుతో భారత్ అక్కడ రాజకీయ సుస్థిరత ఏర్పడిందన్న ధీమాతో ఉదాసీనంగా వ్యవహరించింది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు బంగ్లాలో ఎన్నికలు సక్రమంగా జరగలేదని విమర్శిస్తే మన ప్రధాని మోదీ ఆమెకు ఫోన్ చేసి నాలుగోసారి చారిత్రక విజయం సాధించారంటూ అభినందించారు. విచిత్రమేమంటే జనవరిలో ఎన్నికలు జరిగినప్పటి నుంచే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని మంగళవారం లోక్‌సభలో విదేశాంగ మంత్రి ప్రకటించారు. మరి ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? బంగ్లాదేశ్‌లో ఏర్పడింది బూటకపు రాజకీయ సుస్థిరత అని కానీ, అక్కడ ప్రజలు పడగ మీద కొడితే లేచే సర్పాల్లా బుస కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కాని మనం గమనించడం కానీ, హసీనాను అప్రమత్తం చేయడం కానీ చేయలేకపోయాం. జనవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పడు ఇక్కడ మోదీ సేన తమకు 400 సీట్లకు పైగా స్థానాలు లభిస్తాయన్న ఊపులో ఉన్నది.


తమ మెజారిటీ తగ్గుతుందని ఊహించలేని వారు బంగ్లాదేశ్ పరిణామాలను ఏ విధంగా ఊహించగలరు? ప్రతిపక్షాల పట్ల తాము ప్రజాస్వామికంగా వ్యవహరించలేని వారు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామికంగా వ్యవహరించాలని హసీనాకు ఏ విధంగా హితవు చెప్పగలరు? పైగా బంగ్లాదేశ్‌లో ఉన్న అవలక్షణాలు ఎన్నో మన దేశంలో కూడా ఉన్నాయి. బంగ్లా దేశ్‌లో హసీనా నియంతృత్వ చర్యలకు భారత్ పూర్తిగా వత్తాసు పలుకుతూ అన్ని విధాలా అండగా ఉన్నందువల్ల ఇవాళ హసీనా పట్ల ఉన్న వ్యతిరేకత భారత్ పట్ల వ్యతిరేకతను కూడా ప్రతిఫలిస్తున్నాయి. మోదీ ఇచ్చిన అండదండల మూలంగానే హసీనా భారత్‌కు నేరుగా రాగలిగారు. అక్కడి సైనికాధికారులు హసీనాకు 45 నిమిషాలు సమయం ఇచ్చి పారిపోయే అవకాశం కల్పిస్తే మన వైమానిక స్థావరంలో ఆమెకు భద్రత కల్పించి క్షేమసమాచారాలను తెలుసుకునేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను పంపాం. దాని వల్ల మన భారత్ కేమి ప్రయోజనం? ప్రతి దేశంలోనూ దేశాధినేతలు మారుతూనే ఉంటారు. అందువల్ల వ్యక్తుల ఆధారంగా కాకుండా దేశాల ఆధారంగా మన విదేశాంగ నీతి మారుతూ ఉండాలి.


మనం ఇప్పటికే పాకిస్థాన్, నేపాల్, శ్రీలంకను దూరం చేసుకున్నాం. జనవరిలో మాల్దీవులు భారత్‌కు దూరంగా జరిగి తనను తాను చైనాకు అనుకూలంగా ప్రకటించుకుంది. మన చుట్టూ ఉన్న దేశాల భారత వ్యతిరేకతను చైనా ఉపయోగించుకుంటోంది. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మన చేజారిపోయింది. కింకర్తవ్యం?

మీ స్నేహితులను సన్నిహితంగా ఉంచుకోవాలి, మీ శత్రువులను మరింత సన్నిహితంగా ఉంచుకోవాలన్నది విదేశాంగ నీతి. మనం చరిత్రను మార్చగలం కాని భౌగోళిక పరిస్థితులను మార్చలేం. మనం స్నేహితులను మార్చుకోగలం కాని పొరుగువారిని మార్చుకోలేం.. అని మాజీ ప్రధాని వాజపేయి లాహోర్ పర్యటనలో భాగంగా అన్నారు. మన స్వదేశీ విధానం మనను కేవలం ఓడిస్తుంది. విదేశాంగ విధానం మనను పూర్తిగా దెబ్బతీస్తుంది అని కెనడీ ఊరికే అనలేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Aug 07 , 2024 | 02:27 AM