ఈ చట్టాలతో ప్రజలకు న్యాయం చేరువవుతుందా?
ABN , Publish Date - Jul 03 , 2024 | 01:11 AM
బ్రిటిష్ వారు నిష్క్రమించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన ఊరు హెడ్ కానిస్టేబుల్ మారతాడా అన్న అనుమానం కన్యాశుల్కం నాటకంలో ఒక జట్కాబండి వాడు వ్యక్తం చేశాడు. దేశంలో ఎవరు అధికారంలోకి...
బ్రిటిష్ వారు నిష్క్రమించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన ఊరు హెడ్ కానిస్టేబుల్ మారతాడా అన్న అనుమానం కన్యాశుల్కం నాటకంలో ఒక జట్కాబండి వాడు వ్యక్తం చేశాడు. దేశంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వ్యవస్థల స్వభావం మారదనే చారిత్రక సత్యం ఈ వాక్యాల్లో ప్రస్ఫుటమయింది. న్యాయవ్యవస్థ పలుకుబడి గల వారికి అనుకూలంగా మారడం, సాక్ష్యాలను తారుమారు చేయడం గురించి వందేళ్ల క్రితమే గురజాడ తన కన్యాశుల్కం నాటకంలో చెప్పారు. సమాజంలో శక్తిమంతులే చివరకు గెలుపు సాధిస్తారని ఆయన స్పష్టం చేశారు. కన్యాశుల్కం రాయడానికి ముందే 1825లో మెకాలే తొలి భారతీయ శిక్షా స్మృతిని రూపొందించారు. 1872లో జేమ్స్ స్టీఫెన్ భారతీయ సాక్ష్యాధార చట్టాన్ని లిఖించారు. రాజ్యాంగాన్ని లిఖించుకున్న ఏడు దశాబ్దాల తర్వాత స్వతంత్ర భారతంలో తొలిసారి మనం రూపొందించుకున్న కొత్త నేర చట్టాలు ఎంత వరకు ఆధునిక నాగరిక సమాజానికి, ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయన్న విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ నేర చట్టాల ప్రధాన లక్ష్యం పారదర్శకత, జవాబుదారీ విధానం, సమర్థత, ఆధునికీకరణను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు న్యాయాన్ని చేరువగా చేర్చడమే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజలను శిక్షించడానికి తాము ప్రాధాన్యతనీయడం లేదని, వారికి న్యాయం అందించడమే తమ ప్రాధాన్యత అని ఆయన అన్నారు. అయితే ఈ చట్టాల ఉద్దేశాలు మాత్రం వలసవాద మనోభావాలనే ప్రతిఫలిస్తున్నాయని, చాల చోట్ల భాషను మార్చారు కాని సారాన్ని మార్చలేదని అనేకమంది న్యాయ, రాజ్యాంగ నిపుణుల నుంచి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
స్వాతంత్ర్య పూర్వం మహాత్మాగాంధీ, లోకమాన్య తిలక్ వంటి స్వాతంత్ర్య సమర యోధుల్ని ఐపీసీలోని సెక్షన్ 124 ఏ ప్రకారం రాజద్రోహ నేరం క్రింద అరెస్టు చేసి నిర్బంధించారు. ‘నేటి కాలానికి అనుగుణంగా లేని అలాంటి వలస వాద చట్టాలు మనకు అవసరమా?’ అని రెండేళ్ల క్రితం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ప్రశ్నించడమే కాదు, సెక్షన్ 124ఏ అమలును నిలిపివేస్తూ చరిత్రాత్మక తీర్పును వెలువరించారు. అప్పటి నుంచీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను అమలు చేయడం ఆగిపోయింది. జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన భారతీయ న్యాయసంహితలో సెక్షన్ 124ఏను అయితే తొలగించారు కాని దాని స్థానంలో సెక్షన్ 152ను ప్రవేశపెట్టారని, ఈ సెక్షన్‌లో గతంలోని రాజద్రోహ క్లాజు కంటే ఎక్కువ కఠినమైన, ప్రమాదకరమైన నిబంధనలున్నాయని, పైగా శిక్షను మూడేళ్లనుంచి ఏడేళ్లకు పెంచారని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్) తెలిపింది.
కొత్త నేరచట్టాల్లో వలసవాదం కాలం నాటి కంటే ఎక్కువ క్రూరమైన, ప్రజా వ్యతిరేకమైన నిబంధనలను చేర్చారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇవాళ రాజద్రోహం అన్న పదానికి అర్థం లేకపోయినా దేశ ద్రోహాన్ని మాత్రం తీవ్రంగా పట్టించుకోవాలని, దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమికతకు ఎవరు నష్టం కలిగించినా చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్రం వాదించవచ్చు కాని సెక్షన్ 124ఏను దుర్వినియోగపరిచినట్లే, సెక్షన్ 152ను కూడా దుర్వినియోగపరచరన్న హామీ ఎవరు ఇవ్వగలరు? గతంలో ముఖ్యమంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠించడాన్ని కూడా రాజద్రోహం క్రింద పరిగణించినట్లు ప్రజలు వ్యక్తం చేసే ఏ నిరసనను అయినా దేశ ద్రోహం క్రింద పరిగణించరన్న గ్యారంటీ ఉన్నదా? ‘దేశ భద్రతా ప్రయోజనాలు, సమగ్రత గురించి మాత్రమే కాదు, ప్రజల పౌర హక్కుల గురించి కూడా న్యాయస్థానానికి అవగాహన ఉన్నది. ఈ రెండింటి మధ్యా సమతుల్యం పాటించడం అవసరం. అది చాలా క్లిష్టమైన పని’ అని జస్టిస్ రమణ తన తీర్పులో కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సమతుల్యం పాటించగలిగిన పరిపక్వత మన వ్యవస్థలకు ఉన్నదా అన్నదే చర్చనీయాంశం.
కొత్త నేర చట్టాల్లో రాజద్రోహం తన పేరును, సెక్షన్‌ను మార్చుకుని ప్రవేశించడం, ఊపా, మోకా వంటి ఉగ్రవాద చట్టాలు వేరుగా కాకుండా తొలిసారి ఐపీసీలో భాగం కావడం, ఎన్‌కౌంటర్ మరణాలను, కస్టడీ మరణాలను నిర్వచించకపోవడం, పోలీసులకు జవాబుదారీ విధానం, బాధ్యతను నిర్ణయించకుండా, వారు అధికార దుర్వినియోగానికి విచ్చలవిడిగా పాల్గొనేందుకు మరింత వీలు కల్పించడం, సెక్షన్ 187 క్రింద పోలీసు కస్టడీ రిమాండ్ కాలాన్ని 15 రోజుల నుంచి 90రోజుల వరకు పెంచే అవకాశం ఉండడం విమర్శలకు తావిస్తున్నాయి. సెక్షన్ 113 క్రింద టెర్రరిస్టు చట్టం పోలీసులకు ఊపా కంటే విచ్చలవిడి అధికారాలను కల్పిస్తోందని న్యాయనిపుణులు అంటున్నారు. జస్టిస్ మాలిమత్ నుంచి మాజీ హోం సెక్రటరీ పద్మనాభయ్య వరకు ఎందరో సూచించిన పోలీసు సంస్కరణలను కొత్త నేర చట్టాల విషయంలో పరిగణనలోకి తీసుకున్నట్లు దాఖలాలు లేవు. ఊపా క్రింద అనేకమంది మేధావులు, విద్యార్థులు, ఆదివాసీలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారందర్నీ ఏళ్లతరబడి విచారణ లేకుండా జైలులో బంధించడం, చివరకు 3శాతం మందికి కూడా శిక్ష పడకపోవడం గురించి మానవ హక్కుల సంఘాలు అనేక సందర్భాల్లో ప్రస్తావించాయి. కొత్త నేరాల చట్టాల్లో కూడా నిర్విచక్షణగా అరెస్టులు చేయకుండా పోలీసు అధికారులపై ఆంక్షలు విధించే నిబంధనలు ఏమీ లేవు. ఒక ఖైదీ జైలు శిక్షను తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉండాల్సిందేనన్న సెక్షన్ చేర్చడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కనిపిస్తోంది. విద్వేష నేరాలు, మూక ఊచకోత అన్న పదాలకు ఈ చట్టాల్లో తావివ్వకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ‘బెయిల్ అనేది నిబంధన కావాలి, జెయిల్ అనేది మినహాయింపు కావాలి, నేరం రుజువుకానంతవరకూ ఎవరైనా అమాయకుడే’ అన్న కనీస మౌలిక సూత్రాలకు కొత్త నేర చట్టాలు కూడా తిలోదకలిచ్చాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ కొత్త నేర చట్టాల్లో చెప్పుకోదగ్గ మార్పులు లేకపోలేదు. మహిళలు, పిల్లల సంరక్షణకు సంబంధించి ఎన్నో చర్యల్ని చేపట్టారు. చిన్న చిన్న నేరాలు చేసిన వారితో జైళ్లను నింపకుండా కమ్యూనిటీ సేవను ఒక శిక్షగా చేర్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు నేర విచారణలో కీలక పాత్రను పోషించారు. డిజిటల్, ఎలెక్ట్రానిక్ సాక్ష్యాలకు ప్రాధాన్యత కల్పించారు. ఫోరెన్సిక్ సైన్స్‌కు ప్రాధాన్యత నిచ్చారు. ఖైదీల పరివర్తన, పునరావాసానికి వీలు కల్పించారు. సాక్షులకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. కాని వీటన్నింటినీ ఎలా చేయాలో మాత్రం వివరించలేదు. పోలీసు కస్టడీలో హింసించకుండా టెక్నాలజీ ద్వారా నేర విచారణ జరిపించాలంటే పోలీసులకు శిక్షణ అవసరం. వారికే కాదు, న్యాయవాదులకూ, ప్రాసిక్యూటర్లకూ ఆధునిక టెక్నాలజీ వినియోగంలో శిక్షణ నీయాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఒక పోలీసు కానిస్టేబుల్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారని, హక్కులను ఇచ్చినట్లే ఇచ్చి ప్రతి అధికరణలోనూ దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారని రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడు సోమనాథ లాహిరి వ్యక్తం చేసిన అభిప్రాయం కొత్త నేర చట్టాల విషయంలో కూడా ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.
మానవ హక్కుల విషయంలో భారత దేశం చాలా వెనుకబడి ఉన్నదన్న విషయంలో సందేహం లేదు. 1948లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనను రూపొందించింది. 1966లో పౌర, రాజకీయ హక్కులపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పద్దులపై ఐక్యరాజ్యసమితి రెండు ఒడంబడికలను రూపొందించింది. అయినప్పటికీ 1993లో పివి నరసింహారావు హయాంలో కాని మన దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. మనుషులను హింసించడం, క్రూరంగా, అమానుషంగా వ్యవహరించడానికి వ్యతిరేకంగా 1997లో ఐక్యరాజ్యసమితి ఏర్పర్చిన సదస్సులో భారతదేశం కూడా పాల్గొని సంతకాలు చేసింది. కాని ఇంతవరకూ దాన్ని మనం భారతదేశంలో అమలు చేయలేకపోతున్నాం. ఐక్యరాజ్యసమితి వరకు ఎందుకు? మన రాజ్యాంగంలో పేర్కొన్న కీలకమైన హక్కులనే మన ప్రభుత్వాలు కాలానుగుణంగా విస్మరిస్తూ చట్టాలు చేయడం మొదలుపెట్టాయి 1950లో ప్రవేశపెట్టిన పీడీ చట్టం నుంచి ఊపా వరకు ఎన్నో ఉదాహరణలు మనం పేర్కొనవచ్చు. ఇలాంటి చట్టాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి పెద్ద తేడా లేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ స్థాయిని క్రమక్రమంగా తగ్గించడమే కాని పెంచేందుకు పూనుకున్న దాఖలాలు లేవు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని చైర్మన్‌గా నియమించడానికి బదులుగా ప్రభుత్వానికి అనుగుణంగా ఉండే మాజీ న్యాయమూర్తినైనా నియమించుకునే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టి ఈ సంస్థను పేపర్ టైగర్‌గా మార్చి వేశారు. దళితులు, ఆదివాసీలు, స్త్రీలకోసం ఏర్పర్చిన ప్రత్యేక కమిషన్లు కూడా అస్మదీయ సంస్థలుగా మారాయి. కొత్త నేర చట్టాలను పార్లమెంట్ ఆమోదించినప్పుడు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను బహిష్కరించినందువల్ల పెద్దగా చర్చలు జరగలేదు. ఇప్పుడైనా మరోసారి వీటిపై క్షుణ్ణంగా చర్చ జరపాల్సి ఉన్నది. రాజ్యాంగం న్యాయవ్యవస్థకు కీలక రాజ్యాంగ అంశాలపై విశ్లేషించి, వ్యాఖ్యానించే (జ్యుడిషియల్ ఇంటర్‌ప్రిటేషన్) అధికారం ఇచ్చింది. కేశవానంద భారతి కేసు నుంచి ఇటీవల ఎన్నికల బాండ్ల కేసు వరకూ సుప్రీంకోర్టు ఇలాంటి ఎన్నో కీలకమైన వ్యాఖ్యానాలు చేసింది. చట్టసభలు, న్యాయవ్యవస్థ రెండూ తమ కర్తవ్యాలను నెరవేర్చి నేర చట్టాలను, మానవ హక్కులను అంతర్జాతీయ నాగరిక సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పుడే మనం నిజమైన విశ్వగురువు స్థానాన్ని పొందగలుగుతాము.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)